16, ఏప్రిల్ 2015, గురువారం

ఆయన అజ్ఞాతం వీడారు!

                        
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 57 రోజుల సెలవు తీసుకున్న అనంతరం  రాహుల్‌ గాంధీ గురువారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇన్ని ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘ సెలవు తీసుకోవడంపై ఆయన నాయకత్వంపై  అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం తర్వాత ఆయన ఎక్కువ రోజులు దేశాన్ని విడిచిపెట్టడం అనేక సందేహాలకు తావిచ్చింది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం ఉదయం 11.15గంటలకు థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో బ్యాంకాక్‌ నుంచి ఢల్లీికి చేరుకున్నారు. కొన్ని వారాల క్రితం తన కుమారుడి సెలవుపై సోనియా గాంధీ స్పందిస్తూ ‘రాహుల్‌ గాంధీ త్వరలోనే వెనక్కి వస్తారని, ప్రజలతో కలిసి పనిచేస్తారని’ చెప్పారు. రాహుల్‌ గాంధీ తిరిగి రావడంపై బిజెపి వ్యంగ్యంగా స్పందించింది. రాజకీయాల్లో ఐటెం నంబర్లు అంటూ ఏమి ఉండవని,  పూర్తి కాలం సంపూర్ణ స్థాయిలో పనిచేయాల్సిందేనని పేర్కొంది. రాహుల్‌ గాంధీ కిసాన్‌ ర్యాలీని విజయవంతంగా నిర్వహిస్తారని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. దానికి తామేమంటున్నామంటే భారత రాజకీయాల్లో ఐటెం నంబర్లు వుండవు, మీరు తిరిగి కనిపించి, ర్యాలీకి హాజరై మళ్ళీ అదృశ్యమైపోతానంటే కుదరదు, మీరు రాజకీయాల్లో కూడా సీరియస్‌గా వ్యవహరించాల్సి వుంది.’’ అని బిజెపి ప్రతినిధి సాంబిత్‌ పాత్రా అన్నారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ముఖ్యమైన వ్యక్తి ఇంత సుదీర్ఘ కాలం పరారీలో వుండడం భారత రాజకీయాల్లో ఇదే మొదటిసారి. ఆయన అదృశ్యమవడం, తిరిగి రావడం రెండూ కూడా సంచలన వార్తలే అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ బిజెపి కార్యక్రమాలపై వంకలు పెట్టడం మానేసి తమ నాయకుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాల్సిందిగా పలువురు బిజెపి నాయకులు కాంగ్రెస్‌ వారిని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అమేథీ పర్యటన సమయంలో కూడా రాహుల్‌ ఏక్కడున్నారని, ఎప్పుడోస్తారని లాంటి పలు ప్రశ్నలు ప్రజల నుంచి ఆమెకు ఎదురైయ్యాయి. కొంతమందైతే ఏకంగా రాహుల్‌ మిస్సింగ్‌ అంటూ పోస్టర్లే అతికించారు. మరికొందరు రాహుల్‌ మిస్సింగ్‌పై కోర్టులో కేసు పెట్టారు. కొందరు కాంగ్రెస్‌ నేతలైతే ఇకనుంచి సోనియా గాంధీయే మొత్తం పార్టీ బాధ్యతల్ని మోయాల్సిందని కొత్త పల్లవి ఎత్తుకున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 19న ప్రతిపక్షాలతో కలిసి భూసేకరణ చట్టంపై ఢల్లీిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. అంతకు ముందే రాహుల్‌ని రప్పించాలనే ప్రయత్నాలు మొదలు పెట్టి ఎట్టకేలకు సఫలం అయ్యింది. అయితే రాహుల్‌ రాక సందర్భంగా ట్విట్టర్‌లో పలు ఆసక్తికర కామెంట్లు కనిపించాయి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ అయితే ఏకంగా రాహుల్‌ రాకపోతే ఆయన చెప్పులు, వస్తువుల్ని పెట్టి పార్టీ నడిపించేవారెమో అంటూ కామెంటు పోస్ట్‌ చేశారు.

కామెంట్‌లు లేవు: