14, జులై 2020, మంగళవారం

పదో తరగతి పరీక్షల రద్దుపై అధికారిక ఉత్తర్వులు

                    అమరావతి: పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ అప్పట్లో నిర్ణయించింది. అయితే స్థానిక ఎన్నికల ప్రకటన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 31 నుంచి ఏప్రిల్ 17కు మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆలోపే కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏప్రిల్ 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే జిల్లాల కలెక్టర్లు చాలా మంది కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పోలీస్, మెడికల్ సిబ్బంది కోవిడ్ విధుల్లో ఉన్నందున పరీక్షల నిర్వహణ తలకు మించిన భారంగా ఉంటుందని వారు తెలిపారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. అనేక విధాలుగా పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ పరిశీలించిన తరువాత విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ఎవరైతే పదవ తరగతిలో రిజస్టర్ అయి పరీక్షల కోసం హాల్ టికెట్లు తీసుకున్న వారందరూ పాస్ అయినట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పాస్ అయిన విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్లు ప్రకటించ కూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

కామెంట్‌లు లేవు: