26, జనవరి 2011, బుధవారం

ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు

ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌
దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు అని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు కర్నూలు జిల్లా కేంద్రంలోని లలితాకళాసమితిలో ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం-ధనప్రభావం' అనే అంశంపై సదస్సు జరిగింది. ఫోరం కన్వీనర్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాలగుమ్మి సాయినాథ్‌ ముఖ్యోపన్యాసం చేశారు. దేశంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నట్లే పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని తెలిపారు. 1991కి ముందు దేశంలో ఒక్కరు కూడా డాలర్‌ బిలీనియర్లు లేరని, ఇప్పుడు 53 మంది డాలర్‌ బిలీనియర్లు ఉన్నారని చెప్పారు. వీరి చేతిలో 1/3వ వంతు 83 కోట్ల ప్రజల జిడిపితో సమానమని అన్నారు. కోటీశ్వరులు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశానిది నాలుగో స్థానంమని అన్నారు. ఆహారం, ఆరోగ్యం, విద్యలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో 135వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో 83 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.20ల కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారని, ఈ రూ.20లతో ఏం వస్తుందని ఆయన ప్రశ్నించారు. 83 కోట్ల మంది పేదల్లో 88 శాతం దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఉన్నారని అన్నారు. పేదరికానికి కులం, వర్గం, స్త్రీ, పురుష బేధం కూడా కారణమవుతున్నాయని అన్నారు. దేశంలో ఇంత అసమానతలు ఉంటే ఈ దేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో శాసనసభకు, పార్లమెంట్‌కు వెళ్లాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. అసెంబ్లీకి రూ.10 లక్షలు, పార్లమెంట్‌కు రూ.25 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదని నిబంధన ఉన్నా ఇప్పుడు రూ.40 నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 288 మంది శాసనసభ్యులు ఉండే మహారాష్ట్రలో 212 మంది కోటీశ్వరులు పోటీ చేస్తే 186 మంది గెలిచారని చెప్పారు. మిగిలిన వారు ఎందుకు ఓడారని పరిశీలిస్తే వారి ప్రత్యర్థులు ఓడిన వారి కంటే పెద్ద కోటీశ్వరులు అని తెలిపారు. 70వ దశకంలో ముంబయిలో నవాల్‌ టాటా మీద ఒక సాధారణ కార్మికుడు పోటీ చేసి గెలిచాడని, ఈ పరిస్థితిలో ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. ఈ అవినీతిలో మీడియా పాత్ర కూడా కీలకంగా ఉందని అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పెయిడ్‌న్యూస్‌ల పేరుతో విపరీతంగా డబ్బును ఖర్చు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.వెయ్యి కోట్లను పెయిడ్‌ న్యూస్‌ కోసం ఖర్చు పెట్టారని తెలిపారు. ఆదర్శ కుంభకోణంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన అశోక్‌ ఛవాన్‌ లోకమత్‌ అనే న్యూస్‌ పేపర్‌లో 156 పేజీల పెయిడ్‌ న్యూస్‌ వేశారని చెప్పారు. ఈ 156 పేజీల పెయిడ్‌ న్యూస్‌పై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లోకమత్‌ పేపర్‌ను విచారిస్తే అశోక్‌ ఛవాన్‌ గొప్ప నాయకుడు ప్రకటించుకున్నారు. అందుకే రాశామని, ఇవి వార్తలు అని చెప్పారని అన్నారు. ఆదర్శ కుంభకోణంలో ఇరుక్కుపోయి పదవి కోల్పోవడం చూస్తే ఎంత గొప్పనాయకుడో అర్థమవుతుందని అన్నారు. డబ్బులు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు వారి ఆదాయంలో 350 శాతం నుంచి 7 వేల శాతం వరకూ వృద్ధి ఉంటుందని తెలిపారు. ఏడేళ్లుగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, ఈ డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గేయానంద్‌లాంటి సచ్చీలురులను శాసన మండలికి ఎన్నుకోవాలని కోరారు. కోటీశ్వరులు, కార్పొరేట్‌ సంస్థల అధినేతలు, బడారాజకీయ వేత్తలు కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల గ్లోబల్‌ ఇంటగ్రేటరీ సర్వీసెస్‌ అనే సంస్థ గత 50 ఏళ్లలో భారతదేశంలో రూ. 20 లక్షల కోట్లు లూటీ జరిగిందని బహిర్గతం చేసిందని తెలిపారు. ఈ 20 లక్షల కోట్ల కేవలం నల్లధనమేనని చెప్పారు. స్మగ్లింగ్‌, అవినీతి, అక్రమాలకు సంబంధం లేకుండానే కార్పొరేట్‌ సంస్థలు, కోటీశ్వరులు ఈ డబ్బును తీసుకెళ్లి స్విస్‌ బ్యాంకు, బెర్ముడా, లక్సంబర్గ్‌ లాంటి చోట్ల దాచారని తెలిపారు. వీటి ఖాతాదారుల వివరా లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వీటి ఖాతాదారుల పేర్లు చెప్పమంటే అది బ్యాంకు నిబంధనలకు విరుద్ధ మని చెబుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేద రైతుల పేర్లను మాత్రం బహిర్గతం చేస్తారని చెప్పారు. దేశం నుంచి తరలిపోయిన 20 లక్షల కోట్ల డాలర్లలో 50 శాతం డబ్బు ప్రపంచీకరణ తర్వాతే తరలి వెళ్లిందని అన్నారు. దాదాపు 2 వేల అకౌంట్లలో ఈ డబ్బు ఉందని తెలిపారు. ఈ ధనమే వస్తే దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అక్రమంగా డబ్బును బ్యాంకుల్లో దాచే ఖాతాదారులు ఇండియాలోనే ఎక్కువ అని ఐఎంఎఫ్‌ రిపోర్టు చెబుతుందని అన్నారు. దేశంలోని రైతులు అప్పులు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. 1995 నుంచి 2010 వరకూ దేశంలో 2.56 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇందులో 2/3వ వంతు ఐదు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 30 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు ఇస్తారు కానీ వ్యవసాయ రంగానికి మాత్రం ఇవ్వరని విమర్శించారు. మెర్సిడెన్‌ బెంజిలాంటి కార్లు కొంటే 7 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతులు ట్రాక్టర్లను కొంటే 12 శాతానికి ఇస్తున్నా యని అన్నారు. సాధారణ రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో బయట 24శాతం వడ్డీకి అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయరంగంలో గత ఐదేళ్లలో పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలైన టాటా, అంబాని, నీరారాడియా లాంటి వారు దేశాన్ని పాలిస్తున్నారని తెలిపారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది టాటా, అంబాని లాంటి వారు నిర్దేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని తెలిపారు. 2009 ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు ఉంటేనే చట్టసభలకు వెళ్తున్నారని, ఇది ప్రమాదకరమని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జార్జ్‌ విక్టర్‌ , పశ్చిమ రాయల సీమ పట్టభద్రుల ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ అభ్యర్థి డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ శాసన మండలిలో చుక్కా రామయ్య, కె నాగేశ్వర్‌, బాలసుబ్రమ ణ్యం, ఎంవిఎస్‌ శర్మ, లక్ష్మణ్‌రావు, రామిరెడ్డిలతో పిడిఎఫ్‌గా ఏర్పాటై ఆదర్శ రాజకీయాలకు దిక్సూచిగా పని చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్లాట్లు ఇచ్చిన తిరస్కరించామని తెలిపా రు. అలాంటి పిడిఎఫ్‌ నుంచి బరిలో పట్టభద్రుల అభ్యర్థిగా నిలిచిన డాక్టర్‌ గేయానంద్‌ను, టీచర్స్‌ అభ్యర్థి బీరం సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. లెక్చరర్స్‌ ఫోరం కన్వీనర్‌ చెన్నయ్య, జెవివి జిల్లా కార్యదర్శి బడేసాహెబ్‌ మాట్లాడారు. లలిత కళా సమితి చైర్మన్‌ పత్తి ఓబులయ్య , మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, నగర ప్రజలు హాజరయ్యారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సాయినాథ్‌ సమాధానం చెప్పారు.

20, జనవరి 2011, గురువారం

రచ్చబండ రచ్చరచ్చ...!?

రచ్చబండ కార్యక్రమం తెలంగాణాలో రచ్చరచ్చ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు సమస్యలతో సతమత మవుతున్నారు. ఎన్నికలకు ముందు రేషన్‌ కార్డులు తరువాత బోగస్‌వని లాగేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇస్తామని రచ్చబండ కార్యక్రమంలో అంశంగా పెట్టారు. ఇందిరమ్మ పెండింగు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. మహిళలకు పావలావడ్డీ రుణాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకాలన్నీ పెండింగులో ఉన్నాయి. అదేవిధంగా ఈమధ్య అన్ని రకాల ధరలు పెరిగాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రోశయ్య ముఖ్యమంత్రినుంచి తప్పించాక అభివృద్ధి పనులన్నీ పెండింగులో లోనే ఉన్నాయి. వాటన్నింటికీ మించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఈనేపథ్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకునే అవకాశం ఉంది. పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం జరిగినా అనేక అవాంతరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా నిర్వహిస్తారో వేచిచూడాలి. ఇలా నిర్వహిస్తామని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈనెల 20న ఆయన మహబూబ్‌నగర్‌ రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, డికె అరుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. ఏడు ప్రధానమైన అంశాలపై రచ్చబండలో చర్చ ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం, పావలావడ్డీ, ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, సంక్షేమం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించన్నుట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాపితంగా ఐదు లక్షలా 70 వేల మందికి రేషన్‌ కార్డులు పంపిణీ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సమస్యను పరిష్కరించి, లబ్ధిదారులకు తాత్కాలిక రేషన్‌ కార్డులు, కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. జిల్లా పరిధిలో 19,500 మందికి కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. కూపన్లు పొందిన ప్రతి కుటుంబానికీ మార్చి నుండి రెండు రూపాయల కిలో బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. 37,084 ఇళ్లు ఇందిరమ్మ పథకం కింద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీటన్నింటికి సంబంధించిన బిల్లులను విడుదల చేస్తామని చెప్పారు. అభయహస్తం పథకం కింద కోటీ 45 లక్షల రూపాయల నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పావలావడ్డీ పథకం కింద జిల్లాలోని మహిళా స్వయం సంఘాలకు రూ.10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. పావలా వడ్డీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 440 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 4.60 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. జిల్లా పరిధిలో 25,011 మందికి కోటీ 45 లక్షల రూపాయలతో లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద జిల్లాలో 16,000 మందికి కొత్త కూపన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచామని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, డికె అరుణ మాట్లాడారు. కలెక్టర్‌ పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 12 వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలంలోనూ నాలుగు నుండి ఐదు రోజుల పాటు కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 14 నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కె.దామోదర్‌రెడ్డి, ఎస్పీ సుధీర్‌బాబు, ఎమ్మెల్యేలు అబ్రహం, రాజేశ్వర్‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ చంద్రకాంత్‌రెడ్డి, డ్వామా పీడీ జాన్‌వెస్లీ ఉన్నారు.
27న జిల్లాకు సిఎం
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాను సందర్శించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటించనున్న గ్రామాన్ని ఇంకా ఖరారు చేయలేదు. రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు.
కాంగ్రెస్‌ శ్రేణులు చురుకుగా పాల్గొనాలి
రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు చురుకుగా పాల్గొని, విజయవంతం చేయాలని మంత్రులు రాంరెడ్డివెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డికె అరుణ కోరారు. సమీక్షా సమావేశం అనంతరం వారు కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ, మండల స్థాయి నాయకులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు.

13, జనవరి 2011, గురువారం

మా ఊరిలో సంక్రాంతి

సంక్రాంతి. ఇది రైతుల పండుగ. కంటికి కునుకు లేకుండా అహర్నిశలూ శ్రమించిన అన్నదాత కళ్లలో వెలుగులు నింపే ఆనందాల పండుగ. వరి, కందులు, వేరుశనగ వంటి పంటలు ఇంటికొచ్చే ధాన్యం పండుగ. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారిని ఒక్కచోటికి చేర్చే మమతానురాగాల పండుగ. కొత్తబట్టలు కట్టుకోకూడదనే అపవాదును మూటగట్టుకున్న కీడు పండుగ. మూడు రోజుల పాటు జరుపుకునే అతిపెద్ద పండుగ. తెలుగువారి ప్రియమైన పండుగ. ఇన్ని విశేషాలున్న సంక్రాంతి గొప్పధనాన్ని తెలుసుకోవాలంటే తెలుగు పల్లెలవైపు ఓ సారి తొంగిచూడాలి. మంచులో తడిసిన పల్లె, ఎగిసిపడే భోగిమంట, ముచ్చటైన ముత్యాలముగ్గు, ఘల్లు ఘల్లుమని మోగుతూ ఎదురొచ్చే ఎడ్లబండీ పల్లె అందాల్ని ఇనుమండింపజేస్తాయి. రవి కుంచె నుండి జాలువారిన వర్ణచిత్రాల్లా మనసు పొరల్లో ముద్రించుకుపోతాయి.
మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గం బుద్ధారం గ్రామంలో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. గిరిజనుల నృత్యాలు ఈ పండగకు అదనపు ఆకర్షణ. గ్రామంలో 6,000 మంది జనాభా ఉంది. అందులో 1,000 మంది గిరిజనులు ఉన్నారు. వ్యవసాయం, వలసలు గ్రామ ప్రధాన జీవనాధారాలు. పండుగ వారం రోజులు ఉందనగా పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారంతా కన్నతల్లిలాంటి పల్లెకు చేరుకుంటారు. ఇంటికి రాగానే గుమ్మంలోనే ఎదురుచూసే అమ్మానాన్నలను పట్టుకుని ఆడపడుచులు 'ఘొల్లు'మంటారు. ఏడాదిపాటు గుండెల్లో గూడుకట్టుకున్న ఎడబాటు కరిగిపోయేదాకా కంటతడిపెడతారు. ఇళ్లలోని సామానంతటినీ బయటపెట్టి శుభ్రంచేస్తారు. పుట్టమట్టి, పేడ, బూడిద కలగలిసిన మిశ్రమాన్ని గోడలకు పూస్తారు. మధ్యలోనే సున్నం చారికలను వేస్తారు. ఈ పది రోజుల కాలంలో పల్లెను మంచు వీడకుండానే పొలానికి వెళ్లిన రైతులు బండినిండా ధాన్యంతో ఇళ్లకు చేరుకుంటారు. బండి వస్తుంటే.. పోతుంటే.. ఎడ్లమెడలో ఉన్న మువ్వలు 'ఘల్లు.. ఘల్లు'మని చేసే శబ్ధం వీనుల విందుగా ఉంటుంది. బండి వాకిట్లోకి రాగానే మహిళలు ఇంట్లోకి వెళ్లి చెంబునిండా తెచ్చిన కలిని బండిమీదుగా చల్లుతారు. అలా చల్లితే ఏదైనా దిష్టి తగిలితే పోతుందని వారి ప్రగాఢ నమ్మకం. భోగిరోజు ఉదయాన్నే లేచి మంట పడెతారు. అంతకు ముందు రోజు ఇంటిని శుభ్రం చేయగా పోగుచేసిన చెత్తా చెదారాన్నీ, అవసరం లేని పాత చాట, చీపురు, ఇతర వస్తువులను ఆ మంటలో వేస్తారు. ఆ తర్వాత కొత్తవి కొనుక్కుంటారు. తెల్లవారగానే వేడినిళ్లు పెట్టుకుని అందులో నువ్వులు వేసుకుని స్నానం చేస్తారు. ఉతికిన బట్టలు ధరిస్తారు. నువ్వులతో చేసిన రొట్టెల్లోకి దొండ, వంకాయ, ఆలుగడ్డ వంటి ఐదు రకాల కూరగాయలతో చేసిన కూరను ఇష్టంగా తింటారు. పండుగ సందర్భంగా భోగి రోజు గ్రామంలో 60 నుండి 70 కిలోలున్న బండ ఎత్తడం(మనుషులు), బండలాగుడు(పశువులు), ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం బహుమతులను ప్రదానం చేస్తారు. ధనుర్మాసం ఆరంభం నుండే ఇళ్లముందు కల్లాపి చల్లి రంగవల్లులు వేసే మహిళలు, యువతులు సంక్రాంతి రోజు ప్రత్యేకమైన రథం ముగ్గు వేస్తారు. దీనిని బియ్యం పిండితో వేయడం ప్రత్యేకత. ముగ్గు వేశాక రంగులు వేస్తారు. పేడ, కుంకుమ, పసుపు, గరకలతో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెడతారు. ఒకరు వేసిన ముగ్గును పక్కింటి వారి ముగ్గుతో కలుపుతూ పోతారు. ఇలా గొలుసుకట్టుగా కలుపుతారు. 'ఇది ఇరు కుటుంబాల మధ్యన ఐక్యమత్యాన్ని తెలుపుతుంది' అంటారు గ్రామ మహిళ ప్రసన్నలక్ష్మి. ఇళ్లకు మామిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. తర్వాత పాలు పొంగిస్తారు. పిండి వంటలు చేసుకుని తింటారు. రైతులు పశువులను దగ్గర్లోని బోర్ల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయిస్తారు. ఇంటికొచ్చాక వాటికి బొట్లు పెడతారు. అలంకరించి పూజలు చేస్తారు. బండ్ల గిర్రలను విప్పి జనుం(మరమ్మతు) వేస్తారు. ఆ తర్వాత రంగు రంగుల కాగితాలు, మామిడాకులు, బంతిపూలతో వాటినీ అలంకరిస్తారు. సాయంత్రం కాగానే బండ్లను గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. ముందు భజన బృందం వెళ్తుంది. దాని వెనుక రైలు పెట్టెల్లా బండెనక బండి గ్రామం నుండి ఆలయం వరకు బారులు తీరుతాయి. ఎడ్ల కాళ్ల గిట్టలు చేసే శబ్ధం వాటి మెడల్లోని మువ్వల శబ్ధానికి తాళం వేసినట్లుగా ఉంటుంది. ఇది ఏ సంగీత దర్శకునికీ అందని బాణి. బండ్లపై వెళ్తున్న క్రమంలో ఒకరిని ఒకరు పలుకరించుకుంటారు. వలస వెళ్లి వచ్చిన వారినీ, అత్తవారింటినుంచి వచ్చిన వారినీ కుశల ప్రశ్నలు అడుగుతారు. ఈ ఆలయం వద్దకు గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల బండ్లూ వస్తాయి. బండ్లు ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు చుట్టూ నిల్చున్న వారికి బండ్లపై ఉన్న వారు నూకలు, బెల్లం కలిపిన ఫలహారం పంచుతారు. నేల ఈనినట్టు ఆలయం చుట్టూ ఎక్కడ చూసినా ప్రజలే కనిపిస్తారు. మహిళలు బొడ్డెమ్మ కొట్టగా... పురుషులు కోలాటాలు ఆడతారు. ఆ దృశ్యం కనువిందు చేస్తుంది. కనుమ రోజు ఆలయం వద్దకు వన భోజనాల కోసం వస్తారు.
ప్రత్యేకం గిరిజనుల నృత్యం
ఈ పండుగకు గ్రామానికి చుట్టుపక్కల ఉండే తండాల గిరిజనులు చేసే సాంప్రదాయ నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది. 'పండగకు గిరిజనులు అద్దాలతో కూడిన సంప్రదాయ వస్త్రాలను ధరిస్తారు. ఇంటింటికీ తిరిగి నృత్యం చేస్తారు. పాటలు పాడతారు. గతంలోలా ఇప్పుడు గిరిజనులు సాంప్రదాయ దుస్తులను ధరించడం తగ్గిపోయింది. ఆ డ్రస్సుపై ఉన్న మక్కువను కొందరు సంక్రాంతి పండుగ రూపంలో తీర్చుకుంటున్నారు'అని చెప్తారు ఎంపిటిసి పూల్యానాయక్‌.
పండగపై సంస్కరణల ప్రభావం
సంక్రాంతి పండుగపై సంస్కరణల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో యంత్రీకరణ పెరగడంతో పల్లెలకు శోభను తెచ్చే పశు సంపద తగ్గిపోతోంది. బుద్ధారం గ్రామంలో 15 ఏళ్ల కిందట రెండు ట్రాక్టర్లు ఉండేవి. నేడు ఆ సంఖ్య 25కు చేరింది. గ్రామంలో ఇంకా 25 ఆటోలు, 100కుపైగా బైక్‌లు, ఐదు ఫోర్‌ వీలర్స్‌ ఉన్నాయి. 'పదేళ్ల కిందట సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామం నుండి 100కుపైగా బండ్లు ఆలయానికి వెళ్లేవి. నేడు ఆ సంఖ్య 30కి చేరింది. పశు సంపద తగ్గడంతో పల్లెలు శోభను కోల్పోతున్నాయి'అని పల్లెలపై పరుచుకున్న సంస్కరణల విష వలయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు మాజీ సర్పంచి అచ్యుతరామారావు. 'వెనకటికి ప్రతి ఇంటికీ ఓ ఒండి ఉండేది. సంక్రాంతి రోజు అందరూ బండ్లు కట్టేవారు. ఇంటిల్లిపాదీ బండిపై ఊరేగింపుగా వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరికీ సైకిల్‌ మోటార్లు ఉన్నాయి. వాటిపై వెళ్లి వస్తున్నారు. ఒకరినొకరు పలుకరించుకోవడం తగ్గిపోయింది. బండ్ల మీద వెళ్లేటప్పుడు కనిపించినవారందరినీ ఆప్యాయంగా పలుకరించేవారం'అని నాటికీ నేటికీ ఉన్న తేడాను వివరించారు గ్రామ వద్ధులు నరసింహయ్య, మునుగాల నారాయణ.
కొత్త బట్టలు ఎందుకు వేసుకోరంటే...
సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. అందుకే ఈ పండుగకు కొత్త బట్టలు వేసుకోరు. పాత బట్టల్ని ఉతుక్కుని వేసుకుంటారు. 'ధనుర్మాసంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి సంక్రమిస్తాడు. ఈ కాలాన్ని సంక్రమణ కాలం అంటారు. ఈ కాలం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండగకు కొత్త బట్టలు ధరించరు'అని కీడు నేపథ్యాన్ని గండిఆంజనేయస్వామి ప్రధాన అర్చకులు విజయరత్నం వివరించారు.
సంక్రాంత్రి కీడు పండుగ
రాయలసీమ పల్లెల్లో ప్రజల నమ్మకం
సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. అందుకే ఈ పండుగకు కొత్త బట్టలు వేసుకోరు. పాత బట్టల్ని ఉతుక్కుని వేసుకుంటారు. 'ధనుర్మాసంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి సంక్రమిస్తాడు. ఈ కాలాన్ని సంక్రమణ కాలం అంటారట. ఈ కాలం మంచిది కాదని చెబుతారు. . అందుకే ఈ పండగకు కొత్త బట్టలు ధరించరు' అని కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్చాల శివాలయ అర్చకుడు రామానుజాచార్యులు కీడు నేపద్యాన్ని చెప్పారు. ఆయన వివరాల ప్రకారం..... సంక్రాంతికి అన్ని పంటలు ఇంటికి వస్తాయి. శాస్త్ర ప్రకారం ఇది కీడు పండుక కాకపోయినా మహబూబ్‌నగర్‌, కర్నూలు , అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాలక్రమంలో అలా వచ్చిందని అంటారు. మాపూర్వీకులు కూడా కీడు అనేదానికి సరయిన వివరణ ఇవ్వలేదని కేవలం జనపదాలలో వచ్చిన పద్దతే అని తెలిపారు. ఇంటికి వచ్చిన ధాన్యం నుంచి వృత్తుల వారికి , పురోహితులకు సంభావన ఇచ్చేవారు. సంభావన ఇచ్చినప్పుడు దాన్యంలోపల ఒకటి రెండు ఇనుపసీలలు వేసి ఇచ్చేవారు. అలా ఇస్తే శనిదోషం పోతుందని నమ్మకం. 10 సంవత్సరాల నుంచి సంభావనకు కూడా వెల్లడం లేదు. గ్రామంలో వృత్తులు అన్ని అంతరించాయి. అప్పటి గౌరవం వృత్తుల వాళ్లకు గ్రామాల్లో లేదు. ఏదయినా పండుగ అంటే జీర్ణవస్తువులు ధరించరాదని పెద్దలు చెప్పేవారు. కాని సంక్రాంతికి మాత్రం కొత్తబట్టులు ధరించకుండా పాతబట్టలను శుభ్రం చేసుకుని ధరిస్తారు. మామూలుగా అందరూ ఈ పండుగ రోజు కూడా పనులకు వెళ్తారు. పండుగ అంటే దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కాని సంక్రాంతికి ఉల్చాలలో దేవాలయానికి వెళ్లరు. అన్ని పండుగలకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మా ఊర్లో అస్సలు వ్యాపారాలు సాగవు. సంక్రాంతి పోతే తప్ప మంచి రోజులు రావని ఇక్కడి ప్రజల నమ్మకం. పెళ్లిళ్లు, తదితర శుభకార్యాల గురించి కూడా మాట్లాడరు.
సేకరణ: ప్రదీప్‌ తమ్మడి/ పానుగంటి చంద్రయ్య

సంక్రాంతి

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. "భిన్నత్వంలో ఏకత్వం" అనే వాక్యానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లలో సంక్రాంతి అని; తమిళనాడు లో పొంగల్ అని; మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్‌సంక్రాంతి అని; పంజాబు, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - అంటే ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలం

"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి  సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్య భగవానుని యాత్రలో రెండవ ఘట్టమైన కటక సంక్రమణం నుండి నాల్గవ ఘట్టమైన మకర సంక్రమణం వరకూ గల అరు నెలల్ని ఉత్తరాయణమంటారు. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యంకనుక అది ఉత్తర కాలమని చెపుతారు.
దానాదులు.
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడినది. ఉత్తరాయణ కాలమందు చేయు దానాలలో ఉత్తమమయినవి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.
భోగి

ఇది జనవరి 13న వస్తుంది. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.
సంక్రాంతి

రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
కనుమ

మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్‌సంక్రాంతి లేదా లోరీ ని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెల తో (మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసం గా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.
పండుగ ప్రత్యేకతలు

ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.
రధం ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.
గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మద్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.
బోగిపళ్ళు
బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.
హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
కొన్ని విశేషాలు

  • హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
  • పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడుమాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు. సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (
  • ఆది శంకరాచార్యుడు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడు.
  • ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద పెద్ద తారలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
  • పుష్యమాసములొ వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రొజున గొదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్థి గావి0ఛి తరిస్తారు.

12, జనవరి 2011, బుధవారం

దళిత వాడల పట్ల సర్కారు వివక్ష

-జాన్‌వెస్లీ
యస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం బడ్జెట్‌లో 16.2 శాతం నిధులను ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాల్సి వున్నా ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. వీటిని ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు. గత 19 సంవత్సరాలలో ఇలా దారి మళ్లించిన నిధులు 25,604 కోట్లు, కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం కోత విధించిన 11,340 కోట్లు, ప్రణాళికా సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సూచనల ప్రకారం తిరిగి ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించి దళితవాడల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఫిబ్రవరి నుండి జరగబోయే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ సమస్యపై సమగ్రంగా చర్చించాలి.

అగ్రవర్ణ దురహంకారులు దళితులను రకరకాల సామాజిక వివక్షకు గురిచేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో తరహా వివక్ష చూపుతున్నాయి. పల్లెల్లోను, పట్టణాల్లోనూ అగ్రవర్ణాలు, ధనికవర్గాలుండే వాడలు అభివృద్ధి చెందుతుంటే దళితవాడలు ఎలాంటి సౌకర్యాలు లేక వెలివేసినట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు, మండలాలు వెనుకబడిన మాట ఎంత వాస్తవమో ఈ వెనుకబడిన ప్రాంతాల్లో దళితవాడలు మరింతగా వెనుకబడి ఉన్నాయనేదీ అంతే వాస్తవం. తమ ప్రాంతం వెనుకబడిందని చెప్పే నాయకులు తమ ప్రాంతంలో దళిత వాడల వెనుకబాటుతనం గురించి కనీసం ప్రస్తావించరెందుకని? వీటికి నిధుల కేటాయింపుల్లో కోత, కేటాయించిన అరకొర నిధులను కూడా ఖర్చు చేయరు. దళితులకు ఖర్చు చేయాల్సిన వాటిని వేరే రంగాలకు మళ్లిస్తారు. గత 19 సంవత్సరాల బడ్జెట్‌లో కోత విధించిన ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు, దళితేతరులకు ఖర్చు చేసిన 25,604 కోట్లు తిరిగి దళితులకు ఇవ్వడం ద్వారా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి. వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లుగానే దళితవాడల అభివృద్ధికి కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. వీటి అమలుకు ఒక ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలి. అభివృద్ధిలో దామాషా ప్రాతిపదికపై దళితులకు దక్కాల్సిన వాటా దక్కేలా చూడాలి.  2010 అంచనా ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది దళితులు ఉన్నారు. 39 లక్షల దళిత కుటుంబాలు, 55,972 దళితవాడలు ఉన్నాయి. వీరిలో 80 శాతం దాకా గ్రామీణ ప్రాంతాల్లో వుండగా, పట్టణాల్లో 20 శాతం ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 ప్రకారం కులం, మతం, లింగ, ప్రాంతం పేరుతో ఎవరిపట్ల వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 చెబుతోంది. ప్రతి పౌరుడికి సమాన హక్కులతోపాటు సంపద, వనరుల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశిక సూత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నా దళితుల పట్ల అంటరానితనం, వివక్ష, దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు సాగుతూనే ఉన్నాయి. భూమి, నీరు, ప్రకృతి వనరులు, సంపద, బడ్జెట్‌లలో వీరికి న్యాయంగా లభించాల్సిన వాటా దక్కడం లేదు. గ్రామాల్లో అగ్రకుల ధనికుల సంఖ్య తక్కువే అయినా విశాలమైన ప్రదేశంలో విలాసవంతమైన భవంతులు కట్టుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న దళితులు మాత్రం గాలి వెలుతురు లేని ఇరుకైన ఇళ్లల్లో ఉండాల్సి వస్తున్నది. రాష్ట్రంలో జానెడు ఇళ్ల స్థలం కూడా లేని దళిత కుటుంబాలు 13 లక్షల దాకా వున్నాయి. పట్టణాల్లో ఒకవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలు, మరో వైపు మురికి కాలువల ఒడ్డున చిన్న గుడిసెల్లో రెండేసి, మూడేసి కుటుంబాలు కాపురాలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. 3 లక్షల 12 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా స్థలం లేనికారణంగా ఇళ్లు నిర్మించుకోలేక పోయారు. ప్రభుత్వానికి దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా గ్రామాల్లోని 6 లక్షల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్లు చొప్పున 18 వేల ఎకరాలు, పట్టణాల్లో 7 లక్షల కుటుంబాలకుగాను ఒక్కొక్క కుటుంబానికి 100 గజాల చొప్పున 14,463 ఎకరాలు, మొత్తం 32,463 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంతవరకు 12,76,902 మంది దళితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 6,06,548 ఇళ్లు పూర్తికాలేదు. పూర్తయ్యాయంటున్న ఇళ్లలో సగం దాకా పాత వాటికి మరమ్మతులతో సరిపెట్టినవే. నిధులు సరిగా అందక 2,94,724 ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న నిధులు (20 వేలు) ఇవ్వలేదు. సిమెంటు, ఐరన్‌, కలప ధరలు విపరీతంగా పెరిగినందున ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని లక్ష రూపాయలకు పెంచాలి. ఆ లెక్కన 13 లక్షల ఇళ్ల నిర్మాణానికి 13 వేల కోట్లు, మధ్యలో నిలిచిపోయిన 2,94,724 ఇళ్లకు 50 వేల చొప్పున 1,473 కోట్లు, 20 వేలు అదనంగా ఇవ్వాల్సిన 6 లక్షల ఇళ్లకు 1200 కోట్లు మొత్తం 15,674 కోట్లు కేటాయించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 వేల దళితవాడలకు నేటికీ మంచినీటి సౌకర్యం లేదు. వాస్తవానికి 50 శాతానికి పైగా దళితవాడలకు తాగునీటి సరఫరా లేదు. దీంతో కలుషిత నీరు తాగి అనార్యోగాలకు గురౌతున్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ తీసుకునే స్థోమత లేదు. రక్షిత మంచినీటి కోసం ప్రతి దళితవాడకు 2 లక్షల చొప్పున 10,075 వాడలకు 201 కోట్లు కేటాయించాలి. మిగిలిన 45,895 దళితవాడలకు ఒక లక్ష చొప్పున 458.92 కోట్లు కేటాయించాలి. 80 శాతం దళిత కుటుంబాలు మరుగుదొడ్ల సౌకర్యం లేక నిత్యం అనేక అవస్థలు పడుతున్నారు.కొన్ని వాడల్లో బహిర్భూమికి స్థలమే ఉండడం లేదు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.2,700 ఏ మూలకూ చాలడం లేదు. కాబట్టి ఈ సహాయాన్ని రూ.5 వేలకు పెంచాలి. ఆ ప్రకారం 35 లక్షల కుటుంబాలకు 1750 కోట్లు కేటాయించాలి.
దళితవాడల్లో చిన్న ఇళ్లు, వీధులతో ఇరుకుగా ఉంటున్నాయి. పెళ్ళిళ్లు, ఇతర శుభ కార్యాలకు కమ్యూనిటీ హాళ్లు ఉండడం లేదు. ఫంక్షన్‌ హాళ్లకు రెంట్‌ చెల్లించే స్తోమత వీరికి లేదు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించకుండా ఈ బాధ్యతను జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం అప్పగించింది. దళిత జనాభా అధికంగా ఉన్న 15 వేల గ్రామాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికిగాను గ్రామానికి 5 లక్షల చొప్పున 750 కోట్లు కేటాయించాలి.
దళితవాడల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా వున్నది. దళిత వాడలకు కేటాయించిన నిధులు దళితేతరవాడలు, ప్రాంతాలకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 39 వేల దళితవాడలకు రోడ్లు, డ్రైెనేజీ సౌకర్యం కల్పించేందుకు వాడకు 3 లక్షల చొప్పున 1,170 కోట్లు కేటాయించాలి. గతంలో వేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేని వాడలకు లక్ష చొప్పున కేటాయించాలి.
శ్మశాన స్థలాలను అడుక్కోవాలా?
బతికున్నంత కాలం గుడిసెకింత జాగా కోసం పోరాడిన దళితులు చనిపోయిన తర్వాత శవాన్ని పాతిపెట్టడానికి కాసింత చోటు కోసం కూడా పోరాడాల్సిన దుస్థితి నెలకొన్నది. శ్మశానాలు లేక దూరంగా నదులు, కుంటలు, వాగులు, రైల్వే ట్రాక్‌ల దగ్గరకు తీసుకెళ్లి శవాలను సమాధి చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి శ్మశాన స్థలాలను సైతం పెత్తందార్లు ఆక్రమిస్తున్నారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి దళితవాడకు 2 ఎకరాల శ్మశాన స్థలాలు ఇవ్వాలని కెవిపిఎస్‌ ఆధ్యర్యాన దళితులు శవపేటికలతో కలెక్టరేట్లను స్తంభింపజేశారు. చలో అసెంబ్లీ నిర్వహించారు. ఈ ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం అన్నిమతాల వారికి శ్మశాన స్థలాలు మూడేళ్లలో కేటాయిస్తామని చెప్పి జి.ఓ.నెం. 1235ను జారీ చేసింది. అయితే దాని అమలును మరచింది. శ్శశాన స్థలాలు లేని 10 వేల గ్రామాలకు 2 ఎకరాల చొప్పున 20 వేల ఎకరాలు వెంటనే కేటాయించాలి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనైనా ఇవ్వాలి.
దళితవాడలకు విద్యుత్‌
ట్రాన్స్‌కో లెక్కల ప్రకారమే 2007 చివరి నాటికి 4,532 దళితవాడలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. ఊరంతా లైట్లు వెలుగుతుంటే చాలా దళితవాడలు చీకట్లో మగ్గుతున్నాయి. విద్యుత్‌ సౌకర్యం ఉన్న వాడల్లోకూడ తగినన్ని స్తంభాలు లేవు. ఉన్నా లైట్లు వెలగవు. విద్యుత్‌ సౌకర్యం మెరుగుపరిచేందుకు గాను ఒక్కో దళిత వాడకు లక్ష రూపాయల చొప్పున 4,532 వాడల్లో విద్యుత్‌ సౌకర్యానికి 46 కోట్లు కేటాయించాలి. అలాగే ప్రతి దళితవాడకు సరిపడా స్థంభాలు , లైట్లు వేసేందుకు 50 వేల చొప్పున 254 కోట్లు కేటాయించాలి. 2009 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సంవత్సరానికి 68 వేల మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. దళితుల వాటా కింద 11వేల మిలియన్‌ యూనిట్లు కేటాయించాలి. కానీ, ఒక శాతం కూడా పూర్తిగా కేటాయించడం లేదు. 35 లక్షల కుటుంబాలకు 75 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్‌ అందిస్తే సంవత్సరానికి 315 కోట్ల యూనిట్లు అవసరమవుతాయి. ఇందుకు గాను బడ్జెట్‌లో సంవత్సరానికి 630 కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో 593 ఎస్సీ సంక్షేమ హాస్టల్స్‌, 513 కళాశాల హాస్టల్స్‌కు సొంత భవనాలు లేవు. భవనానికి 20 లక్షల చొప్పున లెక్కించినా మొత్తం 1,106 హాస్టల్స్‌కు సొంత భవనాల నిర్మాణానికి 221 కోట్లు కేటాయించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్టీలు కూడా పెంచాలి.దళితవాడల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తగినన్ని లేవు. ఉపాధ్యాయ సిబ్బంది కొరత ఉంది. ప్రాథమిక విద్యను పెంచేందుకు దళితులు 40 శాతంగా ఉన్న 9,189 గ్రామాల్లో ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ వైద్యశాలలు ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మందులు, డాక్టర్లు, సిబ్బంది, కనీస సౌకర్యాలు లేక మూతపడే దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1581 పిహెచ్‌సిలు మాత్రమే ఉన్నాయి. 5 వేలకు పైగా జనాభా కలిగిన 9,201 గ్రామాల్లో పిహెచ్‌సిల ఏర్పాటు చేసి, వైద్యులు, మందులు అందుబాటులో వుండేలా చూడాలి. ఆరోగ్యశ్రీ కింద దళితులకు అన్ని రోగాలకు ఉచిత వైద్య సౌకర్యం ల్పించాలి.
బడ్జెట్‌లో వాటా
ఇన్ని నిధులు ఎక్కడి నుండి వస్తాయని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో 16.2 శాతం దళితులకు కేటాయించి ఖర్చు చేయాలనే నిబంధనలు, జాతీయ ప్రణాళికా సంఘం సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అమలు చేయడం లేదు. కెవిపిఎస్‌ ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేసింది. అయితే నిధులన్నిటినీ కలిపి కేటాయించడం లేదు. మొత్తం 1,95,044.05 కోట్ల ప్రణాళికా బడ్జెట్‌లో దళితులకు న్యాయంగా 31,597.14 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, 27,440.24 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో కూడా 14,361.50 కోట్లు (7.36శాతం) మాత్రమే ఖర్చు చేసింది. ఫలితంగా గత 7 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో దళితులకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో 17,235.64 కోట్లు కోత పెట్టారు. అంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పాలనలోను 4,047 కోట్లు కోత పెట్టారు. ఖర్చు చేశామంటున్న నిధుల్లో దళితులకు ప్రయోజనం లేని రంగాలకు ఖర్చు చేసి దళితులను అభివృద్ధి చేసినట్లు లెక్కలు చూయిస్తున్నారు. గత వార్షిక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధుల్లో 430 కోట్లు హుసేన్‌ సాగర్‌ ఆధునీకరణ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పార్కుల అభివృద్ధి, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం వంటి వాటికి కేటాయించారు. యస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం బడ్జెట్‌లో 16.2 శాతం నిధులను ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాల్సి వున్నా ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. వీటిని ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు. గత 19 సంవత్సరాలలో ఇలా దారి మళ్లించిన నిధులు 25,604 కోట్లు, కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం కోత విధించిన 11,340 కోట్లు, ప్రణాళికా సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సూచనల ప్రకారం తిరిగి ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించి దళితవాడల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఫిబ్రవరి నుండి జరగబోయే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ సమస్యపై సమగ్రంగా చర్చించాలి. బడ్జెట్‌లో దళితులకు తగు న్యాయం జరిగేలా చూసేందుకు దళితులు, అభ్యుదయవాదులు ఐక్యంగా ఉద్యమించాలి.
(రచయిత కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

11, జనవరి 2011, మంగళవారం

పాలకులకు చిత్తశుద్ధి లేదు ?

ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న ఈ వ్యవస్థలో నిరుద్యోగం, పేదరికం ,అవినీతి, ఆకలి, రైతులకు అందని గిట్టుబాటు వంటి సమస్యలు పరిష్కారమవుతాయా?. అసలు ఆర్థిక అసమానతలు పోవడానికి ఏం చేయాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఏం చేయాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరుదశాబ్దాలు దాటినా మనిషిని మనిషిగా చూడలేని మనుషులున్న వ్యవస్థ నేటికీ ఉంది. పాలకుల తప్పుడు విధానాలే కారణమని కొందరంటుంటే. ఒకపార్టీమీద మరోపార్టీ విమర్శలు, ఒకే పార్టీలో రెండు మూడు రకాల వైఖరులు వంటి గొడవల మధ్య ప్రజల సమస్యలను పక్కన పెట్టారు. నీతిమాలిన రాజకీయ నాయకుల వల్ల ప్రజల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమంగా కోటీశ్వరులయిన రాజకీయ నాయకులు ప్రజల పక్షాన పోరాడుతామంటారు. ఎలా సాధ్యమవుతుంది. చిత్తశుద్ధి ఉంటే ముందుగా మత వద్ద ఉన్న కోట్లను ప్రభుత్వానికి అప్పగించి పోరాడితే ప్రజలు నమ్మె అవకాశం ఉంది. అనుకున్న పదవులు రాలేదని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసే వారు ప్రజలకు సేవ చేస్తారనుకుంటే పొరపాటే. వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలు ఏడాదిదాటినా గుడారాల్లో ఉంటున్నారు. వారి గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. వరదల వల్ల కోస్తాలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూలీలకు ఉపాధిలేక వలసలు పోతున్నారు. వ్యవసాయ కార్మికులు, దళితులు తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం వల్ల దళిత , బడుగు , బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర వంటి ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సమస్యలు పరిష్కార మవుతాయి.

6, జనవరి 2011, గురువారం

శ్రీ కృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే?

శ్రీకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాల అభిప్రయాలు సేకరించింది. పాము చావకుండా కర్ర ఇరుగకుండా రిపోర్టు ఉంది. అన్ని అధ్యయనం చేసినట్లే ఉంది. ఏదీ ప్రజలకు అర్థం కానట్లే ఉంది.
ఏడాది పొడవునా అధ్యయనం చేసినదాంట్లో ఏమి లేదు.... అనే వారు ఎక్కువగా ఉన్నారు. వాస్తవమే ఓ కమిటీకి రాష్ట్రం ఇవ్వండని, ఇవ్వొద్దని చెప్పే అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే తేల్చుతుంది. లేందంటే గొడలు తప్పవు....తేల్చడానికి కాంగ్రెస్‌ లాభనష్టాలను బేరీజు వేసుకుంటుంది. కాంగ్రెస్‌కు కూడా
కొన్ని చిక్కులున్నాయి. పెద్ద స్వార్థం ఉంది. మూడేళ్లు ఇంకా అధికారంలో ఉండాలి. దీని ఆధారంగా మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రణాలిక చేసుకోవాలి. ప్రజల ప్రయోజనాలు కాంగ్రెస్‌కు అవసరం లేదు. ఈ గొడవ మధ్య ప్రజల సమస్యలు కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ధైర్యంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
న్యాయమూర్తి బిఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పడిన కమిటీ తన నివేదికను కేంద్రప్రభుత్వానికి 2010 డిసెంబర్‌ 30 వతేదీన అందచేసింది. కమిటీ అధ్యయనాంశాలను ఈ దిగువ పొందుపర్చటమైనది.
కమిటీ తన 461 పేజీల నివేదికలో ఈ దిగువ అంశాలను సమగ్రంగా పరిశీలించింది.
1. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలు, చారిత్రక నేపథ్యం.
2. ప్రాంతీయ ఆర్థిక, సమానత్వ విశ్లేషణ,
3. విద్య, ఆరోగ్యం,
4. జలవనరులు, సాగునీటి వసతి, విద్యుత్‌ అభివృద్ధి
5. ప్రభుత్వ ఉద్యోగావకాశాలకు సంబంధించిన అంశాలు.
6. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలు.
7. సామాజిక, సాంస్కృతిక అంశాలు.
పై తెలిపిన పరిమితులకు లోబడి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు డిమాండ్‌, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కొనసాగింపు డిమాండ్ల నేపథ్యంలో ఆయా అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించి విశ్లేషించింది. రాష్ట్రంలోని పరిస్థితులను అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ ఆయా స్థానిక, ప్రాంతీయ, జాతీయ దృక్పధాలను దృష్టిలో వుంచుకుని సమస్యకు ఈ దిగువ పరిష్కారాలు/పరిష్కారానికి అనువైన మార్గాలను సూచించింది.
1. యధాతథ స్థితిని కొనసాగించటం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొని వున్న పరిస్థితుల్లో కేవలం యధాతథ స్థితిని కొనసాగించటం ఆచరణ సాధ్యం కాదని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతోంది. ఈ యధాతథ స్థితిని కొనసాగించేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం వుందని భావిస్తోంది. యధాతథ స్థితిని కొనసాగించటం ఒక మార్గమే అయినా దీనికి కమిటీ కొంతమేర మాత్రమే సానుకూలత వ్యక్తం చేస్తోంది.
2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణా,రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వుంచటం, ఇదే సమయంలో రెండు రాష్ట్రాలు తమ సొంత రాజధానులను అభివృద్ధి పరుచుకునేందుకు అవకాశం కల్పించటం.
తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధి లోపం తీవ్రంగా వున్న విషయాన్ని కమిటీ పరిశీలించింది.
అయితే మొత్తం మీద పరిశీలిస్తే రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వుంచటం ఆచరణలో సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడుతోంది.
3. రాష్ట్రాన్ని రాయల-తెలంగాణా, కోస్తా ఆంధ్రాలుగా విభజించి హైదరాబాద్‌ను రాయల-తెలంగాణాలో అంతర్భాగంగా కొనసాగించటం.
ఈ పరిస్థితి అటు తెలంగాణా అనుకూల వాదులకు కానీ, ఇటు సమైక్య ఆంధ్ర వాదులకు కానీ ఆమోదయోగ్యం కాదని కమిటీ భావిస్తోంది. ఈ మార్గంలో ఆర్థిక సమతుల్యత సాధించే అవకాశం వున్నప్పటికీ ఇది మూడు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కాదని కమిటీ భావిస్తోంది.
4. ఆంధ్రప్రదేశ్‌ను సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలుగా విభజించి, హైదరాబాద్‌ మహానగరాన్ని విస్తృతపరిచి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కేంద్ర పాలిత ప్రాంతానికి కోస్తా ఆంధ్రాలోని గుంటూరు జిల్లా నైరుతి ప్రాంతంలోని నల్గొండ జిల్లా మీదుగాను, దక్షిణాన మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు భౌగోళిక, రవాణా సంబంధాలు (మార్గాలు) వుంటాయి.
ఈ ప్రతిపాదనకు తెలంగాణా వాదులనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్న దృష్ట్యా ఈ అంశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా చేయటం కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించటం దాదాపు కష్టసాధ్యమే.
5. రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల్లోనే తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలుగా విభజించి హైదరాబాద్‌ను తెలంగాణా రాజధానిగా కొనసాగించటం, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయటం.
ఈ అంశాన్ని పరిశీలనకు తీసుకోవచ్చని కమిటీ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు డిమాండ్‌ పూర్తిగా సమర్ధించదగినది కాకపోయినా అందులో కొంత న్యాయం వుందని కమిటీ భావిస్తోంది. ఈ అంశాన్ని ఆచరణలో పెడితే హైదరాబాద్‌, ఇతర తెలంగాణా జిల్లాల్లో స్థిరపడిన కోస్తాంధ్రా, రాయలసీమ ప్రజలు, ఇతరులకు తమ ఆస్తులు, పెట్టుబడులు, జీవనాధారం, ఉద్యోగావకాశాలపై ఉన్న భయాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ఈ ప్రాంతంలోని మెజార్టీ ప్రజలకు సంతృప్తి కలిగించినప్పటికీ అది అనేక తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని భావిస్తోంది. అనుకూలతలు, ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ అంశం అత్యంత ప్రాధాన్యత ఇవ్వదగినది కాదని, రెండో అత్యుత్తమ మార్గం మాత్రమేనని భావిస్తోంది. అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్ర విభజన జరగాలని, ఈ నిర్ణయానికి మూడు ప్రాంతాల ప్రజల ఆమోదం పొందేందుకు కృషి చేయాలని సూచిస్తోంది.
6. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించటం, అదే సమయంలో తెలంగాణా ప్రాంతానికి నిశ్చిత, ఖచ్చితమైన రాజ్యాంగ/చట్టపరమైన సామాజిక, ఆర్థిక, అభివృద్ధి, రాజకీయ సాధికారికత కల్పన కోసం ఉన్నతాధికార తెలంగాణా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం.
ఈ మార్గంలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించటంతో పాటు తెలంగాణా ఆర్థిక, సామాజిక అబివృద్ధికి సంబంధించి రాజ్యాంగ/చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదిస్తోంది. సమగ్రమైన విధులు, నిధులు, అధికారాలతో చట్టబద్ధమైన ఉన్నతాధికార తెలంగాణా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రాంతీయ మండలికి సంబంధించిన అంశాలతో వ్యవహరించేందుకు శాసనబద్ధమైన సంప్రదింపుల యంత్రాంగాన్ని మండలి ఏర్పాటు చేయవచ్చు. జాతీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా వుండేందుకు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కమిటీ సూచిస్తోంది. స్థిరమైన రాజకీయ, పాలనా నిర్వహణతో ఈ అంశంపై ప్రజలకు అవగాహన కలిగించటం సాధ్యమే కాక అందరి ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని అధికసంఖ్యాకులైన ప్రజలకు ఇది సంతృప్తి కలిగిస్తుందని కమిటీ భావిస్తోంది. విద్యా, పారిశ్రామిక, ఐటి రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగర భవిష్యత్తుపై నెలకొని వున్న అనిశ్చితికి కూడా ఇది జవాబు చెబుతుంది. జలవనరులు, సాగునీటి వనరులను సమాన ప్రాతిపదికపై పంపిణీ చేసేందుకు సాంకేతిక పరమైన సంస్థ (జల నిర్వహణా బోర్డు, ఇరిగేషన్‌ ప్రాజెక్టు డెవలెప్‌మెంట్‌ కార్పోరేషన్‌)ను విస్తృత స్థాయిలో ఏర్పాటుచేయాలని కమిటీ సూచిస్తోంది. ఈ కార్యాచరణ తెలంగాణా ప్రజలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలకు సరైన జవాబుగా నిలుస్తుంది. ఈ అంశానికి సంబందించిన అన్ని కోణాలను సమగ్రంగా చర్చించిన కమిటీ దీని అమలులో కొన్ని అడ్డంకులు వుండవచ్చని భావిస్తోంది. సమతుల్యతను, మూడు ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని, ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుంటే ఇది పైన సూచించిన పరిస్థితుల్లో ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన అంశమని కమిటీ భావిస్తోంది. సామాజిక, ఆర్థికాభివృది ్ధ, సుపరిపాలన ఇందులో కీలకం. జాతీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నింటికన్నా ఈ మార్గం అత్యుత్తమమైన మార్గమని కమిటీ అభిప్రాయపడుతోంది.
అనుబంధం
కమిటీ అధ్యయనానికి సూచించిన ప్రస్తావనాంశాలు
1. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కొనసాగింపు డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయటం.
2. రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుండి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రగతి, అభివృద్ధిపై వాటి ప్రభావం.
3. మహిళలు, పిల్లలు, విద్యార్ధులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలు, తెగల వంటి విభిన్న వర్గాల ప్రజలపై ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం.
4. పై 1,2, 3 అంశాలలో సూచించిన అంశాలలో కీలకమైన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు సూచించటం.
5. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా రాజకీయ పార్టీలను పై చెప్పిన పరిస్తితులపై సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకోవటంతో పాటు ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని పరిష్కరించేందుకు రాజకీయపార్టీలు ఇతర సంస్థల నుండి పరిష్కార మార్గాలను ఆహ్వానించటం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కొనసాగించటం.
ఇందుకు అనువైన పరిష్కారాలను సూచించి కార్యాచరణ ప్రణాళికను, ఆచరణ మార్గాన్ని ప్రభుత్వానికి సూచించటం.
6. పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రైతు, మహిళా, విద్యార్ధి సంఘాల వంటి విభిన్న సామాజిక తరగతులతో పై చెప్పిన అంశాలపై సంప్రదించి రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి వారి అభిప్రాయాలను స్వీకరించటం.
7. పై అంశాలన్నింటినీ విశ్లేషించి రాష్ట్ర పరిస్థితులకు తగినది అని కమిటీ భావించిన పరిష్కారాన్ని సూచించటం లేదా సిఫార్సు చేయటం.

4, జనవరి 2011, మంగళవారం

నోబుల్‌ సాధిస్తే గర్వపడతా

రాష్ట్ర స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన గవర్నర్‌
శాస్త్ర విజ్ఞాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నోబుల్‌ బహుమతిని సాధించే లక్ష్యంగా పని చేయాలని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ధర్మాపూర్‌ శివారులో గల జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్‌ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్యోపన్యాసం చేశారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రం నోబుల్‌ బహుమతిని కైవసం చేసుకోవాలని, ఆ మేరకు కృషి, పట్టుదల, ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. మానవ జీవన పురోగమనానికి సైన్స్‌ ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం సైన్స్‌ను విస్మరించడం సరికాదన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, రక్షిత మంచినీరు, పర్యావరణం, జీవరసాయన వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువ శాస్త్రవేత్తలు ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. మొక్కుబడి ప్రదర్శనలు చేయకుండా ఫలితం సాధించేలా ఉండాలన్నారు. ఆ మేరకు ఉపాధ్యాయులు ఎంతో పట్టుదలతో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమకాలీన విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. ధనార్జనే ధ్యేయంగా విద్యాభ్యాసం సరికాదని అభిప్రాయపడ్డారు. సైన్స్‌ చదివిన ప్రతి ఒక్కరూ సమాజాన్ని ప్రభావితం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులను దేశ భవిష్యత్తుగా అభివర్ణించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర వ్యాప్తంగా 575 ఉన్నత పాఠశాలల నుండి 1,150 మంది విద్యార్థులు హాజరయ్యారు. జీవ రసాయన, వ్యవసాయ అంశాలపై విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను గవర్నర్‌ తిలకించారు. వారిని అభినందించారు. ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాల కోసం వెతకడం, ఆధారాలను నిరూపించడం సైన్స్‌ విద్యార్థులకు ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సరిగ్గా 30 నిముషాల్లో గవర్నర్‌ పర్యటన ముగిసింది. కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి డికె అరుణ, జిల్లా కలెక్టర్‌ ఎం.పురుషోత్తమరెడ్డి మాట్లాడారు. జెడ్పీ ఛైర్మన్‌ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరు సుధాకర్‌రెడ్డి, ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే ఎన్‌.రాజేశ్వర్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టి.చిరంజీవులు, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ భారతీలక్పతినాయక్‌, జిల్లా విద్యాధికారి డాక్టర్‌ విజరుకుమార్‌ ఉన్నారు.

3, జనవరి 2011, సోమవారం

సూరి జీవితం నెత్తుటితోనే సమాప్తం

బయటకొచ్చిన ఏడాదిలోపే హతం
కత్తులతో సహవాసం... నెత్తుటితో సమాప్తం అన్న సినీ నానుడి నిజమైంది. ఫ్యాక్షన్‌లో పుట్టి పగలు, ప్రతీకారంతో బతికిన గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెరువు సూరి జీవితం కూడా రక్తంతోనే అర్థాంతరంగా ముగిసింది. 11 సంవత్సరాల జైలు జీవితం గడిపి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టి ఏడాది తిరగకుండానే మరణించడం అనంతపురం జిల్లాలో సంచలనం రేపింది. మద్దెలచెరువు సూరికి ఫ్యాక్షన్‌ చరిత్ర ఉంది. మూడున్నర దశాబ్దాలకాలంగా మద్దెలచెరువు సూరి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ ముఠాకక్షలు నడుస్తున్నాయి. 1975 ముందు పరిటాల, గుంగుల కుటుంబాల మధ్య ఆదిపత్యపు పోరు ప్రారంభమైంది. 1975 తరువాత పరిటాల రవీంద్ర తండ్రి శ్రీరాములయ్య హత్యకు గురయ్యారు. దీనికి గంగుల నారాయణరెడ్డిపైనే ఆరోపణలొచ్చాయి. ఆ తరువాత 1982లో పరిటాల రవీంద్ర సోదరుడు పరిటాల హరిని పోలీసులు గ్రామం మధ్యలో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇందులోనూ నారాయణరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఆ తరువాత పరిటాల రవీంద్ర నక్సల్స్‌ వైపు మొగ్గుచూపారు. ఆ తరువాత 1983లో గంగుల నారాయణరెడ్డి అనంతపురం నగరంలోని ఒక లాడ్జీలో నక్సల్స్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రధాన కారణం పరిటాల రవీంద్రనే అన్న ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ సాక్ష్యాధారాలు లభించలేదు. ఈ హత్య తరువాత రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో 1993లో సంక్రాంతి పండుగ రోజున మద్దెలచెరువు సూరి నివాసంలో టీవి బాంబు పేలడంతో సూరి తప్ప కుటుంబ సభ్యులంతా చనిపోయారు. అప్పటి నుంచి సూరి బెంగుళూరులో అజ్ఞాతంలో జీవితం గడిపారు. పరిటాల రవీంద్రను లక్ష్యంగా చేసుకుని 1997లో హైదరాబాదులోని ఫిల్మ్‌సిటీలో కారుబాంబు పేల్చడం ద్వారా సూరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ ఘటనలో 26 మంది చనిపోగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హత్యాయత్నం నుంచి పరిటాల రవీంద్ర బయటపడ్డాడు. మద్దెలచెరువు సూరికి ఈ కేసులో జీవిత ఖైదు పడింది. శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2005 జనవరి 25వ తేదీన అనంతపురం నగరంలోని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. సూరి బావ కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్‌ మొద్దుశీను తరువాత ప్రకటించారు. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ మద్దెలచెరువు సూరిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీంతో ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరుగుతోంది. ఇప్పటి వరకు 122 మంది సాక్షులను కోర్టు విచారించింది. మరో రెండు మాసాల్లో పరిటాల రవీంద్ర హత్య కేసుకు సంబంధించి తీర్పు కూడా వెలువడే అవకాశముంది. కారుబాంబు కేసుకు సంబంధించి 2009లో సూరికి ప్రభుత్వం క్షమాబిక్ష ప్రసాదించింది. అయితే పరిటాల హత్యకు సంబంధించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో కొంతకాలం రిమాండులో కొనసాగాల్సి వచ్చింది. అయితే 2009 డిసెంబరు 12న కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. హత్యకేసు తీర్పు వెలువడే వరకు జిల్లాలో ఉండేందుకు వీల్లేదని ఆంక్షలు విధించింది. సిబిఐ ఎదుట వారానికి రెండుసార్లు హాజరవ్వాలని సూచించింది. దీంతో బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ హైదరాబాదులోనూ ఉంటూ వస్తున్నారు. బయటకొచ్చాక బెంగుళూరు, హైదరాబాదులతోపాటు విజయవాడల్లోనూ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈక్రమంలో ఆయన హత్యగావించబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. పాత కక్షలు కారణమై ఉంటాయా లేక సెటిల్‌మెంట్లలో వచ్చిన తేడాలు కారణమా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి.
సూరి.. కుటుంబ జీవితానికి దూరం.
మద్దెలచెరువు సూరి జీవితం మొత్తం కుటుంబ జీవితానికి దూరంగా గడిపాడు. ఆయన చిన్నతనంలోనే 1983లో తండ్రి హత్యకు గురయ్యాడు. ఆ తరువాత 15 ఏళ్ల వయసు అంటే 1993లో ఆయన స్వగ్రామమైన మద్దెలచెరువులోని నివాసంలో టీవి బాంబు పేలింది. ఈ ఘటనలో తల్లి సారమ్మ, తమ్ముడు రఘునాథరెడ్డి, అక్క పద్మలతోపాటు బోయ చంద్రశేఖర్‌, నారయణప్పలు మృతిచెందారు. ఈ ఘటనతో వారి కుంటుంబంలో మిగిలింది సూరి ఒక్కరే. ఆ తరువాత నుంచి కర్నాటకలో ఆజ్ఞాతంలో గడిపాడు. అక్కడే బెంగుళూరులో ఉంటూ భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహమైన రెండేళ్లలోపే 1997లో జరిగిన కారుబాంబు కేసులో సూరి అరెస్టయ్యాడు. ఇందులో జీవిత ఖైదు శిక్ష కూడా పడింది. అప్పటి నుంచి ఆయన భార్య గంగుల భానుమతి సూరి స్వగ్రామమైన మద్దెలచెరువులో ఉంటూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ కీలకంగా ఉంటూ పరిటాల రవీంద్రకు వ్యతిరేకంగా పనిచేశారు. పెనుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన నాయకురాలిగా ఎదిగి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవీంద్రకు వ్యతిరేకంగా పోటీ చేశారు. అంతేకాకుండా గట్టిపోటీని కూడా ఇవ్వగలిగింది. ఆ తరువాత 2005 జనవరి 24న పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లోనూ పరిటాల సునీతకు వ్యతిరేకంగా పోటీచేయాలని భావించినా టికెట్టు ఆమెకు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో ఆమె పట్టును మరింత పెంచుకోగలిగారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఆమెను ప్రోత్సహించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం తరుపున పోటీచేయాలని భావించారు. టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో సూరికి వరుసకు సోదరుడు అయ్యే సుధీర్‌రెడ్డి స్వతంత్రంగా పోటీచేయాలని నామినేషన్‌ కూడా వేశారు. భర్తను బయటకు తీసుకొస్తామన్న హామీని కాంగ్రెస్‌ పెద్దలు భానుమతికివ్వడంతో ఎన్నికల బరిలోనుంచి తప్పుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు 2009 ఎన్నికల తరువాత సూరికి కారుబాంబు కేసు నుంచి విముక్తి కల్పించారు. సూరి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అయినప్పటి నుంచి భానుమతితో విభేదాలు వచ్చినట్టు సమాచారం. దీంతో సూరి జైలు నుంచి బయటకొచ్చే సమయంలోనూ భానుమతి కనిపించలేదు. ఒక దశలో భానుమతిని చంపేసారన్న ప్రచారం కూడా సాగింది. అయితే పరిటాల రవీంద్ర హత్యకేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకుగాను అనంతపురం జిల్లా కోర్టుకు వచ్చినప్పుడు ఆమె క్షేమంగా ఉందని నిర్ధారణ అయింది. బయటకొచ్చాక కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. సూరి జైలులోనున్న సమయంలో ఎప్పుడూ మద్దెలచెరువులోనున్న భానుమతి ఆ తరువాత నుంచి ఉండటం లేదు. బెంగుళూరులో తన తల్లివద్దే ఉంటున్నట్టు సమాచారం. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో సూరి హత్యకు గురయ్యారు. ఈ విధంగా సూరి జీవతం మొత్తం కుటుంబానికి దూరంగానే గడపాల్సి వచ్చింది.
నమ్మకద్రోహం...?
భానుప్రకాశ్‌పైనే అనుమానాలు
చలసాని పండు తరహాలోనే మద్దెలచెరువు సూరిని నమ్మకమైన వ్యక్తే కడతేర్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్షనిస్టుగా ముద్రపడిన సూరికి అత్యంత నమ్మకమైన వ్యక్తి భానుప్రకాశ్‌. సూరి ప్రతి కదలికా వెనుక భానుప్రకాశ్‌ ప్రమేయముండేది. అనంతపురం నగరం సాయినగర్‌ ఏడవ క్రాస్‌లో నివాసముండే భానుప్రకాశ్‌ తండ్రి పశుసంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండే వాడు. తల్లి రిటైర్డు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు. చిన్న తనం నుంచి కూడా భానుప్రకాశ్‌ అల్లరిచిల్లరిగా తిరుగుతూ రౌడీయిజం చేస్తుండేవాడు. అనంతపురం నగరానికి చెందిన ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి ద్వారా జైలులోనున్న సూరికి అతను పరిచమయ్యాడు. ధర్మవరంలో జరిగిన బాంబు పేలుడు కేసు, పరిటాల రవీంద్రను చంపేందుకు ఐస్‌క్రీం బండిలో బాంబు అమర్చినకేసులో భానుప్రకాశ్‌ నిందితుడిగానున్నాడు. ఇంతేకాకుండా హైదరాబాదులోని అక్రమ ఆయుధాలు అమ్ముతూ పట్టుబడిన కేసులోనూ నిందితుడిగానున్నాడు. సూరి తరుపున జరిగే ప్రతి సెటిల్‌మెంటులోనూ భానుప్రకాశ్‌ ప్రమేయం ఉండేది. ఆయన ద్వారానే సూరి పంచాయతీలు చేయడం వంటివి చేసేవాడు. అనుచరులకు డబ్బులు సమకూర్చడం వంటి ఆర్థిక లావాదేవీలన్నీ భానుప్రకాశ్‌యే చేసేవాడు. జైలులోనున్న సూరిని కలవాలంటే కుటుంబ సభ్యులకు సైతం మొదట భానుప్రకాశ్‌ అనుమతి ఉండాల్సి వచ్చేది. ఈ విధంగా ఎదిగిన భానుప్రకాశ్‌ సూరికి అత్యంత నమ్మకంగా ఉంటూ వచ్చాడు. పరిటాల రవీంద్ర హత్య తరువాత పంచాయతీలు, సెటిల్‌మెంట్లు సూరి పేరు మీద భానుప్రకాశ్‌ మరింత ఎక్కువ చేశాడు. అయితే ఇంత నమ్మకంగానున్న భానుప్రకాశ్‌ను అప్పుడప్పుడు సూరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాడని సమాచారం. ఈ విషయంలోనూ సూరి పట్ల కొంత విముఖతతో భానుప్రకాశ్‌ ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలోనే కొంతకాలం వీరు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలే మధ్యవర్తులు కొంత మంది జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఒక పెద్ద సెటిల్‌మెంటు చేసినట్టు సమాచారం. ఈ సెటిల్‌మెంటు పంపకాల్లో తేడాలొచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సూరిని హతమార్చడానికి కారణమై ఉండవచ్చునన్న సందేహాలు కలుగుతున్నాయి. నమ్మకంగా ఉంటున్న వాడే వెన్నుపోటు పొడిచాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
'అనంత'లో భద్రత కట్టుదిట్టం
రాష్ట్ర రాజధానిలోని మద్దెలచెరువు సూరిని కాల్చి చంపిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లర్లు జరిగే అవకాశాలున్నాయన్న భయంతో దుకాణాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు మూతపడ్డాయి. చనిపోయిన విషయం తెలిసిన అరగంటలోపు జిల్లాలో, ముఖ్యంగా నగరంలో బంద్‌ వాతావరణం నెలకొంది. అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, గుంతకల్లు, రామగిరి, కనగానపల్లి మండలాల్లో పోలీసులు హైఅలర్టు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో బలగాలను మోహరించారు. సూరికి మంచి సంబంధాలున్న ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు కావడంతో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌ సిన్హా ధర్మవరంలోనే ఉండి భద్రతను సమీక్షించారు. ఆర్టీసి బస్సులపై దాడులు జరగకుండా ఉండే విధంగా పోలీసులు భద్రత నడుమ వాటిని డిపోలకు చేర్చారు. అనంతపురం నగరంలోని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇంటి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. వారి బంధువుల ఇళ్ల వద్ద కూడా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.