3, జూన్ 2013, సోమవారం

ఆకట్టుకున్న ప్రదర్శనలు

సజీవ సమాధి అయిన రామకృష్ణ
రెండు గంటల తరువాత బయటకు
రెండవ రోజుకు చేరిన జెవివి కార్యగోష్టి
                   జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మాయలు, మహిమలపై జరుగుతున్న జాతీయ స్థాయి కార్యగోష్టిలో భాగంగా 2013 జూన్‌2న జరిగిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిమలు, మాయల పేరుతో బాబాలు, స్వాములు ప్రజలను ఏ విధంగా బురిడీకొట్టిస్తున్నారన్న విషయాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ప్రజలకు కళ్లకుకట్టినట్టుగా ప్రదర్శించారు. ఇందులో భాగంగా 2న తహశీల్దారు కార్యాలయం ఆవరణలో రామకృష్ణ అనే కార్యకర్త ప్రజలందరి సమక్షంలో సజీవ సమాధి అయ్యారు. ఆరు అడుగుల గోతి తీసి మట్టిలో కప్పిపెట్టారు. ఈ ప్రదర్శనను చూసేందుకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. రెండు గంటల తరువాత ఆయన్ను బయటకు తీశారు. ఆయన సజావుగా రావడంతో ప్రజలంతా అభివాదం చేశారు. ఇందులో ఎటువంటి మాయలు, మహిమల్లేవని రామకృష్ణ బయటకొచ్చాక ప్రజలకు తెలిపారు. ఆత్మవిశాసం, ధైర్యముండటంతోపాటు హిప్నాటిజం మీద అవగాహనున్న వారు ఎవరైనా చేయవచ్చునని ప్రజలకు వివరించారు. తన పదేళ్ల కుమారుడు కూడా 12 గంటలు ఈ విధంగా సజీవసమాధి అయి బయటకు వచ్చినట్లు తెలిపారు. వీపుకు కొక్కేలు కట్టుకుని మరో కార్యకర్త రమణరావు కారును పట్టణంలోని ప్రధాన వీధుల్లో లాగారు. పట్టణవాసులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఇందులోనూ ఎటువంటి మహిమల్లేవని చెప్పారు. నిత్యం వ్యాయామం చేస్తున్న వారు ఎవరైనా సునాయాసంగా లాగవచ్చునని రమణారావు చెప్పారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు, అనంతపురం జిల్లా నాయకులు వసంతబాబులు కళ్లకు గంతలు కట్టుకుని పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాలను నడిపారు. నిప్పుల్లో నడవడం, చేతితో మిరపకాయబజ్జీలు తీయడం వంటి ప్రదర్శనలను కూడా చేసి చూపించారు. చేతికి పచ్చినూనెను అంటించుకుని కాలేనూనెలో నుంచి బజ్జీలు తీయవచ్చునని చేసి చూపించారు. రెండవ రోజు పట్టణంలో జరిగిన ఈ ప్రదర్శనలను పిల్లలు, పెద్దలు ఆసక్తిగా గమనించారు. బాబాలు చేసే వాటన్నింటినీ చేసి చూపించడంతోపాటు ఏ విధంగా చేస్తున్నారని వివరించడంతో అందరూ ఆసక్తిగా గమనించారు.
బాబాలను బతికిస్తున్నది కూడా సైన్సే
జెవివి రాష్ట్ర కార్యదర్శి రమేష్‌
                   దైవాంశ సంభూతులమని చెప్పుకుంటున్న బాబాలను బతికిస్తున్నది, ప్రాణాలను నిలబెడుతున్నది డాక్టర్లు, సైన్సేనని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలో తహశీల్దారు కార్యాలయం వద్ద ప్రదర్శనలు సందర్భంగా ఆయన మాట్లాడారు. మాయలు,మహిమల పేర్లతో బాబాలు, స్వాములు చేస్తున్న మాయలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. అటువంటి వారు మహిమల పేరుతో చేసే దేనినైనా జన విజ్ఞాన వేదిక చేసి చూపుతుందని సవాల్‌ విసిరారు. 'దేహం తనది కాదు... దేహిది అని... ఇహలోకంలో ఏమీ లేదు. అంతా పరలోకంలోనే' అని చెప్పిన సత్యసాయిబాబా పడక గదుల్లో కోట్ల సంపద ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బుపై వారికున్న వ్యామోహం ఏమిటో కూడా ఈ అనంతపురం జిల్లాలోనే రుజువైందని చెప్పారు. ప్రజలకు కావాల్సింది విబూది... బంగారు గొలుసులు కాదన్నారు. తాగడానికి గుక్కెడు మంచినీళ్లుఅని అన్నారు. వాటిని మహిమల ద్వారా చెరువులను నింపగలరా ఈ బాబాలు అని ప్రశ్నించారు. దేశంలో 40 శాతం మందికిపైగా పిల్లలు పౌష్టికాహారలోపంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టి వారికి పౌష్టికాహారాన్ని అందివ్వగలరా అని నిలదీశారు. బాబాలు అనారోగ్యంబారిన పడితే ప్రాణాలను రక్షిస్తున్నది డాక్టర్లు మాత్రమేనని తెలిపారు. అది సైన్సుకున్న గొప్పతనమని చాటి చెప్పారు.