28, ఆగస్టు 2019, బుధవారం

రాజుకున్న రాజధాని

తారస్థాయిలో అమరావతి రాజకీయం
తెదేపా అపోహలు సృష్టించొద్దు.. స్పష్టమైన ప్రకటన చేయాలి

భాజపా మార్పు అసాధ్యం.. మారిస్తే ఊరుకునేది లేదు

కాంగ్రెస్‌ అమరావతిలోనే కొనసాగించాలి

సీపీఎం ప్రజలు ఊరుకోరు..  రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సిందే

రోడ్డెక్కిన రైతులు

ఆందోళన వద్దన్న ఉపరాష్ట్రపతి

సుజనా, తెదేపా నేతలు భూములు కొన్నారన్న బొత్స..

వారు మినహా మిగతా వారికి న్యాయం చేస్తామని హామీ

సెంటు భూమీ కొనలేదన్న సుజనా

ఆందోళన చేస్తున్న రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి రాజధాని తరలింపు ఆలోచనలను విరమించుకునేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ తెరపై రాజధాని కీలక చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల్లో ఆందోళనలకు, పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. రాజధాని అమరావతిలో కొనసాగడంపై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజుకున్న ఈ రాజకీయం మంగళవారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధానిని అక్కడే కొనసాగించాలని ఆందోళనకు దిగాయి. రాజధాని రైతులూ రోడ్డెక్కారు. మరోవైపు ప్రభుత్వం.. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని, రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములన్నాయని ఆరోపించింది. అలాంటి వారిని పక్కనబెట్టి మిగిలిన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేసింది.
రాజధానిని కదిలిస్తే ఊరుకోబోమని భాజపా హెచ్చరించింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి వైకాపా తీరుపై ధ్వజమెత్తారు. బాధ్యతారహిత ప్రకటనలపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండు చేశారు. రాజధానిపై స్పష్టత ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని సీపీఎం నేత మధు హెచ్చరించారు. రాజధాని గ్రామాల్లో సీపీఎం నేతలు పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. రాజధానిని ప్రస్తుతమున్న ప్రాంతంలోనే కొనసాగించాలని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. రాజధానిపై రాజకీయాలు చేయొద్దని కోరుతూ మంగళగిరి మండలం యర్రబాలెం రైతులు రహదారిపై ఆందోళనకు దిగారు.
ఊరట: ఈ రాజకీయ వివాదం మధ్య రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు సొమ్మును విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం వారికి ఊరటనిచ్చింది.
అన్నీ బయటపెడతాం

రాజధాని ప్రాంతంలో సుజనా, చంద్రబాబు బంధువులకు భూములు

ఏ ఒక్కరికో మేలు జరిగేలా వ్యవహరించం: మంత్రి బొత్స
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర రాజధాని అనేది ఒక ప్రాంతానిదో.. ఒక సామాజికవర్గానిదో.. నాయకుల సొంతానిదో కాదు.. 5 కోట్ల మంది ప్రజానీకానిది. 13 జిల్లాలకు సంబంధించినది’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతూ తలసరి ఆదాయం పెరగాలనేదే సీఎం జగన్‌ ఆలోచన. అంతేగానీ ఒకరికి మేలు చేసేలా మా ప్రభుత్వం వ్యవహరించదు’ అని వివరించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధానిలో కొందరు వ్యక్తుల పేర్లతో 25వేల చదరపు గజాల స్థలాలున్నాయి. త్వరలో పేర్లతో సహా వెల్లడిస్తాం. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములున్నాయి. అక్రమాలను వరుసగా వెల్లడిస్తాం’ అని చెప్పారు. అరగంట ఆగితే చంద్రబాబు ఇల్లూ మునిగేది

‘వరదల్లో ఇల్లు మునిగిపోతుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ హైదరాబాద్‌ వెళ్లారు. వరదలు తగ్గాక వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు ఇంటిని ముంచాలనుకుంటే.. ఇంకో అరగంట ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవకపోతే సరిపోయేది కదా’ అని వ్యాఖ్యానించారు.
భాజపా నేతలు ఎందుకు మారారో?

‘రాజధాని ఒక కుంభకోణం.. అవినీతి జరుగుతోందని భాజపా గతంలో ఆరోపించింది. రూ.వేల కోట్ల టెండర్లు పిలిచారని, భూ సమీకరణలో అక్రమాలు జరిగాయని వైకాపాతోపాటు ఆ పార్టీ చెప్పింది. వాళ్లు ఇప్పుడెందుకు విధానాన్ని మార్చుకున్నారో అర్థం కావటం లేదు’ అని బొత్స పేర్కొన్నారు.
రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తాం

రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. పింఛన్లు ఇస్తున్నాం. కౌలు చెల్లిస్తున్నాం. భూములు అభివృద్ధి చేసి ఇస్తాం. రాజధానికి భూములిచ్చిన రైతులు నన్ను కలిసి ఈ ఏడాది కౌలు చెల్లించాలని కోరారు. వెంటనే రూ.187.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చాం.
బొత్స ప్రధాన ఆరోపణలు

* సుజనా చౌదరి బంధువు, గ్రీన్‌టెక్‌ కంపెనీలో డైరెక్టరు అయిన జితిన్‌ కుమార్‌ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాల భూములున్నాయి. ఈడీ ఇచ్చిన జాబితా ప్రకారం ఆయనకు ఉన్న 120 సంస్థల్లో ఇదీ ఒకటి. ఆయన సోదరుడి కుమార్తె అయిన యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలున్నాయి. ఆయన రాజధాని ప్రాంతంలో ఎకరా ఉంటే చూపించమన్నారు. 124 ఎకరాలు చెప్పా.

* చంద్రబాబు వియ్యంకుడికి వియ్యంకుడు అయిన ఎంఎస్‌బీ రామారావుకు చెందిన వీబీసీ సంస్థకు ఏపీఐఐసీ ద్వారా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఎకరా రూ.లక్ష చొప్పున 493 ఎకరాలిచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వారెవరైనా ఎకరా రూ.లక్ష చొప్పున ఇంట్లో వాళ్లకు ఇచ్చుకోవడం ఎక్కడైనా జరిగిందా? దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనాలా? క్విడ్‌ ప్రో కో అనాలా?

* చంద్రబాబు రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరంలలో పెరిగాయని నా స్నేహితులు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచనేంటి? అక్కడెక్కడా పెరగకుండా అమరావతిలోనే పెరగాలా? 
మెట్రోకు అంత అవసరమా?

‘మొత్తం 67 కిలోమీటర్ల దూరంతో అమరావతి మీదుగా వెళ్లేలా రూ.24,460 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ మెట్రోకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేశారు. ఇంత మొత్తంతో మెట్రో అవసరమా?
భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే...

ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే బయటకు వస్తుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘అమరావతిలో భూములు కొన్నవారంతా రాజధాని తరలిపోతే రూ.కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయోనని పీడకలలు కంటున్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆయనకు రియల్‌ ఎస్టేట్‌ తప్ప ఇంకెలాంటి సమస్యలు కనిపించడం లేదా?’’ అని మంగళవారం ట్విటర్‌లో విమర్శించారు. ఎంపీ సుజనాచౌదరి భాజపాలో చేరినా ఆయన మదిలో చంద్రబాబే ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు.
సెంటు భూమీ కొనలేదు: సుజనా
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఒక్క సెంటు భూమీ కొనలేదని రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రి బొత్స సత్యనారాయణ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే కొత్త పదాన్ని వారే కనిపెట్టారని, ఒకవేళ అదే జరిగి ఉంటే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి విచారణ జరపొచ్చని సవాల్‌ చేశారు. మంగళవారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రి బొత్స కొండను తవ్వి ఎలుకను పట్టారు. రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో మా పూర్వీకులకు, మా అన్న, వదినల పేరు మీద 120 ఎకరాల భూములున్నాయని చెబుతున్నారు. ఆ భూములు ఎప్పుడు ఎవరు అమ్మారో? కొన్నారో? ఆ వివరాలివ్వాలి. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ... ఇంకా దూరంగా కోదాడలోనూ మాకు భూములుంటాయి. ఉన్నంత మాత్రాన ఇష్టారీతిన మాట్లాడతారా? బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న బొత్స తనకు తెలిసిన సమాచారాన్ని సరిచూసుకుని మాట్లాడాలి. ఊరికే మాట్లాడుతూ ప్రజల సమయాన్ని వృథా చేయకుండా పాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది’ అని సుజనా వ్యాఖ్యానించారు.
రాజధానిని కదిలిస్తే ఊరుకోం

భాజపా నేతలు లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి
ఈనాడు, గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, దాన్ని అక్కడినుంచి కదిలించే ఆలోచన చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని భాజపా నేతలు హెచ్చరించారు. మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనాచౌదరి ధ్వజమెత్తారు. రైతుల మనోభావాలను తెలుసుకునేందుకు వీరిద్దరూ మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాయపూడి వద్దకు చేరుకున్న 29 గ్రామాల రైతులనుద్దేశించి మాట్లాడారు. ‘రాజధాని అంటే వేసుకుని వదిలేసే చొక్కాలాంటిది కాదు. అభివృద్ధిని నిర్ణయించేది. రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. వారిని ఇరకాటంలో పడేసేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారు’ అంటూ సుజనాచౌదరి మండిపడ్డారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఎక్కడైనా తన పేరిట సెంటుభూమి ఉన్నా నిరూపించాలని సవాల్‌ విసిరారు.
పాదయాత్రలో జగన్‌ చెప్పింది గుర్తుంది: కన్నా

పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి రాజధానిని మార్చేది లేదని చెప్పినట్లు తనకు గుర్తుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధానిని మారుస్తామంటూ మంత్రులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అమరావతిని తరలిస్తామంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు. ‘ఇప్పటిదాకా ఈ ప్రాంతం మునిగిన దాఖలాలు లేవు. 7, 8 మీటర్లు తవ్వగానే నేలలో రాయి తగులుతుంది. మంచి రవాణావ్యవస్థ ఉంది. ఇన్ని ప్రయోజనాలుంటే అమరావతి రాజధానికి సరైనది కాదంటున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతం వరదల్లో మునుగుతుందని నిరూపిస్తే తన పుట్టింటోళ్లు ఇచ్చిన మూడెకరాలు మంత్రికి రాసిస్తానని మందడం గ్రామానికి చెందిన బత్తుల గంగాభవాని సవాలు విసిరారు. విజయవాడ నుంచి సుజనాచౌదరి తొలుత తాళ్లాయపాలెం వచ్చారు. అక్కడ రైతులతో మాట్లాడుతుండగా వారి పక్కనుంచే సీఎం కాన్వాయ్‌ వెళుతోంది. ఆ సమయంలో రైతులు అమరావతి జిందాబాద్‌, రాజధాని ఇక్కడే ఉండాలని నినాదాలు చేయగా.. సీఎం కారులో నుంచే రైతుల వైపు చూసి నమస్కరిస్తూ వెళ్లిపోయారు.
ఉప రాష్ట్రపతిని కలిసిన రైతులు
ఉంగుటూరు, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చామని..రాజధాని మార్పు అనే ప్రచారం సాగుతోందని, అక్కడ నిర్మాణాలు నిలిచిపోయినందున అందరిలో ఆందోళన నెలకొందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురు రైతులు వాపోయారు.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ విజయవాడ చాప్టర్‌లో మంగళవారం ఆయనను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. రాజధాని విషయంలో ఎటువంటి అధికార ప్రకటన వెలువడనందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను రాజకీయాలు మాట్లాడకూడదని, అయినా రాజ్యాంగబద్ధంగానే తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనాలోచనతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని రైతులకు సూచించారు.

కామెంట్‌లు లేవు: