28, సెప్టెంబర్ 2020, సోమవారం

శ్వేత సౌధం.. చౌమహల్లా ప్యాలెస్‌

  చార్మినార్‌: చౌమహల్లా ప్యాలెస్‌ సందర్శన తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆరు

నెలలుగా చౌమహాల్లా ప్యాలెస్‌ సందర్శనను ట్రస్ట్‌ నిలిపి వేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సందర్శకుల అందుబాటులోకి వస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  

  • నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్‌ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్‌ కొనసాగుతోంది. 
  • అసఫ్‌ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌ నిలువుటద్దంగా నిలుస్తుంది.  
  • రెండో నిజాం కాలంలో చార్మినార్‌–లాడ్‌బజార్‌కు అతి సమీపంలో ఈ ప్యాలెస్‌ నిర్మాణం జరిగింది.  
  • చార్మినార్‌ కట్టడం నుంచి వాకబుల్‌ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్‌ యూరోపియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. 
  • ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. 
  • ఏకాంతం (ఖిల్వత్‌)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి.  
  • 5వ నిజాం అప్జల్‌–ఉద్‌–దౌలా–బహదూర్‌ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్‌ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది. 
  • టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌లో ఐదో నిజాం అఫ్తాబ్‌ మహల్, మఫ్తాబ్‌ మహల్, తహనియత్‌ మహల్, అప్జల్‌ మహల్‌ల నిర్మాణం జరిగింది.
  • 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్‌ మరింత శోభాయమానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది.
  • దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్‌ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. 
  • వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్‌ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి.

 సందర్శన వేళలు, మార్గం

  • ఎలా వెళ్లాలి: చార్మినార్‌ కట్టడం నుంచి లాడ్‌బజార్,ఖిల్వత్‌ చౌరస్తా ద్వారా ముందుకెళితే ఖిల్వత్‌ వస్తుంది. 
  •  సందర్శించు వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. 
  • సెలవు: శుక్రవారం. 
  • టికెట్‌ ధరలు: చిన్నారులకు రూ. 20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.200 
  • రవాణా సౌకర్యం: నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యం కలదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఆర్టీసి బస్సులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి.  
  • పార్కింగ్‌: ప్యాలెస్‌ ఆవరణలో చార్జితో కూడిన పార్కింగ్‌ సౌకర్యం కలదు. 

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

మహిళల ఆధ్వర్యంలో లక్ష రిటైల్‌ షాపులు

 వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు  

నేడు మంత్రుల కమిటీ భేటీ

           అమరావతి: వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో మహిళల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్‌ షాపుల కేటగిరీలోనే లక్ష వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని సెర్ప్, మెప్మాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర వ్యాపార మార్గాలపైనా చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశం కానుంది. 

► వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సాయంతో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిపై మహిళల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. 19.61 లక్షల మంది తమ ఆసక్తిని తెలియజేయగా, అందులో 10,00,329 మంది ప్రత్యేకంగా తాము ఏ వ్యాపారం చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేశారు.  
► వారికి వ్యాపారావకాశాలు కల్పించేందుకు  వివిధ శాఖల ద్వారా చేపడుతున్న చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం నాటి సమావేశంలో చర్చిస్తుంది.  
► సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,419 చోట్ల ఇప్పటికే మహిళల ఆధ్వర్యంలో దుకాణాలు ప్రారంభించే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.   

21, సెప్టెంబర్ 2020, సోమవారం

మద్యమే దిక్కయింది


 కష్టకాలంలో అక్కరకొచ్చిన బార్లు..    ఖజానాకు 180 కోట్ల ఆదాయం..

           ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయమే దిక్కయింది. ఓవైపు నిషేధం అంటూనే, మరోవైపు మద్యం ద్వారా అధిక రాబడికి వైసీపీ ప్రభుత్వం పక్కా వ్యూహం అమలుచేస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత మద్యం షాపులు తెరిచినప్పుడు ఒకేసారి భారీగా ధరలు పెంచి ఖజానా నింపుకొంది. ఇప్పుడు మరోసారి బార్లకు అనుమతుల ద్వారా భారీ ఆదాయం రాబడుతోంది. వాటిని ఇప్పటికిప్పుడు తెరవాల్సిన అవసరమేంటని పలువురు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

            దీనిపై గత శుక్రవారం మూడు వేర్వేరు జీవోలు జారీ అయ్యాయి. వాటిద్వారా అక్షరాలా రూ.180కోట్లు ఖజానాలో పడబోతున్నాయి. అందులో రూ.140కోట్లు వెంటనే రానుండగా, మరో రూ.40 కోట్లు నెల వ్యవధిలో సమకూరనున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ ఇటీవల పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువుపై పన్నులు విధించిన ప్రభుత్వం అదే తరహాలో ఇప్పుడు బార్లపైనా కొవిడ్‌ ఫీజు వేసింది. దీంతో సర్కారుకు భారీగా ఆదాయం రానుంది. 


30లోగా కట్టండి 

             లైసెన్స్‌, రిజిస్ర్టేషన్‌ ఫీజుల చెల్లింపులు, బార్లలో కరోనా నిబంధనలపై ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆదివారం మార్గదర్శకాలు జారీ చేశారు. మూడు శ్లాబుల్లో ఎవరు, ఎంత ఫీజు చెల్లించాలో అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీ బార్లు రూ. 7,07,194, రెండో కేటగిరీలో రూ.14,14,388, మూడో కేటగిరీలో ఉన్నవి రూ. 21,21,582 చెల్లించాలని వివరించారు. ఈ నెల 30లోపు ఈ రుసుములు కట్టాలని స్పష్టం చేశారు. అలాగే లైసెన్స్‌, రిజిస్ర్టేషన్‌ ఫీజుపై విధించిన 20శాతం కొవిడ్‌ ఫీజును నెల రోజుల్లో చెల్లించాలని తెలిపారు.  మొదటి కేటగిరీ బార్లు రూ.2లక్షలు, రెండో కేటగిరీలో రూ.4లక్షలు, మూడో కేటగిరీలో రూ.6లక్షలు చొప్పున కొవిడ్‌ ఫీజు చెల్లించాలి. రాష్ట్రంలో మొత్తం 860 బార్లు ఉంటే అందులో 801 సాధారణమైనవి. మిగిలినవి స్టార్‌ హోటళ్లు, టూరిజం పరిధిలో ఉన్నాయి. ఈ 801లో మొదటి కేటగిరీ కింద 61, రెండో కేటగిరీలో 395, మూడో కేటగిరీలో 345 ఉన్నాయి. వీటినుంచి లైసెన్సు, రిజిస్ర్టేషన్‌ ఫీజుల కింద రూ.133కోట్లు, కొవిడ్‌ ఫీజు రూపంలో మరో రూ.40 కోట్లు రానున్నాయి. స్టార్‌ హోటళ్లు, టూరిజం పరిధిలోని బార్ల ద్వారా దాదాపు రూ.10కోట్లు వస్తాయి. మొత్తం దాదాపు రూ.180 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది.  దీనికితోడు బార్లకు 20 శాతం కొవిడ్‌ ఫీజుతో పాటు మద్యం సీసాలపై మరో 10శాతం అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. అంటే షాపుల్లో వచ్చే ధరలపై మరో 10శాతం ధర చెల్లించి బార్ల లైసెన్సీలు మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలి. దీనివల్ల షాపులతో పోలిస్తే అమ్మకాలపై 10శాతం అదనపు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది.  బార్లలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, టేబుళ్ల మధ్య భౌతిక దూరం ఉండాలని, గ్లాసులు వేడినీటితో శుభ్రం చేయాలని, రోజుకు రెండుసార్లు బార్లను శానిటైజ్‌ చేయాలని సూచించారు. కట్టడి ప్రాంతాల్లో బార్లకు కలెక్టర్‌ నుంచి విడిగా అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కాగా, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో బార్లు తెరవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తప్ప మరో ఆలోచన లేదని, అందుకే ఇలాంటి సమయంలోనూ బార్లు తెరిచేందుకు అనుమతిచ్చిందనే వాదన వినిపిస్తోంది. 


18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఆ బెంజి కారు నా కుమారుడిది కాదు: మంత్రి జయరాం

 కర్నూలు: ఆ బెంజి కారు తన కుమారుడిది కాదని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ వేరే వాళ్ల కారు పక్కన తన కుమారుడు ఫొటో దిగాడని చెప్పారు. హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫొటో తీసుకుంటే మనది అవుతుందా? అని ప్రశ్నించారు.  

ఆ కారు తమదేనని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జయరాం సవాల్ చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాయల పకీర్‌లాంటి వారని మంత్రి జయరాం విమర్శించారు.

అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు

            ’‘మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, ఇప్పటికే ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన బెంజ్ కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్‌ ఇచ్చారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి. ఏ 14 మంత్రి జయరాంకు బినామీ. అది పుట్టినరోజు కానుక కాదు...మంత్రికి ఇచ్చిన లంచం’’అని వ్యాఖ్యానించారు.

వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి

 తక్షణం స్పందించిన ప్రభుత్వం..

విశాఖ కేజీహెచ్‌కు 18 మంది తరలింపు 

అనంతగిరి (అరకులోయ): విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ కరకవలస, చినరాబ గ్రామాల్లో మూడు వారాలు వ్యవధిలోని వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. దీనిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్పందించి అధికారులతో మాట్లాడారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు బుధవారం ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌ గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వింత వ్యాధి (కాళ్లు, చేతుల వాపులు)కి గల కారణాలపై ఆరా తీశారు. గురువారం ఉదయం వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని మూడు అంబులెన్స్‌లో కరకవలస, సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరం తరలించారు.  వీరందరికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ముందుస్తు చర్యల్లో భాగంగా వీరందరని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.         

          నిల్వ పశు మాంసమే కారణమా? నిల్వ పశు మాంసం తీసుకోవడంతో కరకవలస వాసులు అనారోగ్యం పాలవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఏ కారణంతో మరణాలు సంభవిస్తున్నాయి? కాళ్లు, చేతుల వాపులు ఎందుకు వస్తున్నాయనే దానిపై పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కాని చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.   

16, సెప్టెంబర్ 2020, బుధవారం

జర్నలిజమే జీవితమా..?



              అభిరుచితో కొందరు...ఇతర ఉద్యోగ అవకాశాలు లేక మరికొందరు.. అనుకోకుండా ఇంకొందరు జర్నలిజం వత్తిలోకి అడుగిడిన వారే.. తొలినాళ్లలో కేవలం ప్రింట్‌ మీడియా ఉన్నప్పుడు....తెలుగు భాషపై పట్టున్నవారు... సాహిత్య నేపథ్యమున్న వారు ఈ రంగంలోకి అడుగిడారు. అప్పట్లో పాత్రికేయమంతా...ఒక మూస పద్ధతిలో సాగేది. క్రమక్రమంగా టీవీ జర్నలిజంతో మీడియా కొత్త పుంతలు తొక్కింది. ఆధునికత, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం వద్ధి చెందుతున్న కొద్దీ...మీడియా అంటే పేపర్‌ లేదా టీవీ అన్న పరిధి దాటిపోయింది.
              సోషల్‌ మీడియా రాకతో ప్రపంచమంతా ఓ కుగ్రామమైపోయింది. ఏ మూలన ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో విశ్వమంతా తెలిసేలా నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వెబ్‌ సైట్‌లు, య్యూ ట్యూబ్‌ చానళ్లు, ట్విట్టర్‌ ఇలా ఎన్నో ప్రసార మాధ్యమాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రసార మాధ్యమాల్లో ఏదో ఒకదానిని వేదికగా చేసుకొని... తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిరసన గళాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. పేపర్‌ కోసమో...టీవీ కోసమో ఆగే పరిస్థితులు ఇప్పుడు అస్సలు లేవు. ఇదేక్రమంలో మీడియా యాజమాన్య తీరుతెన్నుల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపార దక్పథం చొచ్చుకొని వస్తోంది. లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.
             కరోనా కాలమాన పరిస్థితులు అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసినట్టే...మీడియాను కూడా వదల్లేదు. యాడ్స్‌ వచ్చే రాబడి గణనీయంగా తగ్గిపోవడం..సర్క్యులేషన్‌ తగ్గుదలతో పాటు కాగితం, రంగులు, ప్లేట్లు తదితర ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా...ఆ ప్రభావం మీడియా రంగంలో పనిచేసే సిబ్బందిపైనా పడింది. పేజీల కుదింపు.. టాబ్లాయిడ్‌ నుంచి బ్రాడ్‌ షీట్‌కు వెళ్లడం తదితర కారణాలను చూపుతూ...సిబ్బందికి కోత పెట్టడమో...జీతాల కుదింపు చేసుకుంటూ వస్తున్నారు. రోజులన్నీ ఒకలాగా ఉండవని యాజమాన్యాలు, కొంత మంది మీడియా పెద్దలు చెబుతున్నా...అవేవీ విశ్వసించే పరిస్థితులు కనిపించడం లేదు.
ప్రతిభకు కొలమానమేదీ..?
          జర్నలిజంలో ప్రతిభకు కొలమానం ఏమిటీ అన్నప్పుడు నీటిమీద రాతలా ఉన్నది పరిస్థితి. రణరంగంలో రాజు ముందుడి యుద్ధం చేస్తూ తన సమూహాన్ని నడిపిస్తాడు. కానీ అక్షర సేద్యంలోని అనేక విభాగాల్లో ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. పనిచేసేవారు కొందరు...పెత్తనం చేసేవారు మరికొందరు...పైరవీలు చేసేవారు ఇంకొందరులా మారింది. పనిచేసే వారికి కనీస గుర్తింపు కూడా దక్కడం లేదు. ప్రతిభను గుర్తించే వారు కరువై కరివేపాకులా వాడుకొని వదిలేసే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఇన్‌చార్జ్‌ అంటేనే కర్ర పెత్తనంలా ఉంది. అది అలా చేయి..ఇది ఇలా చేయి.. నీ ఆలోచన ఏంటి..? నువ్వయితే ఎలా రాస్తావు... ఎలా ఎడిట్‌ చేస్తావు...? అంటూ సమర్థులైన వారితో పనిచేయించడమో... అభిప్రాయాలు సేకరించి రిమిక్స్‌ చేసేవారే అత్యంత ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతున్నారు. తమకు నచ్చని వారిని ఇబ్బందులకు గురి చేయడమో...బదిలీ చేయించడమో...తమంతట తాము వెళ్లిపోయేలా చేయడమో పరిస్థితులు కల్పిస్తున్నారు.
ప్రత్యామ్నాయం ఉండాలి...!
        మీడియా అనేది పరిమితమైన రంగం. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. అనేకానేక కారణాల వలన ఏదైనా మీడియాను వదిలినా మరోదాంట్లో ఏ కొందరికో ఉద్యోగం దొరుకుతుంది. అందరికీ ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉద్యోగం దొరికినా అనుకున్న జీతం...ఆశించిన స్థానం దొరకకపోవచ్చు. మనస్సాక్షిని చంపుకొని పనిచేయాల్సిందే. ఆ పరిస్థతి రాక ముందే... మీడియాలో పనిచేసే వారంతా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల అన్వేషణలో ఉండాలి. మంత్లీ బడ్జెట్‌ కు ఇబ్బంది లేనంతగా ఆదాయం వచ్చే దానిపై దష్టి సారించాలి. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
ఆ కుటుంబాలను ఒక్కసారైనా కదిలించారా...?
              జర్నలిజం వత్తిలోకి ప్రవేశించిన వారిలో అధిక శాతం మంది తమ జీవితాలను అర్ధంతరంగా ముగించిన వారే మనకు తారసపడుతున్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాకే.. గుండెపోటు, బీపీ, షుగర్‌, గ్యాస్టిక్‌ తదితర జబ్బుల బారిన పడిన వారు కొందరైతే... ఒత్తిడిని తట్టుకోలేక స్మోకింగ్‌..డ్రింకింగ్‌ అలవాటు చేసుకొని జబ్బున పడేవారు ఇంకొందరు. కారణాలు ఏవైతేనేం ప్రాణాలు వదిలిన వారు ఎందరో. ముందస్తు ఆర్థిక ప్రణాళిక లేకపోవడమో...అప్పుడు వచ్చిన సంపాదన రోజు గడవడానికే సరిపోవడమో, అనారోగ్య సమస్యలకు ఖర్చు చేయడమో. ఏదైతేనేం..లోకం విడిచేనాటికి చేతిలో చిల్లి గవ్వ లేని స్థతిగతులను ఎన్నో చూశాం. అలాంటి కుటుంబాల మనుగుడ ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా. చూశారా. ఈ రంగంలోకి అడుగిడిన మెజారిటీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారే ఎక్కువగా తారసపడుతున్నారు.
-టి.జాన్‌ రెడ్డి15/09/2020