28, ఆగస్టు 2017, సోమవారం

నంద్యాల ఉప ఎన్నికలో తెదేపా గెలుపు


 
           తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలో  తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని బ్రహ్మాండమైన మెజార్జీతో గెలిపించారు. 27,466 ఓట్ల ఆధిక్యంతో ఆయ‌న‌ ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లలో తెదేపాకు 56 శాతం ఓట్లు రాగా.. వైకాపాకు 40 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు ప్రతి రౌండ్‌లో తెదేపా అభ్యర్థికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి ఏ దశలోనూ ఆధిక్యాన్ని కనబరచలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ సుమారు వెయ్యి ఓట్లకే పరిమితమైంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. తెదేపా అభ్యర్థికి 97,076 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థికి 69,610 ఓట్లు వచ్చాయి. నంద్యాల ఉప ఎన్నికను అటు అధికార తెదేపా, ఇటు విపక్ష వైకాపా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ ఎన్నిక ఫలితంపై ఎంతో ఆసక్తి కనబరిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలు మార్గనిర్దేశం చేస్తాయని, ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని భావించడంతో ఇరు పార్టీల నేతలు జోరుగా ప్రచారం కొనసాగించారు. చివరి క్షణం వరకూ ఓటర్ల మద్దతు సంపాదించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌ 13 రోజులపాటు నియోజకవర్గంలో ఉండి ప్రచారం నిర్వహించగా.. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో రెండు రోజులు, నోటిఫికేషన్‌కు ముందు రెండు పర్యాయాలు నంద్యాలలో పర్యటించారు. చివరికి పోటీ.. అభ్యర్థుల మధ్య కాకుండా పార్టీ అధినేతల మధ్య అన్నట్లుగా సాగింది.

కామెంట్‌లు లేవు: