14, జనవరి 2019, సోమవారం

సంక్రాంతి సంబరాలు

 

          హైదరాబాద్           మహా నగరంలో ఎటుచూసినా పండుగ వాతావరణమే. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు పలుకరిస్తున్నాయి. హరిదాసుల పాటలు. గంగిరెద్దుల ఆటలు.. సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతున్న చిన్నారులతో సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుంది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో  నివసించే వారు ఒక్కచోటకు చేరి రంగవల్లికలు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలకు భోగిపండ్లు పోస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. చదువులు.. ర్యాంకుల మధ్య పోటీ పడుతున్న ఈ తరం పిల్లలకు పండుగల గొప్పతనం తెలిపేందుకు పలు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు  వేడుకల ఏర్పాటు చేస్తున్నారు.  వేషధారణలు, ముత్యాల ముగ్గుల పోటీలు పెడుతున్నారు. సంప్రదాయ పిండివంటలను రుచి చూపుతున్నారు. 
               నగరంలోని పలు చోట్ల పండుగ గొప్పతనం వివరించేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిజాంపేటలో ఉండే.. రమణి, సువర్ణ, సుజాత.. మూడేళ్లుగా తాము ఇక్కడే సంక్రాంతి చేసుకుంటున్నట్లు చెప్పారు. చిన్నప్పుడు తాము చూసిన సంక్రాంతి... గడిపిన బాల్యాన్ని గుర్తుచేస్తూ పిల్లలతో నాటి ముచ్చట్లను పంచుకుంటున్నట్లు వివరించారు. మెదక్‌ నుంచి గంగిరెద్దులను రప్పించి.. పిల్లలకు హరిదాసుల వేషధారణతో ఇళ్ల ముందు ఉత్సవాలు చేసుకుంటూ పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. నిత్యం పని ఒత్తిళ్లతో సతమతమయ్యే మహిళలు, యువతులు అందరూ ఒక్కచోట చేరుతున్నారు. అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు భోగిపండ్లు పోస్తున్నారు. నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. తెల్లవారుజామునే.. భోగిమంటలు వేసి.. కొత్త సరదాలను ఆస్వాదిస్తున్నారు. 
పేడ కావాలా.. పిడకలు పంపాలా!
                   సంక్రాంతి... పది రోజులు ముందుగానే.. పల్లెల్లో పండుగ మొదలవుతుంది. ఉదయం, సాయంత్రం.. ఇంటిముందు కళ్లాపి చల్లి... అందమైన ముగ్గులు వేస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. గ్రామాల్లో ఆవులు, గేదెలు ఉంటాయి కాబట్టి పేడకు కొదవ ఉండదు. ఇది మహానగరం... సంప్రదాయంగా పండుగ చేసుకునేందుకు నానాతంటాలు పడాల్సిందే. నాలుగయిదు రోజులు ముందుగా ఆర్డరిస్తే తప్ప  ఏదైనా దొరకని పరిస్థితి. భోగి మంటలకు పిడకలు,  గొబ్బెమ్మలకు పేడ కావాలి. ఈ రెండింటినీ తామే అందిస్తున్నామంటున్నాయి... కొన్ని ఈ-కామర్స్‌ సంస్థలు. ఆవు పేడ ముద్ద ఒక్కొక్కటీ రూ.60, 70కు విక్రయిస్తున్నాయి. ఎండిన ఆరు పిడకలు రూ.110-120, పెద్దసైజువి కావాలంటే రెండూ రూ.160 వరకూ వసూలు చేస్తున్నాయి.  భోగిమంటలకు కావాల్సిన సామగ్రినీ ఆన్‌లైన్‌లో ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. 
నోరూరించే.. సంప్రదాయ రుచులు 

           రోజూ అదే దోసె.. అదే బిర్యానీ.. పండుగరోజైనా సంప్రదాయ వంటలు రుచి చూద్దామనుకుంటున్నారా... సొంతూరు వెళ్లలేక ఇక్కడే ఉన్నారా! అయినా ఏం పర్లేదు.. అచ్చమైన తెలుగు రుచులు.. పల్లెల్లో అమ్మమ్మ/నానమ్మలను గుర్తు చేసే చేతి వంటలను మీ చెంతకు చేరుస్తామంటున్నారు కొందరు. పండుగ సందర్భంగా నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వాహకులు సంక్రాంతి ప్రత్యేక ఆహారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పులిహోర, నాటుకోడికూర, పప్పుచారు, అరిసెలు, బందరు లడ్డు, బూందీ లడ్డు, పెరుగు ఆవడలను అందిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించేందుకు రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. రూ.600 నుంచి ప్రారంభ ధర నిర్ణయించారు. పండుగ రోజు బయటకు ఏం వెళ్దాములే... అని అనుకునే వారికి.. కోరుకున్న పిండివంటలు, ఇష్టపడే ఆహార పదార్థాలను ఇళ్లకే పంపుతామంటున్నారు కొందరు మిఠాయి దుకాణాల నిర్వాహకులు. అరిసెలు, బొబ్బట్లు, కజ్జికాయలు, జంతికలు, గవ్వలు, చెక్కలు, సున్నుండలు, పూతరేకులను ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నారు. మరికొందరు పులిహోర, పాయసాలనూ రుచి చూపుతున్నారు. 
ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు
             తెలుగు వారు ఎంతదూరం వెళ్లినా సంప్రదాయాలను వదలరు. పండుగలను అస్సలు విస్మరించరు. అయినవారి మధ్య జరుపుకోలేని సంబరాలను... చుట్టూ ఉన్నవారితో పంచుకోవటం ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. ఎంతటి ఆధునికత పలుకరించినా.. సాంకేతిక పరిజ్ఞానం చేరువైనా.. తెలుగింట.. సంక్రాంతి తెచ్చే ఆనందమే వేరు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా నగరవ్యాప్తంగా స్థిరపడ్డారు. ఉద్యోగ.. వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. వివిధ కారణాల వల్ల సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడ ఉండిపోయారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వటంతో సమయం సద్వినియోగమయ్యేలా అమ్మాయిలకు ముగ్గులు వేయటం నేర్పిస్తున్నామంటున్నారు బంజారాహిల్స్‌ నివాసి రత్న. 
సరదా... సంబరం                సంక్రాంతి అంటే ఓ సరదా.. సంబరం.. ఆత్మీయుల మధ్య చేసుకునే అందమైన వేడుక. ఏడాదిలో వచ్చే తొలిపండుగ. మూడురోజుల ముచ్చటైన సంతోషం. అరిసెలు. గారెలు.. చక్కిలాలు.. నోరూరించే పిండివంటలు. పిల్లలు.. పెద్దలు.. కుటుంబ సభ్యుల సంతోషతీరం. చిన్నారులకు భోగిపళ్లు..  యువతకు సరదా పందేలు. ఇప్పటికే చాలామంది నగరవాసులు సొంతూళ్లలో బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు. ఇక్కడే ఉన్నవారు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. రెండు మూడు రోజులుగా ప్రతి ముంగిటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ముంగిళ్లలో తీర్చిదిద్దిన రంగవల్లికలు.. ముచ్చటగా కనిపించే గొబ్బెమ్మలతో చాలా ముందుగానే సంక్రాంతి వచ్చిందా అనిపించింది.

12, జనవరి 2019, శనివారం

30 ఏళ్లుగా ‘టీ’ మాత్రమే ఆమె ఆహారం..!


                   కోరియా: చల్లటి వాతావరణంలో వేడి వేడిగా టీ తాగితే ఆ మజానే వేరు. కానీ అదే టీ ఆహారంగా మారితే.. చాలా కష్టమేమో. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం 30ఏళ్లుగా ఛాయ్‌నే ఆహారంగా తీసుకుంటుంది. ఏదైనా జబ్బు వల్ల ఆమె అలా చేస్తుందేమోనని కుటుంబసభ్యులు ఎంతోమంది వైద్యులకు చూపించారు. కానీ ఆమె పరిస్థితి చూసిన వైద్యులే ఆశ్చర్యపోయారు. 30ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతూ ఎంతో ఆరోగ్యంగా ఉండటం నిజంగా ఆశ్చర్యమైన విషయమని అంటున్నారు.
                    బరాడియా గ్రామానికి చెందిన పిల్లై దేవి తన 11వ ఏట నుంచి టీ తాగడం మొదలుపెట్టింది. ‘నా కూతురు ఒకసారి జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొని ఇంటికి వచ్చింది. గబాగబా అన్నం తిని, మంచినీళ్లు తాగింది. ఆ తర్వాత టీ, బ్రెడ్‌, బిస్కెట్లు తీసుకుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె కేవలం బ్లాక్‌టీ మాత్రమే తాగడం ప్రారంభించింది. ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం టీని మాత్రమే తీసుకోవడంతో మేం ఆందోళన చెందాం. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చూపించాం. కానీ ఆమె ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడటం లేదని వాళ్లు చెప్పారు’ అని ఆమె తండ్రి రతిరాం చెప్పుకొచ్చారు. పిల్లై దేవి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయినట్లు జిల్లా హాస్పిటల్‌లో పనిచేసే డా.ఎస్‌.కె.గుప్తా తెలిపారు. కేవలం టీ మాత్రమే తాగుతూ జీవించి ఉండటం నిజంగా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇది ఆశ్చర్యం’ అని ఆయన పేర్కొన్నారు. టీ మాత్రమే ఆహారంగా సేవిస్తున్న ఆమెను అక్కడ అందరూ ‘ఛాయ్‌ వాలి ఛాఛి’ అని పిలుస్తుంటారు. ఆమె ఇంట్లో నుంచి చాలా తక్కువ సార్లు బయటకు వస్తుందట. రోజు మొత్తం శివనామస్మరణలోనే గడుపుతోందని ఆమె సోదరుడు చెప్పుకొచ్చాడు.

11, జనవరి 2019, శుక్రవారం

తల్లీ పిల్లల ఉసురు తీసిన ఆచారం!


రుతుక్రమం సమయంలో గుడిసెలో జీవనం 

నేపాల్‌లో ఊపిరాడక ముగ్గురి మృతి
కాఠ్‌మండూ: అనాదిగా కొనసాగుతున్న ఓ ఆచారం నేపాల్‌లో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. రుతుక్రమం సమయంలో ఆమెను వేరుగా ఓ గుడిసెలో ఉంచడంతో గాలీ వెలుతురు లేక ఊపిరాడక ఆమెతో పాటు ఇద్దరు కుమారులు (9, 12 ఏళ్ల పిల్లలు) మృతి చెందారు. బజూరా జిల్లాలో అంబా బోహోరా అనే మహిళ రుతుక్రమం నేపథ్యంలో మంగళవారం రాత్రి భోజనం అనంతరం తన ఇద్దరు పిల్లలతో నిద్రపోయేందుకు ఓ చిన్న గుడిసెలోకి వెళ్లారు. దానికి సమీపంలో చలిమంట వేయగా అక్కడ ఉంచిన ఓ దుప్పటికి నిప్పంటుకుని పొగ వ్యాపించింది. గుడిసెకు కిటికీలు లేకపోవడంతో గుడిసె అంతా పొగతో నిండిపోయింది. మరుసటి రోజు ఆమె అత్త గుడిసెలోకి వెళ్లి చూడగా ముగ్గురూ మృతి చెందారు. పొగ కారణంగా ఊపిరాడక తల్లీ పిల్లలు చనిపోయినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనపై ఓ బృందం దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు.

10, జనవరి 2019, గురువారం

ఉన్నత ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి..


ఆమె పేరు మిరియమ్..అతని పేరు పీటర్..ఇద్దరికీ 30 ఏళ్ల వయసు తేడా. ఉన్నతస్థాయి ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. కానీ ఏదో తెలియని అసంతృప్తి. జీతానికి, జీవితానికి మధ్య తేడాను గమనించడం మొదలుపెట్టారు. అంతే..చేస్తున్న ఉద్యోగాల్ని మానేసి, ఉంటున్న ఇంటిని వదిలేసి అప్పటి వరకు దాచుకున్న డబ్బుతో సంచారకులుగా జీవితాన్ని ప్రారంభించారు. అలా వేరు వేరు చోట్ల 12 ఏళ్ల క్రితం కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన వారు ప్రస్తుతం సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. పంచభూతాల మాదిరిగా వాళ్లకు కూడా పర్మనెంట్ అడ్రస్ అంటూ ఏమీ లేదు. ప్రపంచమంతా వారిదే..వారిద్దరి కథలు వేరైనా..గమ్యం మాత్రం ఒకటే. 
                         న్యూజిలాండ్‌కు చెందిన పీటర్‌కు ఇప్పుడు 64 ఏళ్లు. ముప్పై సంవత్సరాల క్రితం ఎకాలజీలో పీహెచ్‌డీ చేసిన పీటర్..లెక్చరర్‌గా ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. గంటకు 50 డాలర్ల జీతంతో జీవితం బానే సాగిపోతోంది. అయితే, నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేస్తున్న పీటర్..ఇదేనా జీవితం అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి నాలుగు గోడల మధ్య బతకడం జీవితం కాదని తెలుసుకున్న పీటర్ ఆ గోడలను బద్దలుకొట్టి ప్రకృతిలో భాగమవ్వాలనుకున్నాడు. అంతే..చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పేశాడు. ఇంటిని కూడా ఎవరికో అప్పగించేసి సంచారకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. అదే విధంగా నెదర్లాండ్స్‌లో జన్మించిన మిరియమ్ క్రీడాకారిణిగా జీవితం మొదలుపెట్టింది. కానీ, ట్రావెలింగ్ చేస్తూ బతకాలని ఆమె కోరిక. అందుకే క్రీడారంగాన్ని వదులుకుని సంచారకురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నెదర్లాండ్స్ నుంచి భారతదేశం వచ్చింది. అదే సమయంలో ఇండియాకు వచ్చిన పీటర్‌ను కలుసుకుంది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని కలిసి చూట్టేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
              ఇరువురూ దాచుకున్న 40,000 పౌండ్లతో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సంవత్సరానికి వారికయ్యే ఖర్చు కేవలం 3,000 పౌండ్లు మాత్రమే. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే వారు అడవులు, పర్వతాలలో నివసిస్తూ మనుషులకు దూరంగా..ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బల్గేరియాలోని పర్వత ప్రాంతంలో నివాసముంటున్న వారిని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా ఈ వివరాలన్నీ వెల్లడించారు. నిజానికి మిరియమ్ ఓ వెజిటేరియన్. కానీ, అడవుల్లో జీవించడం మూలంగా ఓపిక కోసం మాంసాహారిగా మారింది. మరియమ్, పీటర్ ఆహారం విషయంలో కూడా ఓ పద్దతిని పాటిస్తున్నారు. వేటాడి ఆహారాన్ని తీసుకొచ్చే బాధ్యత మరియమ్‌ది కాగా, దాన్ని రుచిగా వండే బాధ్యత పీటర్‌ది. చిన్న చిన్న జంతువులను వేటాడటానికి తనకు రెండేళ్ల సమయం పట్టిందంటూ మరియమ్ చెప్పుకొచ్చింది. మొదట్లో వాటిని చంపడం బాధాకరంగా అనిపించినప్పటికీ..తమ జీవనానికి తప్పడం లేదంటోంది. అయితే ట్రావెలింగ్ సమయంలో దారిలో కనిపించే స్టోర్లలో మాత్రం కావాల్సిన నిత్యవసర వస్తువులు కొన్ని కొనుక్కుంటారు. వారి షాపింగ్‌లో సబ్బులు, షాంపూలు వంటివి ఉండవు. ఎందుకంటే అడవుల్లోని ఆకులతోనే వారు ఒంటిని శుభ్రం చేసుకుంటున్నారు. జుట్టును మాత్రం తన మూత్రంతో క్లీన్ చేసుకుంటానంటూ మరియమ్ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది. ప్రతి రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, ట్రాఫిక్‌లో గంటలు గంటలు ఉండటం కంటే ఈ జీవితం తనకు ఎంతో తృప్తిగా ఉందంటోంది మరియమ్.
                  చాలామంది తమ దగ్గరున్న డబ్బు అయిపోతే ఏం చేస్తారంటూ ప్రశ్నించారని మిరియమ్, పీటర్ చెప్పారు. వారికి ఆర్థిక విషయాలపై ఎటువంటి దిగులు లేదని, డబ్బులు కావాలంటే మళ్లీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటామన్నారు. అయితే అందరూ బతుకుతున్నట్టు మాత్రం తాము బతకమని తేల్చిచెప్పారు. 30 ఏళ్ల వయసు తేడా ఉన్న వ్యక్తితో సహజీవనంపై పీటర్‌ను ప్రశ్నించగా..వయసుతో తనకు సంబంధం లేదంటూ..ఇలానే బతకాలి అని హద్దులు ఎవరు పెట్టారని బదులిచ్చాడు. మరోపక్క తనకు నచ్చినట్టు జీవిస్తున్నానని..తామిద్దరం ఒకరికి ఒకరు సొంతమేమి కాదని, భవిష్యత్తులో ఒంటరిగా ఉండాలనుకుంటే అలానే ఉంటానని మరియమ్ చెప్పింది. పిల్లల గురించి మాట్లాడుతూ..తనకు పిల్లల్ని కని మళ్లీ సాధారణ జీవితాన్ని మొదలుపెట్టాలనే ఆలోచన లేదంది. పీటర్ మాత్రం జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని..మళ్లీ సాధారణ జీవితానికి వెళ్లే అవకాశాలు ఉంటాయేమో అని అన్నాడు. కానీ, తనకు మాత్రం సాధారణ జీవితం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. 

9, జనవరి 2019, బుధవారం

ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం


             దిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఈబీసీ బిల్లుకు అనుకూలంగా 149 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఏడుగురు సభ్యులు ఓటు వేశారు. బిల్లను సెలెక్టు కమిటీకి పంపాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18 మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్న సవరణతో పాటు, విపక్షాల సవరణ ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి. లోక్‌సభలో మంగళవారం ఆమోదం పొందిన రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ యథాతథంగా ఆమోదం తెలిపింది. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది.
                అంతకు ముందు కేంద్ర సామాజిక, న్యాయశాఖమంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ... ఈబీసీలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాని బిల్లు తెస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారి చేయూతకు ఇంతకన్నా మంచి ఉపాయమేమైనా ఉందా అని ప్రశ్నించారు. రెండు, మూడు పార్టీలు తప్ప అన్ని రాజకీయ పక్షాలు బిల్లుకు మద్దతిస్తున్నాయని తెలిపారు. చరిత్రాత్మక బిల్లులో భాగస్వాములైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

8, జనవరి 2019, మంగళవారం

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం‌

 
దిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై చర్చ ముగింపు సందర్భంగా.. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15కి క్లాజ్‌(6), 16కి క్లాజ్‌(6) చేరుస్తున్నామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం మా ప్రభుత్వమే క్రిమిలేయర్‌ పరిమితిని రూ. 6లక్షల నుంచి 8లక్షలకు వరకు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరి అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పష్టం చేశారు. సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్‌ పద్దతిలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా 323 మంది సభ్యులు, వ్యతిరేకంగా ముగ్గురు సభ్యులు ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదాపడింది.

7, జనవరి 2019, సోమవారం

ఆకలికి తట్టుకోలేక.....


                 దేశంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడం లేదు అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఆకలికి తట్టుకోలేని చిన్నారులు పురుగుల మందు తాగిన సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ సమితి ( ఎన్‌సీపీసీఆర్‌) తెలిపిన వివరాల ప్రకారం... డిసెంబర్‌ 31న మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కొందరు గిరిజనులకు రేషన్‌ దుకాణాల నుంచి అందవలసిన సరుకులు అందలేదు. దీంతో  చాలా కుటుంబాలు ఆకలితో పస్తులుంటున్నాయి. ఆ కుటుంబాల్లోని కొందరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక పంటపొలాల్లో ఉపయోగించే పురుగుల మందు తాగారు. పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

6, జనవరి 2019, ఆదివారం

రైల్వే స్టేషన్లకు 20 నిమిషాల ముందు రావాల్సిందే



                    విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఎదుర్కొనే భద్రతా నిబంధనలను ఇకపై రైల్వే స్టేషన్లలోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రైల్వేశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకుంది. విమానాశ్రయాల్లో విమానం బయలుదేరే నిర్దిష్ట సమయానికి గంటల వ్యవధి ముందే సెక్యూరిటీ చెక్‌ ప్రక్రియ కోసం ప్రయాణికులు చేరుకోవాలనే నిబంధన ఉంది. అదే విధానాన్ని రైల్వే స్టేషన్లలోనూ అమలు చేయనున్నారు. దీని ప్రకారం ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకొని సెక్యూరిటీ చెక్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలుత ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ నెలలో అమలు చేయనున్నారు. దీంతో పాటు కర్ణాటకలోని హూబ్లీ సహా మరో 202 స్టేషన్లనూ ఎంపిక చేశామని రైల్వే భద్రతాదళ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు.

5, జనవరి 2019, శనివారం

ఈ చేప ఖరీదు.. రూ. 21కోట్లు


                       టోక్యో: చేప ధర ఎంత ఉంటుంది. రకాన్ని బట్టి కిలో రూ. 200 నుంచి ఐదారు వందలు పలుకుతుంది. ఇక గోదావరి నదిలో దొరికే పులస చేప కాస్త ఎక్కువే. కిలో రూ. 10వేల దాకా ఉంటుంది. కానీ జపాన్‌లోని ఓ చేప ధర రూ. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 21కోట్లు పలికి ఔరా అనిపించింది. 
                   సముద్ర చేపల్లో అత్యంత రుచిరకంగా ఉండే చేపగా టునా చేప ఖ్యాతి పొందింది. అందుకే దీని ధర కూడా భారీగానే ఉంటుంది. అయితే ఈ చేపలు తక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటాయి. దీంతో వీటిని వేలం వేస్తారు. టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సుకిజీ చేపల మార్కెట్లో ఏటా నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున టునా చేపల వేలం కార్యక్రమం జరుగుతుంది. గతేడాది ఈ చేపల మార్కెట్‌ను సుకిజీ నుంచి టొయోసుకు మార్చారు. ఈ ఏడాది టొయోసు మార్కెట్లో జరిగిన వేలంలో 278 కిలోల భారీ బ్లూఫిన్‌ టునా చేప ఏకంగా రూ. 21కోట్లు పలికింది.
టునా చేపలను విరివిగా కొనుగోలు చేసే స్థానిక సుషీ రెస్టారెంట్ల యజమాని కియోషీ కిమురానే ఈ సారి కూడా బ్లూఫిన్‌ టునాను దక్కించుకున్నారు. తాజాగా జరిగిన వేలంలో ఈ చేపను 333.6 మిలియన్‌ యన్‌లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 21కోట్లు) కిమురా కొనుగోల చేశారు. అంతక్రితం 2013లో జరిగిన వేలంలోనూ కిమురా 155 మిలియన్‌ యన్‌లను(భారత కరెన్సీలో దాదాపు రూ. 9కోట్లు) చెల్లించి టునా చేపను దక్కించుకున్నారు. తాజాగా అంతకు రెట్టింపు ధర పలికింది.
                టునా చేపకు జపాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. సుషీ రెస్టారెంట్లలో ఈ చేప ఓ ముక్క ధర రూ. వేలల్లో ఉంటుంది. ఈ సారి ధర కాస్త ఎక్కువైనప్పటికీ కస్టమర్ల నుంచి అంతే స్థాయిలో డిమాండ్‌ ఉంటుందని కిమురా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

4, జనవరి 2019, శుక్రవారం

త్వరలో మరో 14 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ

విజయవాడ: గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31లోపు నోటిఫికేషన్లు ఇచ్చామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. మొత్తం 21 నోటిఫికేషన్ల ద్వారా 3250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్షల తేదీలతో పాటు ఖాళీల వివరాలను సైతం గతంలో కంటే భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామని వివరించారు. ఈ నెలాఖరు లోపు 1500 ఉద్యోగాల భర్తీకి మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

త్వరగా దరఖాస్తు చేసుకోండి
                       గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు 47,001 దరఖాస్తులు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఉద్యోగాలకు 16,130, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు 5411, హార్టికల్చర్‌ అధికారి ఉద్యోగాలకు 1307 దరఖాస్తులు అందాయని తెలిపారు. మిగతా నోటిఫికేషన్లకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందని, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలకు మొత్తం 56,621 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తులు చేస్తుండటం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు ఎక్కువగా ఓటీపీఆర్‌ సంబంధిత ఇబ్బందులే వస్తున్నాయని, వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామన్నారు.