14, జులై 2020, మంగళవారం

పదో తరగతి పరీక్షల రద్దుపై అధికారిక ఉత్తర్వులు

                    అమరావతి: పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ అప్పట్లో నిర్ణయించింది. అయితే స్థానిక ఎన్నికల ప్రకటన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 31 నుంచి ఏప్రిల్ 17కు మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆలోపే కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏప్రిల్ 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే జిల్లాల కలెక్టర్లు చాలా మంది కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పోలీస్, మెడికల్ సిబ్బంది కోవిడ్ విధుల్లో ఉన్నందున పరీక్షల నిర్వహణ తలకు మించిన భారంగా ఉంటుందని వారు తెలిపారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. అనేక విధాలుగా పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ పరిశీలించిన తరువాత విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ఎవరైతే పదవ తరగతిలో రిజస్టర్ అయి పరీక్షల కోసం హాల్ టికెట్లు తీసుకున్న వారందరూ పాస్ అయినట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పాస్ అయిన విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్లు ప్రకటించ కూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

11, జులై 2020, శనివారం

గిన్నిస్‌ రికార్డు కెక్కిన భారత్‌లో పులుల లెక్కింపు ప్రక్రియ

                 హైదరాబాద్‌: అంతర్జాతీయ పులల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘అఖిలభారత పులుల లెక్కింపు-2018’ నాలుగో దశ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వేగా గిన్నిస్‌రికార్డు సృష్టించింది. ఇదొక గొప్ప క్షణం...ఆత్మనిర్బర్‌ భారత్‌కు ప్రకాశవంతమైనది అంటూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌జవడేకర్‌ ట్వీట్‌చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుండే సంకల్ప్‌ సే సిద్ధిగా ఆయన అభివర్ణించారు. పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని చేసిన తీర్మానాన్ని,లక్ష్యానికి నాలుగేళ్ల ముందే నిలబెట్టుకున్నామని జవడేకర్‌ చెప్పారు. కొత్తలెక్కల ప్రకారం భారత దేశంలో 2967 పులులు ఉన్నాయన్నారు. దీంతో ప్రపంచంలో ఉన్న పులుల్లో 75శాతం భారత్‌లోనే ఉన్నాయని ఆయన వివరించారు. 2022 నాటికి దేశంలో పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 2010లో తీర్మానించామని, 
            ఆ లక్ష్యానికి నాలుగేళ్ల ముందే దానిని సాధించామని చెప్పారు. వనరు, సమాచార పరంగా 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో దశ చాలా సమగ్రమైనది. 141 ప్రాంతాల్లోని 26,838 చోట్ల కెమెరాలు ట్రాప్‌లు (మోషన్‌సెన్సార్లతో అమర్చిన కెమెరాలు, జంతువు ఆ పరికాల ఎదుట నుంచివెళుతున్నప్పుడు ఫోటో తీస్తాయి) అమర్చారు. 1,21,337 చ.కి.మీ. (46,848 చ.మై) విస్తీర్ణంలో సర్వే జరిగింది.  కెమెరా ట్రాప్‌లు మొత్తం 3,48,58,623 ఫోటోలు (వీటిలో 76,651 పులులు, 51,777 చిరుతలు, మిగిలినవి ఇతర జంతుజాలం) తీశాయి. వీటి నుంచి 2,461 పులులను (పులికూనలుకాక) చారలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించారని గిన్నీస్‌బుక్‌సైట్‌లో రాశారు.
                వన్య ప్రాణుల సంస్థ సాంకేతిక సాయంతో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ యంత్రాంగం పులుల జనాభా లెక్కింపు చేపడుతుంది. రాష్ట్ర అటవీ శాఖలు, వాటి భాగస్వాములు ఈ గణన చేపడతాయి. ప్రపంచవ్యాప్తంగా 50 పులుల సంరక్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలు, మన దేశంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ కార్యక్రమానికి సాటిరాలేదు. పులుల సంరక్షణలో భారత్‌ అగ్రస్థానంలో వుంది. భారత్‌ చేపట్టిన చర్యలను బంగారు ప్రమాణాలుగా ప్రపంచం భావిస్తోంది. 

10, జులై 2020, శుక్రవారం

నిషేధం విధించిన 59 చైనా యాప్స్‌కు 79 ప్రశ్నలతో భారత్ నోటీసులు

నిషేధం విధించిన చైనా యాప్స్‌కు భారత్ 79 ప్రశ్నలు
జూలై 22లోగా స్పందించకపోతే...
              న్యూఢిల్లీ: నిషేధం విధించిన 59 చైనా యాప్స్ యాజమాన్యాలకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను భారత్ పంపింది. ఈ నోటీసులో పంపిన ప్రశ్నలకు మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని సదరు యాప్స్‌కు స్పష్టం చేసింది. జూలై 22 లోపు స్పందించకపోతే 59 యాప్స్‌ను శాశ్వతంగా నిషేధిస్తామని భారత్ హెచ్చరించింది. ఈ యాప్స్ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి, గ్లోబల్ సైబర్ వాచ్‌డాగ్స్ నుంచి భారత్ ఇప్పటికే డేటా తెప్పించుకున్నట్లు సమాచారం.
             సదరు యాప్స్ స్పందనకు, తెప్పించుకున్న డేటాకు పొంతన సరిపోయిందో లేదో భారత్ పోల్చి చూడనుంది. ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా ఈ యాప్స్ భారత్‌లో మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. యాప్స్ కార్పొరేట్ మూలాలు, మాతృ సంస్థల నిర్మాణం, నిధులు, డేటా మేనేజ్‌మెంట్, కంపెనీ సర్వర్లకు సంబంధించి చైనీస్ యాప్స్‌కు పంపిన ఆ 79 ప్రశ్నల్లో భారత్ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.