24, ఏప్రిల్ 2011, ఆదివారం

సత్యసాయిబాబా అస్తమయం

ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సత్యసాయిబాబా (86) ఇకలేరు. ఆదివారం ఉదయం 7-40 గంటలకు బాబా తుదిస్వాస వదిలినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. బాబా ఇకలేరన్న వార్త విని భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మార్చి 28న శ్వాస సంబంధ సమస్యతో బాబా ఆస్పత్రిలో చేరారు. పుట్టపర్తి సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రయుఖ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. శరీరంలోని ప్రధాన అవయవాలు కాలేయం, మూత్రపిండాలు, ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాబా మరణ వార్త విని పుట్టపర్తి అంతటా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది.
ఆదివారం ఉదయం 7-30 గంటల నుంచి ఆస్పత్రి వద్ద హడావుడి మొదలైంది. బాబా బంధువులు, ట్రస్టు సభ్యులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. కొంతమంది కన్నీటిపర్యంతమవుతూ ఆస్పత్రి నుంచి బయటకువెళ్లారు. దీన్ని చూసి భక్తుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి రోజూ ఉదయం 8-00 గంటలకు విడుదల చేసే బులెటిన్‌ కూడా విడుదల చేయలేదు. ఇది మరింత ఆందోళనకు గురిచేసింది. ఉదయం 9-30 గంటలకు సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ డైరెక్టర్‌ డాక్టరు సఫాయా చివరి బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ బులెటిన్‌లో బాబా ఇక భౌతికంగా లేరని పేర్కొన్నారు. బాబా లేరన్న వార్త విన్న భక్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎలాగైనా బాబా కోలుకుంటారని ఇంతకాలం ఎదురుచూసిన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బాబా భౌతికకాయం ప్రశాంతి నిలయానికి తరలింపు...
సత్యసాయిబాబా భౌతికకాయాన్ని ప్రశాంతి నిలయానికి తరలించారు. భక్తుల దర్శనార్థం ప్రశాంతి నిలయంలోని యజుర్వేద మందిరం సాయికుల్వంత్‌ హాలులో ఉంచారు. సాయంత్రం ఆరు గంటల నుంచి భక్తులు బాబా భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. బాబా భౌతిక కాయాన్ని సూపర్‌స్పెలాటి ఆసుపత్రినుంచి సాయి కుల్వంత్‌ హాలుకు ఒక అంబులెన్స్‌లో తరలించడం సామాన్య ప్రజలకు ఆందోళన కలిగించింది. పెద్దఎత్తున సాయి కుల్వంత్‌ హాలు వద్దకు చేరుకున్నారు. ఒక దశలో గేట్లను ధ్వంసం చేసకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరిన ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
పోలీసుల వలయంలో పుట్టపర్తి...
రెండు రోజుల ముందు నుంచే పుట్టపర్తికి భారీగా పోలీసు బలగాలను తరలించారు. ఆదివారం ఉదయం బాబా ఇక లేరన్న విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. 9 వేల మంది పోలీసు బలగాలు పుట్టపర్తి పట్టణంలో తిష్టవేశాయి. అన్ని రహదారుల కూడలిలో పోలీసులను భారీఎత్తున మెహరించారు. పుట్టపర్తికి వస్తున్న ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఆస్పత్రి వైపు వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. పట్టణంలో దాదాపు బంద్‌ వాతావరణం నెలకొంది. దుకాణాలన్నీ మూసివేశారు.
ప్రజల సందర్శనార్థం మూడు రోజులు 27న అంత్యక్రియలు
సత్యసాయిబాబా భౌతికకాయాన్ని యజుర్వేద మందిరానికి తరలించారు. సాయంత్రం సాయికుల్వంత్‌హాలులో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. బాబా భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2-50 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నరు నరసింహన్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు బాబా భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. అనంతరం 2-50 గంటలకు అంబులెన్స్‌లో ఆస్పత్రి నుంచి ప్రశాంతి నిలయంలోని యజర్వేద మందిరానికి తరలించారు. భౌతికకాయాన్ని ఆయన నిత్యమూ భక్తులకు దర్శనమిచ్చే సాయికుల్వంత్‌ హాలులో ఉంచారు. సాయంత్రం ఆరు గంటల వరకు ట్రస్టు సభ్యులు, అలాగే ప్రశాంతి నిలయంలో పని చేసే సేవా కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం సాయంత్రం వరకు భక్తులు భౌతికకాయాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం బుధవారం ఐదు గంటలకు సాయికుల్వంత్‌హాల్‌లోనే అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు ట్రస్టు వర్గాలు ప్రకటించాయి.
భక్తుల్లో విషాదఛాయలు
సత్యసాయిబాబా ఇకలేరన్న వార్తతో పుట్టపర్తితో పాటు జిల్లాలో కూడా విషాదచాయలు అలుముకున్నాయి. భక్తులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి కోలుకుని దర్శనమిస్తారని ఎదురుచూస్తున్న భక్తులకు బాబా లేరన్న వార్త మింగుడుపడటం లేదు. పుట్టపర్తిలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. బాబా పార్ధివదేహాన్ని భక్తులు దర్శించేందుకు వీలుగా ప్రశాంత నిలయం పరిసర ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ప్రముఖులందరూ సాయి భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పుట్టపర్తికి బయలుదేరారు.
బాబా భౌతికకాయాన్ని దర్శించుకున్న ప్రముఖులు
సత్యసాయిబాబా భౌతికకాయాన్ని ప్రముఖులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌, కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి, ఎంపీలు అనంతవెంకట్రామిరెడ్డి, నిమ్మలక్రిష్టప్ప, ఎమ్మెల్యేలు పల్లెరఘునాథ్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌లు బాబా భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. టిటిడి మాజీ ఛైర్మన్‌ ఆదికేశవనాయుడు, లక్ష్మిపార్వతిలు బాబా భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. కర్నాటక ప్రభుత్వం రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

1 కామెంట్‌:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును బాబా ఇక లేరన్న బాధ తట్టు కోవడం కష్టం గానే ఉంది.