14, సెప్టెంబర్ 2024, శనివారం

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి వీడ్కోలు


పార్టీలకతీతంగా నివాళులర్పించిన నేతలు 
బారులు తీరిన ప్రజానీకం
ఉద్వేగ భరితంగా అంతిమయాత్ర
పలు దేశాల రాయబారులు హాజరు 
ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి భౌతిక కాయం అప్పగింత 

ప్రజాశక్తి-న్యూఢల్లీి బ్యూరో

                      అలుపెరగని పోరాట యోధుడు, మార్క్సిస్టు మేధావి 2024 సెప్టెంబర్‌ 12న గురువారం కన్నుమూసిన  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72)కి  అశేష ప్రజానీకం 14న శనివారం  కన్నీటి వీడ్కోలు పలికింది.  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన వేలాదిమంది  సిపిఎం కార్యకర్తలు, వామపక్ష అభిమానులు, ప్రగతిశీల, లౌకిక వాదులు తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఉదయం నుండే  ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతికకాయం ఉంచిన న్యూఢల్లీి సిపిఎం కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌ వద్ద ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.  ఉదయం  పదిగంటలకు  ఏచూరి భౌతిక కాయాన్ని  ఆయన నివాసం నుండి  ఎకెజి భవన్‌కు తీసుకువచ్చారు. అప్పటికే ఆ ప్రాంతం అంతిమ నివాళులర్పించడానికి వచ్చిన వారితో  కిక్కిరిసిపోయింది.  ప్రియతమ నేతకు జోహార్లు చెబుతూ వారు చేసిన నినాదాలతో మారుమ్రోగింది.  వివిధ దేశాల రాయబారులతోపాటు,  పార్టీలు, భావజాలాలకు అతీతంగా పలువురు నేతలు, వివిధ  రంగాలకు చెందినవారు తరలివచ్చారు. నేపాల్‌ మాజీ ప్రధానమంత్రి మాధవ్‌కుమార్‌ నేపాల్‌తో పాటు,  చైనా, రష్యా, వియత్నాం, సిరియా, పాలస్తీనా, క్యూబా దేశాలకు చెందిన రాయబారులు ఏచూరి భౌతిక కాయాన్ని సందర్శించి  అంతిమ నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ పార్టీ  సీనియర్‌ నేత సోనియాగాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహాట్‌, మాణిక్‌ సర్కార్‌, అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా,  సిపిఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య, ప్రముఖ చరిత్రకారిణీ రొమిల్లాథాపర్‌, ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా తదితరులు ఎకెజి భవన్‌ వద్ద ఏచూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు.  ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని, దేశ ప్రజలకోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ‘రెడ్‌సెల్యూట్‌ కామ్రేడ్‌, సీతారాం ఏచూరి అమర్‌రహే, లాల్‌సలామ్‌... లాల్‌సలామ్‌’ అన్న నినాదాలతో అంతిమయాత్ర ప్రారంభమైంది.  విద్యార్థులు, యువత, కళాకారులు వివిధ భాషలకు చెందిన విప్లవ గీతాలను పాడుతూ రెండు కిలోమీటర్ల మేర సాగిన అంతియమాత్రలో భాగస్వాములయ్యారు. ఏచూరి భౌతిక కాయాన్ని ఉంచిన అంబులెన్స్‌ ముందు కదలగా, దానిలోనే ఆయన కుటుంబసభ్యులు  కూడా  ఉన్నారు.   అంబులెన్స్‌ వెనుకే ముందువరసలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, ఆ తరువాత కేంద్ర కమిటీ సభ్యులు నడిచారు. ఆ తరువాత వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు అంతిమయాత్రలో భాగస్వాములయ్యారు. సాయంత్రం 4.40గంటలకు  ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి  కుటుంబ సభ్యులు,  పొలిట్‌బ్యూరో సభ్యులు  ఏచూరి భౌతిక కాయాన్ని అప్పగించారు.  అక్కడే  పది నిమిషాలపాటు చివరిసారి చూసి, కడసారి నివాళులర్పించి కన్నీళ్లతో బయటకు వచ్చేశారు. మార్క్సిస్టు యోధుని మహా ప్రస్థానం ముగిసింది.


కామెంట్‌లు లేవు: