24, మే 2015, ఆదివారం

వెనుకబడిన వర్గాల అభివృద్ధే ‘స్వేరోస్‌’ ధ్యేయం

                                 
   టిఎస్‌ స్టేట్‌ సోషల్‌ వెల్పేర్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరి            ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
        రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలను పేదరికం ఉచ్చు నుంచి బయటపడేయడమే స్వేరోస్‌ నెట్‌వర్క్‌ స్వచ్ఛంద సంస్థ ధ్యేయమని తెలంగాణ ఐజీ, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జీసస్‌నగర్‌లో జయమనెమ్మ కళ్యాణమండపంలో రెసిడెన్షియల్‌ పాఠశాలల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లార్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివి ఉన్నత స్థానంలో స్థిరపడిన వారందరినీ కలుపుతూ స్వేరోస్‌ నెట్‌వర్క్‌ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న వారందరి వివరాలు సేకరించామని ఆసక్తి ఉండి పేదరికంతో చదువుకోలేని వారికి సంస్థ అండగా నిలుస్తుందని అన్నారు. నిరుద్యోగయువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో 2004`05లో తాను ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించానని పేర్కొన్నారు. జిల్లా అంటే ప్యాక్షన్‌ గుర్తొస్తుందని అయితే అంత కంటే ఎక్కువగా ఇక్కడ పేదరికం ఉందని అన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం ఉందని దానిని వారు వీడాలని సూచించారు. ఉన్నత స్థానంలో స్థిరపడిన ప్రతి ఒక్కరూ తన కుటుంబం, తన పని అని కాకుండా 5 శాతం సంపాదనను తాను వచ్చిన సామాజిక వర్గంలో వెనుకబడిన వారికి ఖర్చు పెట్టాలన్నారు. సమాజంలో అంతరాలను తొలగించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. రెసిడెన్షియల్‌ విద్యార్థుల కోసం రూపొందించిన ‘నేను నంబర్‌వన్‌ స్టూడెంట్‌’ అను పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  ప్రవీణ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్‌ సంస్థ కేంద్రకమిటీ సభ్యులు సురేష్‌, రాజేష్‌, నవీన్‌, లోక్‌నాధ్‌రెడ్డి, చలపతి, నాగేంద్ర, రమణ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: