22, మార్చి 2012, గురువారం

ఉగాదితో శ్రీశ్రీ అనుబంధం

             ఖరనామ సంవత్సరం తీపి, చేదుల్ని మిగిల్చి నందననామ సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. అచ్చమైన పదహారణాల తెలుగువెలుగుకు చక్కటి నిదర్శనం ఉగాది. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్నా సంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకోవడం ఆనవాయితీ. మారుతున్న సమాజంలో మార్పు ఎంత అనివార్యమైనా తెలుగు సంవత్సరానికి స్వాగతం పలకడం సహజం. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, మామిడి తోరణాలతో ఉగాదిని స్వాగతిస్తాం. కవి సమ్మేళనాలతో తెలుగుభాషకు పట్టాభిషేకం చేస్తాం. ఇంతటి విశిష్టత ఉన్న ఉగాదిని మహాకవి శ్రీశ్రీ తన కవితల్లో విభిన్న రీతుల్లో సామాజిక స్పృహను జోడించి స్వాగతం పలికారు. ఉగాది నాటి అనుభూతుల్ని అనుభావాలతో కలిపి కొత్త సిరాతో అక్షర విన్యాసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉగాది సందర్భంగా ఒక్కోసారి ఒక్కోవిధంగా స్వాగతం పలుకుతూ సామాన్యుడి జీవనానికి దగ్గరగా కవిత్వీకరించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సాహిత్య స్థానం ఆయనతోనే సాధ్యమైంది.
''ఈ నూతన సంవత్సరం
నవచేతన సంపత్కరము
యువజీవన శోభావహము
కవితామయ బృందావనము''
అంటూ ఉగాదిని స్వాగతించారు. మానవ జీవితాన్ని మానవీయ విలువలతో కలగలిపి కొత్త టానిక్‌ను తయారుచేసి సమాజానికి అందించారు. రుతువులతో మాట్లాడించడం, తిథులు, నక్షత్రాలతో సాహిత్యాన్ని సృష్టించడం ఆయనకే సొంతం.
''ఇదిగో ఇంకో ఏడాది
ఎవరిదీ ఉగాది?
అడగాలా? ఇది నీదీ నాదీ
మన భావి సుఖాల పునాది''
వంటి సామాజిన స్పృహ కలిగిన గీతాలతో భాషా సాహిత్యాలను ప్రజలకు చేరువ చేయడం ఎవరికి సాధ్యమవుతుంది. శ్రీశ్రీ భాషలోని అంతర్లీన భావాలు, బహిర్గత భావనలు తెలుగు భాషకు జీవం పోశారు.
''ఈ ఉగాది మనకిచ్చేదేది
రోజురోజుకి తెచ్చేదేది
అని వైరాగ్యం ప్రకటిస్తూనే
రోజూ సూర్యున్ని తెస్తుంది''
అంటూ వాసంతిక ఎవరిదీ ఉగాది అనే యుగళ గీతిలో విశ్లేషిస్తారు. సాధారణ కవిగా ఉంటూనే అసాధారణ సాహిత్యాన్ని సృష్టించి ప్రాపంచిక దృక్పథాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఏమూల, ఏ సంఘటన జరిగినా మొదట స్పందించి అక్షర నీరాజనం అందించే మహోన్నత కవి శ్రీశ్రీ.
''ప్రతీక్షణం అనేక మంది పుడుతున్నారు
ప్రతీ దినం అనేక మంది వెడుతున్నారు
గతించినట్టివారి వంతు పావు కాగితం
జనించినట్టి వారి హక్కు గొప్ప స్వాగతం
ఉగాది దేవరా...''
అంటూ ఉగాది దేవర కవితలో విశ్లేషించి వీర వియాత్నం విముక్తి సైన్యాలకు అంకితమిచ్చారు. కష్టజీవికి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రీశ్రీ అని ప్రతి సాహితీవేత్త అనడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుభాషలో ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా శ్రీశ్రీ పేరు ఉచ్ఛరించకుండా కవితల్ని జ్ఞప్తికి తెచ్చుకోకుండా కార్యక్రమం చేస్తే అది ఉప్పులేని వంటకమే. ఉగాది కవి సమ్మేళాన్ని ఈ కింది విధంగా స్వాగతిస్తారు.
''ఉగాది కవి సమ్మేళన
శుభోదయావసరాన
సౌమ్యనామ వర్షానికి
స్వాగతమగు సమయాన''
అంటూ సౌమ్యవాది మ్యానిఫెస్టో కవితలో చెబుతారు. ఈ కవితలో తిరుగుబాటు, చాదస్తం, మానవ స్వాభవం అన్నీ విశ్లేషిస్తూనే..
''మానవులంతా ఒకటని
మనిషి గ్రహించే సుదినం
ఇంతట్లో వచ్చే సూ
చన లేవి కానరావనే''
ఆవేదన చెందుతారాయన. సహజంగా కవిత్వంలో ఉగాది పచ్చడిని వర్ణిస్తూ చేదు, తీపి, పులుపుల కలయికలను, రుతువులను చెప్పడం జరుగుతుంది. కానీ శ్రీశ్రీ అలా కాదు.
''ఎలాగుంది ఉగాది పచ్చడి అని అంటారా
ఓ భేషుగ్గా ఉంది
పత్రిక పొట్లంలోని పాత సాహిత్యం కన్నా బాగానే ఉంది
కొంచెం తియ్యగా ఉంది
చాలా చేదుగా ఉంది
మొత్తం మీద మన జీవితాల్లాగా ఉందంటారు''
ఈరోజు ప్రాంతీయ ఉద్యమాల పేరుతో తెలుగు ప్రజల్ని, భాషా సాహిత్యాలను వేరు చేసే ప్రయత్నాలు ఆరంభించి రాజకీయ పబ్బం గడుపుకునే రోజులొచ్చాయి. వీటిని ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించారాయన.
''తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చచూస్తున్న
పిశాచాలను తరిమి వేస్తున్నా''
అంటూ ఘాటుగా ఉగాది గీతిలో కవితలో గర్జిస్తారు.
ఎన్నో కవితలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రీశ్రీకి తెలుగుపై మమకారం ఉగాది నాడు ఈ విధంగా చూపిస్తారు.
''తెలుగువాడి తెలుగు 'వాడి'
దీపించాలి.
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం
చేరాలంతే
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే''
అన్నారు. ఎన్నో అభిప్రాయాలు ఉగాదిపై చెప్పినా ప్రత్యక్షంగా ఉగాది పండుగపై సామాన్యుడికున్న అభిప్రాయం చెప్పేందుకే ప్రయత్నిస్తారు.
''ఎన్ని ఉగాదులు రాలేదు ఇం
కెన్ని ఉగాదులు పోలేదు
ఎక్కడి దొంగలు అక్కడే
ఎక్కడి గొంగళి అక్కడే''
అంటు ఉగాది స్వగతం కవితలో కపట రాజకీయాలను తిడుతూనే ఉగాది గీతంలో
''ఈ ఉగాది మహోదయ వేళ
ఈ వసంత నవోదయ వేళ
విప్లవ శంఖం పూరించుదాం
విజయ దుందుభి మ్రోగించుదాం''
అంటూ ముగిస్తారాయన.
కెంగార మోహన్‌ - సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కార్యదర్శి

7, మార్చి 2012, బుధవారం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

                   మహిళల హక్కుల కోసం స్త్రీలంతా ఏకమై వందేళ్లక్రితం జరిగిన పోరాటం సాక్షిగా మహిళాదినోత్సవం ప్రంపంచ వ్యాప్తంగా మార్చి 8న జరుపుకోవడం మొదలైంది. 1911 సంవత్సరంలో ఆనాటి మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వందేళ్లక్రితమే మహిళలు పోరాడి అనుకున్నది సాధించారు. నేటిస్త్రీ చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ముందుంది. ఏ రంగంలోనైనా ముందుకు పోగలనని నిరూపించుకుంది. అన్నింటా ధీటుగా సమర్థవంతంగా రాణించి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. అయినా సమాజంలో సమాన గౌరవాన్ని గుర్తింపును పొందలేక పోతున్నారు. నేటికీ మహిళలపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, జరుగుతూనే ఉన్నాయి. యాసిడ్‌ దాడులు, గృహహింస, కట్నపిశాచి, భ్రూణహత్యల పేరిట వారికి అబధ్రత ఎదురవుతూనే ఉంది. స్త్రీని సమాజం ఇప్పటికీ వ్యక్తిత్వం గలదిగా , ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు గల వ్యక్తిగా గుర్తించడం లేదు. విచిత్రం ఏమిటంటే ... రాజకీయాల్లో , వ్యాపారరంగంలో , ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇంటా బయట, ఎక్కడైనా ఆమె శక్తి సామర్థ్యాలు గుర్తిస్తున్నట్లే ఉంటుంది. నిజానికది స్త్రీని సమాజం తమకు అనువుగా వినియోగించుకోవడం తప్ప ఆమెకు సమాన హోదా ఇవ్వడం కాదు. ఇన్ని ప్రతి కూల పరిస్థితుల్లోనూ వ్యక్తిగా నిలదొక్కుకోవాలన్న ఆమె ఆకాంక్షను అణచి వేయడానికి జరుగుతున్న యత్నాలు అనేకం. అవేనేడు ఆమెను వెనక్కు పట్టి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఆమెను చట్రాల్లో పట్టి బందిస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో ఇంతకుమించిన న్యాయం జరుగుతుందన్న ఆశలు లేవు. మరి పరిష్కారం? అందుకు స్త్రీలే పూనుకోవాలి. వివక్షను సవాలు చేయాలి. తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సవాళ్లకు సరయిన రీతిలో సమాధానమివ్వాలి. సాటి మహిళలందరినీ కూడగట్టుకోవాలి. సమస్యలపై సమరశంఖం పూరించాలి. సమైక్య నినాదాన్ని ప్రతిధ్వనింపజేయాలి. సాధికారతను స్వాధీనం చేసుకోవాలి.
ఈ జన్మ ఎంత గొప్పదో...
         స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషించాలి....ఎంతో గర్వపడాలి. పెద్దలను ఎలా గౌరవించాలో , పిల్లలను ఎలా లాలించాలో , సాటి వారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఎంతో ఆదర్శప్రాయమైంది అమ్మ. గిల్లి గజ్జాలు పెట్టుకున్నా. పరుశమైన మాటనోటి వెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచి మాట చెప్పింది అమ్మ. అందరితో కలిసి పోతూ నవ్వుతూ బేషిజాలు లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నేర్పింది నాకు అమ్మ. జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన అమ్మతనం ఎంత గొప్పదో... ఆడజన్మ ఎంత గొప్పదో....

5, మార్చి 2012, సోమవారం

రాష్ట్రీయ ఆరోగ్యనిధిని సద్వినియోగం చేసుకోవాలి

20 సూత్రాల పథకం ఛైర్మన్‌ తులసిరెడ్డి
             క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌ తులసీరెడ్డి సూచించారు. ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్శిటీలో రెండ్రోజులుగా జరిగిన విలేకరుల శిక్షణా సమావేశం సోమవా రం ముగిసింది. కార్యక్రమంలో తులసీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. క్యాన్సర్‌ వ్యాధికి గురైన గ్రామీణ నిరుపేద లు రూ.2లక్షలు రీయింబర్స్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రామీణ విలేకరులు వ్యాధిగ్రస్తుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సమాజానికి మీడియా ప్రాణవాయువు
           ప్రజాస్వామ్యానికి మీడియా ప్రాణవాయువని తులసీరెడ్డి తెలిపారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విలేకరులు నిరంతర విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులను నిరంతర అధ్యయం చేస్తూ వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల పనితీరుతో పాటు వాటి అమలు విధానంపై ప్రెస్‌ అకాడమీ గ్రామీణ విలేకరుల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తోందన్నారు. తిరుమలగిరిసురేందర్‌ కృషిని అభినందించారు. మెరుగైన సమాజం కోసం మీడియా కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ మాట్లాడారు. గతంలో 'సమాచార హక్కు చట్టం-గ్రామీణ విలేకరుల పాత్ర' అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ మీడియా రాజకీయ రంగంపైనే కాక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక రంగాలపైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. రాయలసీమ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సిలర్‌ కృష్ణానాయక్‌, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు తిలక్‌ మాట్లాడారు.

సమాజాన్ని మేల్కొలిపేలా వార్తలు రాయాలి

గ్రామీణ విలేకరులకు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌సూచన
            సమాజాన్ని మేల్కొలిపే విధంగా విలేకర్లు వార్తలను రాయాలని ఎపి ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ తిరుమలగిరి సురేందర్‌ కోరారు. 2012 మార్చి 4,5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు నగర శివార్లలోని రాయలసీమ విశ్వవిద్యాలయం, ఎపి ప్రెస్‌ ఆకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ హాజరయ్యారు. అథితులుగా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌, ఆర్‌యువిసి కృష్ణానాయక్‌, ఏఎస్పీ పద్మాకర్‌రావు, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ అకాడమీ పాలక మండలి సభ్యులు కెబిజి తిలక్‌, డిపిఆర్‌ఓ తిమ్మప్ప పాల్గొన్నారు. మొదట జ్యోతిని వెలిగించి ముఖ్యఅతిథులు శిక్షణా తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ మాట్లాడారు. ఇప్పటి వరకూ 15 శిక్షణా శిబిరాలను పూర్తి చేసి 16వది కర్నూలులో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పత్రికా రంగం వృత్తిలో నైపుణ్య విలువలు పెంపొందిం చేందుకు గ్రామీణ విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి పాటుపడేవిధంగా వార్తలను సేకరించి ప్రజలకు అందిం చాలని ఆయన కోరారు. కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ మాట్లాడుతూ భారతరాజ్యాంగంలో పత్రికా రంగానికి ప్రధాన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్రికలు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కోరారు. సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా విలేకరులు వార్తలు రాయాలని సూచించారు. ఆర్‌యువిసి కృష్ణానాయక్‌ మాట్లాడుతూ పత్రికలు ప్రస్తుతం సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేయాలని కోరారు. పరిశోధనాత్మక వార్తలు, ప్రభుత్వ పథకాలు, మీడియా భాష, తదితర అంశాలపై లెక్చరర్లు విలేకరులకు శిక్షణను అందజేశారు.

2, మార్చి 2012, శుక్రవారం

ప్రజాచైతన్య కరదీపిక పుస్తక సాహిత్యం

ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ పంపాదకులు తెలకపల్లి రవి
          పుస్తకసాహిత్యం ప్రజాచైతన్య కరదీపికలా అసమానతలతో కూడిన వ్యవస్థను ప్రతిఘటించేలా ఉపయోగపడాలని ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కేంద్రం కొత్తబస్టాండు సమీపంలోని సుందరయ్య జంక్షన్‌ మార్కెట్‌ యార్డు మినీకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను శుక్రవారం సిపిఎం సీనియర్‌ నాయకులు టి.నరసింహయ్య ప్రారంభించారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ మేనేజర్‌ ఎ.వెంకటేష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో రవి ముఖ్యోపన్యాసం చేశారు. అభ్యుదయ సాహిత్యాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేలా ప్రజాశక్తి బుకహేౌస్‌ పని చేస్తుందని చెప్పారు. మానవ మస్తిస్కాలకు పదును పెట్టే గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. గ్రంథాలయాల్లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందడం లేదన్నారు. అనంతరం సీనియర్‌ నాయకులు నరసింహయ్య మాట్లాడుతూ నవశక్తి, విశాలాంధ్ర, జనశక్తిగా రూపాంతరం చెందుతూ ప్రజాశక్తిగా మారిందన్నారు. ప్రజాశక్తితో తనకు చాలా అనుబంధముందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సాహిత్య కేంద్రంగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఉండాలన్నారు. మార్క్సిస్టు సాహిత్యంతోపాటు సమాజ పరిణామం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించే పుస్తకాలు జిల్లా ప్రజలకు అందించా లని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్‌ లలిత మాట్లాడుతూ ప్రజల అభివృద్ధ్ధికి అనుగుణంగా ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలను ప్రజాశక్తి బుకహేౌస్‌లో ఉంచాలని సూచించారు. అభ్యుదయ సాహిత్యంతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఉస్మానియా కళా శాల విశ్రాంత అధ్యా పకులు వెంకట్రామిరెడ్డి, ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌చార్జి పి చంద్రయ్య, జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు పాల్గొన్నారు.