8, ఆగస్టు 2021, ఆదివారం

బహుజనులు పాలకులుగా మారాలి


నల్గొండ 'రాజ్యాధికార సంకల్ప సభ' లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
రాంజీ గౌతమ్‌ సమక్షంలో బిఎస్‌పిలో చేరిక

          నల్గొండ: బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని మాజీ ఐపిఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకొనే దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర నల్గొండ పట్టణంలోని ఎన్‌జి కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బిఎస్‌పి జాతీయ కోఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్‌ సమక్షంలో ప్రవీణ్‌కుమార్‌ బిఎస్‌పిలో చేరారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా రాంజీ గౌతమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని వారి కోసమే తాను ఉద్యోగాన్ని వదులుకున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని.. కేవలం పాలకులే ఉంటారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. సిఎంకు దళితులపై ప్రేమ ఉంటే ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. 'పేదలకు వైద్యం, విద్య, ఉపాధి, నైపుణ్యం కావాలి, గురుకుల పాఠశాలల ద్వారా కేవలం నాలుగు లక్షల మందికే విద్య అందుతోంది. 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారు. పేదలు చదివే యూనివర్సిటీల్లో 3 నుంచి 4 ఏళ్లుగా నియామకాలు లేవు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుల కోసం తాపత్రయపడుతున్నారు. మరి ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో రిజర్వేషన్‌ ఎందుకు పెట్టలేదు? ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా?' అని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.                                                                                                                                            

బహుజనులకు సూటిప్రశ్న
               కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. 'రాజ్యాధికార సంకల్ప సభ'లో ఆయన బహుజన సమాజంలో మనం బానిసలం కాదు పాలకులమని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ జన సునామీని ఎవరూ ఆపలేరని చెప్పారు. సీఎం కెసిఆర్‌ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారెందుకు? అని ప్రశ్నించారు. ఆ డబ్బులు.. గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసి.. ఆదివాసీ బిడ్డలు అడవుల్లో నుంచి తేనె సేకరించి సంపాదించిన డబ్బులేనని తెలిపారు. ''మీకు మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులు అమ్మి డబ్బులు ఖర్చు చేయండి. మా కష్టార్జితాన్ని మేమే నిర్ణయించుకునేలా చేయండి. తమ కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మరి ప్రైవేట్‌ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు? అని ఆర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో మరో పార్టీ క్రియాశీలకంగా మారనుందనే చెప్పాలి. ఇప్పటికే వైఎస్‌ షర్మిల తన పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
బిఎస్‌పి జాతీయ కోఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్‌ సమక్షంలో ప్రవీణ్‌కుమార్‌ బిఎస్‌పిలో చేరిక