25, మార్చి 2022, శుక్రవారం

ఎఫెక్టివ్‌ విజువల్స్‌ స్టోరీ డిఫెక్ట్‌

 


ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రివ్యూ    

విడుదల తేది: 25-03-2022
నటీనటులు: ఎన్‌టిఆర్‌, రామ్‌చరణ్‌, అజరు దేవ్‌గణ్‌, శ్రీయ, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, రేస్టీవెన్‌ సన్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు.
కథ: కె.విజయేంద్రప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి.
రాజమౌళి సినిమా అంటేనే భారీతనం. ఆయన విజన్‌తో ఎన్నో మ్యాజిక్కులు చేస్తుంటారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకెళ్లారు. కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. నాలుగేళ్ల క్రితం ఇద్దరు స్టార్‌ హీరోలతో మొదలైన రోజు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి తరహా టేకింగ్‌, దేశవ్యాప్తంగా చేసిన ప్రమోషన్‌ ఈ చిత్రంపై రెట్టింపు అంచనాలు క్రియేట్‌ చేశాయి. కరోనా విపత్తు, థియేటర్లు, టికెట్‌ ధరలు పలు రకాల సమస్యలతో విడుదల ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
             కథ: విశాఖపట్టణం సమీపానికి చెందిన అల్లూరి సీతారామరాజు ఊరికి ఇచ్చిన మాట కోసం ఢిల్లీలోని అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వంలో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. ఒక లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లిన రామరాజుకు పదోన్నతి పొందాలని పట్టుగా పనిచేస్తాడు. తన మరదలు సీత కోరిక నెరవేరాలంటే రామరాజు లక్ష్యం సాధించాలి. అదెలా జరుగుతుంది? ఇదిలా ఉండగా బ్రిటీష్‌ గవర్నర్‌ స్కాట్‌ అదిలాబాద్‌ పర్యటనకు వెళ్లి అక్కడి గోండ్ల బిడ్డ మల్లిని ఢిల్లీ తీసుకెళ్లిపోతాడు. ఆ బిడ్డను తల్లి దరికి చేర్చాలని గోండ్ల జాతికి కాపలాగా ఉండే కొమురం భీమ్‌ ఢిల్లీకి పయనమవుతాడు. బ్రిటీష్‌ కోటను దాటుకుని మల్లిని తీసుకురావడం కష్టం. ఆ తరుణంలోనే అల్లూరి.. భీమ్‌కు పరిచయం అవుతాడు. ఇద్దరి మధ్య మైత్రి కుదురుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఇద్దరి లక్ష్యాలు నెరవేరాయా లేదా? అజరు దేవగణ్‌, శ్రీయ కథేంటి అన్నది తెరపైనే చూడాలి. కథ అంత ఎఫెక్టివ్‌గా లేదనే చెప్పాలి.

              విశ్లేషణ: అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అయితే వీరిద్దరూ కలిస్తే అన్న కల్పిత కథతో రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' (రణం.. రౌద్రం.. రుధిరం) చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్‌ హీరోలతో సినిమా అనగానే నిడివి, ఇంపార్టెన్స్‌ ఇలా చాలా లెక్కలు ఉంటాయి. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి అభిమానులు, సినీ ప్రియుల నోట ఇదే మాట వినిపిస్తుంది. నీరు, నిప్పు అంటూ హీరోల పాత్రలను పరిచయం చేశారు. దానికి క్లారిటీ ఇవ్వలేదు. లాఠీఛార్జ్‌ సన్నివేశంతో రామరాజు పాత్రను, అడవిలో పులితో పొరాటం సన్నివేశాలతో భీమ్‌ పాత్రను పరిచయం చేశారు. ఇద్దరికీ కావలసినంత ఎలివేషన్‌ ఇచ్చి.. రెండు పాత్రలను బ్యాలెన్స్‌ చేశారు రాజమౌళి. ఓ ఆపదలో ఉన్న ఓ కుర్రాడిని కాపాడి వీరిద్దరూ స్నేహితులైన తీరును చూపించారు. కానీ ఆ స్నేహం ఎలా బిల్డప్‌ అయిందో చూపించలేదు. 'నాటు నాటు' పాటలో మాత్రమే వారిద్దరి మధ్య స్నేహాన్ని భావోద్వేగంగా చూపించారు. రామరాజు పాత్ర ఏంటి? అతను ఏ కారణంతో బ్రిటీష్‌ ప్రభుత్వంలో పోలీస్‌గా చేరాడు అన్నది బాగానే చెప్పారు. కానీ భీమ్‌ విషయంలో అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదు. గొడ్ల కాపరి అని చెప్పారు. అతను ఏంటి? ఆ గూడెంలో ఏం చేస్తాడన్నదీ వివరణ లేదు. కేవలం అతని బలం ఏంటో రాజీవ్‌ కనకాల మాటలతో సరిపెట్టారు. తన గూడెంకి చెందిన పిల్లని రక్షించడానికి ముస్లిం వ్యక్తిగా వెళ్లడం అన్నది కథకు అతికినట్లు లేదు. ఆ తర్వాత రామరాజు పాముకాటుకు గురికావడం.. ఇద్దరి కథలు బయట పెట్టడం.. భీమ్‌ను అరెస్ట్‌ చేయడంతో కథ మరో ట్రాక్‌ ఎక్కింది. ఇంటర్వెల్‌లో హీరోలిద్దరూ పోటీ పడుతుంటే ఓ వైపు ఉద్వేగం, మరో వైపు బాధ కలుగుతాయి. అజరు దేవగణ్‌, శ్రీయ తదితరుల పాత్రలతో సెకెండాఫ్‌ మొదలవుతుంది. 20 నిమిషాలు సాగే ఆ ట్రాక్‌ కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథ అక్కడే రివీల్‌ చేయడం కొసమెరుపు. భీమ్‌కి శిక్ష వేసే సమయంలో 'కొమరం భీముడా' పాటతో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు. భీమ్‌ని ఉరికంబం ఎక్కించినప్పుడు రామరాజు తప్పించే ప్రయత్నం బాగానే ఉన్నా అంతకుముందు సన్నివేశాలు తేలిపోయాయి. బ్రిటీషర్ల నుంచి తప్పించుకుని మల్లిని తీసుకుని బయటపడ్డ భీమ్‌కు సీత ఆశ్రయం ఇస్తుంది. అక్కడ రామ్‌ లక్ష్యం, తన ప్లాష్‌ప్యాక్‌ భీమ్‌కి తెలుస్తుంది. రామ్‌ని రక్షించుకోవాలని బ్రిటీష్‌ కారాగారానికి బయలుదేరతాడు. అక్కడే రామ్‌చరణ్‌ పోషించిన అల్లూరి గెటప్‌ రివీల్‌ అవుతుంది. అయితే క్లైమాక్స్‌ సింపుల్‌గా తేల్చేసినట్లు అనిపిస్తుంది. దర్శకుడు ఇంకెదో చేస్తాడు అని అంచనాలు వేసుకున్నవారికి నిరాశ తప్పదు.
              ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... రాజమౌళి విజన్‌కి తగ్గ హీరోలు ఆయనకు దొరకడం సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. ముఖ్యంగా హీరోలిద్దరి పాత్రలను బాగా బ్యాలెన్స్‌ చేశారు. నటన పరంగా ఇద్దరూ విజృంభించారు. 100 శాతం పాత్రలకు న్యాయం చేశారు. అలియా భట్‌ పాత్ర చిన్నదే అయినా సినిమాలో మలుపునకు కారణం అవుతుంది. అజరు దేవగణ్‌ పాత్ర కూడా అంతే! ఆలియా, రామ్‌ గురించి చెప్పే సన్నివేశం భావోద్వేగానికి లోను చేస్తుంది. బ్రిటీషర్ల విలనిజం అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసిన భావన కలిగించాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే రాజమౌళి ఈ సినిమా విషయంలో అంత ఆసక్తి చూపించినట్లు లేరు. ట్రెయిన్‌ బ్లాస్ట్‌, తెరపై కనిపించిన జంతువులు సీజీలో తెలిసిపోతున్నాయి. సీజీ వర్క్‌ రాజమౌళి స్థాయిలో లేదు. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్స్‌. విజయేంద్రప్రసాద్‌ అల్లిన కథ, సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. రాజమౌళికి బాగా కలిసొచ్చిన సెంథిల్‌ ఫొటోగ్రఫీ అదిరింది. సాబుసిరిల్‌ ఆర్ట్‌ వర్క్‌ బావుంది. నిర్మాత ఖర్చు చేసిన ప్రతి రూపాయి కొన్ని సన్నివేశాల్లో క్వాలిటీ రూపంలో కనిపించింది. 'బాహుబలి'తో భాషాబేధం తొలగించిన రాజమౌళి ఈ చిత్రంతో అభిమానుల మధ్య అంతరాలను కూడా తొలగించారని చెప్పొచ్చు.
భీమ్‌, అల్లూరి సీతారామరాజు అనే పేర్లను కేవలం మార్కెటింగ్‌ ప్రకారం పెట్టినట్లుగా వుంది. కథలో ఆ పేర్లు వున్నా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళకు పైగా అయిన సందర్భంగా ప్రముఖ దినపత్రికలలో రకరకాలుగా ఒక్కో ప్రాంతంలో పోరాట యోధుల గురించి కథలు రాస్తున్నారు. కనీసం అందులో ఒక కథ అయినా తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. కేవలం ఊహాజనితమైన కథ తీసుకుని తనకు తెలిసిన టెక్నికల్‌ గ్రాఫిక్‌తో మాయ చేశారు. విజువల్స్‌ బాగున్నా కథ అంతబాగా కుదరలేదనిపిస్తోంది.
         తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. సినిమా బెనిఫిట్‌షోలో విద్యుత్‌ అంతరాయంతో అభిమానులు, వీక్షకులు తీవ్ర అక్రోశానికి గురయి విజయవాడలో ఓ సినిమా థియేటర్‌ను ధ్వంసం చేశారు.

కామెంట్‌లు లేవు: