11, అక్టోబర్ 2020, ఆదివారం

 


                  ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అంగారక గ్రహం(మార్స్‌) మంగళవారం నాడు భూమితో కలిసి ఒకే సరళ రేఖపైకి రానుంది. ఆ సమయంలో అది మునుపటి కన్నా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రతి 26 నెలలకు అంటే దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అమరిక కుదురుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి, అంగారకుడు తిరిగి వాటి వేర్వేరు కక్ష్యల్లోకి సాధారణ స్థితికి వెళ్లడానికి ముందు దగ్గరగా తిరుగుతాయి. కాబట్టి అంగారక గ్రహం భూమిపై ఉన్న మనకు అతి పెద్దగా, కాంతిమంతంగా గోచరిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు అపోజిషన్‌(వ్యతిరేకత) అని పిలిచే ఈ ఖగోళ అద్భుతాన్ని మంగళవారం రాత్రి చూడొచ్చు. రాత్రి 11.20 గంటల సమయంలో సూర్యుడు, భూమి, అంగారకుడు ఈ మూడు ఒకే సరళ రేఖపైకి రానున్నాయి. అ అపురూప దృశ్యాన్ని తిలకించడం కోసం అర్ధరాత్రి వరకూ వేచివుండక్కర్లేదని, సాయంత్రం 9 లేదా 10 గంటల సమయంలో ఆగేయ ప్రాంతంలో సులువుగా చూడొచ్చని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్‌ డామియన్‌ పిచ్‌ చెప్పారు.