28, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రణబ్‌ ముఖర్జి బడ్జెట్‌కు సెన్సెక్స్‌కు లింకేమిటి?

ప్రణబ్‌ముఖర్జి బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌ పెరిగిపోయింది. స్టాక్‌ మార్కెట్‌కు బడ్జెట్‌కు లింకేమిటి స్టాక్‌ మార్కెట్‌ అనగానే ఇదంతా పెట్టుబడి దారులకు సంబంధించింది. స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో నడుస్తుందంటే ప్రణబ్‌ముఖర్జి బడ్జెట్‌కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైనదనేగా అర్థం. యుపిఎ -1 ప్రభత్వ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా వామపక్షాల మద్దతుతో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఏర్పాటయింది. అప్పుడు పార్లమెంటులో బడ్జెట్‌ పవేశపెట్టిగానే సెన్సెక్స్‌ పడిపోయింది. అంటే అప్పుడు మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే తరహాలో బడ్జెట్‌ ఉన్నది. కొన్ని వ్యాపార సంస్థలకోసం కాకుండా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆనాటి బడ్జెట్‌ అంటే రాజకీయ డాక్యుమెంటు తయారు చేశారు. ఈనాడు అంటే 2011-12 బడ్జెట్‌ మాత్రం ప్రజల ప్రయోజనాలను విస్మరించిందనే చెప్పవచ్చు.బహుళజాతి సంస్థలు తయారు చేసిన కార్పొరేట్‌ కంపెనీల డాక్యుమెంటులా ఉంది. ఒక పక్కధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కష్టాల్లో ఉన్నారు. అన్ని స్థాయిల్లో అవినీతి పెరిగి పోయింది. నల్లధనం నిల్వలు పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వాటిని అదుపు చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం శూన్యం. కేవలం ఆందోళన వ్యక్తం చేస్తే ధరలు తగ్గుతాయా? అవినీతి తగ్గుతుందా? పేదల ఆదాయం పెరుగుతుందా? ఒక పిల్లవాడికి గణితంలో మార్కులు తక్కువగా వస్తున్నాయంటే మార్కులు పెంచడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి. ట్యూషన్‌ చెప్పించాలి. పిల్లవాడికి పౌష్టికాహారం ఇప్పించాలి. కాని మార్కులు తగ్గడానికి గల కారణాలను అన్వేషిస్తాం. నల్లధనాన్ని అదుపు చేయడానికి ఐదంచెల విధానాన్ని రూపొందిస్తామని ప్రకటనలు చేయడం. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడానికి వ్యవసాయానికి సబ్సిడీలు ఇవ్వకుండా ఆందోళన కలిగిస్తుందని ప్రకటన చేస్తే సరిపోతుందా?.
2011-12 వార్షిక పేదలకు మాటలు చెప్పి విదేశీ బహుళజాతి సంస్థలకు, స్వదేశీ సంపన్నులకు మూటలు కట్టబెట్టేలా ఉంది. కాకులను కొట్టి గద్దలకు దోచిపెట్టడమంటే ఇదే. రోజుకు ఇరవై రూపాయలు కూడా ఖర్చు చేయలేని పేదలు, అరకొర ఆదాయాలతో బతుకీడుస్తున్న సామాన్య, మధ్యతరగతి జీవులు కలిపి దేశంలో 95 శాతం మంది ఉన్నారు. భారీసంఖ్యలో ఉన్న ఈ జనాలకు విదల్చడమో లేక వారి వంక చూడకపోవడమో చేసిన ఆర్థిక మంత్రి సంపన్నులకు మాత్రం రెండు చేతులతో తవ్వి పోశారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ద్రవ్యోల్బణాన్ని ఆదుపు చేస్తామంటూనే ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణంపై నోరుమెదపలేదు సరికదా ఆహార పదార్ధాల ధరలు పెరుగుతాయన్నారు. ధరల నియంత్రణపై చేతులెత్తేశారు. ఆహార భద్రత బిల్లును ఈ ఏడాదిలో పార్లమెంట్‌లో ప్రవేశపెడతామంటూనే, సబ్సిడీలకు కోత పెట్టారు. సబ్సిడీలను నగదు రూపంలో చెల్లిస్తాం, కిరోసిన్‌, గ్యాస్‌, ఎరువులకు కూపన్లు ఇస్తాం అంటూ సబ్సిడీలను దిగ్గోస్తామని ప్రణబ్‌ బాహాటంగా ప్రకటించారు. బడ్జెట్‌లో నిరుటి కంటే 27 కోట్లు కోత పెట్టారు. డీజిల్‌, పెట్రోలు ధరల పెంపుతో అన్ని వస్తువుల ధరలూ పెరిగి సామాన్యులు అవస్థలు పడుతున్నారు, పెట్రోలియం ఉత్పత్తులపై కష్టమ్స్‌, ఎక్సయిజ్‌ సుంకాలు తగ్గిస్తే కొంత వరకూ ధరలు తగ్గుతాయని ప్రతిపక్షాలు, ప్రధానంగా వామపక్షాలు నెత్తీనోరు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవినపెట్టింది. బడ్జెట్‌లో ఆ ఊసు లేదు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టడానికి వీలుగా భారీ యంత్రాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. ఏడాదిలో వ్యవసాయ కూలీలకు వంద రోజులు పని కల్పించాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన చేత్తోనే భారీ యంత్రాలను ప్రోత్సహించడం ఏం నీతి? ఉపాధి హామీ కార్మికుల వేతనాలు పెంచామని కొండంతరాగం తీసిన ఆర్థిక మంత్రి గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో వందకోట్లు తగ్గించి ఆమాద్మీకి ప్రాధాన్యమిచ్చామంటే ఎలా చెల్లుబాటవుతుంది? వృద్ధాప్య పింఛన్లకు వయో పరిమితి తగ్గించి ఆ మేరకు పెరగనున్న పింఛన్లకు నిధులు కేటాయించలేదు.
వినాశకర సంస్కరణల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ప్రజల నుండి నిరసనలు మిన్నంటుతున్నా వాటినే పట్టుకు వేలాడుతోంది యుపిఎ-2 సర్కార్‌. భవిష్యత్తులో ఆ 'సంస్కరణ'లనే అమలు చేస్తామని విత్త మంత్రి నిస్సిగ్గుగా ఢంకా భజాయించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను గతేడాది కంటే 15 వేల కోట్లు ఎక్కువగా అంటే 40 వేల కోట్లు ఉపసంహరిస్తున్నట్లు సెలవిచ్చారు. మౌలిక వసతుల రంగంలో విదేశీ పెట్టుబడులకు ఉవ్విళ్లూరుతూ పెట్టుబడులు రావాలంటే భారీ రాయితీలు తప్పనిసరని కుతర్కం వినిపించారు. కార్పొరేట్లపై సర్‌ ఛార్జి 7.5 శాతం నుండి 5 శాతానికి ఉదారంగా తగ్గించేశారు. వేతన జీవులకు ఆదాయ పరిమితి 1.6 లక్షల నుండి 1.8 లక్షలకు పెంచినట్లు ఫోజు పెట్టినప్పటికీ పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ పెంపు ఏ మాత్రం సరిపోదు. గతంలో మహిళలకు, పురుషులకు మధ్య ఆదాయ పన్ను పరిమితి తేడా ఉండేది. ఈసారి పురుషులతో సమానం చేసి మహిళలకు ఇంతకాలం ఉన్న ఆ మాత్రం ప్రోత్సాహకాన్ని సైతం లేకుండా చేశారు. ఆదాయ పరిమితి పెంపువల్ల ప్రత్యక్ష పన్నుల నుండి 11,500 కోట్లు ఆదాయం తగ్గుతుందన్నప్పటికీ అదే జనం నుండి పరోక్ష పన్నుల ద్వారా సర్కార్‌ 11,300 కోట్లు గుంజుతోంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అడుక్కోవడమంటే ఇదే. వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొన్న విత్త మంత్రి బడ్జెట్‌లో అందుకు తగ్గట్టు కేటాయింపులు చేయలేదు సరి కదా తగ్గించారు. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం అంటూ విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరిచి కార్పొరేట్‌ వ్యవసాయాన్ని నిస్సిగ్గుగా ప్రవేశపెడతామన్నారు. కార్పొరేట్‌, కాంట్రాక్టు వ్యవసాయం వల్ల పేద, చిన్న సన్నాకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. వ్యవసాయ రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రుణాల పెంపు అంటున్నా పేదలకు అవి బహుదూరంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల వ్యధలపై ఈ బడ్జెట్‌లో మాట మాత్రం లేకుపోవడం ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిదర్శనం.
యుపిఎ-2 ప్రభుత్వంలో అవినీతికి హద్దూ అదుపు లేకుండా పోయింది. అవినీతి కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామన్న హామీ కంటితుడుపునకే పనికొస్తుంది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వ్యవహారంపై రోజుకో విన్యాసం చేస్తున్నారు ప్రణబ్‌. నల్లధనం వెలికితీతపై ఐదంచెల వ్యవస్థ కూడా ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప చిత్తశుద్ధితో నల్లధనాన్ని రప్పించడానికి కాదని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఆర్థిక రంగంలో కీలకమైన బీమా, బ్యాంకింగ్‌, పెన్షన్‌ నిధుల వంటి వాటిని సరళీకరించే చట్టాలను వేగంగా అమలు చేస్తామనడం వెనుక విదేశీ పెట్టుబడుల మార్కెట్‌ను సంతృప్తి పర్చే రంధి దాగుంది. దానిలో భాగంగానే ప్రైవేటు బ్యాంకులకు లైసెన్సులిస్తామన్నారు. భారతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ను మరింత సరళీకరించడం ద్వారా విదేశీ పెట్టుబడులను అందుబాటులోకి తేవడమంటే ఆశల పల్లకిలో విహరించినట్లే అవుతుంది. భారత కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింత పెరగడానికి దోహద పడుతుంది. పెట్టుబడి వ్యయం జిడిపిలో 1.7 శాతం నుండి 1.2 శాతానికి తగ్గడం వల్ల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై నీలి నీడలు అలముకున్నాయి. జిడిపి గతేడాది కంటే 14 శాతం మేరకు పెరగ్గా ప్రణాళికా బడ్జెట్‌ నిరుటికంటే 12 శాతమే పెరిగింది. సమాజంలోని మహిళ, దళితులు, మైనార్టీలు, గిరిజనుల సంక్షేమానికి జరిపిన కేటాయింపులు పూర్తి అసమగ్రంగా ఉన్నాయి. మహిళలు మైక్రోఫైనాన్స్‌ సంస్థల వేధింపులు, అధిక వడ్డీలతో ఇబ్బందులపాలవుతుండగా మైక్రో సంస్థల కోసం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించడం అత్యంత దుర్మార్గం. మొత్తమ్మీద ప్రణబ్‌ బడ్జెట్‌ యుపిఎ ఆమాద్మీ ఎజెండాను పక్కనపెట్టి నయా సరళీకరణ విధానాలను దూకుడుగా అమలు చేయాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

తిరోగమన పథంలో మమత రైలు

రైల్వే బడ్జెట్‌ చరిత్రలో 2011 ఫిబ్రవరి 25 చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఈవిధంగా నిలిచిపోవటానికి కారణం ఏదో సాధించినందువల్ల కాదు. ఏమీ సాధించలేకపోవటం వల్లనే. సాధారణంగా బడ్జెట్‌ అంటే గత సంవత్సరం పని తీరును పరిశీలించుకుని అసంపూర్ణంగా మిగిలిన లక్ష్యాలను, అందుకు కారణాలను మదింపు చేసుకోవటం, ఆ వెలుగులో వర్తమాన కర్తవ్యభారం స్వీకరించటం. మమతా బెనర్జీ ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో ఈ మూడింటిలో ఏదీ జరగలేదు. ఒకసారి మంత్రిగారి ఉపన్యాసం విన్న వారికి, చదివిన వారికి ఎవరికైనా ఈ బడ్జెట్‌ 2011-2012 సంవత్సరానికే లేక రానున్న దశాబ్ద కాలానికా, అర్థదశాబ్దానికా అన్న సందేహం కలుగుతుంది. ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల సర్వే మొదలు, లైను డబ్లింగ్‌ వరకూ, స్టేషన్‌ నిర్మాణాల మొదలు, సంబంధిత పరిశ్రమల నిర్మాణాల వరకూ 12వ పంచవర్ష ప్రణాళికలో చేపడతామని బడ్జెట్‌ ప్రసంగం చెప్తోంది. ఇంకా మనం 11వ పంచవర్ష ప్రణాళిక ముగింపు దశకు చేరుకోలేదు. ఇక 12వ ప్రణాళికా కాలంలో చేపట్టం అంటే సదరు ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కావటం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ కంటే రైల్వేల ప్రగతి వేగవంతంగా ఉందని చెప్పిన మంత్రి దానికనుగుణంగా మిగిలిన పనులు చేపట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుంటే రవాణా రంగం ప్రత్యేకించి రైల్వే 11 శాతం వృద్ధిరేటు సాధించాలి. అప్పుడే విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చటానికి సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా గత రెండేళ్లుగా భారత రైల్వే విస్తరణ రైల్వేబోర్డు మాజీ సభ్యుల అంచనాల మేరకు కేవలం 5 శాతానికి పడిపోయింది. రైల్వేల ఆర్థికశక్తి సామర్ధ్యాలకు, మనుగడకు ఆపరేషన్‌ రేషియో కీలకం. వంద రూపాయాల ఆదాయం సాధించటానికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని ఆపరేషన్‌ నిష్పత్తిగా నిర్ధారిస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ 76 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి గత రెండు సంవత్సరాల్లో 95 శాతానికి పెరిగింది. వాస్తవిక అంచనాలు, నిధుల లభ్యత, ద్రవ్యోల్బణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 115చేరుతుంది. అంటే వంద రూపాయలు సంపాదించటానికి భారత రైల్వే 115 రూపాయలు ఖర్చుపెడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో వందరూపాయల సంపాదనకు 146 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తంగా భారత రైల్వే సగటున 15 శాతం లోటులో నడుస్తోంది. బహుశా భారతరైల్వే చరిత్రలో ఇంత అథమ స్థాయిలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైల్వేలు చవిచూస్తున్నాయి.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్‌ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు. రైల్వేల విస్తరణకు మూల నిధి ఖాతా, అభివృద్ధి నిధి ఖాతాలు కీలకం. ఈ రెండు ఖాతాల్లో నిధులు నామమాత్రపు దశకు చేరుకోవటంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పథకాలకు కేటాయించాల్సిన మేర కూడా రైల్వే శాఖ వద్ద నిధులు లేవు. దాంతో ఈ పథకం కింద వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ మూటకట్టి అటకెక్కించారు. మరో ముఖ్యమైన విషయం మిగులు నిధుల పద్దు. ఈ పద్దు నుండే తక్షణ వ్యయం సమకూర్చబడుతుంది. 2007-2008లో 25000 కోట్ల రూపాయలు ఉంటే 2010-2011 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు 1328 కోట్లకు కుదించుకుపోయాయి. నూతన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టకపోవటానికి ఇదీ మూల కారణం. ఈ విషయాన్ని దాచిఉంచటానికి రైల్వే శాఖ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విస్తరణ విషయంలోనూ బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదు. గత సంవత్సరం బడ్జెట్‌లో సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తిచేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. 2009లో ప్రకటించిన విజన్‌ 2020 పత్రం ప్రకారం 2020 నాటికి దేశంలో అదనంగా మరో 2,5000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం జరగాలి. అంటే మరో ఎనిమిదేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే దీనికి సంబంధించి శక్తి సామర్ధ్యాలు, శ్రామికులు, నిధులు, స్థల సేకరణ, ప్రణాళికల తయారీ గురించి పల్లెత్తు మాట లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. పైగా ఈ సంవత్సరానికి మరో 800 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం కొత్తగా చేపడతామని డాబుసరిప్రకటనకు మాత్రం బడ్జెట్‌లో చోటు దక్కింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈపాటికేవచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా మరో ఏడు రంగాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్‌ ప్రతిపాదిస్తోంది. మరో 190 రైల్వే లైన్లకు సంబంధించి సర్వే పూర్తి చేయటానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను సర్వే కూడా ఏకంగా పన్నెండవ ప్రణాళికా కాలానికి గెంటివేయబడింది. అంటే కేవలం సర్వేకే మరో ఐదేళ్లు పడితే, 2017 నాటికి పూర్తి అయ్యేట్లయితే కేవలం మిగిలిన మూడు సంవత్సరాల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుందన్నది ఎవరికీ అంతుబట్టని బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
రైల్వేల విస్తరణకు కీలకమైన ఇంజనీరింగ్‌, కోచ్‌, వ్యాగన్‌ పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న కేంద్రాలు పరిశీలిస్తే రైల్వే శాఖ మానసిక స్థితి గురించి సందేహాలు రాకపోవు. జమ్ము కాశ్మీర్‌లో రైలు బ్రిడ్జిలు, మణిపూర్‌లో డీజిల్‌ ఇంజన్లు తయారు చేసి దేశమంతటా పంపిణీ చేస్తామన్న మంత్రి ప్రకటన వెనక భారతదేశ భౌగోళిక పరిస్థితులు, దానికున్న పరిమితులు గురించిన అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌ కొన్ని సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణానికి కావల్సిన యంత్ర సామాగ్రిని తరలించాలంటే కనీసం ఆర్నెల్ల వ్యవధి అవసరం. అటువంటిది జమ్ము కాశ్మీర్‌లో తయారు చేసిన రైలు బ్రిడ్జి సామగ్రి దేశంలో మిగిలిన ప్రాంతాలకు చేరవేయటానికి ఎంత సమయం పడుతుంది ? అసలు జమ్ము కాశ్మీర్‌ నుండి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ ఎంత? అందులో వ్యాగన్‌లు తరలించగలిగిన నెట్‌వర్క్‌ ఎంత అన్నది పరిశీలిస్తే ఈ ప్రతిపాదనల హేతుబద్దతను ప్రశ్నించకుండా ఉండలేము. అదేవిధంగా మణిపూర్‌లో నిర్మించిన డీజిలు ఇంజన్లను కనీసం ఈశాన్యభారతంలోని ఏడు రాష్ట్రాలకు చేరవేయటానికే ఏళ్ల గడువు పడుతుంది. అటువంటిది మిగిలిన దేశానికి చేరవేయటానికి ఉన్న సాధనాల గురించి కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసిందీ ప్రభుత్వం. ఏతావాతా చెప్పాలంటే ఈ బడ్జెట్‌ అత్యంత అశ్రద్ధతో, అసమంజస ప్రతిపాదనలతో, వచ్చే సంవత్సరాల కోసం రూపొందించిన బడ్జెట్‌ తప్ప కనీసం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ కాదు అన్నది స్పష్టంగా రూఢి అవుతోంది.

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుందని ఒక చర్చ నడుస్తోంది. రాజకీయ పరిశీలకుల అంచనాలకు అందకుండా ఎపిలో మార్పులు జరుగుతున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించాక ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనడిచింది. రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే ఎవరనేది తరువాత నిర్ణయిస్తామని అధిష్టానం చెప్పింది. ఈలోపు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కొందరు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తికి మాత్రమే జగన్‌ వారసుడు...రాజకీయ వారసుడు కాదు అని ఒకచర్చ నడిచింది. ఇదిలా ఉండగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వ్యవహారంతో రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుంది మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో అనుకున్నారు. తెలంగాణా అంశాన్ని అధ్యయనం చేయడానికి నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాగానే రాష్ట్రం అళ్లకల్లోలం అవుతుందని ఒక విశ్లేషణ నడిచింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఈలోపు రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసి రోశయ్యను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించింది. ఇటు జగన్‌కు, అటు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని రెండింటినీ అదుపులోకి తెచ్చే తరహాలో అధిష్టానం ఆలోచించింది. ఎవరూ ఊహించని తరహాలో కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణావాడా, రాయలసీమవాడా అనే చర్చనడిచింది. ఈలోపు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది. రిపోర్టులో ఏమున్నా కాంగ్రెస్‌ అధిష్టానమే తెలంగాణా అంశాన్ని తేల్చాలనేది తెలిసిందే. జగన్‌పార్టీ పార్టీ పెడుతాడు ఈలోపు మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ వెంట వెళ్తారని ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని విశ్లేషకులు భావించారు. తెలంగాణా అంశాన్ని తేల్చక ముందే జగన్‌పార్టీ రాకముందే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి అధిష్టానం పావులు కదిపింది. కాంగ్రెస్‌లో విలీనం కావడానికి ప్రజారాజ్యం అంగీకరించింది. రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో మెజార్టీ ఓటింగుకోసం ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టే ప్రయత్నం చేసింది. చర్చబండ మొదలెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రచ్చబండలో వచ్చిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి త్వరలో మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈలోపు తెలంగాణా వాదులు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటిస్తారు. మరో సారి మున్సిపల్‌ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకోవాలని చూస్తారు. పుణ్యకాలం దగ్గర పడుతుంది. ప్రజల సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కో అంశాన్ని ఇలా కాంగ్రెస్‌ దాటుతూ చివరికి తెలంగాణాలోని టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని తెలంగాణా రాష్ట్రం ప్రకటించడానికి ప్రయత్నిస్తుంది. 2013 వరకు తెలంగాణా విషయం ఎటూ తేల్చదు. 2013లో కూడా ఎందుకు తేల్చుతుందంటే తెలంగాణాలో ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. సెంటిమెంటుతో ఉన్న ప్రజలు ఇతర పార్టీలను అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తెలంగాణా అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. తెలంగాణా వాదులు ఉద్యమం ఉదృతం చేస్తే 2013లోపే ఒక నిర్ణయం తీసుకుని తెలంగాణాలోనూ సీమాంధ్రలోనూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తుంది. కాని అంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని వదులుకునే పని కాంగ్రెస్‌ మాత్రం చేయదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రెండు రాష్ట్రాలు డిస్టర్బ్‌ అయితే యుపిఎ -2కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కువమంది ఎంపీలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌వాళ్లు ఉండటం ప్రధాన కారణం. కాబట్టి కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 2014 వరకూ కాపాడుకోచ్చు. అవినీతి, అధికధరలు, ప్రజల అన్ని రకాల సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో డబ్బుతో ముడిపడి ఉన్న అంశాలు కాకుండా కొన్నింటికి ఈలోపు పరిష్కారం చూపవచ్చు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లేందుకు స్థానిక ఎన్నికలు, తెలంగాణా వేర్పాటు వాదం వంటి వాటిని చర్చకు తెస్తారు పాలకులు. ప్రజలు అర్థం చేసుకుని తిరగబడనంతకాలం ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు.

5, ఫిబ్రవరి 2011, శనివారం

అమెరికాలో కర్నూలు వాసి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరం గణేష్‌నగర్‌కు చెందిన రంజిత్‌కుమార్‌ శనివారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వారంతపుసెలవు కావడంతో భార్యాభర్తలిద్దరూ విందుకు వెళ్లి భోజనం చేశారు. ఇంటికి వచ్చాక రంజిత్‌కుమార్‌ కోమాలోకి వెళ్లాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ మండలం సుల్తానాపురం గ్రామానికి చెందిన సూరిబాబు కుమారుడు రంజిత్‌కుమార్‌ ఆరేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సుల్తానాపురం తుంగభద్ర నదికి కర్నూలు జిల్లా వైపు ఉండడంతో వారు చాలాకాలంగా కర్నూలు నగరం గణేష్‌ నగర్‌లో నివాసముంటున్నారు. సూరిబాబు ప్రస్తుతం మానవపాడు మండలం పుల్లూరు గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు. సూరిబాబుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. రంజిత్‌కుమార్‌ అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రంజిత్‌కుమార్‌ కోమాలో ఉన్న పరిస్థితిలో నుంచి ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. రంజిత్‌కుమార్‌కు గత ఏడాది నవంబర్‌లో వివాహమయింది. ప్రస్తుతం భార్య శిల్పా కూడా అమెరికాలోనే ఉంది.

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మా ఆవిడ మీద ఒట్టు నీ ప్రియురాలు చాలామంచిది!

భార్య ప్రేమ కోసం భర్త పోరాటం
తను పెళ్లి చేసుకున్న యువతి మరో యువకున్ని ప్రేమిస్తోందని తెలిసి వారిద్దరినీ కలిపేందుకు ఆ భర్త నిశ్చయించుకున్నాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది. ఇది '' హమ్‌దిల్‌ దే చుకే సనమ్‌ '' సినిమా గుర్తుకొస్తుంది కదూ ... ఇలాంటివి తెలుగులో కూడా సినిమాల్లో చూశాం... కాని నిజజీవితంలో జరిగిన ఈ సంఘటన. మూడేళ్లుగా తన వెంట తిప్పుకున్న ప్రియురాలిని చెల్లెలు వరుస అవుతుందంటూ ప్రియుడు ప్లేటు ఫిరాయించాడు. పెళ్లి చేసుకోవడం కుదరదంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రియురాలి భర్త కాలనీ వాసులతో కలిసి ప్రియుడు పనిచేసే ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం....
ఆంధ్రప్రదేశ్‌లోని నంతపురం జిల్లా హిందూపురం వీవర్స్‌ కాలనీలో నివాసముంటున్న పవిత్రకు తన బావ ధనుంజరుతో మూడు నెలల క్రితం పెళ్లయింది. పెళ్లికి ముందే ఆమె అదే కాలనీకి చెందిన గోపిని ప్రేమించింది. పెళ్లయిన తరువాత కూడా ఈ ప్రేమ కొనసాగింది. ఓ రోజు ఈ విషయంపై భర్త ఆమెను నిలదీయగా తాను గోపిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. ఇది విన్న ఆయన ప్రేమికులిద్దరినీ కలిపేందుకు నిశ్చయించుకున్నాడు. పవిత్రను పెళ్లి చేసుకోవాలని గోపిని కోరాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పవిత్ర తనకు చెల్లెలు వరుస అవుతుందని ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు గోపి పనిచేసే ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. గోపి పెళ్లికి ఒప్పుకోక పోవడంతో పవిత్ర భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. వారిని పిలిచి పోలీసులు చర్చలు జరిపారు. చర్చలు విఫలమయ్యాయి. వారు ఒప్పుకోక పోవడంతో ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు.