20, ఫిబ్రవరి 2019, బుధవారం

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు




హైదరాబాద్‌:  2019 ఫిబ్రవరి 19న ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలు కేటాయించారు. గతంలో ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కేటాయించారు. జగదీశ్‌రెడ్డి గతంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేయగా ప్రస్తుతం విద్యాశాఖను కేటాయించారు. నిరంజన్‌రెడ్డికి ఆర్థిక శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ సీఎం.. ఆశాఖను ఎవరికీ కేటాయించలేదు. ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. తెలంగాణ కేబినెట్‌లో 16మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తొలి విడతలో 10 మందికి  అవకాశం దక్కింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. 
మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు...
ఈటల రాజేందర్‌: వైద్య ఆరోగ్యశాఖ
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌: పశుసంవర్థకశాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్‌శాఖ
నిరంజన్‌రెడ్డి: వ్యవసాయశాఖ
కొప్పుల ఈశ్వర్‌: సంక్షేమశాఖ
చామకూర మల్లారెడ్డి: కార్మిక శాఖ
జగదీశ్‌రెడ్డి: విద్యాశాఖ
శ్రీనివాస్‌గౌడ్‌: ఎక్సైజ్‌శాఖ, పర్యాటకశాఖ
ప్రశాంత్‌రెడ్డి: రవాణా, రహదారులు, భవనాలశాఖ
ఇంద్రకరణ్‌రెడ్డి: న్యాయ, అటవీ, దేవాదాయశాఖ

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

మోదీ ఉండగానే మంత్రి అసభ్య ప్రవర్తన


                  అగర్తల: ఆయనో మంత్రి.. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి తోటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో. ఎదురుగా ప్రధాని మోదీ శంకుస్థాపనలో బిజీగా ఉంటే.. ఈయనేమో పక్కన నిల్చున మహిళా మంత్రిపై వేధింపులకు పాల్పడుతూ కెమెరాకు చిక్కారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే..
ప్రధాని మోదీ గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు.
                  దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. మనోజ్‌ కాంతి దేవ్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీనిపై మనోజ్‌ను ప్రశ్నించగా.. ఘటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
కాగా.. భాజపా మాత్రం ఘటనను తోసిపుచ్చింది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్ష నేతలు ఇలా భాజపా మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి అన్నారు. ఆ వీడియో అంతా బూటకమని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా ఘటనపై సదరు మహిళా మంత్రి నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు.

ఆ ఊరిలో రెండు గంటల ముందే సూర్యాస్తమయం!



                 సాధారణంగా ఎక్కడైనా సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యాస్తమయమే అవుతుంది. కానీ ఆ ఊరిలో మాత్రం రెండు గంటల ముందే చీకటి పడుతుంది. ఒక గంట ఆలస్యంగా తెల్లవారుతుంది. అంటే సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ఈ ప్రత్యేక విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం  పెద్దపల్లి జిల్లా వెళ్లాల్సిందే.          పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కుదురుపాక మండలం. అన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యుడు ఆస్తమిస్తే ఈ వూరిలో మాత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం గ్రామానికి తూర్పు, పడమర దిక్కుల్లో ఉన్న ఎత్తైన కొండలే. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ముందుగానే సూర్యాస్తమయం ఉంటుంది.              తూర్పు దిక్కున కొండలు ఉండడం వల్ల సూర్యోదయం కూడా గంట ఆలస్యమవుతుంది. ఉదయం, రాత్రి వేళ్లల్లో తేడా ఉండడంతో ఈ పల్లెకు మూడు జాముల కుదురుపాకగా పేరు ఉంది.సాయంత్రం కాగానే సూర్యుడు రంగనాయకుల గుట్ట వెనుక దాక్కుంటాడని  గ్రామస్థులు చెబుతున్నారు. పనులకు వెళ్లినవారు త్వరగానే పల్లెకు చేరుకుంటారు. ఊరికి నాలుగు వైపుల గుట్టలు కొంత ప్రయోజనం ఉన్నా..  వేసవికాలంలో మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుందని పల్లెవాసులు పేర్కొంటున్నారు

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

యాత్ర రివ్యూ



              మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద యాత్ర చేశార‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలుసు. ఆ పాద‌యాత్ర ఆయ‌న రాజ‌కీయ జీవిత‌ంలో ఎంతో కీల‌క‌మైంది. అస‌లు యాత్ర చేయాల‌ని ఎందుకు అనుకున్న‌ట్టు? పాదయాత్రకు దారితీసిన పరిస్థితులేంటి? ఆయ‌న ఆలోచ‌నా విధానం ఏంటి? ఆయ‌న కుటుంబం ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎలాంటి స‌ల‌హాలు ఇచ్చింది? వెంట ఉన్న‌వారు ఏమ‌న్నారు? వంటి అంశాల‌తో మ‌హి.వి.రాఘ‌వ్ తెర‌కెక్కించిన చిత్రం `యాత్ర‌`. ఈ చిత్రం వై.య‌స్‌. జీవితానికి అద్దం ప‌ట్టిందా? సినిమాటిక్ లిబ‌ర్టీస్ తీసుకున్నారా? ఆల‌స్య‌మెందుకు? చ‌దివేయండి.
సినిమా: యాత్ర‌
నిర్మాణ సంస్థ‌: 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
తారాగ‌ణం: మమ్ముట్టి, రావు ర‌మేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి త‌దితరులు
కెమెరా: సత్యన్ సూర్యన్
మ్యూజిక్: కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్: సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్: Knack Studios
సమర్పణ: శివ మేక
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : మహి వి రాఘవ్
క‌థ‌:
                   వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి (మ‌మ్ముట్టి) ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో భాగంగా త‌న నియోజ‌కవ‌ర్గంలో.. త‌న జిల్లాలోని నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతుంటారు. అత‌నికి కె.వి.పి.రామ‌చంద్ర‌రావు (రావుర‌మేష్‌) సహాయకుడు. కె.వి.పి ని కెప్‌స్ట‌న్ అని వై.ఎస్ పిలుస్తుంటాడు. పార్టీ హై క‌మాండ్ ఓ నియోజ‌క వ‌ర్గంలో సుబ్బారెడ్డి అనే వ్య‌క్తిని ఎమ్మెల్యేగా నిల‌బెడుతుంది. కానీ వై.ఎస్ ఆ సీటును సుచ‌రిత‌కు కేటాయిస్తాడు. దాంతో హై క‌మాండ్‌ నుంచి వ‌చ్చిన తివారీ.. వై.ఎస్‌ను హై క‌మాండ్‌కు వ్య‌తిరేకంగా వెళ్ల‌వ‌ద్ద‌ని అంటాడు. కానీ తాను మాట ఇస్తే ముందుకెళ‌తాన‌ని వెన‌క్కి త‌గ్గ‌న‌ని అంటాడు వై.ఎస్‌. ఇలాంటి త‌రుణంలో అధికార పార్టీ మ‌న‌దేశం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతుంది. ప్ర‌చారం చేసుకోవ‌డానికి త‌గిన స‌మయం ఉండ‌దు. ఆర్ధిక‌బ‌లం కూడా ఉండ‌దు. ఇలాంటి స‌మ‌యంలో వై.ఎస్ ఏం చేయాల‌ని ఆలోచిస్తుంటాడు? ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు పాద‌యాత్ర చేయాల‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తుంది. హై క‌మాండ్‌కు ఓ మాట చెబుతాడు. కానీ వారి ప‌ర్మిష‌న్ లేకుండానే పాద‌యాత్ర స్టార్ట్ చేస్తాడు. ముందుగా ఆయ‌న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుండి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌దు. క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుంది. ప్ర‌జ‌ల స్పంద‌నతో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనం, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు.. అందుకు దారి తీసిన ప‌రిస్థితులే యాత్ర సినిమా...
విశ్లేష‌ణ‌:
             వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉండి.. అధికారప‌క్ష నాయ‌కుడిగా ఎదిగిన క్ర‌మాన్ని యాత్ర సినిమాలో చూపించారు. కొత్త‌గా చెప్పిన క‌థేం కాదు.. వై.ఎస్‌.ఆర్ రాజ‌కీయ జీవితంలో పాద‌యాత్ర‌కు ఉన్న ప్రాముఖ్య‌త‌ను.. అందుకు దారి తీసిన ప‌రిస్థితుల‌ను ప్ర‌ధానంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించారు. పాత్రల తీరు తెన్నుల విషయానికి వ‌స్తే మల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌ర్శ‌కుడు చెప్పిన అంశాల‌ను సినిమాగా మలిచే క్ర‌మంలో త‌న‌దైన న‌ట‌న‌తో ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డమే కాదు.. తెలుగులో కూడా త‌నే డబ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. గ్రేస్ ఫుల్‌గా క‌న‌ప‌డ్డాడు మ‌మ్ముట్టి. సినిమా అంతా ఈయ‌న పాత్ర చుట్టూనే ఎక్కువ‌గా తిరుగుతుంది. సినిమాలో ముఖ్య పాత్ర‌ధారులైన కె.వి.పి పాత్ర‌లో న‌టించిన రావు ర‌మేష్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. అయితే వై.ఎస్ పాత్ర కె.వి.పికి ఇచ్చిన ప్రాముఖ్య‌త‌ను సినిమాలో చూపించారు. నిజానికి వై.ఎస్‌.ఆర్‌కు పాద‌యాత్ర చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చిన వ్య‌క్తిగా కె.వి.పి పేరుంది. అయితే దాన్ని సినిమాలో ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. వై.ఎస్‌. పాద‌యాత్ర స‌మ‌యంలో కె.వి.పి ఆయ‌న వెన్నంటే ఉన్నా ఆ పాత్ర‌ను అంత పెద్ద‌గా ఎలివేట్ చేయ‌లేదు. వై.ఎస్ అనుచరుడిగా న‌టించిన ర‌మేష్ కంటే రావు ర‌మేష్ పాత్ర ఎఫెక్టివ్ కాస్త త‌క్కువ‌గానే క‌న‌ప‌డింది. ఇక వై.ఎస్‌.రాజారెడ్డి పాత్ర‌లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు, స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో న‌టించిన సుహాసిని, సుచ‌రిత పాత్ర‌లో న‌టించిన అన‌సూయ‌, వెంక‌ట్రావుగా పోసాని కృష్ణ‌ముర‌ళి, కేశ‌వ‌రెడ్డిగా వినోద్ కుమార్‌, హ‌నుమంతరావు పాత్ర‌లో తోట‌ప‌ల్లి మ‌ధు త‌దిత‌రులు వారి పాత్ర‌ల్లో చ‌క్కగా న‌టించారు.
              సాంకేతికంగా నైపుణ్యం కలిగిన చిత్ర ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ యాత్రను ఎక్కువ‌గా సినిమాటిక్ కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఉదాహ‌ర‌ణ‌కు హై క‌మాండ్‌కు వై.ఎస్ విధేయుడిగా ఉండేవారు. కానీ ఈ సినిమాలో పార్టీ హైక‌మాండ్‌ను వ్య‌తిరేకించిన‌ట్లు చూపించారు. ముఖ్యంగా వై.ఎస్ ముఖ్య‌మంత్రి అయ్యే క్ర‌మంలో హైక‌మాండ్ పంపిన గులాంన‌బీ అజాద్ అనే వ్య‌క్తిని ఇక్క‌డ నెగ‌టివ్‌గా చూపించారు. అలాగే వై.ఎస్ పాత్ర‌ను హైలైట్ చేయ‌డానికి మిగ‌తా పాత్ర‌ల ప్రాముఖ్య‌త‌ను ప‌క్క‌న పెట్టేశారు. సూరీడు పాత్ర‌ను పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌నేలేదు. అలాగే వై.ఎస్‌.విజ‌య‌మ్మ పాత్ర‌ధారి చేసిన ఆవిడ‌.. అలాగే ఇత‌ర పాత్ర‌ల ప‌రిధి అనేది ప‌రిమితంగానే క‌న‌ప‌డింది. కె సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని సీన్స్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. స‌త్య‌న్ సూర్య‌న్ కెమెరా వ‌ర్క్ బావుంది. చివ‌ర్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డికి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను, ఆయ‌న మ‌ర‌ణం స‌మ‌యంలో జరిగిన కొన్ని ప‌రిస్థితుల‌ను యథాతథంగా చూపించారు. ఈ క్ర‌మంలో వై.ఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చేసిన స్పీచ్‌ను కొన్ని సెకండ్ల పాటు తీసుకున్నారు. అయితే సినిమా పూర్తిస్థాయి రాజ‌కీయ కోణంలో సాగింది. ఫ‌స్టాఫ్ మ‌రీ స్లో ఫేజ్‌లో సాగింది. ఇలాంటి పొలిటికల్ బ‌యోపిక్స్ యూత్‌ను ఏ మేర ఆక‌ట్టుకుంటాయనేది సందేహమే.