ప్రపంచంలో ప్రజల ఆకలి బాధలను అర్థం
చేసుకునే శక్తి కేవలం మహిళలకే వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి
బాన్-కి- మూన్ అన్నారు. అక్టోబర్ 20న ఇక్కడ జరిగిన ప్రపంచ ఆహార పురస్కార
ప్రదానోత్సవానికి హాజరైన ప్రపంచ నేతలు, పరిశోధకులు, రైతులు, విధాన కర్తల
వంటి వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మహిళలకు మాత్రమే ప్రజల ఆకలిని
అర్ధం చేసుకోగల శక్తి వుందని, వ్యవసాయ రంగంలో వారిని ప్రోత్సహిస్తే ఆహార
భద్రతకు లోటుండదని అన్నారు. ప్రపంచంలో ఆకలిని అంతం చేసేందుకు
శాస్త్రవేత్తలు, పరిశోధకులు మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు.
ప్రపంచం లో ఆకలిని అంతం చేయగలమని, అదే మనం చేయగల సరైన చర్య అని ఆయన
అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆహార సంస్థ లెక్కల ప్రకారం వివిధ దేశాలలో ఆకలితో
అలమటిస్తున్న వారి సంఖ్య వంద కోట్లను దాటుతున్న ప్రస్తుత సమయంలో వారికి
ఆహార భద్రత కల్పించేందుకు వివిధ దేశాల నాయకత్వాల మధ్య సహకారం అవసరమని
బాన్‌కిమూన్ అన్నారు. ఆఫ్రికన్ మహిళల వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి సంస్థ
(అవార్డ్)ను ఆయన ప్రస్తావిస్తూ వ్యవసాయ రంగంలో మహిళా పరిశోధ కులు,
శాస్త్రవేత్తల సంఖ్యను పెంచేందుకు చేసిన కృషికి గాను ఈ సంస్థ బిల్-
మిలిండా గేట్స్ ఫౌండేషన్, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల నుండి
సంయుక్తంగా దాదాపు రెండు కోట్ల డాలర్ల సాయాన్ని అందుకుంది. ఈ నెల 17-19
తేదీల మధ్య ఇక్కడ జరిగిన బోర్లాగ్ సదస్సులో ఈ సాయాన్ని ప్రక టించారు. ఈ
సాయం ద్వారా అవార్డ్ వరుసగా రెండో ఐదేళ్ల కాల వ్యవధిలో ఆఫ్రికన్ దేశాల్లో
మరికొంతమంది మహిళా శాస్త్రవేత్తలు, పరిశోధకులను రంగంలోకి దించేందుకు కృషి
చేయనుంది. అవార్డ్ 2008లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆఫ్రికా దేశాలలో
ప్రతి నలుగురు వ్యవసాయ శాస్త్రవేత్తలలో ఒకరు మహిళ. అయితే వ్యవసాయ పరిశోధనా
సంస్థల్లో మాత్రం ఈ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. అక్కడ నాయకత్వం
వహించే స్థాయిలో కేవలం ఏడుగురిలో ఒకరు మాత్రమే వుంటున్నారు. దీంతో మహిళలకు
వ్యవసాయం విలువ తెలియక వారు ఆకలిపై పోరాటంలో వెనుకబడి వుంటున్నారని
అవార్డ్ వ్యవస్థాపకురాలు విక్కీ విల్డే అభిప్రాయ పడ్డారు. ఆఫ్రికాలో ఆహార
భద్రతను సాధించటం కష్టసాధ్యమని అంటున్న ఆమె ఇందుకు ప్రధానంగా ఇక్కడ
వ్యవసాయ రంగంలో కార్మికులుగా మాత్రమే పనిచేస్తున్న మహిళలు అంతకు మించి
పరిశోధన, అభివృద్ధి రంగాలలో రాణించలేకపోవటమే కారణమని వివరించారు. ఆహార
ప్రాధాన్యతలను నిర్ణయించే స్థాయిలో వారు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వారిని ఏకం చేయటం మాత్రమే ప్రతి సమస్యకూ పరిష్కారం కానప్పటికీ అది సత్వర
ప్రగతి సాధనకు దోహదపడుతుందన్నారు. ఆఫ్రికాలో చిన్నతరహా వ్యవసాయ రంగంలో
ఎక్కువగా మహిళలదే ఆధిపత్యం అయినందున ఈ దిశగా వారిని మరింత
ప్రోత్సహించగలిగితే ఆహార దిగుబడులను పెంచి అనేక ప్రాణాలను కాపాడగలుగుతారని
ఆమె చెప్పారు. చిన్న కమతాల రైతులు, ముఖ్యంగా మహిళా రైతుల అవసరాలను
తెలుసుకుని అందుకు అనుగుణంగా స్పందించగలిగే నవతరం నాయకత్వం ఇప్పుడు
ఆఫ్రికాకు అవసరమని ఆమె స్పష్టం చేశారు. తమ వద్ద అందుబాటులో వున్న కేవలం
320 ఫెలోషిప్‌ల కోసం ఈ ఏడాది దాదాపు మూడువేల మంది ఆఫ్రికన్ మహిళలు
దరఖాస్తు చేసుకున్నారని ఆమె వివరించారు. ఆహార భద్రతా విధానాలను
సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలుగా తమ సంస్థ వ్యవసాయ రంగంలో టాలెంట్
పూల్‌ను మరింత విస్తరించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆమె
చెప్పారు. వ్యవసాయ రంగంలో వున్న మహిళల నైపుణ్యాన్ని, నాయకత్వ లక్షణాలను
మెరుగుపర్చటంతోపాటు పరిశోధన, అభివృధ్ధి కార్యకలాపాలను బలోపేతం చేసే కెరీర్
అభివృద్ధి కార్యక్రమం అవార్డ్. ఈ సంస్థ ఆఫర్ చేస్తున్న రెండేళ్ల
ఫెలోషిప్‌ల కోసం ఇథియోపియా, ఘనా, కెన్యా, లైబీరియా, మలావీ, మొజాంబిక్,
నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా, జాంబియా తదితర దేశాల వ్యవసాయ
పరిశోధనా అభివృద్ధి రంగంలో పనిచేస్తున్న మహిళలు దరఖాస్తు చేసుకుంటుంటారు.
ఇందుకు వీరికి కావల్సిన అర్హత ఎంపిక చేసిన డిసిప్లిన్స్‌లో బాచిలర్,
మాస్టర్ లేదా డాక్టొరల్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
2 కామెంట్‌లు:
అందుకే అన్నారేమోనండి...అమ్మ ఆకలిని చూస్తే, నాన్న ఆవేదనని కాస్తాడని.
మీరు చెప్పింది నిజమే. అమ్మకే ఆశక్తి ఉంది. తల్లిగర్భంలో ఉన్నప్పటి నుంచి అమ్మ బిడ్డ ఆకలిని తీరుస్తుంది. అది వెలకట్టలేనిది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి