సముద్ర చేపల్లో అత్యంత రుచిరకంగా ఉండే చేపగా టునా చేప ఖ్యాతి పొందింది. అందుకే దీని ధర కూడా భారీగానే ఉంటుంది. అయితే ఈ చేపలు తక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటాయి. దీంతో వీటిని వేలం వేస్తారు. టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సుకిజీ చేపల మార్కెట్లో ఏటా నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున టునా చేపల వేలం కార్యక్రమం జరుగుతుంది. గతేడాది ఈ చేపల మార్కెట్‌ను సుకిజీ నుంచి టొయోసుకు మార్చారు. ఈ ఏడాది టొయోసు మార్కెట్లో జరిగిన వేలంలో 278 కిలోల భారీ బ్లూఫిన్ టునా చేప ఏకంగా రూ. 21కోట్లు పలికింది.
టునా చేపలను విరివిగా కొనుగోలు చేసే స్థానిక సుషీ రెస్టారెంట్ల యజమాని కియోషీ కిమురానే ఈ సారి కూడా బ్లూఫిన్ టునాను దక్కించుకున్నారు. తాజాగా జరిగిన వేలంలో ఈ చేపను 333.6 మిలియన్ యన్‌లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 21కోట్లు) కిమురా కొనుగోల చేశారు. అంతక్రితం 2013లో జరిగిన వేలంలోనూ కిమురా 155 మిలియన్ యన్‌లను(భారత కరెన్సీలో దాదాపు రూ. 9కోట్లు) చెల్లించి టునా చేపను దక్కించుకున్నారు. తాజాగా అంతకు రెట్టింపు ధర పలికింది.
టునా చేపకు జపాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. సుషీ రెస్టారెంట్లలో ఈ చేప ఓ ముక్క ధర రూ. వేలల్లో ఉంటుంది. ఈ సారి ధర కాస్త ఎక్కువైనప్పటికీ కస్టమర్ల నుంచి అంతే స్థాయిలో డిమాండ్ ఉంటుందని కిమురా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి