27, డిసెంబర్ 2017, బుధవారం

లిస్బన్‌, అమరావతి : రెండు నగరాల కథ




            ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్‌ డికెన్స్‌ రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'ఏ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌'- రెండు నగరాల కథ. 1789 మే ఐదున ప్రారంభమై 1799 నవంబర్‌ 9న రాచరిక వ్యవస్థ కూల్చివేతతో ముగిసిన ఫ్రెంచ్‌ విప్లవం నేపథ్యం, విప్లవానికి ముందు, తర్వాత ప్యారిస్‌, లండన్‌ నగరాల్లో చోటు చేసుకున్న మార్పులు ఈ నవల ప్రధాన ఇతివృత్తం. పోర్చుగీస్‌ నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని స్థిరీకరించిన అనంతరం వలస రాజ్యాల నుంచి దోచుకున్న సంపదతో లండన్‌, ప్యారిస్‌, లిస్బన్‌ వంటి యూరోపియన్‌ నగరాలు సుపంపన్నం అవుతున్న కాలం అది. రాచరిక వ్యవస్థ కూల్చివేత తర్వాత సమాజంలో మంచి మార్పులు వచ్చి సామాన్యుల స్థితిగతులు మెరుగవుతాయని ఆశించి భంగపడిన మేధావుల్లో చార్లెస్‌ డికెన్స్‌ ఒకరు. ఆయన తన ఆవేదనను రెండు నగరాల కథలో 'సమాజం స్వార్థపూరితంగా, యాంత్రికంగా మారింది. దానిని నియంత్రించే శక్తి సామాన్యులకు లేదు. మిల్లులో నలిగిన ధాన్యాల నుంచి వచ్చే వ్యర్థాలుగా వారు మారారు. విప్లవాలు కూడా సామాన్యులకు ఏమీ చేయలేకపోయా యనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?' అంటారు. నిజానికి ఆనాటి పరిస్థితికి నేటికి పెద్దగా ఏమీ మార్పు రాలేదు. నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా సామాన్యులకు ఒనగూరుతున్న దేమీ లేదు.
              ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయిన తర్వాత ఎన్నో ఆశలతో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారు. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆ లోటు తీర్చేందుకు తాను రేయింబవళ్లు కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఎక్కువ కాలం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే గడిపారు. ఈ నేపథ్యంలో 'ఓటుకు నోటు కేసు' మీద పడడంతో ఆగమేఘాల మీద అమరావతికి తరలి వచ్చారు. అప్పటి నుంచి అమరావతి ప్రహసనం ప్రారంభమైంది. రాజధాని నిర్మాణం పేరుతో దేశ దేశాలు పట్టి తిరగడం, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించడం, డిజైన్లు తయారు చేయించడం, తిరస్కరిం చడం నిత్యకృత్యంగా మారింది. అమరావతిని ఎంపిక చేసి ఒక్క శాశ్వత కట్టడమైనా కట్టకుండా తాత్కాలిక భవనాల పేరిట వందలాది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు.
                చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఏ నగరానికి వెళితే ఆ నగరంలాగా అమరావతిని తీర్చిదిద్దుతానని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. కనీస పౌర సదుపాయాలు లేని నగరాలను కూడా గొప్పగా పొగిడే ముఖ్యమంత్రి దృష్టిలో పోర్చుగీస్‌ రాజధాని లిస్బన్‌ నగరం పడలేదు. ప్రపంచ మేటి నగరాల్లో 29వ స్థానంలో ఉన్న ఈ నగరం 1775లో భూకంపం, సునామీ, అగ్ని ప్రమాదాల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. శిధిలాల మయంగా మారిన లిస్బన్‌ నగరాన్ని కేవలం ఐదేళ్ళలో అంటే 1780వ సంవత్సరానికల్లా అద్భుత నగరంగా పునర్‌నిర్మించారు. ఏడు కొండల మధ్యలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో 237 సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని భారీ భూకంపాలను కూడా తట్టుకునే విధంగా కట్టారు. ఆనాడు నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకపోవడం, నేటికీ సుమారు ఐదు లక్షల మంది ప్రజల ఆవాస అవసరాలు తీర్చుతుండడం గొప్ప విశేషం.
1775వ సంవత్సరం నవంబర్‌ ఒకటో తేదీన లిస్బన్‌ వాసులు 'ఆల్‌ సెయింట్స్‌ డే' ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9.40 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలు మీద సుమారు 8.5 నుంచి 9 పాయింట్ల మాగ్నిట్యూడ్‌ తీవ్రత గల భూకంపం సంభవించింది. నగరం మొత్తం నేలమట్టమైంది. వేలాది మంది అక్కడికక్కడే చనిపోయారు. వందలాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్ర తీరానికి చేరుకున్నారు. అయితే భూకంపం వచ్చిన 50 నిముషాలలోపే సునామీ అలలు రావడంతో తీర ప్రాంతంలో తలదాచుకున్న వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయారు. 'ఆల్‌ సెయింట్స్‌ డే' ప్రార్థనల కోసం ఇళ్ళలోను, చర్చిలలోనూ వెలిగించిన కొవ్వొత్తుల కారణంగా నగరమంతటా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకేసారి వచ్చిన ఈ మూడు ఉపద్రవాలతో లిస్బన్‌ నగరం నామరూపాలు లేకుండా పోయింది. వాస్కోడిగామా తన సముద్రయాన అనుభవాలను పొందుపరిచిన పత్రాలతో సహా విలువైన కళాఖండాలు, గ్రంథాలు, పెయింటింగ్స్‌ సమస్తం కాలిపోయాయి.
             నిరాశ్రయులైన పోర్చుగల్‌ రాజు జోసెఫ్‌-1, అతని కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడానికి పొరుగునే ఉన్న స్పెయిన్‌ అంగీకరించింది. అయితే జోసెఫ్‌-1 శిధిల నగరం మధ్యలో ఉన్న కొండపై టెంట్‌లు వేయించి అక్కడి నుంచే పాలన సాగించాడు. విధ్వంసం జరిగిన నెలలోగానే అంటే 1775 డిసెంబర్‌ నాలుగో తేదీన రాజాస్థాన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మాన్యూల్‌ డ మైయ నగర నిర్మాణానికి చక్కటి ప్రణాళిక తయారు చేశారు. వేరే ప్రాంతంలో నగరాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. శిధిలాల్లో పనికి వచ్చే రాళ్ళు, కలప, ఇనుము ఇతర సామాగ్రి ఒకచోట చేర్చి పునర్‌నిర్మాణ పని ప్రారంభించారు. తిరిగి నిర్మించే నగరంలో విశాలమైన స్క్వేర్‌లు, వెడల్పాటి రహదారులు, బ్రిడ్జిలు, అద్భుతమైన భవంతులు, గృహ సముదాయాలకు సంబంధించిన ప్రణాళిక లను నెల రోజుల లోపులోనే రూపొందించడం విశేషం. శిధిలా లను తొలగించడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. కేవలం నాలుగేళ్ళలో లిస్బన్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలి గారు. నగర పునర్‌నిర్మాణా నికి ముందు పోర్చుగీస్‌ ప్రధాన మంత్రి సెబాస్టియో డి మెలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'భూకంపం సృష్టించిన విధ్వంసం చూసి దిగులు చెందవద్దు. భూకంపం కారణంగా వచ్చిన కొత్త నీటి ఊటలు చూసి ఆనంద పడదాం. ఈ విధ్వంసం మన మేధో శక్తికి, శక్తి సామర్థ్యాలకు, ఐక్యకతు సవాల్‌ విసిరింది. పోర్చుగీస్‌ వాసుల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటడానికి ఇది మంచి అవకాశం' అన్నారు. నిజానికి పోర్చుగీస్‌ చాలా చిన్న దేశమే అయినప్ప టికి శక్తివంతమైన నావికాదళం ఉండేది. పోర్చుగీస్‌ నావికుడు వాస్కోడిగామా నౌకా మార్గం ద్వారా ఇండియా వచ్చి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల మొదట లబ్ధిపొందిన యూరోపియన్‌ దేశం పోర్చుగీస్‌.
              విధ్వంసం తర్వాత పోర్చుగీస్‌ వాసులు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి తమ సత్తా చాటారు. నిజానికి నాడు పోర్చుగీస్‌ వాసుల ఇబ్బందులతో పోల్చితే ప్రస్తుతం మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తక్కువే. అయినా మన పాలకులు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనలు వేసి మూడేళ్లు కావస్తున్నా ఇంకా డిజైన్లు కూడా ఖరారు చేయలేకపోయారు. నాటి పోర్చుగీస్‌ పాలకులు తమ ప్రజలతో పాటు గుడారాలలో నివసించారు. నేటి మన పాలకులు విలాసవంతమైన భవనాల్లో నివశించడానికే మోజు పడుతున్నారు. లిస్బన్‌లో విధ్వంసం జరిగిన ఏడాదిలోగానే నగర నిర్మాణానికి ప్లాన్‌లు సిద్ధం చేస్తే, ఇక్కడ మాత్రం అవి ఇంకా డ్రాయింగ్‌ బోర్డులపైనే ఉన్నాయి. లిస్బన్‌లో ప్రతి రాయినీ తిరిగి ఉపయోగించడానికి ప్రయత్నించగా ఇక్కడ ప్రతి పైసానూ తమ స్వార్థ ప్రయోజనాలు, ప్రచారం కోసం వాడుతున్నారు.
            237 సంవత్సరాల క్రితం నిర్మించిన లిస్బన్‌ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉంటే అమరావతిలో వందలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తాత్కాలిక భవనాలు బీటలు వారుతున్నాయి. లిస్బన్‌లోని ప్రతి అంగుళం భూమిని ప్రజల కోసం ఉపయోగిస్తే నేడు మన పాలకులు అమరావతిలోని వందలాది ఎకరాలు విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. నాటి లిస్బన్‌ నగర నిర్మాణం త్యాగాలకు, సమష్టి కృషికి, ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలబడగా నేటి అమరావతి స్వార్థ ప్రయోజనాలకు, సంకుచిత అలోచనలకు, మిడిమిడి జ్ఞానాలకు, ఏకపక్ష నిర్ణయాలకు కొలువుగా మారింది. ప్రతి పనికి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే అమరావతి 'భ్రమరావతి'గానే మిగిలిపోతుంది.

- వివిఆర్‌ కృష్ణంరాజు ( రచయిత ఎపి ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు,
సెల్‌ : 9505292299 )

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

good blog
https://goo.gl/Yqzsxr