14, ఏప్రిల్ 2015, మంగళవారం

దేశానికి రక్ష వామపక్షాలే

   సిపిఎం అఖిల భారత మహాసభలు ప్రారంభం
                 నయా ఉదారవాద, అవినీతి  విధానాలకు, మతతత్వ శక్తులకు  నిజమైన ప్రత్యామ్నాయం వామపక్ష ప్రజాతంత్ర శక్తులు మాత్రమేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ అన్నారు.  సిపిఎం 21వ జాతీయ మహాసభలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శాఖపట్నంలోని సమర్‌ముఖర్జీ నగర్‌లో 2015 ఏప్రెల్‌ 14 మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో మితవాద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వామపక్షశక్తుల ఐక్యతకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. వామపక్ష ఐక్యతను మరింత విశాలంగానూ, శక్తిమంతంగానూ  రూపొందించాల్సి ఉందన్నారు. అన్ని వామపక్ష పార్టీలు, గ్రూపులు, వ్యక్తులు ఒకే వేదికపైకి రావాల్సిఉంది. ఈ ఐక్యతను సాధించడం ద్వారానే ఇతర ప్రజాతంత్ర శక్తులను కూడగట్టగలం అన్నారు. సిపిఎంతో పాటు ఇతర వామపక్ష శక్తులూ సొంత బలాన్ని పెంచుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఈ విషయం చాలా కీలకమైంది. ఇటీవల కాలంలో సిపిఎంతో పాటు ఇతర వామపక్షాలు  ఎదురుదెబ్బలు తిన్నాయి. ఈ సమస్యలను అధిగమించాల్సి ఉందని చెప్పారు.ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌  నేతృత్వంలో జరుగుతున్న హింసాకాండను ఆయన ప్రస్తావించారు. ఆ హింసాకాండను ఎదిరించి పోరాడుతున్న  వేలాదిమంది సిపిఎం, వామపక్ష కార్యకర్తలను అభినందిస్తున్నానన్నారు. గత పార్టీ మహాసభ నుండి ఇప్పటి వరకు 99 మంది అక్కడ ప్రాణత్యాగం చేశారు.  ఆ అమరవీరులకు ఈ  మహాసభ  జోహార్లు అర్పిస్తోంది. వారి త్యాగాన్ని వృథా కానివ్వం. అవరోధాలను అధిగమిస్తాం.  అశేష ప్రజానీకం అందించే సహకారంతో విజయం సాధిస్తామని కరత్‌ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల హడావుడి ఉన్నందువల్ల అక్కడి నుంచి ఎన్నికైన ప్రతినిధులు పలువురు ఈ మహాసభకు హాజరుకాలేదని, వారి స్థానంలో ప్రత్యామ్నాయ ప్రతినిధులు వచ్చారని ఆయన వివరించారు, మహాసభకు హాజరుకావాల్సిన సుభాష్‌ ముఖోపాధ్యాయ, మానస్‌ ముఖర్జీలు అక్కడ తృణమూల్‌ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారని తెలిపారు. ప్రజలపై భారాలు మోపి, కష్టాలు మిగిల్చే ఆర్థికసరళీకరణ విధానాలు వేగవంతంకావడంతో పాటు మతోన్మాదశక్తులు చెలరేగుతున్న  సమయంలో జరుగుతున్న ఈ మహాసభలు పార్టీకి కీలకమైన నూతన దిశానిర్దేశం చేస్తాయని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం దిశగా ప్రజలను సమీకరించి, నడిపించడానికి, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణానికి  మహాసభల సందేశం దోహదపడు తుందన్నారు. ఈ సందర్భంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల వైఖరిని కరత్‌ తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తిని ఆ సంస్థలు తుంగలో తొక్కుతున్నాయనీ, సెక్యులర్‌, ప్రజాతంత్ర పునాదులను ధ్వంసం చేస్తూ మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఆర్డినెన్స్‌ల రాజ్యాన్ని నడపడం, వామపక్ష ప్రజాతంత్రశక్తులపై, కళాకారులపై దాడులకు దిగడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని చెప్పారు. గత ఎన్నికల తరువాత ఏడాది కాలంలో మితవాదుల దాడులు పెరిగాయన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలపై జరుగుతున్న ఈ దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ‘కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ విభాగం. మోడి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిల సంయుక్త భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యంలో  మాతృసంస్థjైున ఆర్‌ఎస్‌ఎస్‌కే ఎక్కువ వాటాలున్నాయి’ అని కరత్‌ వ్యాఖ్యానించారు. మోడి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు  దేశంలోని  కార్పొరేట్‌ రంగం కూడా సహకరించిందన్నారు. అందుకే మోడి ప్రభుత్వం కార్పొరేట్లకు ఉపయోగపడే ఎన్నో చర్యలను  ఈ పది నెలల కాలంలో తీసుకుందన్నారు. దేశంలోని కీలక మౌలికవనరులను కార్పొరేట్‌శక్తులకు, విదేశీ పెట్టుబడుదారులకు అప్పగించిందన్నారు. బొగ్గు గనులు, బీమా, రైల్వేలతో పాటు భూమిని కూడా స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌శక్తులకు కట్టబెడుతున్నారని, కార్పొరేట్‌ పన్నును 5శాతం తగ్గించడంతో పాటు సంపద పన్నును రద్దు చేశారని తెలిపారు. మోడి ప్రభుత్వం వల్ల మంచిరోజులు ఎవరికి వచ్చాయో తేలిపోయింది, పెద్ద పెట్టుబడిదారుడు గౌతమ్‌ ఆదాని సంపద ఏడాది కాలంలో 25వేల కోట్లు పెరిగిందని ఆయన చెప్పారు. కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా  ఉన్న  పేద ప్రజలు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతాంగం సతమతమవుతోందని,  ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడంతో గ్రామీణ వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు నామమాత్రంగా మారాయని వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటుతుండటంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చట్టాల సవరణతో కార్మిక హక్కులకు ప్రమాదం ఏర్పడిరదని, నూతన గనుల విధానంతో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, దేశ వ్యాప్తంగా పునరావాస సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మరోవైపు హిందూత్వశక్తులకు తలుపులు తెరవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యాసంస్థల్లోనూ, పరిశోధనా కేంద్రాల్లోనూ విధానాలను నిర్దేశిస్తోందన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా విషప్రచారం సాగుతోందని, మత మార్పిడులు, ప్రార్థ్దనాస్థలాలపై దాడులు, గోవధపై నిషేధం వంటి సాంస్కృతిక దాడికి ఆర్‌ఎస్‌ఎస్‌ దిగుతోందన్నారు. ‘హిందూత్వ తిరోగమన వాదులు మహిళల స్వేచ్ఛపై కూడా దాడిచేస్తున్నారన్నారు. వస్త్రధారణలపై ఆంక్షలతో ప్రజాజీవితం నుండి వారిని దూరం చేస్తున్నారని విమర్శించారు.  మితవాద అజెండా విదేశీ విధానంపై కూడా ప్రభావం చూపింది. మోడి ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదంతో చెట్టాపట్టాలేస్తోంది. ఆసియా ఖండంలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా మోడి ప్రభుత్వ విదేశీ విధానం ఉంది. విదేశీ పెట్టుబడికి గేట్లు మరింతగా తెరవాలన్న అమెరికా ఒత్తిడికి మోడి సర్కారు లొంగిపోయింది. మేధోహక్కులు, పేటెంట్ల అంశంలోనూ అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని  కరత్‌ చెప్పారు.  దూకుడుగా అమలుచేస్తున్న ఈ విధానాలను వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు మాత్రమే తిప్పికొట్టగలవని అన్నారు. అతి తక్కువ కాలంలోనే అసంతృప్తి పెరుగుతోంది. పలు రంగాలకు చెందిన కార్మికులు ఉద్యమాల్లోకి వస్తున్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికచట్టాల సవరణకు వ్యతిరేకంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణకు దిగుతున్నాయి. బొగ్గు బిల్లుకు వ్యతిరేకంగా బొగ్గుగని కార్మికులు రెండు రోజులు, ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా బీమా ఉద్యోగులు ఒకరోజు  సమ్మె చేశారు. వివిధ పథకాల కార్మికులు హక్కుల కోసం రోడ్లమీదకొస్తున్నారు. రానున్న రోజుల్లో  పాలకవర్గాలకు, మోడి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల ఫలితంగా నష్టపోతున్న ప్రజలకు మధ్య వైరుధ్యం మరింత తీవ్రం కానుందని ఆయన  చెప్పారు.
                                             తెలంగాణ విప్లవపోరాటం స్ఫూర్తిదాయకం
                ఈ సందర్భంగా వీరతెలంగాణ విప్లవపోరాటాన్ని, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపన్నయ్య, సి. రాజేశ్వరరావుల స్ఫూర్తిని కరత్‌ గుర్తు చేశారు. మహాసభలకు ఆతిథ్యమిస్తున్న విశాఖ నగర వాసులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పోర్టుసిటీ విశాఖ  ఎన్నో కార్మిక ఉద్యమాలకు కేంద్రం, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, స్టీల్‌ప్లాంటు, హిందూస్థాన్‌ షిప్‌యార్డు, బిహెచ్‌ఇఎల్‌ ప్లాంటు, హెచ్‌పిసిఎల్‌ రిఫైనరీ మరెన్నో పరిశ్రమలు ఉన్నాయి. కార్మికసంఘాలు సంఘటితమై ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు చేశాయని  ఆయన చెప్పారు. ప్రారంభసభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్‌. రామచంద్రన్‌ పిళ్ళై అధ్యక్షత వహించారు. సిపిఐ  ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి,ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి దేవబ్రత్‌ విశ్వాస్‌, ఎస్‌యుసిఐ (సి) ప్రధానకార్యదర్శి ప్రభాష్‌ ఘోష్‌, ఆర్‌ఎస్‌పి అఖిలభారతనాయకులు అబనీరాయ్‌, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు కవితా కృష్ణన్‌తో పాటు సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు, మహాసభల ఆహ్వానసంఘ సభ్యులు వేదికపై ఆశీనులయ్యారు.

కామెంట్‌లు లేవు: