5, ఏప్రిల్ 2011, మంగళవారం

సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయి బాబాగా

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబరు 23న సత్యనారాయణ రాజు (సత్యసాయిబాబా) జన్మించారు. తనకుతానే బాబా అని ప్రకటించుకుని ప్రపంచ ఆధ్యాత్మికవేత్తగా సత్యసాయిబాబా ఎదిగారు. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు, విమర్శలను, ఆరోపణలను సైతం సత్యసాయిబాబా ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్తగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులున్నారు.
బాల్యం గడించింది ఇలా...
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెద్దవంకమరాజు రత్నం దంపతులకు 1926 నవంబరు 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిన్నప్పటి నుంచి పెద్దసోదరుడు శేషమరాజు వద్దనే ఉంటూ వచ్చారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సత్యనారాయణరాజు విద్యాభ్యాసం కూడా ఒక్కొక్క చోటు జరుగుతూ వచ్చింది. పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉరవకొండలో ప్రాథమికోన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల తరుణంలో ఒక రోజు సత్యనారాయణ రాజుకు తేలు కుట్టింది. అప్పటి నుంచి ఆయన మానసిక పరివర్తనలో మార్పు వచ్చింది. ఏదేదో మాట్లాడుతుండే వాడు. దీంతో ఆయన సోదరుడు శేషమరాజు ఆయన్ను తన స్వగ్రామమైన పుట్టపర్తికి పంపించారు. కొద్దిరోజులు తరువాత తాను దేవుడినని, తన పేరు ఇక నుంచి సత్యసాయిబాబా అని 1940లో ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సత్యనారయణ రాజు కాస్త సత్యసాయిబాబాగా పిలువబడుతూ వచ్చారు. అనంతరం ఆయన దక్షిణ, ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. తిరిగొచ్చాక కొన్ని మహిమలు చూపడంతో భక్తులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. 1944లో ఆయనకు మొట్టమొదటిసారిగా పుట్టపర్తిలో మందిరాన్ని నిర్మించారు. దీన్ని ప్రస్తుతం మందిరంగా పిలుస్తున్నారు. 1948లో ప్రశాంతి నిలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి క్రమక్రమంగా బాబా గురించి దేశవ్యాప్తంగా తెలియడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చేవారు. 1968లో మొట్టమొదటిసారి విదేశీ పర్యటన చేపట్టారు. క్రమక్రమంగా అక్కడి నుంచి కూడా విదేశీ భక్తులు పుట్టపర్తికి రావడం పెరిగింది.
విమర్శలు, ఆరోపణలు...
సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయిబాబాగా ఎదిగే క్రమంలో ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం అనేక వ్యతిరేక కథనాలు వచ్చాయి. అన్నింటికంటే ఎక్కువగా విమర్శలకు గురిచేసింది 1993 జూన్‌ 6న ఆశ్రమంలో జరిగిన ఆరు హత్యలు. బాబా నిద్రించే గదిలోనే ఇద్దరు యువకులు తుపాకీతో కాల్చి హత్య గురికావడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించినందునే వారిని కాల్చి చంపారని అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. ఇకపోతే నోటిలో నుంచి శివలింగం తీయడం, గాలిలో విబూది తీయడం వంటివన్నీ మహిమలు కాదని, మ్యాజిక్‌ మాత్రమేనని ప్రముఖ హేతువాది ప్రేమానంద్‌ పేర్కొన్నారు. చంద్రుడు తన ప్రతిరూపం కనిపిస్తుందని అంతకు ముందు ఏడాది ప్రకటించి కనబడకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఆరోపణలేవీ ఆయన్ను పెద్దగా అడ్డుకోలేకపోయాయి. 2004లో బిబిసి అంతర్జాతీయ మీడియా ఛానల్‌ 'ది సీక్రెట్‌ స్వామి' అనే పేరుతో ఒక కథనాన్ని వెలువరిచింది. వీటన్నింటినీ సత్యసాయిబాబా భక్తులు తిప్పికొట్టగలిగారు.
ప్రపంచ వ్యాప్తంగా సేవా సమితులు...
సత్యసాయి సేవా సమితులు ప్రపంచ వ్యాప్తంగానున్నాయి. 126 దేశాల్లోని 1200 చోట్ల సత్యసాయి సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారానే సత్యసాయి బాబా ట్రస్టు కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలే కాకుండా పుట్టపర్తిలోని ట్రస్టు కార్యకలాపాలన్నీ సేవాసమితి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. భద్రత మొదలుకుని అన్నీ కూడా సమితి సభ్యుల కనుసన్నల్లోనే నడుస్తాయి. ట్రస్టు లోపలి భాగంలో పోలీసులకు సైతం ప్రవేశం ఉండదు.
సేవా కార్యక్రమాలు...
సత్యసాయి బాబా ఏర్పాటు చేసిన 'సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు' ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, వైద్యం అందులో ప్రధానమైనవి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. వీటితోపాటు పలు జిల్లాలకు తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. అనంతపురం, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. చెన్నై నగరానికి తాగునీటి ప్రాజెక్టును చేపట్టారు. ఒరిస్సాలో 2008లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టారు.
ఇటీవలే వైభవంగా 85వ జన్మదిన వేడుకలు...
ప్రతి ఐదేళ్లకు ఒకసారి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించడం అనవాయితీ. 2010 నవంబరు 23న 85వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వారం రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో మహిళా దినోత్సవానికి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నవంబరు 22న సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. 23న జరిగిన జన్మదిన వేడుకలకు కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణ, టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్‌టాటా తదితరులు హాజరయ్యారు.
సత్యసాయి వారసులెవరు?
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి పుట్టపర్తివైపే పడింది. భక్తి , మహిమలు ఎలాగున్నా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బోగు చేశారు. వాటితో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిని కాపాడి ప్రభుత్వ పరం చేయడానికి తగిన శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి నిర్వహణ పరిస్థితి భవిష్యతులో ఏ విధంగా ఉండబోతోందన్న చర్చసాగుతోంది. సత్యసాయిబాబా ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఇటువంటి ఆలోచనే చేయని వారందరూ ఇకపై ఎలాగన్న చర్చమొదలైంది. ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లే వారసుడు ఎవరన్నది ట్రస్టులోని ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కార్యక్రమాలు జరిగాయి. ఈ ట్రస్టుకు సత్యసాయి బాబానే అధ్యక్షులుగావున్నారు. కార్యదర్శిగా చక్రవర్తి ఉన్నారు. తొమ్మిది మంది సభ్యులున్నారు. వారిలో ఎక్కువగా తమిళనాడుకు చెందినవారున్నారు. భక్తులుగా చేరిన వారు క్రమంగా ట్రస్టు సభ్యులుగా మారారు. ఈ సభ్యుల్లో సత్యసాయి బాబా సోదరుడు జానకిరామయ్య కుమారుడు రత్నాకర్‌ ఒకరుగానున్నారు. సత్యసాయిబాబాకు ఆయనంటే అమితమైన అభిమానముండేది. కాని ఆయన్ని వారసుడిగా ఇప్పటి వరకు బాబా ఎక్కడా ప్రకటించిన దాఖలాల్లేవు. బాబా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. ఆయన కోలుకున్నప్పటికీ ఇకపై ట్రస్టు నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలపై ఏ మేరకు దృష్టి సారించగలరో చెప్పలేని పరిస్థితి. దీంతో నాయకత్వ బాధ్యతలను మరొకరు తీసుకునే అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితే గనుక వస్తే ఎవరిని సత్యసాయి వారసునిగా ప్రకటిస్తారో అంతుబట్టడం లేదు. ఈ విషయంలో ట్రస్టు వర్గాల్లోనూ భిన్నాభిప్రాయలున్నట్లు తెలుస్తోంది. ట్రస్టు కార్యదర్శిగానున్న చక్రవర్తి ఇప్పటి వరకు అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆయన పట్ల కొంత మంది వ్యతిరేక భావంతోనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌ రాజును కూడా వారసుడిగా ప్రకటించే పరిస్థితుల్లేవు. ఈ విషయంలో ఇప్పటికే ట్రస్టు సభ్యుల మధ్య భేదాభిప్రాయలున్నట్టు తెలుస్తోంది. రత్నాకర్‌ రాజును ట్రస్టు సభ్యులు దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం సాగుతోంది. బాబా ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు కూడా కొంత మంది నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో శుక్రవారం రాత్రి రత్నాకర్‌ రాజు ఆసుపత్రి వైద్యులతోనూ, ట్రస్టు సభ్యులతోనూ స్వల్ప వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కొంత మంది కలుగజేసుకుని సర్ధిజెప్పడంతో తాత్కాలికంగా ఇది సద్దుమణిగినట్టు సమాచారం. ఇదిలావుండగా సోమవారం ఆరుగురు ఉన్నతస్థాయి న్యాయనిపుణులు పుట్టపర్తికి వస్తున్నట్టు సమాచారం. వీరు బాబాను కలిసేందుకు వస్తున్నారా లేక ట్రస్టులో తలెత్తబోయే సమస్యలను పరిష్కరించేందుకు వస్తున్నారా? అన్నది తెలియాల్సుంది. మొత్తం మీద భవిష్యత్తులో సత్యసాయి సేవా ట్రస్టు కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న ఆందోళన అటు భక్తుల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ నెలకొంది.

5 కామెంట్‌లు:

Sandeep P చెప్పారు...

చాలా వివరంగా వ్రాశారు. అభినందనలు.

రవి చెప్పారు...

సత్యసాయిబాబా మీద 80 వ దశకం చివర్లో అనుకుంటాను, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకసంచిక వెలువరించింది. అందులో ఆ రోజుల్లోనే 1500 కోట్లు ఆ చిన్నగ్రామంలో పోగు పడినట్లు చెప్పింది.

ప్రముఖ ఐంద్రజాలికుడు పీసీ సర్కార్ చెప్పిన కథనం కూడా ప్రచురించినట్టు గుర్తు. ఆయన భక్తులమధ్య కూర్చుని ఉండగా సాయిబాబా వచ్చి చేతులు తిప్పి విభూతి సృష్టించి ఇచ్చారుట. అప్పుడు పీసీ సర్కార్ తనూ చేతులు తిప్పి లడ్డూ సృష్టించి ఇచ్చాడుట. అక్కడి సెక్యూరిటీ జోక్యం చేసుకుని సర్కార్ ను అక్కడి నుంచి పంపించివేసినట్టు కథనం.

panuganti చెప్పారు...

Sandeep garu, Ravigaru Thanks for your comments. ravigaru saibaba nu baga study chesharu.

Atheist చెప్పారు...

Chaala baagaa vraasaaru. Baabaa gurinchi cheppakane cheppesaaru!

Abhinandanalu
Sharath Chandra Chowdary Bellamkonda

kulavivakshavyatireka poratasangam చెప్పారు...

సత్య సాయిబాబా కు సంబందించిన సంపూర్నమైన వివరాలు ఇచ్హారు చాలాబాగుంధి. ఐతే ఆయన మరనం తరువాత ట్రస్ట్ రూపం మారింధి అనుకుంటున్నారు ప్రజలు దానికిసంబందించిన వివరాలుకూడా తెలియజేస్తే మంచిది. MD.Anandbabu KVPS