8, మే 2015, శుక్రవారం

బ్రిటన్‌ గద్దెపై మరోసారి కామెరాన్‌

                                                      
                   బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో మితవాద కన్సర్వేటివ్‌ పార్టీ అనూహ్యమైన మెజార్టీతో విజయం సాధించింది. ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ మరోసారి పదవ నంబర్‌  డౌనింగ్‌ స్ట్రీట్‌ (బ్రిటన్‌ ప్రధాని అధికారిక  నివాసం)లో  ప్రవేశించనున్నారు. కన్సర్వేటివ్‌ల భారీ  విజయం బ్రిటిష్‌ రాజకీయాలు మరింతగా మితవాదం వైపు మళ్ళాయనడానికి ఒక తార్కాణమని  రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ రాణి ఎలిజబెత్‌`2ను కలిశారు. అనంతరం ఆయన తన నివాసం వెలుపల  మాట్లాడుతూ మెజారిటీ కన్సర్వేటివ్‌ ప్రభుత్వాన్ని తాను ఏర్పాటుచేయబోతున్నానని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో  తనతో పోటీపడిన  మాజీ సంకీర్ణ భాగస్వామి , లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు నిక్‌ క్లెగ్‌, ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు ఇడి మిలిబండ్‌లను కెమరాన్‌ అభినందించారు.ప్రతి ఒక్కరూ చక్కటి మెరుగైన జీవితాన్ని గడిపే ప్రదేశంగా బ్రిటన్‌ను  తీర్చిదిద్దుతామని ప్రధాని కెమరాన్‌ చెప్పారు. కన్సర్వేటివ్స్‌కు సీట్లలో  దగ్గరగా నిలుస్తుందనుకున్న  ప్రతిపక్ష  లేబర్‌ పార్టీ  బాగా వెనకబడిరది. మొత్తం 650 స్థానాలున్న పార్లమెంటులో కన్సర్వేటివ్స్‌ పార్టీ  330 సీట్లు కైవసం చేసుకోగా, లేబర్‌ పార్టీ 230 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఎడ్వర్డ్‌ మిలిబాండ్‌తోపాటు లిబ్‌డెమ్స్‌ నేత నిక్‌ క్లెగ్‌, యుకెఐపి నేతనైజల్‌ ఫరాజ్‌ పదవులకు రాజీనామా చేశారు.  బ్రిటన్‌ ప్రజలు కన్జర్వేటివ్‌ పార్టీని గట్టిగా సమర్ధించారని శుక్రవారం ఉదయం ఫలితాలు తెలిసినవెంటనే ప్రధాని కామెరాన్‌ హర్షంవ్యక్తం చేశారు. తనను తిరిగి ఎన్నుకున్న ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ వాసులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.  ‘మనదేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేవిధంగా ప్రతిఒక్కరికీ సుపరిపాలన అందించాలన్నది తన ఆకాంక్ష అని కామెరాన్‌ చెప్పారు.  స్కాట్లండ్‌ స్వాతంత్య్ర రిఫరెండం సందర్బంగా చేసిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  తన పార్టీ, తమ ప్రభుత్వం దేశానికి నేతృత్వం వహించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
                                                                 ఎస్‌ఎన్‌పి ప్రభంజనం
              ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ ప్రభంజనంలా విజృంభించటంతో లేబర్‌పార్టీకి ఘోరంగా ఓడిపోయింది.  ఈ ఓటమి నేపథ్యంలో లేబర్‌పార్టీ నేతృత్వంనుండి తాను వైదొలుగుతున్నట్లు ఎడ్వర్డ్‌ మిలిబండ్‌ ప్రకటించారు.  ఓటమిపాలయిన వారిలో స్కాటిష్‌ లేబర్‌ పార్టీ నేత జిమ్‌ మర్ఫీ, మరో సీనియర్‌ నేత డగ్లస్‌ అలెగ్జాండర్‌ కూడా ఓటమి పాల య్యారు.  లిబ్‌డెమ్స్‌ను ఓడిరచినప్పటికీ లేబర్‌ పార్టీ కన్జర్వేటివ్‌ల విజయాన్ని నిలువరించటంలో ఘోరంగా విఫలమైంది.  డాన్‌కాస్టర్‌ స్థానంలో తనను సమర్తించిన మద్దతుదారులకు మిలిబాండ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  దేశాన్ని ఐక్యంగా వుంచటంలో కొత్త ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రముఖుల్లో లండన్‌ నగర మేయర్‌ బోరిస్‌ జాన్సన్‌ తదితరులున్నారు.

కామెంట్‌లు లేవు: