16, మే 2015, శనివారం

ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షునికి మరణశిక్ష


                 ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీకి శనివారం ఈజిప్ట్‌లోని కోర్టు మరణదండన విధించింది. 2011లో ఖైదీలు జైలు నుంచి సామూహికంగా పారిపోవడానికి సంబంధించిన పాత్రకు 100 మంది ముద్దాయిలకు తోడు ఆయనకూ మరణశిక్ష విధించారు. ఈజిప్ట్‌లో స్వేచ్ఛగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మోర్సీ. అధ్యక్షునిగా ఉండగా ఉద్యమకారులను అరెస్ట్‌ చేయించి, చిత్రహింసలు పెట్టించినందుకు 20 ఏళ జైలుశిక్షను అనుభవిస్తున్నారు. హోస్నీ ముబారక్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక 2012లో ముస్లిం బ్రదర్‌హుడ్‌ ఉద్యమానికి చెందిన నాయకుడు మోర్సీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మోర్సీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగడంతో 2013లో ఈజిప్ట్‌ సైన్యం అతన్ని అధ్యక్షపీఠం నుంచి దించేసింది. మోర్సీని దించేయడానికి కారకుడైన సైన్యాధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌`ససి 2014లో అధ్యక్ష ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత ముస్లిం బ్రదర్‌హుడ్‌ను నిషేధించారు.అన్ని మరణశిక్షల లాగానే మోర్సీ మరణశిక్ష తీర్పు పై అభిప్రాయం కోసం ఈజిప్ట్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న గ్రాండ్‌ ముఫ్తీకి పంపారు. గ్రాండ్‌ ముఫ్తీ ఈ శిక్షకు ఆమోదం తెలిపినప్పటికీ, నేరారోపణలపై ఇప్పటికీ అప్పీల్‌ చేసుకోవచ్చు. జూన్‌ 2న ముఫ్తీ నిర్ణయం వెలువడుతుందనుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు: