4, డిసెంబర్ 2011, ఆదివారం

అవిశ్వాసం అధికార కాంగ్రెస్‌కే అనుకూలం?!

             ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సమస్యలను పక్కనపెట్టి బలనిరూపణకు సిద్ధమయ్యారు. చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో పాదయాత్రలు చేశారు. రైతుల కోసం అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు. దాని ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెగ్గాలంటే 294 శాసన సభ్యులలో 147 మ్యాజిక్‌ సంఖ్య అవసరం. ఈమ్యాజిక్‌ సంఖ్యలో కూడా ఒకరు చనిపోవడం కొందరు రాజీనామా కారణంగా మారనుంది. టిడిపికి 90 మంది సభ్యులు ఉండేవారు. ఇటీవల ముగ్గురు దూరమయ్యారు. టిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం తదితరులను కలిపి 21, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీల నుంచి 27 మంది జగన్‌కు జై కొట్టారు. ఈ మధ్య ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లారు. ఇవన్నీ కలిపినా 141 మంది సభ్యులు మాత్రమే అవుతున్నారు. మరో ఆరుగురు సభ్యులను కూడగడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండేది. కానీ ఇంతలోనే సీను రివర్స్‌ అయ్యింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జగన్‌ సిబిఐ కేసులో ఇరుక్కుని పీకల్లోతు కష్టాల్లో పడటంతో ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు జ్ఞానోదయమయినట్లుంది. వారు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. కారణాలడిగితే 'యువకిరణాలు' తదితరాల పేర్లు చెబుతున్నారు. కాబట్టి ఆవిశ్వాసానికి కావల్సిన మ్యాజిక్‌ సంఖ్యను కూడగట్టం కష్టమే అనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కరువు, అధిక ధరలు, ప్రత్యేక తెలంగాణా , పెండింగు ప్రాజెక్టులు, రైతుల సమస్యలు ప్రస్తావించడానికి అస్త్రాలు సిద్దం చేసుకున్నాయి ప్రతిపక్షాలు. కాని అధికార పక్షం చాకచక్యంగా వ్యవహరించి సభా సమయాన్ని ఐదు రోజులకే కుదించారు. ఇందులో కూడా అనవసర విషయాలతో కాలయాపన చేయడం ఎపి శాసన సభ్యులకు కొత్తేమి కాదు. యువకిరణాల పేరుతో ఉద్యోగాలిస్తామని, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కిరణ్‌కుమార్‌ ప్రభుత్వం హామీల వర్షం కురిపించడానికి ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేల నెంబర్‌ గేమ్‌ మొదలైంది. అవిశ్వాస తీర్మానంపై సోమవారం (2011 డిసెంబర్‌ 5న) చర్చ జరగనున్న నేపథ్యంలో తమ వారెవరు, పరాయి వారెవరు అన్న లెక్కల్లో అధికార, ప్రధాన ప్రతిప్రక్షాలు బిజీగా ఉన్నాయి. ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు, మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్‌, టిడిపి, జగన్‌ గ్రూపు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ తాయిలాలను ఎర వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. జగన్‌ సైతం తన వెంట ఉన్నవారికి పలు 'హామీలు' ఇచ్చినట్లు చెబుతున్నారు. తమకు గుర్తింపు ఇవ్వట్లేదని అసంతృప్తిగా ఉన్న పిఆర్‌పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పలు 'వాగ్దానాల'తో బుజ్జగించింది. ఆదివారం(డిసెంబర్‌ 4న) కరువుపై చర్చ తర్వాత అవిశ్వాసంపై చర్చను లాంఛనంగా ప్రారంభించాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు. కరువుపై సాయంత్రం ఆరున్నర వరకు సుదీర్ఘంగా చర్చ జరగడంతో అవిశ్వాసంపై చర్చను చేపట్టలేదు. దీంతో సోమవారమే చర్చ, ఓటింగ్‌ జరగనుంది. ఉదయం తొమ్మిది గంటలకు అవిశ్వాసంపై చర్చను ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రారంభించనున్నారు. బొత్స, ఢిల్లీ నుండి గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ రంగంలోకి దిగి పిఆర్‌పిని బుజ్జగించి తమ వైపు ఉండేలా చర్యలు తీసుకున్నారు. జగన్‌ తమ గ్రూపు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాలని నిర్ణయించారు. జగన్‌ నిర్వహించిన సమావేశంలో 19 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఓటింగ్‌ దగ్గరకొచ్చే సరికి ఆ సంఖ్య తగ్గుతుందని, కనీసం 15 మంది అవిశ్వాసాన్ని బలపరుస్తారని తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం అసెంబ్లీకి వస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తామన్నారు. ఈ మేరకు ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. వామపక్షాలు అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయించాయి. మరో పక్క తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని టిఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనమయింది. కాబట్టి చిరంజీవి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతున్నారు. ఏదేమైనా ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రహసనం తప్ప ప్రజలకు మేలు చేసేది మాత్రం కాదు. సభ్యులంతా చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజల సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

1, డిసెంబర్ 2011, గురువారం

ఎఫ్‌డిఐని వ్యతిరేకిద్దాం

             రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐని వ్యతిరే కించి, చిల్లర వర్తకులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ అన్నారు. బుధవారం కర్నూలు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో ప్రజాశక్తి ఆధ్వర్యంలో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకి స్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య అధ్యక్షత వహించారు. ఎంఏ గఫూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిరుద్యోగులకు కోట్ల ఉద్యోగాలు విదేశీ పెట్టుబడుల వల్ల లభిస్తాయని మోసపూరిత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిటైల్‌ రంగంలో చిల్లర దుకాణాలు పెట్టుకుని కోట్లాది మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎఫ్‌డిఐ దేశంలో ప్రవేశిస్తే వీదేశాలు పెట్టుబడులు పెట్టడం వల్ల వారి పెత్తనంతో పాటు ఆదాయాలు కూడా వారికే పోతాయన్నారు. ప్రధాని వీటి ద్వారా ఉపాధి కలుగుతుందని చెప్పడం బూటకమన్నారు. ఎఫ్‌డిఐ ప్రవేశం వల్ల భారతదేశ వస్తు ఉత్పత్తి పరిశ్రమలు దెబ్బతింటాయన్నారు. వీటితో పాటు వ్యవసాయరంగం కూడా వారి ఆధీనంలోకి వెళ్తుందని తెలిపారు. దేశ నవనాడులన్నీ విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతున్నాయని చెప్పారు. ఇలా ఒక్కో రంగంలో ప్రవేశిస్తూ పత్రికా రంగంలో ప్రవేశించనుందన్నారు. పాలకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని తెలిపారు. రిటైల్‌ రంగాన్ని కాపాడుకునేందుకు గురువారం చేపట్టే బంద్‌కు అందరూ సంఘీభావం తెలపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ఈసమావేశంలో టిడిపి జిల్లా నాయకులు ఆకెపోగు ప్రభాకర్‌,సిపిఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయి, బిజెపి నాయకులు దామోదర్‌రెడ్డి, సమాజ్‌వాది పార్టీ నాయకులు శేషుఫణి, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌శర్మ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్‌బాబు, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు లక్ష్మణ్‌, చిన్న వ్యాపారుల సంఘం నాయకులు షరీఫ్‌, వ్యాపారులు సుధాకర్‌, ప్రకాష్‌, ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు, ప్రతినిధి బి.గోరంట్లప్ప, సిబ్బంది సుజాత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.