22, అక్టోబర్ 2020, గురువారం

ఉచిత వ్యాక్సిన్‌కు రూ.50వేల కోట్లు, ఒక్కొక్కరికీ రూ.450 ఖర్చు

 

న్యూఢిల్లీ: కరోనా నివారణకు వ్యాక్సిన్‌ సిద్దమయిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమౌతోందని ఎన్‌డిటివి పేర్కొంది. ప్రభుత్వ వర్గాల్లో ఉన్న వ్యక్తుల ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు 50 వేల కోట్ల రూపాయలను సిద్దం చేసిందని ఒక నివేదికలో ఎన్‌డిటివి తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలోపే ఈ డబ్బును వాడుకునేవిధంగా సిద్దం చేసిందని చెప్పింది. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు రెండు దఫాలుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దఫాల వ్యాక్సిన్‌కు ఒక్కొరికీ 150 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనికితోడు వ్యాక్సిన్‌ను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు, వాటి నిల్వ ఉంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించేందుకు ఒక్కొక్కరికీ మరో మూడు వందల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తం ఒక్కొ వ్యక్తిపై 450 రూపాయలవరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ అంచనాల మేరకే మొత్తం 50 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసుకున్నట్లుగా ఎన్‌డిటివి తెలిపింది.

20, అక్టోబర్ 2020, మంగళవారం

బీహార్‌లో గెలిచేదెవరో చెప్పేసిన సర్వే

 పాట్నా: బీహార్‌లో గెలవబోయేదెవరో లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. జెడియూ-బీజేపీ సారధ్యంలో ఎన్డీయే 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. 243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారధ్యం వహిస్తోన్న లోక్‌ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం లభించవచ్చని, ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీయేకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.  
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 28న తొలి విడత, నవంబర్ 3న రెండో విడత, నవంబర్ ఏడున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ పదిన ఫలితాలు ప్రకటిస్తారు. 

11, అక్టోబర్ 2020, ఆదివారం

 


                  ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అంగారక గ్రహం(మార్స్‌) మంగళవారం నాడు భూమితో కలిసి ఒకే సరళ రేఖపైకి రానుంది. ఆ సమయంలో అది మునుపటి కన్నా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రతి 26 నెలలకు అంటే దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అమరిక కుదురుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి, అంగారకుడు తిరిగి వాటి వేర్వేరు కక్ష్యల్లోకి సాధారణ స్థితికి వెళ్లడానికి ముందు దగ్గరగా తిరుగుతాయి. కాబట్టి అంగారక గ్రహం భూమిపై ఉన్న మనకు అతి పెద్దగా, కాంతిమంతంగా గోచరిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు అపోజిషన్‌(వ్యతిరేకత) అని పిలిచే ఈ ఖగోళ అద్భుతాన్ని మంగళవారం రాత్రి చూడొచ్చు. రాత్రి 11.20 గంటల సమయంలో సూర్యుడు, భూమి, అంగారకుడు ఈ మూడు ఒకే సరళ రేఖపైకి రానున్నాయి. అ అపురూప దృశ్యాన్ని తిలకించడం కోసం అర్ధరాత్రి వరకూ వేచివుండక్కర్లేదని, సాయంత్రం 9 లేదా 10 గంటల సమయంలో ఆగేయ ప్రాంతంలో సులువుగా చూడొచ్చని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్‌ డామియన్‌ పిచ్‌ చెప్పారు.

9, అక్టోబర్ 2020, శుక్రవారం

ఐక్య రాజ్య సమితి ఆకలిపోరాటానికి శాంతి పురస్కారం


                 క్యూబా డాక్టర్లను నోబెల్‌ శాంతి పురస్కారంతో సత్కరించాలన్న ప్రపంచ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి నార్వే నోబెల్‌ అకాడెమీ ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి)కి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి విభాగమైన డబ్ల్యుఎఫ్‌పి ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థఅని, ఆకలిదప్పులను నిర్మూలించి, ఆహారభద్రతకు పాటుపడుతోందని నోబెల్‌ కమిటీ చైర్మన్‌ బెరిట్‌ రెస్‌ ఆండర్సన్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ దిశలో ఆ సంస్థ జరిపిన బహుముఖ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థకు ఇస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రతపై పాలకులకు మరిన్ని సందేశాలు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ద్వారా భవిష్యత్తులో ఇవ్వాలని ఆశిద్దాం.

బీహార్‌ ఎన్నికలపై పాశ్వాన్‌ మృతి ప్రభావం ఎంత?


               మరికొద్ది రోజుల్లో బీహార్‌లో ఎన్నికలు జరగుతుండగా ఆ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడైన రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ గురువారం మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన మృతి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) బాధ్యతలు స్వీకరించిన ఆయన కొడుకు చిరాగ్‌ పాశ్వాన్‌ నితిష్‌కుమార్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాడు. కానీ బిజెపికి మాత్రం సహకరిస్తున్నాడు. బిజెపి పోటీచేసే సీట్లలో పోటీ పెట్టకుండా కేవలం జెడియు పోటీ చేసే స్థానాలపైనే గురి పెట్టాడు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌.. మృతికి ముందు కొద్ది నెలల నుంచి అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎన్డీయే నుంచి బయటకొచ్చి పోటీ చేయాలన్న చిరాగ్‌ నిర్ణయంపై బిజెపి నేత సుశీల్‌ మోడీ మాట్లాడుతూ రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ క్రియాశీలకంగా ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అన్నాడు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కూడా మాట్లాడుతూ సీనియర్‌ పాశ్వాన్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న మంచి సంబంధాల కారణంగానే పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
బీహార్‌ ఎన్నికలపై పాశ్వాన్‌ మృతి ప్రభావం ఎంత?

ఎన్నికల సమయంలో ప్రజల అంతరంగాన్ని అంచనా వేయడంలో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ దిట్ట. అందుకనే ఆయన్ను రాజకీయ పండితుడు అని కూడా అంటారు. 1999లో పాశ్వాన్‌ తన బిజెపి వ్యతిరేక వైఖరిని విడిచి పెట్టి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో నితీష్‌కుమార్‌తో కలిసి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 54 పార్లమెంట్‌ సీట్లలో ఆర్‌జెడి ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. లాలూప్రసాద్‌ తన స్వంత నియోజకవర్గమైన మాధేపూర్‌ను కూడా కోల్పయాడు. తర్వాత 2004 ఎన్నికల్లో బిజెపిని వదిలేసి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఏతో కలిశాడు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌, పాశ్వాన్‌, కాంగ్రెస్‌ కూటమి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని కూటమిని చిత్తుగా ఓడించింది. ఒక్క 2009లో మాత్రం రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తన హాజీపూర్‌ స్థానాన్ని కోల్పయాడు. 2014 వరకు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఆ తర్వాత 2014లో మోడీని ఎవ్వరూ నిలువరించలేరని భావించిన పాశ్వాన్‌ తిరిగి బిజెపితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో బిజెపిని వీడిన నితీష్‌కుమార్‌ మూడేళ్ల కాలంలోనే ఆర్జేడి,కాంగ్రెస్‌కు మోసం చేసి తిరిగి ఎన్డీయేలో చేరాడు.
           రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ చనిపోగానే బీహార్‌లోని కొందరు రాజకీయ విశ్లేషకులు చిరాగ్‌ పాశ్వాన్‌ రాజకీయ వ్యూహంలో మార్పులు జరిగే అవకాశముందని అంచనా వేశారు. అయితే ఇప్పటికే చిరాగ్‌ పెద్ద రాజకీయ ఎత్తుగడే వేశాడు. ఈ ఎత్తుగడ అతన్ని చావో రేవో అని తేల్చుకునే పరిస్థితిలోకి నెట్టింది. బీహార్‌లో 223 అసెంబ్లీ సీట్లకు గాను అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవరబర్‌ ఏడు తేదీల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. నవరబర్‌ పదో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో తనవైఖరిపై చిరాగ్‌ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశాడు. నితీష్‌కుమార్‌ను ఓడించాలనేదే తన లక్ష్యమని, బిజెపి స్థానాల్లో పోటిపడబోమని, బిజెపికి ఎటువంటి నష్టం కల్గించబోమని తెలిపాడు. తన తండ్రి అరోగ్యం గురించి విలేకర్లు నితీష్‌కుమార్‌ను ప్రశ్నించినప్పుడు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరించారని ఆరోపించారు. కానీ జెడియు నేతలు మాత్రం ఈ విషయంలో చిరాగ్‌ను సంప్రదించేందుకు నితీష్‌కుమార్‌ ప్రయత్నించాడని, కానీ అతను స్పందించలేదని చెబుతున్నారు.
            మరి పాశ్వాన్‌ మృతి చిరాగ్‌ ఎన్నికల వ్యూహంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనుంది? మొదట చిరాగ్‌ బిజెపి పోటీచేసే అన్ని స్థానాలు మినహా మిగిలిన 122 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో చిరాగ్‌ పెద్దగా అభ్యర్దులను నిలబెట్టకపోవచ్చుని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే 42 మంది అభ్యర్ధులు నామినేషన్‌ వేసేవారు. వారిలో ఆరుగురు బిజెపి నుండి వచ్చిన అసంతృప్త నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా బిజెపి పోటీ చేయని స్థానాల్లోనే నామినేషన్‌ వేశారు.
బీహార్‌ ఎన్నికలపై పాశ్వాన్‌ మృతి ప్రభావం ఎంత?
అయితే నితిష్‌కుమార్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి అంతగా టెన్షన్‌ పడడం లేదని జెడియు నేతలు చెబుతున్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే ఓట్లు ఉన్న పాశ్వాన్‌ దళితులు 2005 నుండి తనకెప్పుడూ వ్యతిరేకంగానే ఓటు వేశారని, ఎల్‌జెపి అభ్యర్ధులు పోటీ చేయడం వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేదని నితీష్‌ భావిస్తున్నాడు. మరో వైపు పాశ్వాన్లు మినహా మిగిలిన దళిత కులాల ఓట్లన్నింటికీ ప్రాథినిధ్యం వహిస్తున్న మహా దళిత గ్రూపుకు నాయకుడైన జతిన్‌ రామ్‌ మాంజీ తనకు మద్దతు ఇస్తున్నందున, అది తనకు కలిసివచ్చే అవకాశమని నితీష్‌ భావిస్తున్నాడు. అందుకు మంజీ నేతృత్వంలోని పార్టీకి నితీష్‌ తనకు వచ్చిన కోటాలో నుండి ఏడు సీట్లును కేటాయించాడు.
             ఈ నేపథ్యంలో చిరాగ్‌ పాశ్వాన్‌తో బిజెపి ఎలా వ్యవహరిస్తుందనేది కీలకం. ఒకవైపున నితీష్‌తో పొత్తు కొనసాగుతూనే చిరాగ్‌ను కూడా బిజెపి ట్రంప్‌ కార్డు లాగా వాడుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపున చిరాగ్‌ కేంద్ర కేబినెట్‌లో తన తండ్రి స్దానాన్ని తాను పొందాలని కోరుకుంటున్నాడు. బీహార్‌లో బిజెపికి లాభం చేకూర్చే వైఖరి తీసుకోకుండా కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లడం కష్టమని చిరాగ్‌కు కూడా తెలుసు.