12, జులై 2017, బుధవారం


  ధీరత్వానికి ప్రతీక.. అందానికి ప్రతిబింబం


ప్రతి దేశాధినేత విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక భవనాలుంటాయి. మన ప్రథమపౌరుడు, దేశాధిపతి అయిన రాష్ట్రపతి మన రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నివసిస్తూ అక్కడి నుంచే అధికారిక విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రపతి కోసం హైదరాబాద్, సిమ్లాలో పెద్ద పెద్ద నివాసాలే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పర్యాటనకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొఘల్ ఉద్యానవనం అందాలు, భవనంలోని శిల్పకళా చాతుర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఆ విశేషాలు మీ కోసం...వైస్రాయ్ హౌస్:
రాష్ట్రపతి భవన్‌ని స్వాతంత్ర్యానికి ముందు వైస్రాయ్ హౌస్ అని పిలిచేవారు. ఢిల్లీలోని రాజ్ పథ్‌లో ఉందీ ప్యాలెస్. ప్రపంచంలోని అత్యద్భుత కట్టడాల్లో ఇదొకటి. మొత్తం 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి మొఘల్ గార్డెన్ అదనపు అలంకారం. విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యక్ష నివాసం ఇదే. ప్రధాన భవనమే ఐదెకరాల్లో విస్తరించి
ఉంది మరి. మొత్తం భవనం విస్తీర్ణం 15 ఎకరాలు.
1911లో దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మారినప్పుడు. అప్పటి వైస్రాయ్ కోసం ఈ భవనాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 4 వేల ఎకరాలను సేకరించారు. అక్కడ ఉండే రైజినా, మాల్చా అనే గ్రామాలను ఖాళీ చేయించారు. బ్రిటిష్ శిల్పి ఎడ్విన్ లచన్స్ రాష్ట్రపతి భవన్‌కు ఆకృతినిచ్చారు. ఆయనకు బేకర్ అనే మరో శిల్పి సాయం అందించారు. 1912లో నిర్మాణం ప్రారంభించగా 1929 నాటికి పూర్తయ్యింది. మొత్తం 29 వేల మంది 17 ఏళ్లపాటు పనిచేశారు. మొఘలాయిల అట్టహాసం. యూరప్ శిల్ప శైలి రాష్ట్రపతి భవన్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
పేరు మార్పు:
1950 జనవరి 26న బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి అయ్యాక వైస్రాయ్ హౌస్ పేరు మార్చి రాష్ట్రపతి భవన్‌గా నామకరణం చేశారు. అంతకుముందు ఈ భవంతిని ప్రెసిడెంట్స్ హౌస్ అని కూడా పిలిచేవారు. రాష్ట్రపతి భవన్ నాలుగు అంతస్తులుంటుంది. మొత్తం 340 గదులున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ ఇంటికి బ్రిటన్ నుంచి అతిథులు పెద్ద సంఖ్యలో వస్తుండేవారు. వారి నివాసానికి అనుకూలంగా వీటిని తీర్చిదిద్దారు. విస్తీర్ణం రెండులక్షల చదరపు అడుగులు. దీని నిర్మాణానికి స్టీల్ ఉపయోగించలేదు.
దర్బార్ హాల్ - అశోకా హాల్:
రాష్ట్రపతి భవన్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. దర్బార్ హాల్, అశోకా హాల్. దర్బార్ హాల్‌ను రంగు రంగుల పాలరాతితో ఎంతో విలాసవంతంగా నిర్మించారు. అశోక హాల్ పర్షియా శైలిలో రంగురంగుల పైకప్పు, చెక్క ఫ్లోరింగ్‌తో నిర్మించారు. ఈ రెండు హాల్స్‌ను పార్టీలు, ఫంక్షన్లకు ఉపయోగిస్తుంటారు. దర్బార్ హాల్ ఫ్లోరింగ్ కోసం చాక్లెట్ కలర్‌లో ఉండే ఇటాలియన్ పాలరాయిని ఉపయోగించారు. కాలమ్స్ నిర్మాణానికి జైసల్మేర్ పాలరాతిని ఉపయోగించారు. దర్బార్ హాలులో ఐదు వందల మంది కూర్చునే వీలుంది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దర్బార్ హాలులోనే ప్రమాణస్వీకారం చేశారు.
ఇక్కడే రాష్ట్రపతి కోసం ప్రత్యేక గ్రంథాలయం ఉంది. ఇందులో రెండువేలకుపైగా అరుదైన పుస్తకాలున్నాయి. వీటన్నింటినీ డిజిటలైజ్ చేశారు. ఇందులో 31 లక్షలకుపైగా ఫొటోలున్నాయి. 
రాష్ట్రపతి భవన్‌లో అత్యంత అందమైనది అశోకా హాలు. హాలుమొత్తం బంగారం పూత పూసినట్లుంటుంది. అణువణువునా రాజసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అశోకాహాల్‌లోనే రాష్ట్రపతికి చెందిన ఫంక్షన్లు జరుగుతుంటాయి. ప్రమాణస్వీకారాలు, పద్మ అవార్డుల ప్రదానం, సాహస బాలలకు సత్కారం ఇలాంటి ఎన్నో విశిష్ట కార్యక్రమాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన వేదికగా అశోకా హాల్ అలరారుతోంది.
రాష్ట్రపతి డైనింగ్ హాలులో ఒకేసారి 104 మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా పొడవైన టేబుల్ ఉంది. బ్రిటిష్ రాజరికానికి ఇదో ప్రతీక. 
రాష్ట్రపతి భవన్ డోమ్... అంటే గోపురం కరెక్టుగా మధ్యలో ఉంది. భారతీయ, బ్రిటిష్ శైలులలో నిర్మించారు. భవనానికి దాదాపు రెట్టింపు ఎత్తులో ఉంటుందీ డోమ్. 1929లో డోమ్ నిర్మాణం పూర్తయ్యింది. ఐదు కిలోమీటర్ల దూరం నుంచి చూసినా ఈ డోమ్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఫౌంటైన్లు - మ్యూజియం:
రాష్ట్రపతి భవన్‌లో వాటర్ ఫౌంటైన్లు ప్రత్యేక ఆకర్షణ. మెట్ల దగ్గర ఉండే ఎనిమిది పాలరాతి సింహపు విగ్రహాల నోటి నుంచి నీరు వస్తుంటుంది. బ్రిటిష్ రాజదర్పానికిది నిదర్శనం.
2014లో రాష్ట్రపతి భవన్‌లో మ్యూజియాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్, మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. రాష్ట్రపతి భవనంలోని స్తంభాలకు అచ్చం దేవాలయాల్లో ఉన్నట్లే గంటలు పెట్టారు. ఇవి హిందూ, బౌద్ధ, జైన సంస్కృతులకు ప్రతీకగా నిలుస్తాయి. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతిలోకి ప్రవేశించే ముందు ప్రతి ద్వారం దగ్గరా ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది.
పచ్చదనం- మొఘల్ ఉద్యానవనం:
రాష్ట్రపతికి అందుబాటులో టెన్నిస్, పోలో, క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ కార్డిడార్ల పొడవే రెండున్నర కిలోమీటర్లు. 190 ఎకరాల్లో ఉద్యానవనాలున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. రాష్ట్రపతి భవన్ వెనుకాలుండే ఉద్యానవనాన్ని మొఘల్, బ్రిటిష్ శైలిలో నిర్మించారు. దీన్ని మొఘల్ గార్డెన్ అని పిలుస్తున్నారు. ఇందులోని 13 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో రకాల ఆకర్షణీయమైన పుష్పాలున్నాయి. 160 రకాల గులాబీలు ఇక్కడ పూస్తున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరిలో మొఘల్ గార్డెన్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. పష్పాలే కాదు, మొఘల్ గార్డెన్‌లోని ఫౌంటైన్లు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మొత్తం ఆరు ఫౌంటైన్లు తామరపూల ఆకారంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటి మొఘల్ గార్డెన్స్. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. ఇక్కడే మన రాష్ట్రపతి రోజూ వాకింగ్ చేస్తుంటారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఐదువేల చెట్లున్నాయి. 160 రకాల పూలమొక్కలు కనువిందు చేస్తాయి.
రాష్ట్రపతి భవన్ పాతదైపోవడంతో దీనికి 1985-89 మధ్యకాలంలో కొన్ని అదనపు హంగులు అద్దారు. 2010లో డిజైనర్లు చార్లెస్ కొరియా, సునీతా కోహ్లీ మరిన్ని హంగులు చేర్చారు. అయినా అసలు అందాలకు మాత్రం ఎక్కడా ముప్పు రానివ్వలేదు. రాష్ట్రపతి భవన్‌ను 2001లో గ్రేడ్ వన్ హెరిటేజ్ స్టక్చర్‌గా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యద్భుత ఐకానిక్ లివింగ్ హెరిటేజ్ సైట్ మన రాష్ట్రపతి భవన్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పరిరక్షకునిలాంటి రాష్ట్రపతి ఇందులో నివసిస్తారు. భారత ప్రజాస్వామ్యానికే ఇదో సౌధం లాంటిది.
హైదరాబాద్ - సిమ్లా నివాసాలు:
విశ్రాంతి తీసుకునేందుకు రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని బొల్లారం, సిమ్లాలో నివాసాలున్నాయి. చలికాలం హైదరాబాద్‌లో వేసవికాలం సిమ్లాలో రాష్ట్రపతి విశ్రాంతి తీసుకుంటుంటారు. బ్రిటిష్ వారి కాలంలోనే బొల్లారంలో వైస్రాయ్ నివాసాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటీషు వారి త‌ర్వాత నిజాం రాజులు స్వాధీన ప‌ర్చుకున్నారు. అయితే స్వాతంత్ర్యానంత‌రం 1950లో కేంద్ర ప్రభుత్వం 60 లక్షలకు కొనుగోలు చేసి రాష్ట్రపతికి దక్షిణాది విడిదిగా దీనిని తీర్చిదిద్దింది. తర్వాత పురాతన, వారసత్వ కట్టడంగా ప్రకటించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ప్రణబ్ క్రమం తప్పకుండా ఏడాదికి 15 రోజులు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇందులో 20 గదులున్నాయి. వీటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వాహణ, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ప్రకృతి ప్రేమికులను బొల్లారం భవనం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఔషధ మొక్కలను సైతం పెంచుతున్నారు.
ఇక సిమ్లాలోని రాష్ట్రపతి నివాస్‌లో బ్రిటిష్ కాలంనాటి అరుదైన ఫొటోలున్నాయి. లార్డ్ డఫ్రిన్ కాలంలో 1888లోనే సిమ్లాలోని రాష్ట్రపతి నివాస్‌ను నిర్మించారు. హెన్రీ ఇర్విన్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ దీనికి ఆకృతినిచ్చారు. పచ్చదనంతో అలలారే ఇక్కడి తోటలు రాష్ట్రపతి నివాస్‌కు ప్రత్యేక అందాన్నిచ్చాయి. అబ్జర్వేటరీ హిల్స్ పైన నిర్మించిన ఈ భవంతిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా సేవలకోసం ఉపయోగించాలని నిర్ణయించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు దీనిని బదలాయించారు. తర్వాత ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌ను నెలకొల్పారు. ఈ భవనం కొద్దిరోజులు మాత్రమే రాష్ట్రపతికి వేసవి విడదిగా ఉంది. తర్వాత సిమ్లాలోనే ఉన్న మషోబ్రా వద్ద రాష్ట్రపతి కోసం మరో విడిదిని కేటాయించారు. దానినే రిట్రీట్ బిల్డింగ్ అని పిలుస్తారు.