22, డిసెంబర్ 2023, శుక్రవారం

ఈ ఏడాదిలో క్రైం రేటు పెరిగింది : హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి


తెలంగాణ : 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం మేర పెరిగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్‌ నిమజ్జనోత్సవం, మిలాద్‌ ఉన్‌ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు.

ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి : సిపి

ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని సిపి వివరించారు. మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. సైబర్‌ నేరాలు 11 శాతం పెరిగాయన్నారు. గతేడాది సైబర్‌ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారని తెలిపారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయన్నారు పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కఅషి చేస్తోందని చెప్పారు. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని, డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిపర్‌ డాగ్స్‌ను వినియోగిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని సిపిఎం తెలిపారు.

పబ్స్‌ తెరిచే ప్రసక్తే లేదు : సిపి

కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డిఎట్టి పరిస్థితుల్లో తిరిగి పబ్స్‌ ఓపెన్‌ చేయించే ప్రసక్తి ఉండదు అని సిపి స్పష్టం చేశారు. న్యూ ఇయర్‌ రోజు ఎవరైనా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్‌, పబ్‌ లకు అనుమతి ఉందని హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 12.30 గంటల నుంచే కష్టమర్లను బయటకి పంపాలన్నారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్‌ సేవించినా, సప్లై చేసినట్లు తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సిపి హెచ్చరించారు.

5, డిసెంబర్ 2023, మంగళవారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి


డిసెంబర్‌ 7న ప్రమాణస్వీకారం

                   తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టబోతోంది. రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన బిఆర్‌ఎస్‌ పార్టీపై వ్యతిరేకతో.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకమో కానీ.. ఈసారి హస్తం పార్టీకే ఓటరు జై కొట్టారు. ఈ సమయంలోనే.. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే సిఎం అభ్యర్థి ఎవరూ అన్న చర్చ జరుగుతుండగా.. ఎక్కువగా వినిపించిన పేరు అనుముల రేవంత్‌ రెడ్డి. అటు అధిష్ఠానం తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరబోతోంది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిది. 2023 డిసెంబర్‌ 7న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంగా వినిపించిన ఒకే ఒక్క పేరు రేవంత్‌ రెడ్డి. పార్టీ గెలిచినప్పటి నుంచి అధిష్ఠానం మనసులో కూడా అదే పేరు ఉన్నా.. బయటకు చెప్పలేక తచ్చాడుతున్న సమయంలోనూ.. రాష్ట్రమంతా ముక్తకంఠంతో తమకు రేవంత్‌ రెడ్డే సీఎం అని... మిగితా ఎవ్వరు వచ్చినా ఒప్పుకోమన్న రీతిలో తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే.. రేవంత్‌ రెడ్డిపై అటు అధిష్ఠానానికి, ఇటు రాష్ట్ర ప్రజానికానికి అంత నమ్మకమేంటీ.. సీఎంగా రేవంత్‌ రెడ్డే ఎందుకు.. ఆయనకున్న అర్హత లేంటీ అన్న చర్చ నడుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి జడ్పీటీసీగా గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన ఓ సాధారణ వ్యక్తి ఏదో ఓ రోజు సిఎం అవుతానని ఆరోజే కలగన్నాడు. ఇప్పుడు ఆయన కోరుకోకపోయినా.. అటు అధిష్ఠానం, ఇటు ప్రజలు ఆయనే కావాలని బలంగా నమ్ముతున్నారంటే.. ఆయనలో ఏదో ఉంది.. అదేంటీ..?
        సీఎం కావాలన్న లక్ష్యం 17 ఏళ్ల క్రితమే..: 1969లో జన్మించిన రేవంత్‌ రెడ్డి.. ఎవి కాలేజీలో బిఎ చదివారు. ఆ సమయంలోనే.. ఎబివిపి తరపున స్టూడెంట్‌ లీడర్‌గా యాక్టీవ్‌ రోల్‌ ప్లే చేశారు. కట్‌ చేస్తే.. 2006లో మిడ్జిల్‌ మండలం జడ్‌పిటిసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి గెలిచారు. అనంతరం.. 2007లో మాహబూబ్‌ నగర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచారు. ఆయన చురుకుదనం చూసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి పసుపు కండువా కప్పితే.. మరింత ఉత్సాహంతో పని చేశారు. 2009లో టిడిపి  తరపున కొడంగల్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు చాలా దగ్గరైపోయి.. పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2014లో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి ఫ్లోర్‌ లీడర్‌గా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించారంటే.. ఆయనకున్న కమిట్‌మెంటే కారణం.
            ఆ ఒక్క అరెస్టుతో మారిపోయిన సీన్‌:  ఇక.. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ కావటంతో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే.. రేవంత్‌ ఏమాత్రం భయపడకుండా.. ఇదంతా కేసీఆర్‌ అండ్‌ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే.. కెసిఆర్‌్‌ను సిఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ అతిథిగా వచ్చి వెళ్లటం లాంటి ఘటనలతో తీవ్రంగా బాధపడిన రేవంత్‌ రెడ్డి.. ఏమాత్రం కుంగిపోలేదు. వేరే నేతలైతే తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో.. ఎక్కడో ఓ పాయింట్‌లో సరెండర్‌ అయిపోయే వారేమో. కానీ.. రేవంత్‌ రెడ్డి మాత్రం అర్జున్‌ రెడ్డి టైపులో మరింత అగ్రెస్సివ్‌గా మారిపోయారు.
                      టిడిపి వద్దనుకుంది.. హస్తం కావాలనుకుంది: జైలుకు వెళ్లి బెయిల్‌ మీద రిలీజ్‌ అయిన తర్వాత.. సీన్‌ మొత్తం మారిపోయింది. ముందు నుంచీ కొంత అగ్రెస్సిన్‌ నాయకుడిగానే పేరున్న రేవంత్‌.. ఆ తర్వాత తన మాటల్లో, విమర్శల్లో పదును పెంచారు. మైక్‌ పట్టుకుంటే చాలు కెసిఆర్‌తో పాటు ఆయన ఫ్యామిలీ మీద పరుష పదజాలంతో శివాలెత్తి పోయేవారు. సొంతంగా సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేసుకుని తన ఇమేజ్‌ను గణనీయంగా పెంచుకోగలిగారు. అదే సమయంలో.. తెలంగాణలో టిడిపి బలహీనపడిపోవటం.. ఎమ్మెల్యేలంతా సైకిల్‌ దిగి కారెక్కటంతో.. రేవంత్‌ ఒంటరిగా మిగిలిపోయారు. మరోవైపు.. చంద్రబాబు కూడా తెలంగాణపై అంతగా దృష్టి పెట్టకపోవటంతో ఆయన భవితవ్యం శూన్యంగా మారింది. అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టాలని ఆయన అభిమానులు కోరగా.. అప్పటికే బలహీనమైపోతున్న కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌తో టచ్‌లోకి వచ్చారు. ఈ విషయం బాబుకు తెలియటంతో.. ఆయణ్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.
                  ఏడాదిలోనే సీనియర్లకు పోటీగా: ఇంకేముంది.. హస్తంతో రేవంత్‌ దోస్తీ కుదిరిపోయింది. 2017 అక్టోబర్‌ 30న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా భుజాన వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రేవంత్‌.. పొలిటికల్‌ కెరీర్‌ మరింత పుంజుకుంది. ఆయన వాగ్ధాటితో అధికార బిఆర్‌ఎస్‌ నేతలపై.. ముఖ్యంగా కెసిఆర్‌ మీద బలమైన విమర్శలు చేస్తూ.. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకుని.. ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తన చురుకుదనం, అగ్రెస్సివ్‌నెస్‌తో పార్టీలో చేరిన ఏడాదికే అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. దీంతో.. టిపిసిసి అధ్యక్షుని రేసులో ఇద్దరు సీనియర్ల సరసన నిలిచారు. కానీ.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికే అధిష్ఠానం పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.
             పార్టీని జీరో నుంచి హీరోగా మార్చి: కానీ.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ పరాభవమే మూటగట్టుకుంది. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి సైతం ఓడిపోయారు. దీంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన లోక్‌ సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొంది తిరిగి తన సత్తా చాటారు. ఎంపీగా గెలవటంతో.. డిల్లీి నేతలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు రేవంత్‌కు మంచి అవకాశంగా మారింది. దీంతో.. 2021లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని తప్పించి.. టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. అందుకు కారణం.. యువనేత, అగ్రెస్సివ్‌ స్పీచులతో ప్రజలను ఆకట్టుకుంటూ మాస్‌ లీడర్‌గా పేరుతెచ్చుకోవటం, ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉన్న పార్టీకి ఊపిరిలూదేందుకు కావాల్సిన స్ట్రాటజీలున్న నేతగా గుర్తించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుతారు. ఇక అప్పటి నుంచి రేవంత్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.
               ఆర్టిస్టు నుంచి సిఎం దాకా : రేవంత్‌ రెడ్డి 1969, నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నా ఆర్ట్స్‌ లో సాధన చేశారు. ఆర్టిస్టు నుంచి ముఖ్యమంత్రి దాకా అనేక ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సారథిగా వెలుగొందుతున్నాడు. ప్రజలకు మంచి చేసి చిరస్థాయిగా నిలుస్తాడని ఆశిద్ధాం.


24, అక్టోబర్ 2023, మంగళవారం

నంద్యాల తొలి ఎమ్మెల్యే మల్లు సుబ్బారెడ్డి

                     

నంద్యాల మొదటి ఎమ్మెల్యే అయిన మల్లు రామసుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు ఉమ్మడి జిల్లా పాణ్యం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఒక సోదరి. మల్లు సుబ్బారెడ్డి ఎస్‌ఎస్‌ఎల్‌ సి వరకు నంద్యాల ఎస్‌పిజి హై స్కూల్‌లో ఆ తరువాత ఇంటర్మీడియట్‌ , డిగ్రీ అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో చదివారు. తర్వాత 'లా' డిగ్రీ మద్రాసు 'లా 'కాలేజ్‌ లో పూర్తి చేసి నంద్యాలలో న్యాయవాద వృత్తి చేపట్టారు.1941 సంవత్సరంలో బ్రిటీష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని మూడు నెలలు బళ్లారి సెంట్రల్‌ జైలులో గడిపి తరువాత 1942 సంవత్సరం నుండి 1944 వ సంవత్సరం వరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు వెల్లూరు, తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. స్వాతంత్య్ర వచ్చిన తరువాత 1952వ సంవత్సరంలో స్వాతంత్రం తొలి శాసనసభ ఎన్నికల్లో మల్లు సుబ్బారెడ్డి నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1954వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎత్తివేయాలని ఓటింగ్‌ నిర్వహించింది. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మల్లు సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పినా మల్లు సుబ్బారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయమని అడిగినా తిరస్కరించి మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ ఒక్క ఓటుతో ప్రభుత్వం పడి పోయింది. మరలా 1955వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. మరలా 1962వ సంవత్సరంలో నంద్యాల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 1967 వ సంవత్సరము వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1968 డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. మల్లు సుబ్బారెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడైన మల్లు రామచంద్రారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ నంద్యాలలో మెడిసేవా డయాగ్నోసిస్‌ సర్వీసెస్‌ ఎండిగా కొనసాగుతున్నారు.

13, ఫిబ్రవరి 2023, సోమవారం

220 జంటలకు సామూహిక వివాహం

         
  నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. ఎంజెఆర్‌ ట్రస్ట్‌ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆ ధ్వర్యంలో నాగర్‌కర్నూలు జిల్లాపరిషత్‌ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై 220 జంటలు ఒక్కటయ్యాయి.

             తెలంగాణరాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం(12-02-2023) సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. మర్రిజనార్దన్‌రెడ్డిచారిటబుల్‌ ట్రస్ట్‌ (ఎంజెఆర్‌) అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్‌ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై 220 జంటలు ఒక్కటయ్యాయి. హిందూ, ముస్లిం, క్రిష్టియన్లకు వారి సంప్రదాయ పద్ధతుల్లో వివాహాలు జరిపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమునారాణి పెండ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఓవైపు లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, మరోవైపు జంటలకు ఒకేసారి వివాహాలు జరిపించారు. సినిమా సెట్టింగ్‌ను తలపించేలా భారీగా వేసిన మండపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అతిథులుగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వేడుకను తిలకించారు. వచ్చిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. కొత్త జంటలకు పెండ్లికి ముందు పట్టువస్త్రాలు, బంగారు తాళి, మెట్టెలు అందించారు. తరువాత బీరువా, మంచం, బెడ్‌, దిండ్లు, ట్రావెలింగ్‌ బ్యాగ్‌, టేబుల్‌ ఫ్యాన్‌, మిక్సీ, కుక్కర్‌, వంటసామగ్రిని బహూకరించారు. సాయంత్రం నూతన జంటలను డిజె డ్యాన్స్‌ల మధ్య అప్పగింతల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయి చందు, కలెక్టర్‌ ఉదరుకుమార్‌ పాల్గన్నారు.










4, ఫిబ్రవరి 2023, శనివారం

బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం

 

Feb 04,2023 07:55

ఏళ్ళ తరబడి, గౌతమ్‌ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి. బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరు పై మీడియాలో, వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ, వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్‌బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా సంస్థలు కానీ స్పందించిన దాఖలాలు లేవు.

           అమెరికాకు చెందిన అతి చిన్న మదుపరుల సంస్థ భారతదేశంలోని అతి పెద్ద, శక్తివంతమైన అదానీ గ్రూప్‌ను సవాలు చేసి, దాని పునాదులనే కదిలించేేసింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి అనే ఈ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ అదానీ గ్రూపుపై 129 పేజీలతో నివేదిక వెలువరించింది. అదానీ గ్రూపునకు చెందిన ఏడు కంపెనీలతో సంబంధమున్న 578 అనుబంధ సంస్థల, షెల్‌ కంపెనీల నిధుల సేకరణ కార్యకలాపాలు, దేశం వెలుపల సాగించే కార్యకలాపాల గురించి అనేక ఆధారాలను అందులో పొందుపరిచింది. ఇది 'కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద మోసం'గా హిండెన్‌ బర్గ్‌ నివేదిక పేర్కొంది.
         నిధులు, బూటకపు కంపెనీల సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఈ నివేదిక బయటపెట్టింది. ఈ షెల్‌ కంపెనీల్లో కొన్ని మారిషస్‌లో, సైప్రస్‌లో, యుఎఇలో వున్నాయి. లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేయడానికి తెలివిగా ఈ డొల్ల కంపెనీలను ఉపయోగించారు. అధిక రుణాలు, అంతంతమాత్రం ఆస్తులు మాత్రమే ఉన్న ఈ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉందని, రుణాలను చెల్లించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పుకునేందుకు లిస్టెడ్‌ కంపెనీల ఆస్తి అప్పుల పట్టీ (బ్యాలన్స్‌ షీట్‌)లను చూపించారు. వాటికి డబ్బును మళ్లించడానికి ఈ డొల్ల కంపెనీలను వాడుకున్నారు. అదానీ కంపెనీల విలువను వాస్తవిక రేటు కన్నా దాదాపు 85శాతం ఎక్కువ చేసి చూపారని ఆ నివేదిక అంచనా వేసింది. స్టాక్‌ మార్కెట్‌లో దారుణమైన అవకతవకలకు పాల్పడుతూ, అకౌంటింగ్‌లో పెద్దయెత్తన అక్రమాలకు పాల్పడడం ఇదంతా అదానీ గ్రూపు ఒక పక్కా పథకం ప్రకారం చేసిన చర్యగా హిండెన్స్‌బర్గ్‌ నివేదిక ఆరోపించింది.
         హిండెన్‌బర్గ్‌ నివేదికను 'భారత్‌పై ఒక పథకం ప్రకారం జరిగిన దాడి' అంటూ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. అయితే, తన వాదనను సమర్ధించుకోవడానికి అది ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. జాతీయవాదం ముసుగులో తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అది ప్రయత్నించింది. ''భారతదేశ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, వృద్ధి కథనం, వడివడిగా అడుగులు వేయాలన్న భారత్‌ ఆకాంక్షను చూసి సహించలేకనే ఈ రకమైన దాడి'' చేస్తున్నారని గావు కేకలు పెడుతోంది.
          హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం వెంటనే కనిపించింది. నివేదిక వచ్చిన తరువాత వారంలోనే అదానీ గ్రూపు 6,700 కోట్ల డాలర్లను లేదా స్టాక్‌ మార్కెట్‌లో దాదాపు రూ.5.6 లక్షల కోట్ల మార్కెట్‌ పెట్టుబడులను నష్టపోయింది. గౌతమ్‌ అదానీ తన సంపదలో 5వేలకోట్ల డాలర్ల మేరకు నష్టపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తిగా వున్న అదానీ ఒక్కసారిగా 15వ స్థానానికి పడిపోయారు.
        అదానీ గ్రూపు సంపదలో చాలా వరకు దేశ సహజ వనరులను అనేక ఏళ్లుగా లూటీ చేస్తూ, ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడం ద్వారా సమకూర్చుకున్నదే. అందువల్లే అదానీ గ్రూపు మోసపూరిత లావాదేవీలపై ప్రజలు ఇంతగా ఆందోళన చెందుతున్నారు. అదానీ గ్రూపు ఓడరేవులు, విమానాశ్రయాలకు సంబంధించి అతిపెద్ద ప్రైవేట్‌ ఆపరేటర్‌గా అవతరించింది. ఆహార ధాన్యాల గిడ్డంగుల్లో అతిపెద్దదిగా వుంది, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌లో అయిదోవంతు భాగాన్ని కలిగి ఉంది, సిమెంట్‌ పరిశ్రమను శాసిస్తుంది.బొగ్గు తవ్వకాల్లో అతిపెద్ద వాటా కలిగి దేశంలోనే అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ ప్రైవేటు ఉత్పత్తిదారుగా అదానీ గ్రూపు వుంది. మోడీ ప్రభుత్వ చలవతోనే అదానీ ఇంత వేగంగా ఎదిగాడనేది నిర్వివాదాంశం.
         జాతీయ బ్యాంకుల నుండి రుణాలు పొందడం, జీవిత బీమా సంస్థ వంటి సంస్థల నుండి వచ్చిన పెట్టుబడుల ద్వారా ఆస్తులు, కొనుగోళ్ళలో ఎక్కువ భాగాన్ని సమకూర్చుకోగలిగింది. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసి పెట్టుబడుల ద్వారానే దాదాపు రూ.80వేల కోట్ల నిధులు వచ్చాయి. బ్యాంకుల నుండి ఈ గ్రూపు తీసుకున్న అన్ని రుణాల్లో 40శాతం వరకు ఎస్‌బిఐ నుండే వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలడం వల్ల ప్రజల పొదుపు మొత్తాలకు, ప్రభుత్వ నిధులకు ముప్పు వాటిల్లుతోంది.
         రూ.20వేల కోట్లను సమీకరించేందుకు అదానీ, బహిరంగంగా షేర్ల అమ్మకాలను ప్రారంభిస్తున్న సమయంలో సరిగ్గా హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలినప్పటికీ, అంతిమంగా ఆ ఆఫర్‌ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు కొందరు తమ సంస్థల తరపున కాకుండా వ్యక్తులుగా ఈ షేర్లను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం వల్లే అవి పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. పెట్టుబడిదారుల మధ్య వర్గ సంఘీభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణ. ముకేష్‌ అంబానీ, సజ్జన్‌ జిందాల్‌, సునీల్‌ మిట్టల్‌, పంకజ్‌ పటేల్‌ వంటి బడా వ్యాపారవేత్తలు అదానీ కంపెనీ షేర్లను పెద్ద మొత్తంలో కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ మరుసటి రోజునే, అదానీ కంపెనీలు షేర్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. పెట్టుబడిదారులందరికీ ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పాయి. రెండు అదానీ ఫ్రంట్‌ కంపెనీలు మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌లో పెట్టుబడులు పెట్టాయన్న ఆరోపణలు రావడంతో అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
          అదానీ గ్రూపు అకస్మాత్తుగా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఎదిగిన తీరు, చాలా వేగంగా విస్తరించిన వైనాన్ని ప్రశ్నించే స్థితే లేకుండా చేశారు. ఏళ్ళ తరబడి, గౌతమ్‌ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి. బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరు పై మీడియాలో, వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ, వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్‌బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా సంస్థలు కానీ స్పందించిన దాఖలాలు లేవు.
            తమ మోసపూరిత లావాదేవీలను ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడానికి, అణచివేయడానికి అదానీలు తమ ధన, రాజకీయ బలాన్ని ఉపయోగించారు. అదానీల ఒప్పందాలకు ప్రశ్నించేలా కథనాలు రాసినా, ప్రసారం చేసినా సహించలేని స్థితి. ఆ కథనాలను ప్రచురించిన, లేదా ప్రసారం చేసిన వార్తా సంస్థలు, చానెళ్లపై పరువు నష్టం దావాలను ఒక అస్త్రంగా ప్రయోగించారు. ఉదాహరణకు, అదానీ ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ, గెయిల్‌ ఇండియాలు పెట్టుబడులు ఎందుకు పెట్టాయని ప్రశ్నిస్తూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించినందుకు 2017 నవంబరులో 'ది వైర్‌' పత్రికపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇటువంటి పరువు నష్టం కేసులను ఎదుర్కొంటున్న ఇతర జర్నలిస్టుల్లో పరంజరు గుహ థకుర్తా (ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ), రవి నాయర్‌ తదితరులున్నారు. ఈ విధంగా కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలని అదానీ గ్రూపు ప్రయత్నించింది.
           స్టాక్‌ల తారుమారు, మనీ లాండరింగ్‌, అకౌంటింగ్‌ మోసాలు, భారతదేశ అత్యున్నత పారిశ్రామికవేత్త పేరు ప్రతిష్టకు భంగం కలిగిచే కుట్రగా చూపించే యత్నాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ అదానీ-హిండెన్‌బర్గ్‌ అధ్యాయం నుంచి తీసుకోవాల్సిన అసలు పాఠం మరుగున పడకూడదు.
       నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన దన్నుతోనే అదానీ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని చూడకపోతే అదానీ కథ అసంపూర్ణమే అవుతుంది. 2002లో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినపుడు అదానీ, మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుండి అదానీ అదృష్టాలన్నీ మోడీ రాజకీయ పంథాతో పెనవేసుకుని సాగాయి. 2014లో మోడీ ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరంలో రూ.50.4 వేల కోట్లుగా వున్న అదానీ సంపద, 2022 నాటికి వచ్చేసరికి అమాంతంగా అది రూ.10.30లక్షల కోట్లకు పెరిగిపోయింది. మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడైన పారిశ్రామికవేత్త అదానీకి ఇక పట్ట పగ్గాల్లేవు. ఏ ప్రభుత్వ నియంత్రణా సంస్థ కానీ, అధికారి కానీ ఆయనను ప్రశ్నించే సాహసం కానీ, అడ్డుకునే యత్నం కానీ చేయలేని స్థితి. ప్రభుత్వ అండ చూసుకునే అదానీ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతగా విస్తరించుకోగలిగింది. ఇటీవలి కాలంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇదొక అత్యంత దారుణమైన ఉదాహరణ. మోడీ-అదానీ సంబంధాలు ఈనాడు దేశాన్ని పాలిస్తున్న హిందూత్వ-కార్పొరేట్‌ శక్తుల పొత్తును నగంగా బయటపెట్టింది. మోడీ ప్రభుత్వ మద్దతుతో తాను ఈ తుపానును ఎదుర్కోగలనని అదానీ చాలా ధీమాగా ఉన్నారు. కానీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడాన్ని, మతోన్మాద-కార్పొరేట్‌ శక్తులు కుమ్మక్కయి తమ జీవనోపాధిని దెబ్బతీయడాన్ని స్వయంగా చూస్తున్న ఈ దేశ పౌరులకు మాత్రం ఈ దోపిడీ, అక్రమ సంపాదనలకు గాను అదానీలను జవాబుదారీ చేయడమనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ఉన్నది.
          అందువల్ల, అదానీ గ్రూపునకు సంబంధించిన మొత్తం ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలన్నింటిపైనా నియంత్రణా సంస్థలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు దర్యాప్తు జరిపేలా చూసేందుకు కృతనిశ్చయంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా వుంది. అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చి సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలి.

(పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం)

30, డిసెంబర్ 2022, శుక్రవారం

 సబ్‌ప్లాన్‌ అమలులో పాలకుల విఫలం

             సమాజంలో అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా వ్యయంలో ప్రత్యేక కేటాయింపుగా వున్న సబ్‌ప్లాన్‌ విధానాన్ని కొనసాగించడం అవశ్యం. కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసుకొచ్చిన ఈ సబ్‌ప్లాన్‌ విధానం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది. అయితే, దాని కాల పరిమితి పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది. సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు ఉపక్రమించాలి.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో సబ్‌ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకురావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక సబ్‌ప్లాన్‌ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు. కాని, అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్న మోడీ సర్కారు ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం సంఘపరివార్‌ నైజానికి నిదర్శనం. కాని, కేరళ లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిల జనాభా శాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశంలో అలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదీ లేదు.

        రాష్ట్రంలో సబ్‌ప్లాను చట్టం చేయడంతో నిధుల కేటాయింపు, ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని, 2018 నుండి రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించాలి. ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్‌సి ఎస్‌టిల అభివృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేల కోట్లు మాత్రమేననీ మిగతా 12 వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లించారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు. సబ్‌ప్లాన్‌ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలు అంటే దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదు. రోడ్లు వేయడానికి, సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్‌ ప్లాన్‌ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్‌ప్లాన్‌ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు.

ప్రభుత్వ రంగాన్ని పాలకులు క్రమంగా కుదించివేయడంతో సామాజిక న్యాయం చతికిలపడుతోంది. ఎస్‌సి, ఎస్‌టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించవలసిన పరిస్థితి. అణగారిన వర్గాల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించేలా సబ్‌ప్లాన్‌ చట్టం కొనసాగాల్సిందే. కేటాయింపులు అణగారిన తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు, సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల, ప్రగతిశీల శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పదు.

25, మార్చి 2022, శుక్రవారం

ఎఫెక్టివ్‌ విజువల్స్‌ స్టోరీ డిఫెక్ట్‌

 


ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రివ్యూ    

విడుదల తేది: 25-03-2022
నటీనటులు: ఎన్‌టిఆర్‌, రామ్‌చరణ్‌, అజరు దేవ్‌గణ్‌, శ్రీయ, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, రేస్టీవెన్‌ సన్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు.
కథ: కె.విజయేంద్రప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి.
రాజమౌళి సినిమా అంటేనే భారీతనం. ఆయన విజన్‌తో ఎన్నో మ్యాజిక్కులు చేస్తుంటారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకెళ్లారు. కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. నాలుగేళ్ల క్రితం ఇద్దరు స్టార్‌ హీరోలతో మొదలైన రోజు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి తరహా టేకింగ్‌, దేశవ్యాప్తంగా చేసిన ప్రమోషన్‌ ఈ చిత్రంపై రెట్టింపు అంచనాలు క్రియేట్‌ చేశాయి. కరోనా విపత్తు, థియేటర్లు, టికెట్‌ ధరలు పలు రకాల సమస్యలతో విడుదల ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
             కథ: విశాఖపట్టణం సమీపానికి చెందిన అల్లూరి సీతారామరాజు ఊరికి ఇచ్చిన మాట కోసం ఢిల్లీలోని అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వంలో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. ఒక లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లిన రామరాజుకు పదోన్నతి పొందాలని పట్టుగా పనిచేస్తాడు. తన మరదలు సీత కోరిక నెరవేరాలంటే రామరాజు లక్ష్యం సాధించాలి. అదెలా జరుగుతుంది? ఇదిలా ఉండగా బ్రిటీష్‌ గవర్నర్‌ స్కాట్‌ అదిలాబాద్‌ పర్యటనకు వెళ్లి అక్కడి గోండ్ల బిడ్డ మల్లిని ఢిల్లీ తీసుకెళ్లిపోతాడు. ఆ బిడ్డను తల్లి దరికి చేర్చాలని గోండ్ల జాతికి కాపలాగా ఉండే కొమురం భీమ్‌ ఢిల్లీకి పయనమవుతాడు. బ్రిటీష్‌ కోటను దాటుకుని మల్లిని తీసుకురావడం కష్టం. ఆ తరుణంలోనే అల్లూరి.. భీమ్‌కు పరిచయం అవుతాడు. ఇద్దరి మధ్య మైత్రి కుదురుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఇద్దరి లక్ష్యాలు నెరవేరాయా లేదా? అజరు దేవగణ్‌, శ్రీయ కథేంటి అన్నది తెరపైనే చూడాలి. కథ అంత ఎఫెక్టివ్‌గా లేదనే చెప్పాలి.

              విశ్లేషణ: అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అయితే వీరిద్దరూ కలిస్తే అన్న కల్పిత కథతో రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' (రణం.. రౌద్రం.. రుధిరం) చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్‌ హీరోలతో సినిమా అనగానే నిడివి, ఇంపార్టెన్స్‌ ఇలా చాలా లెక్కలు ఉంటాయి. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి అభిమానులు, సినీ ప్రియుల నోట ఇదే మాట వినిపిస్తుంది. నీరు, నిప్పు అంటూ హీరోల పాత్రలను పరిచయం చేశారు. దానికి క్లారిటీ ఇవ్వలేదు. లాఠీఛార్జ్‌ సన్నివేశంతో రామరాజు పాత్రను, అడవిలో పులితో పొరాటం సన్నివేశాలతో భీమ్‌ పాత్రను పరిచయం చేశారు. ఇద్దరికీ కావలసినంత ఎలివేషన్‌ ఇచ్చి.. రెండు పాత్రలను బ్యాలెన్స్‌ చేశారు రాజమౌళి. ఓ ఆపదలో ఉన్న ఓ కుర్రాడిని కాపాడి వీరిద్దరూ స్నేహితులైన తీరును చూపించారు. కానీ ఆ స్నేహం ఎలా బిల్డప్‌ అయిందో చూపించలేదు. 'నాటు నాటు' పాటలో మాత్రమే వారిద్దరి మధ్య స్నేహాన్ని భావోద్వేగంగా చూపించారు. రామరాజు పాత్ర ఏంటి? అతను ఏ కారణంతో బ్రిటీష్‌ ప్రభుత్వంలో పోలీస్‌గా చేరాడు అన్నది బాగానే చెప్పారు. కానీ భీమ్‌ విషయంలో అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదు. గొడ్ల కాపరి అని చెప్పారు. అతను ఏంటి? ఆ గూడెంలో ఏం చేస్తాడన్నదీ వివరణ లేదు. కేవలం అతని బలం ఏంటో రాజీవ్‌ కనకాల మాటలతో సరిపెట్టారు. తన గూడెంకి చెందిన పిల్లని రక్షించడానికి ముస్లిం వ్యక్తిగా వెళ్లడం అన్నది కథకు అతికినట్లు లేదు. ఆ తర్వాత రామరాజు పాముకాటుకు గురికావడం.. ఇద్దరి కథలు బయట పెట్టడం.. భీమ్‌ను అరెస్ట్‌ చేయడంతో కథ మరో ట్రాక్‌ ఎక్కింది. ఇంటర్వెల్‌లో హీరోలిద్దరూ పోటీ పడుతుంటే ఓ వైపు ఉద్వేగం, మరో వైపు బాధ కలుగుతాయి. అజరు దేవగణ్‌, శ్రీయ తదితరుల పాత్రలతో సెకెండాఫ్‌ మొదలవుతుంది. 20 నిమిషాలు సాగే ఆ ట్రాక్‌ కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథ అక్కడే రివీల్‌ చేయడం కొసమెరుపు. భీమ్‌కి శిక్ష వేసే సమయంలో 'కొమరం భీముడా' పాటతో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు. భీమ్‌ని ఉరికంబం ఎక్కించినప్పుడు రామరాజు తప్పించే ప్రయత్నం బాగానే ఉన్నా అంతకుముందు సన్నివేశాలు తేలిపోయాయి. బ్రిటీషర్ల నుంచి తప్పించుకుని మల్లిని తీసుకుని బయటపడ్డ భీమ్‌కు సీత ఆశ్రయం ఇస్తుంది. అక్కడ రామ్‌ లక్ష్యం, తన ప్లాష్‌ప్యాక్‌ భీమ్‌కి తెలుస్తుంది. రామ్‌ని రక్షించుకోవాలని బ్రిటీష్‌ కారాగారానికి బయలుదేరతాడు. అక్కడే రామ్‌చరణ్‌ పోషించిన అల్లూరి గెటప్‌ రివీల్‌ అవుతుంది. అయితే క్లైమాక్స్‌ సింపుల్‌గా తేల్చేసినట్లు అనిపిస్తుంది. దర్శకుడు ఇంకెదో చేస్తాడు అని అంచనాలు వేసుకున్నవారికి నిరాశ తప్పదు.
              ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... రాజమౌళి విజన్‌కి తగ్గ హీరోలు ఆయనకు దొరకడం సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. ముఖ్యంగా హీరోలిద్దరి పాత్రలను బాగా బ్యాలెన్స్‌ చేశారు. నటన పరంగా ఇద్దరూ విజృంభించారు. 100 శాతం పాత్రలకు న్యాయం చేశారు. అలియా భట్‌ పాత్ర చిన్నదే అయినా సినిమాలో మలుపునకు కారణం అవుతుంది. అజరు దేవగణ్‌ పాత్ర కూడా అంతే! ఆలియా, రామ్‌ గురించి చెప్పే సన్నివేశం భావోద్వేగానికి లోను చేస్తుంది. బ్రిటీషర్ల విలనిజం అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసిన భావన కలిగించాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే రాజమౌళి ఈ సినిమా విషయంలో అంత ఆసక్తి చూపించినట్లు లేరు. ట్రెయిన్‌ బ్లాస్ట్‌, తెరపై కనిపించిన జంతువులు సీజీలో తెలిసిపోతున్నాయి. సీజీ వర్క్‌ రాజమౌళి స్థాయిలో లేదు. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్స్‌. విజయేంద్రప్రసాద్‌ అల్లిన కథ, సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. రాజమౌళికి బాగా కలిసొచ్చిన సెంథిల్‌ ఫొటోగ్రఫీ అదిరింది. సాబుసిరిల్‌ ఆర్ట్‌ వర్క్‌ బావుంది. నిర్మాత ఖర్చు చేసిన ప్రతి రూపాయి కొన్ని సన్నివేశాల్లో క్వాలిటీ రూపంలో కనిపించింది. 'బాహుబలి'తో భాషాబేధం తొలగించిన రాజమౌళి ఈ చిత్రంతో అభిమానుల మధ్య అంతరాలను కూడా తొలగించారని చెప్పొచ్చు.
భీమ్‌, అల్లూరి సీతారామరాజు అనే పేర్లను కేవలం మార్కెటింగ్‌ ప్రకారం పెట్టినట్లుగా వుంది. కథలో ఆ పేర్లు వున్నా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళకు పైగా అయిన సందర్భంగా ప్రముఖ దినపత్రికలలో రకరకాలుగా ఒక్కో ప్రాంతంలో పోరాట యోధుల గురించి కథలు రాస్తున్నారు. కనీసం అందులో ఒక కథ అయినా తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. కేవలం ఊహాజనితమైన కథ తీసుకుని తనకు తెలిసిన టెక్నికల్‌ గ్రాఫిక్‌తో మాయ చేశారు. విజువల్స్‌ బాగున్నా కథ అంతబాగా కుదరలేదనిపిస్తోంది.
         తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. సినిమా బెనిఫిట్‌షోలో విద్యుత్‌ అంతరాయంతో అభిమానులు, వీక్షకులు తీవ్ర అక్రోశానికి గురయి విజయవాడలో ఓ సినిమా థియేటర్‌ను ధ్వంసం చేశారు.

10, మార్చి 2022, గురువారం

పంజాబ్‌ను ఊడ్చేసిన ఆప్‌



యుపిలో బిజెపి జోరు -డీలాపడ్డ కాంగ్రెస్‌

               పంజాబ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఊడ్చేసింది. మొత్తం 117 స్థానాల్లో 92 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టింది. దీంతో కాంగ్రెస్‌ 18 స్థానాలకే పరిమితమైంది. బిఎస్‌పి,శిరోమణి ఆకాళీదళ్‌ కూటమి, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌-బిజెపి కూటమి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆకాళీదళ్‌కు నాలుగు, బిజెపికి రెండు స్థానాలు లభించాయి. గత ఎన్నికల్లో ఆప్‌ 20 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 92 స్థానాల్లో విజయం సాధించి, 72 స్థానాలను పెంచుకోగలిగింది. గత ఎన్నికల్లో ఆప్‌ 23.7 శాతం ఓట్లు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం ఓటింగ్‌ సాధించింది. దాదాపు 19 శాతం ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 77 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 18 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ ఏకంగా 59 స్థానాలను కోల్పోయింది. గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 23 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 15 శాతం ఓట్లు కోల్పోయింది. శిరోమణి అకాలీ దళ్‌ గత ఎన్నికల్లో 15 స్థానాలు గెలవగా, ఈసారి మూడు స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు రాగా, 18.4 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది. మంత్రులు ఓం ప్రకాష్‌ సోనీ, మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రజియా సుల్తానా, భరత్‌ భూషన్‌, విజరు ఇందిర్‌ సింఘాలా, రణదీప్‌ సింగ్‌ నభా, గుర్కీరత్‌ సింగ్‌ కోట్లి తదితరులు ఓటమి పాలయ్యారు.
ఆప్‌ విజయం వెనుక..
            పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం వెనుక పక్కాగా ఎన్నికల వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. నాణ్యమైన విద్యబోధన జరిగేలా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ప్రచార అస్త్రంగా కేజ్రీవాల్‌ ప్రయోగించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్‌, నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి, ఇంటింటికీ గ్యారెంటీ కార్డును నింపేలా ఫారాలిచ్చారు. ఇలా ఆప్‌ చెబుతున్న విషయాలు సామాన్యుల ఇళ్లకు చేరాయి. నగరాల్లో స్థానికంగా బలంగా ఉన్న దాదాపు 50 మంది ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్టు ఇచ్చారు. దీంతో గ్రామాలతో పాటు నగరాల నుంచి కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించటానికి కారణమైంది.

కీలకంగా మారిన మూడు అంశాలు
- పంజాబ్‌లో మార్పును పసిగట్టిన కేజ్రీవాల్‌.. పార్టీని అక్కడ బలంగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, ప్రజాసమస్యలను కాంగ్రెస్‌ పట్టించుకోకపోవటం గమనించారు. ఇదే అదనుగా కేజ్రీవాల్‌ ప్రచార విధానాన్ని మార్చేశారు. మాల్వాలో పెద్ద ప్రభావం కనిపించింది.
- ఆప్‌.. బయటి పార్టీ అనికాంగ్రెస్‌ ప్రచార అస్త్రంగా వినియోగించింది. దీన్ని తిప్పికొట్టడానికి వివాద రహితుడైన భగవంత్‌ మాన్‌ను సిఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఫీడ్‌బ్యాక్‌ నుంచి ప్రకటన వరకు, మద్దతుదారులు, ప్రత్యర్థుల వరకూ చర్చ జరిగేలా చేయటంలో సక్సెస్‌ అయ్యారు. ముందుగా ఒక్క అవకాశం ఇవ్వమని కేజ్రీవాల్‌ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ నుంచి విమర్శలు రాగానే... ఆ నినాదాన్ని మార్చారు. భగవంత్‌ మాన్‌ పేరుతో ఓట్లు అడగటం షురూ చేశారు.
- పంజాబ్‌ ఎన్నికలలో పోటీ చేస్తున్న 22 రైతు సంఘాల ఐక్య సమాజ్‌ మోర్చా. రైతు నాయకుడు బల్బీర్‌ రాజేవాల్‌ ఆప్‌తో పొత్తును నిరాకరించారు. ఈలోపు కేజ్రీవాల్‌ ధైర్యం చేసి 90 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థులను ప్రకటించారు. మిగతా సీట్లు ఇవ్వటానికి కేజ్రీవాల్‌ సిద్ధమైనా.. రాజేవాల్‌ అంగీకరించలేదు. దీంతో ఆప్‌ ఒంటరిగానే బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో గెలవటానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌ను ముంచిన విభేదాలు
          కాంగ్రెస్‌లో విభేదాలు ఆ పార్టీని పూర్తిగా ముంచివేశాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చడం ప్రతికూలంగా మారింది. ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో దారుణంగా ఓటమి చవిచూశారు. పంజాబ్‌ పిసిసి చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమఅత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పరాజయం చెందారు. అమృత్‌సర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మూడు సార్లు విజయం సాధించిన సిద్దూ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారంటేనే కాంగ్రెస్‌ పరిస్థితి అంచనా వేయవచ్చు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆప్‌ ధాటికి గల్లంతయ్యారు.
కొత్త చరిత్ర సృష్టించాం,
పేదల అనుకూల, క్రియాశీల పాలనకు ప్రజల మద్దతు : ప్రధాని నరేంద్ర మోడీ
             పార్టీ పేదల అనుకూల, క్రియాశీల పాలనకు ప్రజల నుంచి బలమైన ఆమోదముద్ర లభించింది. ఇది ఉత్సాహం, ఉత్సవాల రోజు. ఈ ఉత్సాహం భారతదేశ ప్రజాస్వామ్యం కోసం. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో విజయం 'జీత్‌ కా చౌకా' అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌ చాలా మంది ప్రధానమంత్రులను ఇచ్చిందని, తొలిసారిగా పూర్తి కాలం పనిచేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని చెప్పారు. సుపరిపాలన మరింత మెరుగ్గా సాగిందన్నారు. గత కొన్నేళ్లుగా పారదర్శకంగా, పేదలకువారి హక్కులను అందజేస్తోందన్నారు. బిజెపి కార్యకర్తలు 24 గంటలూ పనిచేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించారన్నారు. మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాలలోనూ బిజెపి ఓట్ల శాతం పెరిగిందన్నారు. గోవాలో అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలిందని, గోవా ప్రజలు వరుసగా మూడోసారి వారికి సేవ చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు. ''యుపి ప్రజల నుండి నేను పొందిన ప్రేమ. పార్లమెంటు సభ్యునిగా వారణాసి నుంచి నన్ను యుపిగా మార్చారు. ''మై యుపి వాలా,'' అని అన్నారు.
దేశమంతా విస్తరిస్తాం : కేజ్రీవాల్‌
            పంజాబ్‌ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆప్‌ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఆప్‌ జోరులో అమరీందర్‌, చన్నీ, సిద్ధూ, సుఖ్‌బీర్‌సింగ్‌, ప్రకాశ్‌సింగ్‌, బిక్రమ్‌సింగ్‌ కొట్టుకుపోయారు. ఆప్‌ను దేశమంతా విస్తరిస్తాం. ప్రజలు ఆదరించాలి.
ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం : రాహుల్‌గాంధీ
             ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పనిచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తాం.
నిరాశ పడొద్దు : శరద్‌ పవార్‌
              తాజా ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనమంతా కలిసి పనిచేసే సమయం మళ్లీ వస్తుంది. దేశవ్యాప్తంగా బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక వేదికపైకి రావాల్సిన అవసరముంది. తద్వారా బిజెపికి ప్రత్యామ్నాయంగా మారుతాం. అంతర్గత సంక్షోభం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. కాంగ్రెస్‌ నిర్ణయాల్ని పంజాబ్‌ ప్రజలు అంగీకరించలేకపోయారు. యూపీలో అఖిలేశ్‌ యాదవ్‌ ఒంటరిగా పోరాడారు. బిజెపికి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రభావం చూపవు.
కొత్త చరిత్ర సృష్టించాం : యోగి ఆదిత్యనాథ్‌
           ఉత్తరప్రదేశ్‌లో బిజెపి కొత్త చరిత్ర సృష్టించింది. ప్రధానిమోడీ నాయకత్వంలో బిజెపి అద్భుతమైన విజయం అందుకుంది. అభివృద్ధి చూసే రెండోసారి అధికారం ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాబోతోంది. పార్టీలో ప్రతి ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కింది.
ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా : పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ
            ఇది ప్రజా తీర్పు. ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నాం. ఆప్‌కు అభినందనలు'' అని చెప్పారు. అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీపడిన సిద్ధూ ఓటమి చెందారు. పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పరిస్థితి మరీ దారుణం. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన ఓటమిపై స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్టు చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లో ఎందుకిలాంటి ఫలితాలు వచ్చాయి?
         రైతులను , కార్మికులను, మధ్య తరగతి ప్రజలను ఇంతగా ఇబ్బంది పెట్టిన బిజెపిని నాలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఆదరించారు?. నిత్యావసర ధరలు పెంచింది. లౌకిక వాదానికి తూట్లు పొడిచింది. మనువాదాన్ని ప్రజలపై బలంగా రుద్దేందుకు ప్రయత్నించింది. రుద్దుతోంది. విద్య, వైద్య రంగాలలో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మరెన్నో పాపాలు చేసింది. అయినా ఎందుకు బిజెపికి ప్రజలు సానుకూలంగా మారారు. హిందూత్వ నినాదం పని చేసిందా?...కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఇతర రాజకీయ పార్టీలన్నీ ఎందుకు చతికిల పడ్డాయి. భవిష్యత్తులో నయినా కాంగ్రెస్‌ ఇతర పార్టీలను కలుపుకుని పోవాలనే గుణపాఠం నేర్చుకోవాలి. వామపక్ష , ఇతర ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా ఉండాలి. దేశంలో లౌకిక వాదుల బలం పెరగాలి.

17, ఫిబ్రవరి 2022, గురువారం

పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు కన్నమూత



గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సాహితీ వటవృక్షం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు కన్నమూశారు. 2022 ఫిబ్రవరి 17న గురువారం పెనుకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. మధ్యామ్నం 3 గంటల సమయంలో గుండెపోటుకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకులుగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగు పద్యానికి, అవధానానికి, వర్తమానకాలంలో ప్రసిద్ధుడైన ఆశావాది ఎన్నో వందల అవధానాలు దేశవ్యాప్తంగా చేశారు. అంతేగాక అనేక గ్రంధాలు దాదాపు 60 దాకా రాశారు. ఆయన కవిగా, వక్తగా, రచయితగా, సాహితీ కార్యకర్తగా, విద్యావేత్తగా ప్రముఖ అవధానిగా అనంత సాహితీ వనంలో ఏపుగా పెరిగిన పెద్ద సాహితీ వటవక్షంగా నిలిచారు. ఆయన సాహిత్య ప్రయాణంలో 'పద్మశ్రీ' సైతం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వివిధ ఉద్యోగాల్లో వారు స్థిరపడ్డారు. పెనుకొండ పట్టణంలో శుక్రవారం 18-02-2022న ప్రకాశరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు పద్యానికి వన్నె తెచ్చిన డాక్టర్‌ ఆశావాది
          తెలుగు రాష్టాల్లోని సాహిత్య రంగంలో పద్యానికి, అవధానానికి వన్నెతెచ్చిన డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు 1944వ సంవత్సరం ఆగస్టు 2న అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కొరివిపల్లి గ్రామంలో కుళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు జన్మించారు. అష్టావధానంలో ఆశావాది దిట్ట. ఎన్నో అవధానాలు చేసిన ఆశావాది తన అనుభవాల్ని అక్షరబద్ధం చేసి అనేక రచనలు చేశారు. వీటిలో అవధానదీపిక, అవధాన కౌముది, అవధానకళాతోరణము, అవధాన వసంతం మొదలైనవి ఉన్నాయి. ఇవిగాక వరదరాజు శతకం, పార్వతీశతకం, మెరుపు తీగలు వంటి కావ్యాలు కూడా ఉన్నాయి. ఆశావాది పద్యరచనతో పాటు ఆధునిక వచన కవితలో ఆర్కెస్ట్రా, అంతరంగ తరంగాలు మొదలైన కావ్యాలు రచించారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలు కలిగిన డాక్టర్‌ ఆశావాది విద్యార్థి దశలోనే అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేత 'బాలకవి'గా ప్రశంసలు పొందారు. 55 సంవత్సరాలుగా రచనా వ్యాసంగం, సాహిత్యంలో ప్రయాణం సాగించారు. 35 సంవత్సరాలు విద్యారంగంలో ఉపాధ్యాయుడు, అధ్యాపకుడిగా విశేష కషి చేశారు. ప్రకాశరావు 171 అవధానాలు చేసి, 60కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఆశావాది సాహిత్యకషిని గురించి వివిధ కవులు ఆయన పేరిట 24 పుస్తకాలు రచించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని మహోన్నత శిఖరాలకు చేర్చిన మేరుపర్వతం ఆశావాది ప్రకాశరావు. ఆయన రచనలపై ఐదారుగురు పిహెచ్‌డిలు చేశారు. ఆయనకు రెండు తెలుగు రాష్టాల్లో శిష్యులున్నారు. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ , కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన అష్టావధానాలు చేశారు.
పురస్కారాలు, సత్కారాలు
          ఆశావాది సాహిత్య రంగంలో ఎన్నో సత్కారాలు పొందాడు. 1976లో దళితుల్లో ప్రథమ అవధానిగా 'తెలుగు వెలుగు' పురస్కారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి అందుకున్నారు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయం 'రాష్ట్రకవి'గా సత్కరించింది. 1994లో ఉగాది పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2000 సంవత్సరంలో డిలిట్‌ డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. 2005లో హరిజన సేవాసంఘం ద్వారా గాంధేయ వాద పురస్కారం పొందాడు. అధికార భాషాసంఘం నుండి 'భాషాభిజ్ఞు' పురస్కారాన్ని పొందారు. ఆశావాది జీవితంలో అపూర్వఘట్టం పూర్వం అల్లసాని పెద్దనలా 'స్వర్ణగండ పెండేర సన్మానం' పొందడం. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆయన తన సాహితీ ప్రజ్ఞకు గుర్తుగా ఈ సన్మానాన్ని పొందడం విశేషం. ఆశావాది తెలుగు సాహితీ క్షేత్రంలో సాహితీ వారసత్వంగా ఎన్నో తెలుగు విత్తనాలు వేసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆయన స్వయంగా 'రాయలకళాగోష్టి' సంస్థ స్థాపించి దానికి కార్యదర్శిగా పనిచేశారు. 'ఆంధ్ర పద్య కవితాసదస్సు' రాష్ట్ర కార్యదర్శిగా పది సంవత్సరాల పాటు 1993 నుండి పనిచేసి ఎంతోమంది సాహిత్య కారులును వెలుగులోకి తెచ్చారు. 'ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ' సభ్యునిగా కూడా పనిచేశారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇతర విశేషాలు
           ప్రథమ సంవత్సరం డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే (1962) అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణతో 'బాలకవి'గా ఆశీర్వదప్రాప్తి అందుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ కర్నాటక ఉన్నత పాఠశాలల తెలుగు పాఠ్యాంశ రచయిత. అనేక పత్రికలలో వీరి కవితలు, వ్యాసాలు ముద్రితమయ్యాయి. వీరి సాహిత్యవికాసంపై 2 రోజులపాటు యుజిసి నిధులతో కర్నూలులోని కెవిఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ సదస్సు జరిగింది. పలు సాహితీ సాంస్కతిక సంస్థలు 13 రకాల బిరుదులతో సత్కరించింది. సహ సాహితీవేత్తల గ్రంథాలు 14 దాకా అంకిత స్వీకారం పొందారు. ఆయన 7 జాతీయసదస్సులకు పరిశోధనపత్రాలు సమర్పించారు. వందకు పైగా ఆకాశవాణి, దూరదర్శన్‌ కార్యక్రమాలున్నాయి. దేశవ్యాప్తంగా 171 అష్టావధాన ప్రదర్శనలు చేశారు. భువనవిజయాది సాహితీరూపకాలతో కవుల పాత్రను పోషించారు. సామాజిక నాటకాలకు దర్శకత్వం వహించారు. శ్రీశైలజ్యోతి ( అనంతపురం ), గౌతమప్రభ ( గుత్తి ), జాగతి ( హైదరాబాదు ), పద్యవారధి ( రాజమండ్రి ) పత్రిక సంపాదకమండలిలో స్థానం పొందారు. గహగ్రంథాలయాల స్థాపనకు కషి చేశారు. పరిశోధక విద్యార్థులకు సహకారం అందించారు. ముద్రిత స్వీయరచనలను పలుగ్రంథాలయాలకు, సాహిత్య సంస్థలకు ఉచితముగా పంపిణీ చేశారు. శ్రీకష్ణదేవరాయలు , పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు , డా క్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాల ప్రతిష్టాపనలకు కషి చేశారు. స్వీయ ఆధ్వర్య సాహిత్యసంస్థల ద్వారా 40 కి పైగా ప్రచురణలు, అజ్ఞాత కవులకు, యువసాహితీవేత్తలకు అండగా నిలిచి ప్రోత్సాహం అందిచారు. 2010 నుండి ఆశావాది సాహితీకుటుంబ పక్షాన సంప్రదాయకవులకు ఆధునిక రచయితలకు, సంఘసేవకులకు, ఆధ్యాత్మికప్రచారకులకు, ప్రతిసంవత్సరం ఆత్మీయపురస్కారాల ప్రదానం చేశారు. పలువురు గవర్నర్లు , కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జస్టిస్‌లు , ఐఎఎస్‌, ఐపిఎస్‌, వైస్‌ఛాన్సిలర్ల చేతుల మీదుగా సత్కారాలు పొందారు.
సబ్‌కలెక్టర్‌ నివాళి : గుండెపోటులో మతిచెందిన ఆశావాది ప్రకాష్‌రావు మతదేహానికి సబ్‌కలెక్టర్‌ నవీన్‌ నివాళి అర్పించారు. ఆశావాది భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతపురం : ప్రముఖ అవధాని, ఉపన్యాసకులు, బహు గ్రంథకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టరు ఆశావాది ప్రకాశరావు నిర్యాణం సాహిత్యలోకానికి తీరని లోటు అని కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డాక్టరు అప్పిరెడ్డి హరినాథరెడ్డి అన్నారు. ఆశావాది ప్రకాశరావు మతికి తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు టివి.రెడ్డి, అవధానం నాగరాజారావు, కార్యదర్శులు కాప ఓబిరెడ్డి, అల్తాఫ్‌ నివాళులర్పించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌ సంతాపం తెలిపారు.
నేత్రదానం
          ఆశావాది ప్రకాష్‌రావు చివరి కోరికను గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను సాయి ట్రస్టుకు దానం చేశారు. ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రికి చెందిన ఆప్తమాలిక్‌ అసిస్టెంట్‌ రాఘవేంద్ర ఆయన నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు.
ఆశావాది లేని లోటు తీర్చలేనిది : డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ
         ఒక మహోన్న త సాహితీ వటవృక్షం ఆకస్మికంగా కూలిపోయిందని ఆయన లేని లోటు సాహితీ లోకానికి తీర్చలేనిదని రచయిత్రి డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ అన్నారు. ఎందరో రెక్కలు రాని సాహితీ విహంగాలకు గూడునిచ్చి, నీడనిచ్చి, రెక్కలు తొడిగి ఎగిరేటట్లు చేసిన మహోన్నత ఆచార్యుడాయన అన్నారు. డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు తనకు సాహితీ సేవలు చేసేందుకు స్ఫూర్తినిచ్చారన్నారు. తెలుగు సాహిత్యంలో తెలియని ఎన్నో విషయాలను బోధించి సందేహాలను తీర్చిన గురువులాయన తన ప్రతి రచనా పుస్తకరూపానికి రావడానికి ప్రధాన కారకులు. నాకు దైవమిచ్చిన సోదరులు. పరమ సౌజన్య మూర్తి. మంచితనానికి, మానవత్వానికి ప్రతీక ఆశావాది. ఆయన ఆకస్మిక మరణం మా అందరికీ పెను విషాదాన్ని మిగిల్చింది. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్ధిస్తున్నాను.


10, నవంబర్ 2021, బుధవారం

పద్మశ్రీ అందుకున్న డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ అవధాని డాక్టర్‌ అశావాది ప్రకాశరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ చేతుల మీదుగా మంగళవారం (09-11-2021) ఈ అవార్డును ఆయన స్వీకరించారు. సాహిత్యం, విద్య విభాగంలో ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన ప్రకాష్‌ రావు 1944 ఆగస్టు 2న కుల్లాయమ్మ, పకీరప్ప దంపతులకు జన్మించారు. ఆయన ఎస్‌ఎస్‌ఎల్సీ నుంచి ఎంఏ తెలుగు వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవి విరమణ చేశారు.

              రచనలు : రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 150కి పైగా అవధానాలు చేశారు. పుష్పాంజలి, లోకలిలా సూక్తం, మెరుపు తీగలు, దీవన సేసలు, రామకథ కలశం, పార్వతి శతకం, ఆత్మతత్వ ప్రబోధం, అవధాన చాటువులు, అవధాన కౌముది, వివేక పునీత నివేదిత వంటి పద్య రచనలు చేశారు. రాప్తాటి పరిచయ పారిజాతం, దోమావధాని, సాహితీ కుంజర మూర్తిమత్వం, ప్రసార కిరణాలు, సమారాధన, భాగవత సౌరభం, సువర్ణ గోపురం, ప్రహ్లాద చరిత్ర ఎర్రన్న, పోతనల తులనాత్మక పరిశీలన వంటి విమర్శ రచనలు చేశారు. నిరోష్ఠ్య శతకం, భర్తృహరి, వైరాగ్యసతి వంటి వ్యాఖ్య రచనలు చేశారు. చల్లపిల్లరాయ చరిత్రం వంటి పరిష్కరణలు ఆర్కెస్ట్రా, నడిచే పద్యం నండూరి వంటి సంకలనాలు, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రలు కలిపి మొత్తం 57 రచనలు వెలువరించారు.
              గుర్తింపు : ప్రకాష్‌రావు అవధాన రంగంలో చేసిన కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. స్వర్ణ గండపెండేర, రజిత హస్తకంకణ, కనకాభిషేక, రజత కిరీటం వంటి సత్కారాలను పొందారు. ఆయన అవధాన ప్రతిభను, సాహిత్య కృషిని మెచ్చి అవధాన కిశోర, అవధాన కోకిల, అవధాన ఆచార్య, శారదా తనయ, అపర జాషువా వంటి బిరుదులతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీరికి కవికోకిల జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2020లో మహాకవి డాక్టర్‌ గడియారం వెంకటేశ శాస్త్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.