16, సెప్టెంబర్ 2020, బుధవారం

జర్నలిజమే జీవితమా..?



              అభిరుచితో కొందరు...ఇతర ఉద్యోగ అవకాశాలు లేక మరికొందరు.. అనుకోకుండా ఇంకొందరు జర్నలిజం వత్తిలోకి అడుగిడిన వారే.. తొలినాళ్లలో కేవలం ప్రింట్‌ మీడియా ఉన్నప్పుడు....తెలుగు భాషపై పట్టున్నవారు... సాహిత్య నేపథ్యమున్న వారు ఈ రంగంలోకి అడుగిడారు. అప్పట్లో పాత్రికేయమంతా...ఒక మూస పద్ధతిలో సాగేది. క్రమక్రమంగా టీవీ జర్నలిజంతో మీడియా కొత్త పుంతలు తొక్కింది. ఆధునికత, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం వద్ధి చెందుతున్న కొద్దీ...మీడియా అంటే పేపర్‌ లేదా టీవీ అన్న పరిధి దాటిపోయింది.
              సోషల్‌ మీడియా రాకతో ప్రపంచమంతా ఓ కుగ్రామమైపోయింది. ఏ మూలన ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో విశ్వమంతా తెలిసేలా నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వెబ్‌ సైట్‌లు, య్యూ ట్యూబ్‌ చానళ్లు, ట్విట్టర్‌ ఇలా ఎన్నో ప్రసార మాధ్యమాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రసార మాధ్యమాల్లో ఏదో ఒకదానిని వేదికగా చేసుకొని... తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిరసన గళాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. పేపర్‌ కోసమో...టీవీ కోసమో ఆగే పరిస్థితులు ఇప్పుడు అస్సలు లేవు. ఇదేక్రమంలో మీడియా యాజమాన్య తీరుతెన్నుల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపార దక్పథం చొచ్చుకొని వస్తోంది. లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.
             కరోనా కాలమాన పరిస్థితులు అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసినట్టే...మీడియాను కూడా వదల్లేదు. యాడ్స్‌ వచ్చే రాబడి గణనీయంగా తగ్గిపోవడం..సర్క్యులేషన్‌ తగ్గుదలతో పాటు కాగితం, రంగులు, ప్లేట్లు తదితర ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా...ఆ ప్రభావం మీడియా రంగంలో పనిచేసే సిబ్బందిపైనా పడింది. పేజీల కుదింపు.. టాబ్లాయిడ్‌ నుంచి బ్రాడ్‌ షీట్‌కు వెళ్లడం తదితర కారణాలను చూపుతూ...సిబ్బందికి కోత పెట్టడమో...జీతాల కుదింపు చేసుకుంటూ వస్తున్నారు. రోజులన్నీ ఒకలాగా ఉండవని యాజమాన్యాలు, కొంత మంది మీడియా పెద్దలు చెబుతున్నా...అవేవీ విశ్వసించే పరిస్థితులు కనిపించడం లేదు.
ప్రతిభకు కొలమానమేదీ..?
          జర్నలిజంలో ప్రతిభకు కొలమానం ఏమిటీ అన్నప్పుడు నీటిమీద రాతలా ఉన్నది పరిస్థితి. రణరంగంలో రాజు ముందుడి యుద్ధం చేస్తూ తన సమూహాన్ని నడిపిస్తాడు. కానీ అక్షర సేద్యంలోని అనేక విభాగాల్లో ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. పనిచేసేవారు కొందరు...పెత్తనం చేసేవారు మరికొందరు...పైరవీలు చేసేవారు ఇంకొందరులా మారింది. పనిచేసే వారికి కనీస గుర్తింపు కూడా దక్కడం లేదు. ప్రతిభను గుర్తించే వారు కరువై కరివేపాకులా వాడుకొని వదిలేసే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఇన్‌చార్జ్‌ అంటేనే కర్ర పెత్తనంలా ఉంది. అది అలా చేయి..ఇది ఇలా చేయి.. నీ ఆలోచన ఏంటి..? నువ్వయితే ఎలా రాస్తావు... ఎలా ఎడిట్‌ చేస్తావు...? అంటూ సమర్థులైన వారితో పనిచేయించడమో... అభిప్రాయాలు సేకరించి రిమిక్స్‌ చేసేవారే అత్యంత ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతున్నారు. తమకు నచ్చని వారిని ఇబ్బందులకు గురి చేయడమో...బదిలీ చేయించడమో...తమంతట తాము వెళ్లిపోయేలా చేయడమో పరిస్థితులు కల్పిస్తున్నారు.
ప్రత్యామ్నాయం ఉండాలి...!
        మీడియా అనేది పరిమితమైన రంగం. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. అనేకానేక కారణాల వలన ఏదైనా మీడియాను వదిలినా మరోదాంట్లో ఏ కొందరికో ఉద్యోగం దొరుకుతుంది. అందరికీ ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉద్యోగం దొరికినా అనుకున్న జీతం...ఆశించిన స్థానం దొరకకపోవచ్చు. మనస్సాక్షిని చంపుకొని పనిచేయాల్సిందే. ఆ పరిస్థతి రాక ముందే... మీడియాలో పనిచేసే వారంతా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల అన్వేషణలో ఉండాలి. మంత్లీ బడ్జెట్‌ కు ఇబ్బంది లేనంతగా ఆదాయం వచ్చే దానిపై దష్టి సారించాలి. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
ఆ కుటుంబాలను ఒక్కసారైనా కదిలించారా...?
              జర్నలిజం వత్తిలోకి ప్రవేశించిన వారిలో అధిక శాతం మంది తమ జీవితాలను అర్ధంతరంగా ముగించిన వారే మనకు తారసపడుతున్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాకే.. గుండెపోటు, బీపీ, షుగర్‌, గ్యాస్టిక్‌ తదితర జబ్బుల బారిన పడిన వారు కొందరైతే... ఒత్తిడిని తట్టుకోలేక స్మోకింగ్‌..డ్రింకింగ్‌ అలవాటు చేసుకొని జబ్బున పడేవారు ఇంకొందరు. కారణాలు ఏవైతేనేం ప్రాణాలు వదిలిన వారు ఎందరో. ముందస్తు ఆర్థిక ప్రణాళిక లేకపోవడమో...అప్పుడు వచ్చిన సంపాదన రోజు గడవడానికే సరిపోవడమో, అనారోగ్య సమస్యలకు ఖర్చు చేయడమో. ఏదైతేనేం..లోకం విడిచేనాటికి చేతిలో చిల్లి గవ్వ లేని స్థతిగతులను ఎన్నో చూశాం. అలాంటి కుటుంబాల మనుగుడ ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా. చూశారా. ఈ రంగంలోకి అడుగిడిన మెజారిటీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారే ఎక్కువగా తారసపడుతున్నారు.
-టి.జాన్‌ రెడ్డి15/09/2020

కామెంట్‌లు లేవు: