13, జనవరి 2016, బుధవారం

ఎమోషనల్ డ్రామా...


ఎమోషన్ లాజిక్‌కి అందనిది. అలాంటి ఎమోషన్‌ని కూడా లాజికల్ గా చెప్పాలనుకోడం లెక్కల్లో త్రికోణమితి చాప్టర్ లాంటిది. ఇలాంటి లెక్కల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేది సుకుమార్ మాత్రమే. ఈరోజు వెండితెరపై ఆయన తీసుకొచ్చిన చాప్టర్ పేరు 'నాన్నకు ప్రేమతో'. దాన్ని మన లెక్కల మాష్టారు ఎలా డీల్ చేశారో చూద్దాం..
              కథ: సుబ్రహ్మణ్యం అలియాస్ రమేష్ చంద్ర ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) మరో నెల రోజుల్లో చనిపోతాడనగా కోటీశ్వరుడైన తాను ఐడెంటిటీని మార్చి ఎందుకు బతుకుతున్నాడో తన ముగ్గురు కొడుకులతో చెబుతాడు. 35 వేలకోట్ల అధిపతి అయిన కె గ్రూప్ చైర్మన్ కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) తమ తండ్రి మోసం చేశాడని తెలిసినా ఇద్దరు కొడుకులు (రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల) ఏం పట్టనట్టు ఉంటారు. మూడో కొడుకు అభిరామ్ (ఎన్టీఆర్) మాత్రం తండ్రి చివరి కోరికను తీర్చడానికి కృష్ణమూర్తితో గేమ్ మొదలెడతాడు. ఆ గేమ్ ఎలా సాగింది అందులో ఎవరు గెలిచారు..? అన్నది తెరమీద చూడాల్సిందే.
                నటీనటులు: సినిమాలో ప్రత్యర్థులుగా పోటీ పడిన ఎన్టీఆర్, జగపతిబాబులిద్దరూ తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుస్తారు. రకుల్ ప్రీత్ పాటలకు మాత్రమే పరిమితం కాని పాత్రలో కనపడి పెర్ఫార్మన్స్ వైపు అడుగేసింది. సినిమాలో సొంత గొంతు వినిపించడం కూడా రకుల్‌కి ఇదే తొలిసారి. రెండింటిలోనూ మార్కులే కొట్టేసింది. రాజేంద్ర ప్రసాద్ ఉన్న కొద్ది సమయంలోనే సినిమాకి బలంగా నిలిచారు. మధుబాల ప్రత్యేక పాత్రలో కనపడగా మిగతా తారాగణం కథానుసారం రక్తి కట్టించే ప్రయత్నం చేశారు.
            సాంకేతిక విభాగం: సుకుమార్ సినిమా అనగానే అక్కడ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యక్షమవుతాడు. ఈ సినిమాలోనూ దేవీ ఆకట్టుకునే బాణీలతోను, నేపథ్య సంగీతంతోనూ మరోసారి సుక్కుతోపాటు ప్రేక్షకులను మెప్పించాడు. ఎండ్ టైటిల్స్‌లో దేవీ రాసిన బిట్ సాంగ్ చాలా బాగుంది. చంద్రబోస్ సాహిత్యం, విజయ్ కె చక్రవర్తి కెమెరా కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక్కడ ప్రత్యేకించి మరో విషయం చెప్పాలి. ప్రతీ టెక్నీషియన్ సుకుమార్‌తో కలిసి ఒక్కసారైనా పనిచేయాలనుకుంటారు. అందుకు ఆయన సినిమాలోని టైటిల్ కార్డ్ కూడా ఓ కారణం. తన ప్రతి సినిమాలోనూ చేసినట్టే ఈ సినిమాలోనూ ఓ గేమ్‌లా డిజైన్ చేసి క్లాప్స్ కొట్టించాడు.
              దర్శకత్వం - విశ్లేషణ: సుకుమార్ ఈ సినిమాలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాఠాలను కూడా ఈ సినిమాలో చెప్పారు. హీరో పరిచయం తర్వాత ఇంటర్వెల్ ముందు వరకూ ఏ యాంగిల్‌లో ఏ పని చేయాలి..?, దాని ఫలితం ఎలా ఉంటుంది..? చేసే విధానంలో తేడా వస్తే ఆ ఫలితం ఎలా మారుతుంది..? లాంటి ఎన్నో విషయాలను బోదించారు. అక్కడివరకూ సాగిన స్క్రీన్‌ప్లేని హీరోతో డైలాగుల్లో చెప్పించారు. ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఈస్ట్రోజన్‌ని 'డీఎన్ఏ'కి ముడివేసినా, హీరో పాత్రకి సంబంధించి వచ్చే సన్నివేశాలు లెక్కలతో, అంకెలతో చూపించి కెమెరా షాట్లతో లాగిస్తున్నపుడు లెక్కలంటే ఇష్టం లేని విద్యార్థి ఆ క్లాసు నుండి ఎప్పుడు పారిపోదామా అని ఎదురుచూస్తున్నట్టు ఉంటాడు సీట్లోని ప్రేక్షకుడు. అది పాత్ర ఇంటలిజెన్స్ అనుకున్నా అదంతా చేతల కంటే మాటల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఇంటర్వెల్ కొద్దిసేపటి ముందు నుండి కథ ఆసక్తికరంగా నడిపించినా ఇంటర్వెల్ ట్విస్ట్ సమయంలో పందెం కాసిన హీరో బ్రేక్ తర్వాత తండ్రి దగ్గర కనపడటం, హీరోయిన్ తల్లి గురించి హీరో తెలుసుకోవడం, చివర్లో తండ్రికి ఓ క్షణం పాటు తన విజయాన్ని చూపించడం లాజిక్‌కి అందని ఎమోషన్. చివరిగా... 'ఒక్కసారి పగిలితే అతుక్కోదు' అనే మాట గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. అది అతుక్కుంటే ఎంత బావుంటుందన్నది ఈ సినిమాలో సుకుమార్ చూపించాడు. దీనికిగాను అతడ్ని అభినందించి తీరాల్సిందే.
రేటింగ్: 2.5
నాన్నకు ప్రేమతో: కొంత ఎమోషన్.. మరికొంత కన్ఫ్యూజన్