3, మార్చి 2011, గురువారం

ఆయనకు నిజంగా తెలంగాణా మీద ప్రేముందా?

దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలంగాణాపై నిజంగా ప్రేముందా? మంత్రి పదవి అంతగా ఆదాయం వచ్చేది కాదని అప్పుడే నిరసన తెలిపిన మంత్రి ఇంకేదైనా పెద్దపదవి ఆశించి రాజీనామా చేశారా? తెలంగాణాలో భవిష్యత్తులో రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని రాజీనామా చేస్తానంటున్నాడా? అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి. నిజంగా ఆయనకు తెలంగాణామీద లేదా వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లా మీద లేదా ఆయన సొంతనియోజకవర్గం కొల్లాపూర్‌ మీదయినా అభిమానం ప్రేమ ఉందా? . ఉంటే ఇప్పటివరకు ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఇంకా అనేక ఇబ్బందులున్నాయి. మరి ఎందుకు పట్టించుకోలేదు. వెనుకబడిన నియోజకర్గంలో ఒక్క కళాశాలస్థాపించారా? స్కూలు ఏమయినా ఏర్పాటు చేశారా?. మూడు సార్లు ఎమ్మెల్యే అయి తెలంగాణాలో ఏమి ఉద్దరించారాయన. గత నెలలో తెలంగాణా ప్రాంతం మంత్రులుగా ఉన్నవారు ప్రత్యేక సమావేశమయ్యారు. ఆ ప్రత్యేక సమావేశంతో ఒకరిద్దరు మినహా అందరూ రాజీనామా చేయాలనుకున్నారు. మరి ఎందుకు ఒక్కరే రాజీనామా చేశారు. ఎంపీ కావూరి సాంబశివరావు చేసిన విమర్శలకు స్పందించి రాజీనామా లేక పంపారా?. నిజంగా రాజీనామా చేసే వాడయితే తెలంగాణా రావాలనుకుంటే రాజీనామాను గవర్నర్‌కు ఇవ్వకుండా సోనియాకు ఎందుకు పంపారు. ఈ బెదిరింపు లేఖకు సోనియా గాంధీ స్పందిస్తుందా? . చిదంబరం కరుణిస్తారా?.ఏమయ్యేదుంది.2013 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరని కూడా జూపల్లికి కూడా తెలుసు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సోనియాకు పంపిన లేఖలో జూపల్లి డిమాండ్‌ చేశారు. లేకుంటే గవర్నర్‌కు అధికారికంగా లేఖ అందించి రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడ్తానని చెప్పారు. రాజీనామా ఆమోదం పొందేవరకు పదవిలోనే కొనసాగుతానని, విధులకు హాజరవుతానన్నారు. రాజీనామా విషయాన్ని జూపల్లి కృష్ణారావు గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సోనియాకు పంపాల్సిన రాజీనామా లేఖపై సచివాలయంలో తన అనుచరులతో మధ్యాహ్నం వరకు చర్చించారు. సభ వాయిదా పడిన తరువాత అసెంబ్లీలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి రాజీనామా విషయాన్ని చర్చించారు. సిఎంతో 20 నిమిషాలకు పైగా చర్చించిన తరువాత జూపల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగానే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి చిదంబరం 2009 డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన ప్రకటన చేయడం, తరువాత దానిపై అదే నెల 23న వెనక్కు తీసుకోవడం, ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన రాజకీయ పరిణామాలను జూపల్లి వివరించారు. విద్యార్థుల ఆత్మహత్యలు తనను ఎంతగానో కలచివేశాయని, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడే రాజీనామా చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు ఏడాది పాటు నిరీక్షించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు పెట్టి నిర్ధిష్ట ప్రకటన చేయాలన్నారు. లేకుంటే రాజీనామా చేస్తామని అధిష్టానానికి గతంలోనే లేఖ రాశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితిని సోనియాకు తెలిసేందుకు అన్ని విషయాలను లేఖలో చేర్చినట్లు చెప్పారు. 'తెలంగాణ ఉద్యమాల గడ్డ, 50 ఏళ్ల నుండి ఉద్యమం నడుస్తోంది. 1969లో 300 మందికిపైగా చనిపోయారు. ఇప్పుడు 600 మంది మృతిచెందారు. తెలంగాణ సాధన కోసం ఒకపక్క ఉద్యమాలు, ఉద్యోగుల సహాయ నిరాకరణ, రైల్‌రోకోలు, బంద్‌లు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మరోవైపు అన్నిపార్టీల తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. తెలంగాణాలో అన్నివర్గాల ప్రజలు పోరాడుతుంటే తాము అసెంబ్లీలో గుడ్లప్పగించి చూడటం సరికాదు. మాకూ చీమూ, నెత్తురూ, పౌరుషం ఉంది. అందుకే తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమయ్యా' అని జూపల్లి ఆవేశంగా అన్నారు. పదవుల్లేకుండా అరగంట కూడా ఉండలేమని కొంతమంది సీమాంధ్ర ప్రాంత నేతలు అంటున్నారు. నోరుంది కదాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారే తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చిదినందునే సోనియాకు రాజీనామా లేఖ పంపానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణాపై అధిష్టానం ఏ నిర్ణయమూ ప్రకటించని పక్షంలో తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందిస్తానన్నారు. ఆత్మ ప్రభోదానుసారం తానొక్కడినే రాజీనామా చేశానన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకముందన్నారు.