23, అక్టోబర్ 2012, మంగళవారం

విజయదశిమి శుభాకాంక్షలు

             బ్లాగు మిత్రులకు, బ్లాగువీక్షకులకు, పాఠకులకు, నాశ్రేయోభిలాషులకు, అందరికీ దసరా శుభాకాంక్షలు. మీకు విజయాలు చేకూరి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నాపోస్టులను చూసి ఇంతకాలం ఆదరించి మంచి సూచనలు, సలహాలు చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇట్లు
పానుగంటి చంద్రయ్య

దసరా శుభాకాంక్షలు

                   బ్లాగు మిత్రులకు, బ్లాగువీక్షకులకు, పాఠకులకు, నాశ్రేయోభిలాషులకు, అందరికీ దసరా శుభాకాంక్షలు. మీకు విజయాలు చేకూరి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నాపోస్టులను చూసి ఇంతకాలం ఆదరించి మంచి సూచనలు, సలహాలు చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇట్లు
పానుగంటిచంద్రయ్య

22, అక్టోబర్ 2012, సోమవారం

ఇందు గలదందు లేదని సందేహము వలదు

                       మంగళూరు : 'ఇందు గలదందు లేదని సందేహము వలదు... ఎందెందు వెతకి చూసినా అందందే గలదు కుల వివక్ష....' అని కర్నాటకలో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. కర్నాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష నేటికీ కొనసాగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇతర కులాలకు చెందిన విద్యార్థుల నుంచి తమను వేరుగా కూర్చోవాలని ఉపాధ్యాయులే ఆదేశించినట్లు దాదాపు 13.7 శాతం మంది దళిత పిల్లలు చెప్పినట్లు మంగళూరు యూనివర్శిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ తాజా అధ్యయనం పేర్కొంది.
                 'కర్నాటకలో దళితుల అభివృద్ధి, అనుభవాలు' అనే అంశంపై జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కర్నాటకలోని షెడ్యూల్డ్‌ కులాల జనాభా అధికంగా ఉన్న బెల్గాం, గుల్బర్గా, చిత్రదుర్గ, మైసూర్‌, కోలార్‌ వంటి 10 జిల్లాల్లో వారి సామాజిక, సాంస్కృతిక పరిస్థితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. 2011 జులై నాటికి ముగిసిన పది నెలల్లో 50 గ్రామాల్లో ఈ అధ్యయనం ప్రకారం 2,425 కుటుంబాలు లేదా 12,677 మంది దళితులు వివక్ష, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులోని 825 కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. సర్వే నిర్వహించిన అన్ని జిల్లాల్లోనూ వివిక్షకు చెందిన వాస్తవాలు ఇదే స్థాయిలో కనిపించాయి. పాఠశాలల్లో ఈ వివక్షకు ఉపాధ్యాయులే కారణమని అధ్యయనం పేర్కొంది. మధ్యాహ్న భోజనంలోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. భోజన సమయంలో తమ పిల్లలను ప్రత్యేంగా కూర్చోబెడుతున్నారని, వారు తినే ప్లేట్లను సైతం వేరుగా ఉంచుతారని దాదాపు 114 కుటుంబాలకు చెందినవారు చెప్పారు. భోజనం వడ్డించేందుకుగానీ లేదా వంటగదిలోకి ప్రవేశించేందుకుగానీ దళిత చిన్నారులను పాఠశాల అధికారులు అనుమతిం చడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. ఆశ్చర్యకరమైన విషయమే మిటంటే, తమ పిల్లలను క్లాస్‌ మానిటర్‌గా ఎప్పుడూ నియమించరని 72.8 శాతం తల్లిదండ్రులు చెప్పారు. అయితే తమ పిల్లలతోనే క్లాస్‌ రూమును తరచుగా శుభ్రం చేయిస్తుంటారని 33 శాతం మంది దళిత చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. ఇదిలా ఉండగా పిల్లల్లల మధ్య వివక్ష వ్యక్తమయ్యే సందర్భాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. దాదాపు 14 శాతం మంది తమను ఇతర కులాల పిల్లలు వారి ఇళ్లకు ఆహ్వానించారని చెప్పారు. అయితే వారి ఇళ్లకు వెళ్లిన సందర్భాల్లో అతితక్కువ మంది పెద్దలు మాత్రమే అనుమతించేవారనీ, వాటిలోనూ ఇంటి వసారాకే పరిమితమనీ పిల్లలు తెలిపారని నివేదిక పేర్కొంది. తాము పరిశీలించిన గ్రామాల్లో నిరక్షరాస్యత ఒక సమస్యగా ఉన్నట్లు పరిశీలకులు పేర్కొన్నారు. చదువుకున్న వారిలోనూ కేవలం 12.6 శాతం మంది పియుసి(ఇంటర్‌) పూర్తి చేయగలుగుతున్నారు. వృత్తి, ఉన్నత విద్య వరకు వెళ్ళేవారు స్వల్పం. కేవలం 1.2 శాతం మంది మాత్రమే డిప్లొమా, పారిశ్రామిక శిక్షణ పూర్తిచేసిన వారున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.

21, అక్టోబర్ 2012, ఆదివారం

ఆకలిని అర్థం చేసుకునేది స్త్రీలే

ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌-కి-మూన్‌

               ప్రపంచంలో ప్రజల ఆకలి బాధలను అర్థం చేసుకునే శక్తి కేవలం మహిళలకే వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌-కి- మూన్‌ అన్నారు. అక్టోబర్‌ 20న ఇక్కడ జరిగిన ప్రపంచ ఆహార పురస్కార ప్రదానోత్సవానికి హాజరైన ప్రపంచ నేతలు, పరిశోధకులు, రైతులు, విధాన కర్తల వంటి వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మహిళలకు మాత్రమే ప్రజల ఆకలిని అర్ధం చేసుకోగల శక్తి వుందని, వ్యవసాయ రంగంలో వారిని ప్రోత్సహిస్తే ఆహార భద్రతకు లోటుండదని అన్నారు. ప్రపంచంలో ఆకలిని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. ప్రపంచం లో ఆకలిని అంతం చేయగలమని, అదే మనం చేయగల సరైన చర్య అని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆహార సంస్థ లెక్కల ప్రకారం వివిధ దేశాలలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య వంద కోట్లను దాటుతున్న ప్రస్తుత సమయంలో వారికి ఆహార భద్రత కల్పించేందుకు వివిధ దేశాల నాయకత్వాల మధ్య సహకారం అవసరమని బాన్‌కిమూన్‌ అన్నారు. ఆఫ్రికన్‌ మహిళల వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి సంస్థ (అవార్డ్‌)ను ఆయన ప్రస్తావిస్తూ వ్యవసాయ రంగంలో మహిళా పరిశోధ కులు, శాస్త్రవేత్తల సంఖ్యను పెంచేందుకు చేసిన కృషికి గాను ఈ సంస్థ బిల్‌- మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల నుండి సంయుక్తంగా దాదాపు రెండు కోట్ల డాలర్ల సాయాన్ని అందుకుంది. ఈ నెల 17-19 తేదీల మధ్య ఇక్కడ జరిగిన బోర్లాగ్‌ సదస్సులో ఈ సాయాన్ని ప్రక టించారు. ఈ సాయం ద్వారా అవార్డ్‌ వరుసగా రెండో ఐదేళ్ల కాల వ్యవధిలో ఆఫ్రికన్‌ దేశాల్లో మరికొంతమంది మహిళా శాస్త్రవేత్తలు, పరిశోధకులను రంగంలోకి దించేందుకు కృషి చేయనుంది. అవార్డ్‌ 2008లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆఫ్రికా దేశాలలో ప్రతి నలుగురు వ్యవసాయ శాస్త్రవేత్తలలో ఒకరు మహిళ. అయితే వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో మాత్రం ఈ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. అక్కడ నాయకత్వం వహించే స్థాయిలో కేవలం ఏడుగురిలో ఒకరు మాత్రమే వుంటున్నారు. దీంతో మహిళలకు వ్యవసాయం విలువ తెలియక వారు ఆకలిపై పోరాటంలో వెనుకబడి వుంటున్నారని అవార్డ్‌ వ్యవస్థాపకురాలు విక్కీ విల్డే అభిప్రాయ పడ్డారు. ఆఫ్రికాలో ఆహార భద్రతను సాధించటం కష్టసాధ్యమని అంటున్న ఆమె ఇందుకు ప్రధానంగా ఇక్కడ వ్యవసాయ రంగంలో కార్మికులుగా మాత్రమే పనిచేస్తున్న మహిళలు అంతకు మించి పరిశోధన, అభివృద్ధి రంగాలలో రాణించలేకపోవటమే కారణమని వివరించారు. ఆహార ప్రాధాన్యతలను నిర్ణయించే స్థాయిలో వారు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఏకం చేయటం మాత్రమే ప్రతి సమస్యకూ పరిష్కారం కానప్పటికీ అది సత్వర ప్రగతి సాధనకు దోహదపడుతుందన్నారు. ఆఫ్రికాలో చిన్నతరహా వ్యవసాయ రంగంలో ఎక్కువగా మహిళలదే ఆధిపత్యం అయినందున ఈ దిశగా వారిని మరింత ప్రోత్సహించగలిగితే ఆహార దిగుబడులను పెంచి అనేక ప్రాణాలను కాపాడగలుగుతారని ఆమె చెప్పారు. చిన్న కమతాల రైతులు, ముఖ్యంగా మహిళా రైతుల అవసరాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా స్పందించగలిగే నవతరం నాయకత్వం ఇప్పుడు ఆఫ్రికాకు అవసరమని ఆమె స్పష్టం చేశారు. తమ వద్ద అందుబాటులో వున్న కేవలం 320 ఫెలోషిప్‌ల కోసం ఈ ఏడాది దాదాపు మూడువేల మంది ఆఫ్రికన్‌ మహిళలు దరఖాస్తు చేసుకున్నారని ఆమె వివరించారు. ఆహార భద్రతా విధానాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలుగా తమ సంస్థ వ్యవసాయ రంగంలో టాలెంట్‌ పూల్‌ను మరింత విస్తరించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆమె చెప్పారు. వ్యవసాయ రంగంలో వున్న మహిళల నైపుణ్యాన్ని, నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చటంతోపాటు పరిశోధన, అభివృధ్ధి కార్యకలాపాలను బలోపేతం చేసే కెరీర్‌ అభివృద్ధి కార్యక్రమం అవార్డ్‌. ఈ సంస్థ ఆఫర్‌ చేస్తున్న రెండేళ్ల ఫెలోషిప్‌ల కోసం ఇథియోపియా, ఘనా, కెన్యా, లైబీరియా, మలావీ, మొజాంబిక్‌, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా, జాంబియా తదితర దేశాల వ్యవసాయ పరిశోధనా అభివృద్ధి రంగంలో పనిచేస్తున్న మహిళలు దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇందుకు వీరికి కావల్సిన అర్హత ఎంపిక చేసిన డిసిప్లిన్స్‌లో బాచిలర్‌, మాస్టర్‌ లేదా డాక్టొరల్‌ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.

అపూర్వ సమ్మేళనం

వనపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
1987-89 పూర్వవిద్యార్ధుల సమ్మేళనం
                  ఆంధ్రప్రదేశ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1987-89 సవంత్సరంలో ఇంటర్‌ పూర్తి చేసిన ఎంపిసి, బైపిసి విద్యార్థుల సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. (21-10-2012) ఆదివారం వనపర్తి చిట్యాల రోడ్డులోని స్టార్‌ పంక్షన్‌హాలులో జరిగిన ఈ సమ్మేళనానికి దాదాపు 70 మంది పూర్వవిద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయ, న్యాయవాద, జర్నలిజం, రియల్‌ఎస్టేట్‌ , వ్యాపార తదితర వృత్తులో స్థిరపడిన పలువురు 23 సంవత్సరాల తరువాత కలుసుకుని పరిచయం చేసుకోవడం అత్యంత అనందాన్ని కలిగించిందని మాట్లాడుతూ చెప్పారు. వారివారి విద్యార్థి దశల్లోని అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నరేష్‌, వసంత్‌, ప్రవీణ్‌, అయోద్యరామ్‌, అరుణ్‌, కిరణ్‌, రవీందర్‌, రాము, పానుగంటి చంద్రయ్య, నవీన, మంజుల, సునీత, వేదవతి, విజయలక్ష్మి, నాగరాణి, ఎం.శ్రీదేవి, అనంద్‌, ఎల్‌.రమేష్‌ , భాస్కర్‌ తదితరులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పేరు వారి హోదా, ప్రస్తుతం పని చేసే ప్రదేశం చెప్పారు. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 1987-89 బ్యాచ్‌ 2014 నాటికి ఇంటర్మీడియట్‌ పూర్తయి 25 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించారు. ఆబ్యాచ్‌ సమయంలో పని చేసిన అధ్యాపకులను సన్మానించాలని, అప్పటి బ్యాచ్‌లో చనిపోయిన వారి కుటుంబాలను ఏదో రూపంలో ఆదుకోవాలని అనుకున్నారు.

20, అక్టోబర్ 2012, శనివారం

ముగిసిన జీవవైవిధ్య సదస్సు

183 దేశాలు 14500 ప్రతినిధులు
మొక్కుబడిగా జపాన్‌ నిర్ణయాలు-కొరియాలో 2014లో సదస్సు
                     భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో 2012 అక్టోబర్‌ 1న ప్రారంభమైన జీవవైవిధ్య సదస్సు 19న ముగిసింది. 183 దేశాలు హాజరయిన ఈసదస్సులో 14,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జయంతినటరాజన్‌ ప్రారంభించిన సదస్సులో అక్టోబరు 16న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరయి ప్రసంగించారు. ఈసదస్సులో చర్చలతోనే సంతృప్తి చెందారు. 2014లో తిరిగి కొరియా దేశంలో నిర్వహించాలని నిర్ణయించారు. జీవ వైవిధ్య రక్షణ కోసం ఆర్థిక వనరుల సేకరణే అసలు సమస్యగా మారింది. అవసరమైన ఆర్థిక వనరులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ (సిబిడి) సమాచార అధికారి డేవిడ్‌ ఎయిన్స్‌వర్త్‌ తెలిపారు. ఈ విషయంపై అక్టోబర్‌18న అర్థరాత్రి వరకు వివిధ దేశాలకు చెందిన మంత్రులతో చర్చలు జరిపామన్నారు. 19న ఆయన భాగస్వామ్య దేశాల సదస్సు (కాప్‌-11) జరుగుతున్న హైటెక్స్‌లో మీడియాతో మాట్లాడుతూ కాప్‌-11లో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించామని అన్నారు. చాలా అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకున్నామని చెప్పారు. ఆర్థిక వనరుల సేకరణ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. కాప్‌-11కు మొత్తం 183 దేశాల నుండి 14,500 మంది ప్రతినిధులు, పర్యవేక్షకులు హాజరయ్యారని తెలిపారు. మూడు రోజుల నుండి కొనసాగుతున్న హై లెవల్‌ సెగ్మంట్‌లో 77 దేశాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారని తెలిపారు. 98 దేశాల నుండి ప్రభుత్వ ప్రతినిధులు సదస్సులో భాగస్వాములయ్యారని చెప్పారు. 2014లో నగోయా ప్రోటోకాల్‌ అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రానున్న 9 నెలల్లో చాలా దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. అమెరికా, రష్యా వంటి దేశాలు సిబిడిలో లేకపోవడంపై ఎలా స్పందిస్తారని విలేకరులు ప్రశ్నించగా అమెరికా సిబిడిలోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అమెరికా 20 ఏళ్ల క్రితమే సమ్మతించిందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు నగోయా ప్రోటోకాల్‌ను సమ్మతించడం లేదని, అటువంటప్పుడు చిన్న దేశాలు ఎలా అంగీకరిస్తాయని విలేకరులు ప్రశ్నించగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ ప్రోటోకాల్‌ను ఆమోదిస్తున్నాయని, 2014 నాటికి ఈ ఒప్పందం అమలు జరిగేలా ప్రయత్నిస్తామని చెప్పారు. సుమారు 12 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో అన్ని దేశాలు సహకరించుకోవాలన్నారు.
జీవవైవిధ్య రక్షణలో తాము ముందుంటామని జి4 బయోడైవర్సిటీ ప్రతినిధులు తెలిపారు. 19న ఉదయం వారు హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తాము జీవవైవిధ్య రక్షణ కోసం ప్రత్యేకంగా యూత్‌ ఫోరంను ఏర్పాటు చేసుకున్నామన్నారు. భవిష్యత్తులో జి4 బయోడైవర్సిటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భాగస్వామ్య దేశాల సదస్సు(కాప్‌)-10లో యూత్‌గా పాల్గొన్నామని, అనంతరం వివిధ దేశాల్లో యూత్‌ జీవవైవిధ్య రక్షణ కోసం కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే సముద్రతీర ప్రాంత రక్షణ కోసం కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఉత్సాహం ఉన్న యువతను తమతోపాటు చేర్చుకుంటామన్నారు. ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

19, అక్టోబర్ 2012, శుక్రవారం

కడపలోనూ అవే సమస్యలు

జగన్‌ వస్తే మంచికాలం మళ్ళీ వస్తది
పాదయాత్రలో షర్మిల హామీ
              కడప జిల్లాలోనూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు న్నాయి. సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు షర్మిలకు సమస్యలు ఏకరువు పెట్టడం గమనార్హం. అక్టోబర్‌ 19న శుక్రవారం రెండోరోజు పాదయాత్రలో విద్యుత్‌, తాగునీరు, పెన్షన్‌లు, ఇందిరమ్మ గృహాలకు బిల్లులు ఇవ్వకపోవడం, పంటలబీమా అందడం లేదని చెప్పగా మంచికాలం మళ్ళీ వస్తదని, రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని, జగన్‌ సిఎం అయ్యేవరకూ ఓపిక పట్టాలని షర్మిల కోరారు. మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రలో భాగంగా గురువారం కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించిన షర్మిల శుక్రవారం రెండో రోజు వేంపల్లిలోని రాజీవ్‌నగర్‌ కాలనీ నుండి నందిపల్లి, ముసలిరెడ్డిపల్లి మీదుగా వేముల వరకు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దారిపొడవునా ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, రైతులు తమ సమస్యలను వివరించారు. ఒకచోట అరటితోటలోకి వెళ్ళి రైతులతో మాట్లాడారు. ముసలిరెడ్డిపల్లిలో అక్కడ మహిళలు, విద్యార్థులు షర్మిలను పూలతో స్వాగతం పలికారు.
మైసూరా దూరం..వివేకాను పట్టించుకోని నేతలు
                    కడప జిల్లా పులివెందులలో పాదయాత్ర జరుగుతున్నా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీలో చేరిన మైసూరారెడ్డి, వైఎస్‌ వివేకానందారెడ్డి పట్టించుకోకుండా దూరందూరంగా ఉంటున్నారు. మొదటిరోజు గురువారం పాల్గొన్నా రెండోరోజు యాత్రలో వారిద్దరూ ఎక్కడా పాల్గొనలేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తనకు చెప్పడం లేదన్న బాధతో మైసూరారెడ్డి ఉన్నట్లు తెలిసింది. వివేకానందారెడ్డిని పిలిచేవారే కరువయ్యారు. సొంతంగా ఆయనే పాదయాత్రలో మొదటిరోజు పాల్గొన్నారు. రెండో రోజూ ఎవరూ ఆయనను పిలవలేదని తెలిసింది. పాదయాత్రలో వారిద్దరికీ ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు.

18, అక్టోబర్ 2012, గురువారం

నేను జగనన్న వదిలిన బాణాన్ని


చంద్రబాబును నిలదీస్తాం

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం

పాదయాత్ర ప్రారంభసభలో షర్మిల

                        ''నేను జగనన్న వదిలిన బాణాన్ని. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురిని.. అసమర్థ్థ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీడం... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం....'' రెండే 'మరో ప్రస్థానం' ప్రధాన లక్ష్యాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు వై.ఎస్‌.షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన మరో మహాప్రస్థానం పాదయాత్రను 2012 అక్టోబరు 18న ప్రారంభించారు. షర్మిల ఉదయం పది గంటలకు తల్లి విజయమ్మ, వదిన భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 11-45 గంటలకు షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రను వైఎస్‌ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. ప్రజా ప్రస్థానం ప్రధానంగా రెండు అంశాలపైనే దృష్టిపెడుతోందన్నారు. ఒకటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయడమని అన్నారు. దృఢ సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్న తనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. వైఎస్‌ రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వకుండా విద్యార్థులకు మొండిచేయి చూపుతోందని, ఆరోగ్యశ్రీనీ మూసేసిందని విమర్శించారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. వీటన్నింటిపై నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ మూడేళ్లుగా చోద్యం చూస్తోందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి తన బాధ్యతను విస్మరించిందన్నారు. బాబు తన హయాంలో కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధంపై ప్రజలను మోసగించారన్నారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్నారు. అవమాన భారంతో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు అన్ని విధాలా విఫలమైన ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని బాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపి పార్టీలు తప్ప మూడోది ఉండకూడదనే కుట్ర పన్నుతున్నారన్నారు. జగన్‌ ప్రజల మధ్య ఉంటున్నారనే ఉద్దేశంతో జైల్లో పెట్టించారన్నారు. చీకట్లో చిదరబరంతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన ఎంపిలను ఆయన వద్దకు పంపి సాక్షి ఆస్తులను జప్తు చేసేలా కుట్ర పన్నారని దుయ్యబట్టారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పనిని జగన్‌ చేస్తున్నారనే కుట్రపన్నారని చెప్పారు. జగన్‌ రాలేని పరిస్థితుల్లోనే తాను పాదయాత్రను చేపట్టాల్సి వచ్చిందన్నారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడుతామని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

17, అక్టోబర్ 2012, బుధవారం

యాత్రలెవరికోసం.....?

                          ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారి కష్టాలకు పాలకులే కారణం.. మేము అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుస్తాం.... గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కష్టాలు పెంచారు. ఎలా తీరుస్తారు. అనేదానికి సమాధానం లేదు. నయాఉదారవాద విధానాలను మాజీ ప్రధాని పివి నర్సింహారావు ఆధ్యుడయితే ఆంధ్రప్రదేశ్‌లో అమలు వేగంగా జరిగేందుకు నారాచంద్రబాబు నాయుడు ఆజ్యం పోశారు. అందులో భాగంగానే విద్యుత్‌ను విభజించి ప్రయివేట్‌ పరం చేసి ఛార్జీలు పెంచుకోవడానికి అవకాశామిచ్చారు. రైతుల రుణాలు పెరగడానికి ప్రధాన కారకులయ్యారు. సంస్కరణల పుణ్యమాని వృత్తులన్నీ నాశనమయ్యాయి. వీటన్నింటికీ కారకుడు చంద్రబాబునాయుడని ప్రచారం చేసుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో దోపిడీ దొంగలందరూ ఏకమై రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. అత్యధికంగా ఆయన కుమారుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్నాడని జైల్లో పెట్టారు. ఐదుగురు మంత్రులు కూడా ఆ ఉచ్చులో ఇరుకున్నారు. అది జగమెరిగిన సత్యంగా ప్రచారం జరిగింది. ఒక పార్టీ పెట్టుకుంటే ప్రజలను పోగేసుకుంటే తప్పులన్నీ మాఫీ అవుతాయని వైఎస్‌ఆర్‌సి అనే పేరుతో పార్టీని ప్రారంభించారు. అయినా కటకటాలు తప్పలేదు. మేమున్నాం.... మిమ్ములను ఆదుకుంటాం.... మమ్ములను ఆదరించండని పాదయాత్రలు చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గాంధీజయంతి సందర్భంగా ప్రారంభించారు. అక్టోబర్‌ 18 నుంచి వైఎస్‌సిపి నేత షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే గతంలో నాశనం చేశావు.. మరో అవకాశం ఇస్తే నాశనం చేయరనే నమ్మమేముంది. అనేతరహాలో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా గతంలో రాష్ట్రాన్ని టూటీ చేశారు. మరో అవకాశం ఇస్తే లూటీ చేయరా అని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల పట్ల ఉండరా అనేది ఆలోచించాలి.
జనం ఎవరి వెంట ఎక్కువ పోతారు?
            సంస్కరణలను ఆపేయండి లేదా... ధరలను తగ్గించండి....పేదలకు భూములు పంచండి. అవినీతిని అరికట్టండి... ప్రస్తుతం ప్రజలను పట్టి పీడిస్తున్న తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకు పరిష్కారం చూపుతాం. ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని పాదయాత్ర చేసే వారి వెంట ఎక్కువ మంది ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. విధానమేంటనేది చెప్పకుండా వెళ్లే వారిని ప్రజలు ఎలా నమ్ముతారు?.

14, అక్టోబర్ 2012, ఆదివారం

ఆకలి కేకలు

వచ్చే ఏడాది మరింత ఆహార సంక్షోభం 

పెరిగే ధరలతో అశాంతికి ఆజ్యం 

వాతావరణ మార్పుల ప్రభావం 

ప్రపంచ దేశాలకు ఐరాస హెచ్చరిక

                  అంతంత మాత్రంగా ఉన్న ఆహార నిల్వలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. మరోవైపు ప్రపంచ జనాభాకు తగిన స్థాయిలో వాటి ఉత్పత్తీ లేదు. దీనికితోడు వాతావరణంలో అనూహ్యమైన మార్పులు. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు. వెరసి ఇప్పటికే అర్ధాకలి, పోషకాహార లోపంతో అలమటిస్తున్న ప్రజానీకానికి మున్ముందు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనున్నాయి. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంటుందని, దారుణ దుర్భిక్ష పరిస్థితులను ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
                    కరువు పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి మరో దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. అమెరికా, ఉక్రెయిన్‌ తదితర దేశాల్లో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గిపోతుండటంతో ఈ ఏడాది ఆయా దేశాల్లో అత్యల్ప స్థాయికి ఆహార ధాన్యాల నిల్వలు పడిపోనున్నాయని, ఇవి 1974 స్థాయి నాటికి తగ్గిపోతాయని ఐరాస ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడగాడ్పులతో పాటు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న అమెరికాలో ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో 6.5 శాతం మొక్కజొన్న నిల్వలు మాత్రమే ఉన్నాయని, వీటితో ఆ దేశ ప్రజలు వచ్చే ఏడాది సర్దుకోవాల్సి ఉంటుందని ఐరాస వివరించింది. 'మనం
              వినియోగిస్తున్న స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాం. దీంతో మిగులు నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వలు ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో ఉన్నాయి. వచ్చే ఏడాది అనూహ్య పరిస్థితులకు దారితీసే ప్రమాదముంది' అని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఎఓ)కు చెందిన సీనియర్‌ ఆర్థికవేత్త అబ్డోల్‌రెజా అబ్బాసియన్‌ అభిప్రాయపడ్డారు. గత 11 ఏళ్ల కాలంతో పోలిస్తే ఆరేళ్ల నుండి ఆహార వినియోగం పెరుగుదల రికార్డు స్థాయిలో నమోదైంది. పదేళ్ల క్రితం ఏడాదిలో సగటున 107 రోజులకు సరిపడిన నిల్వలు ఉంటే, ఇప్పుడు అవి 74 రోజులకే సరిపోయే స్థాయికి పడిపోయాయి. వరి, గోధుమ, జొన్న వంటి ప్రధానమైన ఆహార పంటల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవి 25 దేశాల్లో దాదాపుగా 2008 నాటి స్థాయికి తిరిగి చేరుకుంటున్నాయి. 2008లో ఆహార ధాన్యాల ధరలు చుక్కలనంటిన పరిస్థితుల్లో అనేక దేశాల్లో వాటి కోసం దాడులు, ఘర్షణలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 87 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఎఫ్‌ఎఓ గణాంకాలు తెలియచేస్తున్నాయి. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది వివిధ దేశాల్లో గోధుమ పంట ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 5.2 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని, అదే విధంగా వరి, తదితర ఆహార పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోతోందని ఎఫ్‌ఎఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అనేక దేశాల్లో ఆహార సరఫరా వ్యవస్థ ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోయే అవకాశం ఉందని, ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ఆకలితో మలమల మాడిపోతారని తెలిపింది. తద్వారా ఆహార ధాన్యాల కోసం దాడులు, ఘర్షణలు చోటు చేసుకుని కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది.
ఆజ్యం పోస్తున్న వాతావరణ మార్పులు
                      ఇదిలావుండగా వాతావరణంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం కూడా ఆహార సంక్షోభానికి ఆజ్యం పోస్తోందని వాషింగ్టన్‌లోని ఒక భూభౌతిక పరిశోధనా కేంద్రం అధ్యక్షుడు లెస్టర్‌ బ్రౌన్‌ అంటున్నారు. ఈ వాతావరణ మార్పులను ఎదుర్కొని ప్రజల నుండి పెరుగుతున్న ఆహార డిమాండ్‌ను తీర్చేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పెక్యులేటర్లు వేలాది ఎకరాల భూములను చౌక ధరలకు 'కబ్జా' చేస్తుండటంతో గత దశాబ్ద కాలంలో ఆహార ధరలు రెట్టింపు స్థాయిని దాటటమే కాక అనేక దేశాల్లో ఆహార ధాన్యాల నిల్వలు అడుగంటే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 11 ఏళ్ల కాలంలో ఆరోసారి అనేక దేశాల్లో ఆహార సంక్షోభం ఉధృతం కానుందని ఐరాస స్పష్టం చేసింది. రానున్న రెండు దశాబ్దాల కాలంలో వరి, గోధుమ వంటి ప్రధాన పంటల ధరలు ప్రస్తుత స్థాయికి రెట్టింపయ్యే అవకాశాలున్నాయని ఆక్స్‌ఫామ్‌ సంస్థ గత వారం హెచ్చరిక జారీ చేసింది. దీంతో పేద ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది విపత్కర పరిణామాలకు దారితీసే ప్రమాదముందని ఆ సంస్థ హెచ్చరించింది.

8, అక్టోబర్ 2012, సోమవారం

మూలకణ పరిశోధనకు నోబెల్‌

సంయుక్త విజేతలుగా

బ్రిటన్‌, జపాన్‌ శాస్త్రవేత్తలు

                  మూలకణ పరిశోధకులు ఇద్దరికి ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్‌ బహుమతి లభించింది. పెద్ద కణాలు మూల కణాలుగా మారడంపైనా, శరీరంలో అవి తిరిగి ఏ తరహా కణాలుగానైనా మారిపోవడంపై విశేష పరిశోధనలు సాగించిన బ్రిటన్‌కు చెందిన జాన్‌ గుర్డాన్‌కు, జపాన్‌కు చెందిన షిన్యా యమనకకు ఈ పురస్కారం సంయుక్తంగా లభించింది. ప్రొఫెసర్‌ గుర్డాన్‌ కప్పల క్లోనింగ్‌ ప్రక్రియ కోసం పేగు నమునాను ఉపయోగించగా..ప్రొఫెసర్‌ యమనక జన్యువులను రీప్రోగ్రామింగ్‌ కణాలుగా మార్పు చేశారు. విజ్ఞానశాస్త్రాన్ని ఈ ఇరువురు పరిశోధకులు విప్లవాత్మకం చేశారని నోబెల్‌ కమిటీ ప్రశంసించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం గెల్చుకున్న ప్రొఫెసర్‌ గుర్డాన్‌ చదువుకునే రోజుల్లోనే శాస్త్ర ప్రయోగాలపై ఆసక్తి చూపగా ఆయన ఉపాధ్యాయుడు 'సమయం వృధా' అని వ్యాఖ్యానించారట. దానికి సంబంధించిన టీచర్‌ రిపోర్టును ఆయన ఇంకా పదిలంగానే ఉంచుకోవడం విశేషం. బహుళ సమర్థతను సంతరించుకునేందుకుగాను పరిపక్వత చెందిన కణాలను రీప్రోగ్రామింగ్‌ చేయగలమని గుర్డాన్‌, షిన్య శాస్త్రబద్ధంగా నిరూపించారు. ఈ నిరూపణ అంతిమంగా 2012 సంవత్సర వైద్య రంగ నోబెల్‌ పురస్కారాన్ని గెలుచుకుంది. సోమవారం స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

శభాష్‌ చావేజ్‌! వివా వెనిజులా!

అమెరికా ఆధిపత్యాన్ని అతి సమీపం నుంచి సవాలు చేసి... అన్ని కుట్రలనూ కుహకాలనూ తట్టుకుని నాలుగో సారి అఖండ విజయం సాధించిన హ్యూగో ఛావేజ్‌ హిప్‌ హిప్‌ హుర్రే! లొంగుబాటు కాదు తిరుగుబాటులోనే భవిష్యత్తు వుందంటూ 21 వ శతాబ్ది సోషలిజం నినాదమిచ్చిన ఈ ధీరుడి గెలుపు వర్తమాన చరిత్రకొక మలుపు. క్యూబా ధృవతార ఫైడెల్‌ కాస్ట్రో తర్వాత సమకాలీన ప్రపంచంలో ఉత్తేజ ప్రదాత, ఉదాత్త నేత చావేజ్‌. అమెరికా కూటమి, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు, ముఖ్యంగా చమురు సంస్థల మాఫియా,    అభివృద్ధి నిరోధకులు, ప్రతీఘాత ప్రతిపక్షాలూ కలసి ధనరాశులు గుమ్మరించినా 30 పార్టీల కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా 54 శాతం పైగా ఓట్లు తెచ్చుకుని విజయ ఢంకా మోగించాడు.    చావేజ్‌పై అమెరికన్‌, లాటిన్‌ అమెరికన్‌ బడా పత్రికలన్నీ శాపనార్తాలు పెట్టాయి. ఆయనను ఓడించడానికి ఇదే అదనని హడావుడి చేశాయి. ఆయన స్వల్ప మెజారిటీతో గెలిచినా తట్టుకోలేడని జోస్యాలు చెప్పాయి. ప్రత్యక్షంగానూ బోలెడు ప్రతికూల ప్రచారం సాగించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి.    చమురు సంపన్న దేశాలలో ఒకటైన వెనిజులా స్వంత కాళ్లపై నిలబడటం సామ్రాజ్యవాదులకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. ఎందుకంటే చావేజ్‌ చమురు సంస్థల జాతీయ కరణతో సహా అనేక ప్రగతిశీల చర్యలు  చేపట్టారు. భూ సంస్కరణలు అమలు చేసి భూమి పంచాడు. అన్నిచోట్లా ఉద్యోగాలు వూడగొట్టి పని భారం పెంచుతుంటే వెనిజులాలో వారానికి నాలుగు పని గంటలు తగ్గిస్తూ చట్టం చేశాడు. క్యూబాను ఆర్థిక దిగ్గంధనంలో బిగించాలని అమెరికా వత్తిడి చేస్తుంటేదాన్ని ఆప్తమిత్రంగా అక్కున చేర్చుకున్నాడు. తనను ప్రాణాంతకమైన కాన్సర్‌ వ్యాధి పీడిస్తే ఆ క్యూబాలోనే చికిత్స పొంది ఆరోగ్యంతో పాటు ఆశయ బలం కూడా పెంచుకుని వచ్చాడు. ఆదివారం జరిగిన ఎన్నికలలో విజయంతో చావేజ్‌ మరో ఆరేళ్లు అధికారంలో కొనసాగడమే గాక ఆర్థిక రంగంలో అభ్యుదయ కరమైన చర్యలన్ని పూర్తి చేసే అవకాశం లభించింది. త్వరలో ఎన్నికలు జరిగే బొలీవియా, పెరూ, అర్జెంటీనా,నికరాగ్వా తదితర దేశాలలోనూ ఇదే విధమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు రావడం తథ్యంగా కనిపిస్తుంది. దేశ విదేశీ కార్పొరేట్ల వత్తిడికి లొంగిపోవడమే పనిగా పెట్టుకున్న మన్మోహన్‌ సర్కారు ఈ ఎన్నికల తీర్పు కళ్లు తెరిపించాలి. ప్రజలు ఈ ప్రత్యామ్నాయ విశిష్టతను అర్థం చేసుకోవాలి.