25, ఏప్రిల్ 2020, శనివారం

న్యూయార్క్‌లో కరోనా విలయానికి కారణం చైనా కాదట..!

న్యూయార్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యమైన అమెరికాపై కొవిడ్ విజృంభిస్తోంది. అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్.. ప్రపంచంలోనే కరోనా వైరస్‌కు అతిపెద్ద హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో కరోనా వైరస్ ప్రబలడంపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆండ్రూ క్యూమో.. న్యూయార్క్‌లో కరోనా ప్రబలడానికి కారణం చైనా కాదని పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి యూరప్ దేశాల నుంచి న్యూయార్క్‌లోకి ప్రవేశించిందని వెల్లడించారు. న్యూయార్క్‌లో మార్చి 1న మొదటి కరోనా కేసు నమొదవ్వడానికి ముందే దాదాపు 10వేల మంది కొవిడ్ బారినపడ్డట్లు ఓ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో వెల్లడైందన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫిబ్రవరి 2నే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాజ్ఙలు విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన నెల తర్వాత యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ట్రంప్ ఆంక్షలు విధించారన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. అమెరిలోకి కరోనా అడుగుపెట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అయితే తాను మాత్రం న్యూయార్క్‌లోకి కరోనా వైరస్ ఇటలీ నుంచి వ్యాప్తి చెందినట్లు నమ్ముతున్నానన్నారు. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 2.77లక్షల మంది కరోనా బారిపడ్డారు. 21వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

మహేష్ నెంబర్ వన్.. 4వ స్థానంలో పవన్

                     
టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానం ఎవరిదీ అంటే ఖచ్చితంగా అందరూ మెగాస్టార్ చిరంజీవిదే అంటారు. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అంటూ బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ ఒక లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ను ఆ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో హీరో మహేష్ బాబుకు నెంబర్ వన్ ప్లేస్ దక్కగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు 4వ స్థానం దక్కింది.

               ఒర్మాక్స్ అనే మీడియా సంస్థ టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ హీరోలపై సర్వే నిర్వహించిందట. ఈ సర్వే ప్రకారం ఒర్మాక్స్ విడుదల చేసిన టాప్ 10 హీరోల లిస్ట్ ఇలా ఉంది. 1. మహేష్ బాబు, 2. అల్లు అర్జున్, 3. ప్రభాస్, 4. పవన్ కల్యాణ్, 5. ఎన్టీఆర్, 6. చిరంజీవి, 7. రామ్ చరణ్, 8. నాని, 9. విజయ్ దేవరకొండ, 10. వెంకటేష్. హీరోకి దక్కిన విజయాలు.. అలాగే కలెక్షన్స్ ఆధారంగా ప్లేస్‌లు నిర్ణయించే ఈ సంస్థ.. మార్చి నెలకు సంబంధించి ఈ సర్వేను నిర్వహించిందట. మరి ఆ లెక్కన చూస్తే.. పవన్ కల్యాణ్‌కు 4వ ప్లేస్ ఎలా వచ్చిందో ఆ ఒర్మాక్స్ అనే సంస్థకే తెలియాలి. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమా చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఆయనకున్న సక్సెస్, కలెక్షన్స్‌ని ఎలా పరిగణనలోకి తీసుకున్నారో అని.. ఈ సంస్థపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. 

                ఇంకా చెప్పాలంటే మార్చిలో సరిగా సినిమాలు విడుదల కాలేదు. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్ సినిమా కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరి అలాంటప్పుడు మహేష్ బాబు ఎలా నెంబర్ వన్ అవుతాడు అనేది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న. ఇంకా మార్చి వరకే ప్రామాణికంగా తీసుకుంటే మార్చి నెలలో రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేసిన వీడియో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలియంది కాదు. ఈ వీడియో ప్రకారం చూస్తే.. చరణ్, ఎన్టీఆర్‌లు టాప్ ప్లేస్‌లో ఉండాలి. ఈ లెక్కన చూసినా.. ఇది అర్థం పర్థం లేని సర్వే అని కొట్టిపారేస్తున్నారు.

23, ఏప్రిల్ 2020, గురువారం

భారత్‌లో కరోనాపై కేంద్రం ఇచ్చిన తాజా అప్‌డేట్

               న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో తాజా పరిస్థితిపై కేంద్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరినట్లు కేంద్రం ప్రకటించింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,454గా కేంద్రం వెల్లడించింది. మొత్తం భారత్‌లో ఇప్పటివరకూ 4,257 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. భారత్‌లోని 12 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాదు, మరో 78 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కొత్త కేసు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతం 19.89గా కేంద్రం ప్రకటించింది.

18, ఏప్రిల్ 2020, శనివారం

‘కలరా’ నిర్మూలనకు చార్మినార్‌


గుర్తు చేసుకుంటున్న నగరవాసులు   
నేడు ప్రపంచ చారిత్రక కట్టడాల దినోత్సవం
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో గోల్కొండ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూ నివర్సిటీ, అసెంబ్లీతోపాటు ఎన్నో చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా నగరం పేరు చెప్పగానే అందరి మదిలో నిలిచేది మా త్రం చార్మినార్‌. రాష్ట్రపటంలో ఉన్న చిహ్నం. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కట్టడ నిర్మాణానికి వెనక ఉన్న గాథ గురించి నగరవాసులు చర్చించుకుంటున్నారు. ప్రపంచ చారిత్రక కట్టడాల దినోత్సవంగా గుర్తించే ఏప్రిల్‌ 18 నేపథ్యంలో చార్మినార్‌ గురించి చర్చ ఎందుకుని భావిస్తున్నారా? చార్మినార్‌ కట్టడ నిర్మాణానికి ముందు మన నగరం అప్పట్లో... ప్రస్తుత పరిస్థితులే ఎదుర్కొందనే విషయం అతి తక్కువ మందికి తెలుసు. 

కలరా వ్యాధి నిర్మూలనకోసం...
చార్మినార్‌ కట్టడ నిర్మాణం క్రీ.శ. 1591లో ప్రారంభమై 1593లో పూర్తయ్యింది. చార్మినార్‌ నిర్మాణం కలరా వ్యాధి నిర్మూలన కోసం ప్రారంభమైంది. 16వ శతాబ్దం చివర్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసి
ఎంతోమంది ప్రాణాలను హరించిన కలరా వ్యాధి నిర్మూలనకు కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఐదోరాజు కులీకుతుబ్‌ షా  నిర్మాణం చేపట్టారు. కలరా వ్యాధి పూర్తిగా సమసిపోయిన తర్వాత చార్మినార్‌ను దాని గుర్తుగా గుర్తించారు. క్రమేఽణా చారిత్రక కట్టడంగా ప్రసిద్ధి గాంచి దేశ విదేశాల నుంచి మన్ననలు అందుకుంది.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

60 శాతం తగ్గిన పెట్రోలు, డీజిల్ అమ్మకాలు

 కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా రవాణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఫలితంగా ఈ నెలలో దేశంలో ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. రికార్డు స్థాయిలో 50 శాతానికి పడిపోయింది. ప్రొవిజనల్ ఇండస్ట్రీ డేటా ప్రకారం.. ఏప్రిల్ తొలి అర్ధ భాగంలో పెట్రోలు అమ్మకాలు 64 శాతం పడిపోయాయి. డీజిల్ విక్రయాలు 61 శాతం క్షీణించాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగమైతే ఏకంగా 94 శాతం పడిపోయింది. కారణం అందరికీ తెలిసిందే. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడమే ఇందుకు కారణం. అయితే, ఒక్క ఎల్పీజీ వినియోగం మాత్రం పెరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 15వ తేదీ మధ్య ఎల్పీజీ వినయోగం 21 శాతం పెరిగింది. ఇక, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం మొత్తంగా 50 శాతానికి పడిపోయింది.

16, ఏప్రిల్ 2020, గురువారం

చక్రం పోయె... ప్రభుత్వ చిహ్నం వచ్చె!

 • సీఎం సమీక్ష బ్యాక్‌డ్రా్‌పలో ఆకస్మిక మార్పు 

 తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ రోజువారీ నిర్వహించే సమీక్ష సమావేశాల్లో పద్మం ఆకారంలో కనిపించే చక్రం మాయమైంది. దాని స్థానంలో తెల్లని రంగుపై రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ప్రత్యక్షమైంది. అధికార ముద్ర హఠాత్తుగా తెరపైకి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ ఆకర్షణీయంగా కనిపించిన బ్యాక్‌డ్రాప్‌ ఒక్కసారిగా మారడంపై సామాజిక మాధ్యమాల్లో పలు కారణాలు షికారు చేశాయి. జ్యోతిషులు చెప్పారని కొందరు ప్రచారం చేయగా, ఈ బ్యాక్‌డ్రాప్‌ సీఎంను డామినేట్‌ చేస్తోందని, అందువల్లే దాన్ని తీసేశారని మరికొందరు వ్యాఖ్యానించారు. దీనిపైౖ ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

15, ఏప్రిల్ 2020, బుధవారం

లాక్‌డౌన్ 2 మార్గదర్శకాలు

            న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కొనసాగింపుపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలు కొనసాగిస్తూ మరికొన్ని జోడించింది. 

ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న గైడ్‌లైన్స్ ఇవే!

 1. విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ 
 2. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్
 3. దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి
 4. గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లలోని  పరిశ్రమల నిర్వహణకు అనుమతి
 5. పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి
 6. నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి 
 7. కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్‌ పవర్‌కు అనుమతి
 8. పట్టణ పరిధిలోని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి
 9. అన్ని రకాల ఈ-కామర్స్‌ సర్వీసులకు అనుమతి 
 10. పబ్లిక్‌లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి
 11. హాట్‌స్పాట్‌లలో నిబంధనలు మరింత కఠినం
 12. హాట్‌స్పాట్‌లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదే
 13. హాట్‌స్పాట్‌లలో జనసంచారం ఉండొద్దు
 14. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
 15. సభలు  సమావేశాలకు అనుమతి లేదు
 16. విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు
 17. మాల్స్‌, సినిమా హాళ్లు, పార్క్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేత
 18. అన్ని రకాల సభలు, సమావేశాలు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌పై నిషేధం 
 19. అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనవద్దు
 20. లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు
 21. కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
 22. 10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం
 23. సోషల్‌ డిస్టెన్స్‌ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం
 24. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి
 25. విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి
 26. వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి
 27. ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదని, 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది. 

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కరోనాపై లెక్కలు బయటపెట్టిన కేంద్రం

              న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం నాటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో.. ఇప్పటివరకూ భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,363కు చేరింది. గత 24 గంటల్లో 117 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా బారిన పడిన వారిలో 1036 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల భారత్‌లో 31 మంది చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. భారత్‌లో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 339 మంది మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది.
         ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ భారత్‌లో 2,31,902 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఐసీఎమ్‌ఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 18,644 శాంపిల్స్‌ను టెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. 2,991 శాంపిల్స్ ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టెస్ట్ చేసినట్లు ఐసీఎమ్‌ఆర్ తెలిపింది. ఐసీఎమ్‌ఆర్ పరిధిలో 166 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, 70 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

12, ఏప్రిల్ 2020, ఆదివారం

ఏపీలో 420కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

             ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఈ మహమ్మారి అంతకంతకు పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఏపీలో ఆదివారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో  420 కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్‌గా తేలినట్లు నిర్ధారించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో 199 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వారిద్వారా 161 మందికి కరోనా సోకిందని చెబుతున్నారు. ఇతరత్రా మార్గాల వల్ల 32 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు.జిల్లాల వారీగా కేసులు ఇవీ.. 
01. కర్నూలు : 84
02. గుంటూరు : 82
03. నెల్లూరు : 52 
04. కృష్ణా : 35
05. ప్రకాశం : 41
06. కడప : 31
07. అనంతపురం: 15
08. చిత్తూరు : 21 
09. తూర్పు గోదావరి : 17
10. విశాఖపట్నం : 20
11. పశ్చిమ గోదావరి : 22 

మొత్తం కేసుల సంఖ్య : 420
డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య : 12

మరణించిన వారు..
ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 07. మరణించిన వారు అనంతపురంలో 02, కృష్ణాలో 02, గుంటూరులో 02, కర్నూలులో ఒకరు మరణించారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో  401 మంది చికిత్స పొందుతున్నారు.

8, ఏప్రిల్ 2020, బుధవారం

భారత్‌ పై ట్రంప్‌ ప్రశంసల జల్లు...

భారత్‌ పై ట్రంప్‌ ప్రశంసల జల్లు...

          అమెరికా : కరోనా వ్యాప్తితో ఛిన్నాభిన్నమవుతున్న తమ దేశ పరిస్థితుల గురించి ఇటీవల మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్‌ తమకు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ ఔషధాల ఎగుమతిపై నిషేధాన్ని విధించిన భారత్‌ మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్రంప్‌ మరోసారి మాట్లాడుతూ... తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.
         ' హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్‌ డోసులు కొన్నాను. దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నాను. భారత ప్రధాని మోడి తో నేను మాట్లాడాను.. భారత్‌ నుంచి మాకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. వాటిని పంపిస్తారా? అని మోడి ని అడిగాను. సానుకూలంగా స్పందించారు. భారత్‌కు కూడా ఆ ఔషధాలు చాలా అవసరం అందుకే వాటి ఎగుమతులను ఆపేశారు ' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
                ఇటీవల మోడి తో మాట్లాడిన ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌ను ఎగుమతి చేయాలని కోరారు. ఆ మరుసటి రోజే భారత్‌ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పాటు పలు ఔషధాల విడుదలపై నిషేధం విధించింది. దీంతో ట్రంప్‌ భారత్‌పై మండిపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ భారత్‌ ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తూ పలు దేశాలకు సరఫరా చేస్తామని ప్రకటించడంతో ట్రంప్‌ మళ్లీ కూల్‌ అయి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.