30, ఏప్రిల్ 2021, శుక్రవారం

కార్మిక హక్కులపై పెట్టుబడి దాడిని వ్యతిరేకిద్దాం

ఈ మేడే రోజున దేశంలోని, ప్రపంచం అన్ని మూలల్లోని కార్మికులు, శ్రమజీవులందరూ :అందరికీ ఉచితంగా టీకా మందులివ్వాలని, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ఐక్యంగా డిమాండ్‌ చేయండి. జీవనోపాధి మీద, కార్మికులు, శ్రమ జీవులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద పెట్టుబడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడండి. ప్రజా ప్రత్యామ్నాయం కోసం ఐక్యంగా పోరాడండి. కార్మిక వర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా ఓడించండి.
   పెట్టుబడిదారీ వ్యవస్థ అనాగరికమైన, క్రూరమైన రూపాన్ని...2019 చివరి నుండి అది కొనసాగిస్తున్న విధ్వంసాన్ని...కరోనా బట్టబయలు చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినా, అత్యధిక ప్రజల కనీస అవసరాలను, ప్రాణాలను అది కాపాడలేకపోయింది. ఈ వ్యవస్థలో ఆరోగ్యం ప్రాథమిక హక్కు కాదు. అది కొన్న వారికి మాత్రమే లభిస్తుంది. ఆరోగ్యం, విద్య, నివాసం, ఆహారం పేదలకు మరింతగా అందుబాటులో లేకుండా పోతోంది. కరోనా సమయంలో పేదల సంఖ్య పెరిగింది. లక్షల మంది తమ ఉపాధి కోల్పోయారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ ఉన్న వారికే ఆరోగ్యం అందుబాటులో ఉంచినందువలన ధనిక దేశమైన అమెరికా వేలాది కరోనా చావులను నివారించ లేకపోయింది. మన పాలకులు ఇటువంటి వారి సాహచర్యంలో ఉన్నారు.
   ఈరోజున కొద్ది సంఖ్యలో ఉన్న సంపన్న దేశాలు కరోనా టీకాలను నియంత్రిస్తూ వాటిని అనేక పేద దేశాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడి కంటె ప్రజలకే ప్రాధాన్యత నిచ్చే సోషలిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని కరోనా మహమ్మారి అనుభవం ఎత్తి చూపింది. సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ, తక్షణ ప్రభుత్వ జోక్యంతో సోషలిస్టు దేశాలలో కరోనా నియంత్రించబడింది. దాంతో మరణాలు నామమాత్రంగా ఉన్నాయి. చైనా, వియత్నాం, ఉత్తర కొరియా దేశాలు దీనికి సాక్షీభూతంగా ఉన్నాయి. చైనా, వియత్నాం దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టాయి కూడా.
   ఫిబ్రవరి 2021 కల్లా చివరి 9 కోట్ల 89 లక్షల మంది గ్రామీణ ప్రజలను పేదరికం నుండి బయట పడేయటంలో చైనా పూర్తి విజయాన్ని సాధించింది. కరోనా దీర్ఘకాలిక ప్రభావం వలన 2030 కల్లా ప్రపంచంలోని 21 కోట్ల మంది ప్రజలు అదనంగా అత్యంత పేదరికం లోకి పోతారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన నేటి పరిస్థితుల్లో చైనా సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. అమెరికన్‌ సామ్రాజ్యవాదం విధించిన అమానవీయమైన ఆటంకాలు, ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ క్యూబా తన వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను కరోనా కట్టడికి ఆఫ్రికా, లాటిన్‌ అమెరికన్‌ దేశాలకే కాకుండా యూరప్‌ లోని ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు (మొత్తం 51 దేశాలకు) పంపింది. ప్రపంచానికి నిస్వార్ధ ఆరోగ్య సేవలు అందిస్తున్న క్యూబన్‌ డాక్టర్లకు నోబెల్‌ బహుమతి ప్రదానం చేయాలని సిఐటియు డిమాండ్‌ చేస్తున్నది.
   ప్రజల జీవనోపాధిని, వారి మనుగడను ప్రమాదంలోకి నెడుతూ కరోనా అవకాశాన్ని బిజెపి ప్రభుత్వం ఉపయోగించుకుని భూస్వాములు, పెట్టుబడిదారీ వర్గాల లాభాల దాహాన్ని తీర్చేందుకు తన నూతన సరళీకరణ విధానాలను దూకుడుగా అమలు చేయటాన్ని సిఐటియు గర్హిస్తున్నది. ఓటింగ్‌ నిర్వహించాలని అడిగిన యం.పి లను సస్పెండ్‌ చేసి మూడు వ్యవసాయ బిల్లులను పాస్‌ చేసింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షం లేని సమయంలో లేబరు కోడ్‌లను పాస్‌ చేసింది. స్వావలంబన (ఆత్మ నిర్భర్‌) అనే మోసపూరిత నినాదం మాటున ప్రభుత్వ రంగ హోల్‌సేల్‌ ప్రైవేటీకరణకు ముందుకు పోతోంది. మొత్తం భారత దేశాన్ని, దాని సంపదయిన ప్రకృతి వనరులు, ప్రభుత్వ రంగాన్ని మరియు సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతోంది. 19వ శతాబ్దం నాటి వలస దోపిడీ తరహా పరిస్థితుల లోకి దేశాన్ని, ప్రజలను నెడుతోంది.
   సరళీకరణ విధానాల అమలు కాలంలో దేశంలోని మూడు భారీ టీకా మందుల ఉత్పత్తి కర్మాగారాలు మూతపడటంతో వాటి ఉత్పత్తి ఇపుడు ప్రైవేటు కంపెనీల చేతిలోకి పోయింది. భారత ప్రభుత్వం కూడా వాటి దగ్గర కొనాల్సి వస్తోంది. ఒకప్పుడు టీకా ఉత్పత్తిలో ముందు పీఠిన ఉన్న దేశం ఇపుడు తీవ్రమైన కరోనా టీకాల కొరతను ఎదుర్కొంటోంది. వాటి ఉత్పత్తిని పెంచి అందరికీ అందుబాటులోకి తేవటంలో ప్రభుత్వం విఫలమైంది.
   సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించటానికి, ఎటువంటి ఆటంకాలు లేని దోపిడీ కోసం లేబర్‌ కోడ్‌లను బిజెపి ప్రభుత్వం పాస్‌ చేసింది. చట్టాలను అతిక్రమించే యజమానుల చర్యలను లేబర్‌ కోడ్‌లు ఇపుడు చట్టబద్ధం చేశాయి. మరో పక్క హక్కుల కోసం కార్మికులు చేసే ఉమ్మడి కార్యాచరణను నేరంగా పరిగణించాయి. సార్వత్రికమైన, మేడేకు ప్రతి రూపంగా ఉన్న 8 గంటల పని నీరుగార్చబడింది. కార్మిక హక్కులకు సంబంధించి వలస కార్మికుల జాతీయ విధాన ముసాయిదాలో ఎటువంటి ప్రస్తావన లేదు. రెండో దశ కరోనా దేశాన్ని నాశనం చేస్తున్నది. మరోసారి లాక్‌డౌన్లు వస్తాయనే భయంతో వేలాది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెనుదిరుగుతున్నారు.
   వినాశకరమైన పెట్టుబడిదారీ సరళీకరణ విధానాల వలన ఆర్థిక వ్యవస్థలో ఉపాధిని కల్పించే సామర్ధ్యం దెబ్బతిని భారతదేశంతో సహా ప్రపంచమంతటా నిరుద్యోగం విజృంభిస్తోంది. అయితే, కరోనా సమయంలో భారత బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగినట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది.
   సామాన్య ప్రజలు తమ డబ్బును దాచుకునే ప్రభుత్వరంగ బ్యాంకులు, తమకు కష్టకాలంలో రక్షణగా నిలిచే ప్రభుత్వరంగ ఇన్సూరెన్సు కంపెనీలు బడా కార్పొరేట్లకు అప్పజెప్పబడుతున్నాయి. రక్షణ, రైల్వేలు, కమ్యూనికేషన్లు, పౌరవిమానయానం, ఓడరేవులు, విద్యుత్తు, ఉక్కు, గనులు విదేశీ గుత్త సంస్థలతో సహా ప్రయివేటు కార్పొరేట్లకు ఇవ్వబడుతున్నాయి. ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలతో సహా మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రైవేటీకరణకు లక్ష్యంగా చేయబడింది. పరిశ్రమలు, సర్వీసులే గాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు తలుపులు బార్లా తెరిచింది. చిన్న రైతుల చేతిలో ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్లు స్వాధీనం చేసుకునేందుకు మూడు వ్యవసాయ చట్టాలు ఉద్దేశించబడ్డాయి. మద్దతు ధరలను, ధాన్య సేకరణను ఉపసంహరించి రైతులను అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులకు బలిచేసే విధంగా కార్పొరేట్‌ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ కూలిపోవటానికి దారి తీస్తుంది. ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం తెస్తుంది. అత్యధిక రైతులు తమ భూముల నుండి తొలగించబడతారు.
   కార్మిక, రైతు, ప్రజా, జాతి వ్యతిరేక బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న కార్మికులు, రైతులు ఇతర శ్రమ జీవులందరినీ సిఐటియు అభినందిస్తున్నది. దేశవ్యాప్తంగా కార్మికులు వారి పోరాటంలో భాగస్వాములు కావటం సిఐటియు కి గర్వకారణం.
  బడా పెట్టుబడిదారులు, వారి ప్రతినిధుల దాడి నుండి తమ హక్కులు, పని పరిస్థితుల పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మిక వర్గాన్ని సిఐటియు అభినందిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో తమ ఇంటి నుండి నిరసన తెలియజేసిన కార్మికవర్గం తమ పోరాటాన్ని పెంచుకుంటూ పోయి 26 నవంబర్‌ సమ్మెను విజయవంతం చేసింది. ఈ నిరసనలకు చొరవ చేసినందుకు సిఐటియు గర్విస్తోంది. భారీగా స్పందించిన కార్మికులను అభినందిస్తున్నది. బొగ్గు, ఉక్కు, బ్యాంకు, బీమా, ప్రైవేటు సంఘటిత రంగం, స్కీము వర్కర్లు, ఉద్యోగులు మరియు లక్షలాది మంది అన్ని రంగాల కార్మికులు పోరాట బాటలో ఉన్నారు.
   దేశ సంపదను ఉత్పత్తి చేస్తున్న కార్మికులు, రైతుల మధ్య సంఘీభావం పెరుగుతుండటం గొప్ప ప్రాముఖ్యత కలిగిన అంశం. అటువంటి సంఘీభావాన్ని, ఐక్యతను అభివృద్ధి చేసేందుకు సిఐటియు సదా కృషి చేస్తున్నది. కరోనా కాలంలో తమ కోర్కెలపైన కార్మికులు, రైతులు తమ పోరాటాలను తీవ్రం చేయటమేగాక, పరస్పరం ఒకరి పోరాటాలలో మరొకరు పాల్గొన్నారు. ఇటువంటి కార్మిక కర్షక ఐక్య పోరాటాలు విశాల ప్రజానీకంతో ఉన్నత స్థాయిలో జరిగితే సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగానే గాక పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పోరాటాలను పురోగమింపజేసే చారిత్రక అవకాశం వస్తుందని సిఐటియు నమ్ముతుంది.
   తన విధానాలకు వ్యతిరేకతను, నిరసనను తప్పుడు పద్ధతులతో బిజెపి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేయటాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక హక్కులు, పార్లమెంటరీ ప్రమాణాలు ఉల్లంఘించబడుతున్నాయి. తన చర్యలకు నిరసన తెలిపే, తన విధానాలను వ్యతిరేకించే వారిని భయపెట్టటానికి, బెదిరించటానికి, జైలుకు పంపటానికి బిజెపి ప్రభుత్వం తన అధీనంలోని ఆర్థిక నేరాలను విచారించే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి), ఆదాయ పన్ను, సిబిఐ, ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తున్నది. వందలాది మంది విద్యార్ధులు, మహిళలు, జర్నలిస్టులు, ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలు, మానవ, పౌర హక్కుల కార్యకర్తలు ఈ చట్టాల కింద అరెస్టయి బెయిలు లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు.
   నిరంతరాయంగా వస్తున్న పెట్టుబడిదారీ సంక్షోభానికి స్పందనగా పాలకవర్గాలు ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్ని కేంద్రీకృతం చేస్తున్నాయి. నిరంకుశ పోకడలలో భాగంగా ప్రజాస్వామిక విభాగాలను ధ్వంసం చేస్తున్నాయి. సమాఖ్య నిర్మాణంలో భాగంగా ఉన్న రాష్ట్రాల హక్కులు హరింపబడుతున్నాయి.
   తమ ప్రయోజనాలను కాపాడటంలో వ్యవస్థ వైఫల్యాన్ని దేశంలోని, ప్రపంచంలోని కార్మికులు గుర్తిస్తున్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వ లక్షణం ప్రజలకు క్రమేపీ అర్ధమవుతోంది. ఈ అవగాహన మరింత విస్తృతం కావాలి. కేంద్రంలో వస్తున్న వరుస ప్రభుత్వాల విధానాలకు తమ రోజువారీ సమస్యలకు ఉన్న లింకు ప్రజా బాహుళ్యం అర్ధం చేసుకునేలా చైతన్యపరచాలి. వారి మిత్రులెవరో, శత్రువులెవరో గుర్తించేలా సహాయపడాలి. తమ శత్రువులపై తమ మిత్రులతో కలిసి ఐక్యంగా పోరాడేలా వారిని సమీకరించాలి.
   ప్రజల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, సామాజిక సామరస్య వాతావరణం మీద, మొత్తం జాతీయ సమగ్రత మీద పూర్తి స్థాయిలో దాడి జరుగుతోంది. ఈ దాడులను తిప్పికొట్టాల్సిన కార్మికవర్గం, తన వ్యక్తీకరణలన్నిటిలోనూ సమగ్రమైన అవగాహనతో వ్యవహరించాలి. కార్మికులు, ప్రజల హక్కులు, వారి జీవనోపాధి పరిరక్షణ కోసం, ప్రజాస్వామిక వ్యవస్థ మరియు విలువలు, దేశ ఆర్థిక వ్యవస్థ మరియు వనరులు, వీటన్నింటిని మించి ప్రజల ఐక్యతను కాపాడుకోవటం కోసం కార్మికవర్గం ప్రజలతో కలిసి ఐక్యంగా పోరాడాలి.
   దీని కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అంతర్గత దోపిడీ గుణాన్ని బహిర్గతం చేసేందుకు నిరంతరం, నికరంగా ప్రయత్నించాలి. ఆ వ్యవస్థ అమానవీయ కుయుక్తులను, వాటిని ప్రోత్సహించే రాజకీయాలను బట్ట బయలు చేయాలి. ఈ మేడే రోజున ఈ కర్తవ్యాన్ని చేపడదామని ప్రతిజ్ఞ చేద్దాం.
   ఈ మేడే రోజున దేశంలోని, ప్రపంచం అన్ని మూలల్లోని కార్మికులు, శ్రమజీవులందరూ: అందరికీ ఉచితంగా టీకా మందులివ్వాలని, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ఐక్యంగా డిమాండ్‌ చేయండి. జీవనోపాధి మీద, కార్మికులు, శ్రమ జీవులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద పెట్టుబడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడండి. ప్రజా ప్రత్యామ్నాయం కోసం ఐక్యంగా పోరాడండి. కార్మిక వర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా ఓడించండి. మే డే వర్థిల్లాలి.

28, ఏప్రిల్ 2021, బుధవారం

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!

 

న్యూఢిల్లీ : గత ఏడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది. దీంతో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దశల వారీగా లాక్‌డౌన్‌కు విముక్తి కలిగించగా..కేసులు పెరుగుతూ వచ్చినప్పటికీ..అనంతరం తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వాలు, ప్రజలు 'హమ్మయ్య' అనుకున్నారు. జనవరిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేయడంతో... ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్లతో భయాందోళనలను మొదలయ్యాయి. అయితే టీకాలు అందుబాటులోకి వచ్చేయడంతో.. వాటి వల్ల భారత్‌కు వచ్చే ప్రమాదమేమీ లేదని, అప్పటికే వచ్చిన వ్యాక్సిన్లు వాటిపై కూడా పనిచేస్తాయని వైద్య సిబ్బంది, అంటు వ్యాధి నిపుణులు అనుకున్నారు. వెంటిలేటర్ల డిమాండ్‌ ఉండకపోవచ్చునని, సెకండ్‌ వేవ్‌ను తప్పించుకున్నట్లేనని కొందరు నిపుణులు ఫిబ్రవరిలో ఓ అంచనాకు వచ్చేశారు.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
వద్దన్నా...వదిలేస్తానా....
మార్చి చివరి నుండి కరోనా కేసులు కొది కొద్ద్దిగా పెరగడం మొదలయింది. మహమ్మారి బలం పుంజుకుని విజృంభించింది. దీంతో దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో వెళ్లిందని కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్‌లో ఊహించనిరీతిలో మహమ్మారి జడలు విప్పింది. కేసులు విపరీతంగా పెరిగాయి. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. పలువురు మృత్యువాత పడ్డారు. శ్మశాన వాటికల వద్ద మృతదేహాలు బారులు తీరిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతటి విపత్తుకు మోడీ సర్కార్‌ వైఫల్యమే కారణమని పలువురు విమర్శించారు.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
ఇంత ఘోరమైన పరిస్థితులు ఇందుకేనా..?
తగ్గినట్లే తగ్గి కరోనా ఉప్పెనలా ఎగిసి పడటాన్ని బహుశా నిపుణులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గింది. రోజువారీ కేసుల నమోదులో అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంతో సమానంగా భారత్‌లో నమోదయ్యాయి. జనాభా రీత్యా న్యూయార్క్‌కు భారత్‌ 50 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే భారత్‌లో కేసులు తక్కువగా ఉండడానికి ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి కారణమని అంటువ్యాధి నిపుణులు భావించారు. ఏప్రిల్‌లో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రపంచంలో మరే ఇతర దేశంలో నమోదవ్వనన్ని కేసులు భారత్‌లో వెలుగుచూడటంతో...ఈ దేశం కేంద్ర బిందువుగా మారిపోయింది. కేసుల నమోదులో భారత్‌ తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటోంది. లక్ష నుండి మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు వెలుగుచూడటంతో...రోగ నిరోధక శక్తిపై తాము వేసుకున్న అంచనా తప్పని నిపుణులు భావించారు. కాగా, గతంలో వచ్చిన వైరస్‌ పేదలపై అధిక ప్రభావం చూపించగా ఈ ఉప్పెన కొంత స్తోమతుపరులను దెబ్బ తీసిందని కొందరి భావన.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
మోడీ ర్యాలీలు, కుంభమేళా కొంప ముంచాయ్
ఈ స్థాయిలో కరోనా వ్యాప్తికి పెద్ద పెద్ద ప్రజా సమూహాలు ప్రధాన పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. దానికి ఉదాహరణ...ప్రధాని మోడీ ప్రసంగ ర్యాలీలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలపై ఫోకస్‌ చేశారు. దీంతో ప్రజలు వేలల్లో హాజరుకావడం మొదలు పెట్టారు. అంతేకాకుండా మహా కుంభ మేళా వంటి వాటికి భక్తులను ఆహ్వానించారు. ఇవి కరోనా కేసులు విజృంభించడానికి కారణమయ్యాయి. దీనిపై ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ అంటువ్యాధి నిపుణులు రమణ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..కోవిడ్‌-19పై భారత్‌ విజయం సాధించిందని బహిరంగంగా గొప్పలు చెప్పుకున్నారని, అయితే పరిస్థితి మరోలా ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు రిలాక్స్‌ అయ్యారని, ఈ ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక అన్ని కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. పెద్దగా గుమిగూడటం, ప్రయాణాలు, ఘనంగా వివాహాలు నిర్వహించడం మొదలు పెట్టారని తెలిపారు. ఇది కూడా మహమ్మారి కట్టలు తెంచుకోవడానికి కారణమైందన్నారు.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
కొత్త వేరియంట్లు పరిస్థితులను దిగజార్చాయా..?
బ్రెజిల్‌, యుకె, దక్షిణాఫిక్రా వంటి దేశాలకు చెందిన వైరస్‌ల వల్ల దేశంలో ఈ పరిస్థితులకు దారితీశాయా అనే అంశంపై ఇంక స్పష్టత రాలేదు. అయితే శాస్త్రవేత్తలు ఇవి కూడా కారణం కావచ్చునని అంగీకరిస్తున్నారు. యుకెలో మొదట గుర్తించిన బి.1.1.7 వైరస్‌ ఇప్పుడు..పంజాబ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలెక్కువని అధ్యయనంలో తేలింది. మరో వేరియంట్‌ బి.1.617 మహారాష్ట్రలో విజృంభిస్తోంది. దీన్నే డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌గా పిలుస్తారు. అయితే ఇతర వేరియంట్ల కన్నా..ఇది వేగంగా వ్యాప్తి చెందగలదన్న నివేదికలు ఏమీ లేవు. అదేవిధంగా బ్రెజిల్‌, దక్షిణాఫిక్రాలో బయటపడ్డ వేరియంట్లు కూడా భారత్‌లో చక్కర్లు కొట్టాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

కేసులు పెరుగుతుంటే...కేంద్రం ఏం చేసిందంటే..?
కేసులు పెరుగుతుండటంతో వివిధ రాష్ట్రాలు మినీ లాక్‌డౌన్‌ బాట పట్టాయి. ఆసుపత్రుల్లో బెడ్స్‌ కొరత మొదలైంది. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడిన చందంగా ఆక్సిజన్‌ కొరత తోడయ్యింది. దీంతో దేశంలో మృత్యుఘోష మొదలైంది. ఇవన్నీ కేంద్రం దృష్టికి వెళ్లగా...ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని భావించి..మే 1 నుండి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ చివరి ఆప్షన్‌గా మాత్రమే ఉండాలని హితవు పలికారు. పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో పలు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం నడిపేందుకు సిద్ధమైంది. వీటన్నింటితో పాటు కరోనా కట్టడి చేయడంతో మోడీ సర్కార్‌ వైఫల్యం చెందిందంటూ సోషల్‌ మీడియా వేదికగా గొంతెత్తిన వారి పోస్టులను తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది. ఇది మరో పెద్ద వివాదానికి దారి తీసింది.

center

ప్రాణవాయువు కొరత ఏర్పడటానికి కారణాలు?
దేశంలో గతంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగం చాలా తక్కువ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌లో 90 శాతం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రులకు తరలివెళ్లాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సీనియర్‌ ఆరోగ్యాధికారి రాజేష్‌ భూషణ్‌ ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్య్యూలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే సొంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లు లేనందున..ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడ్డాయి. అయితే ఇందులో కూడా ఓ సమస్య ఏర్పడింది. ఓ ఆక్సిజన్‌ ట్యాంక్‌ నింపేందుకు రెండు గంటల సమయం పట్టడం, ట్యాంకర్లు గంటకు 25 మైళ్ల వేగంతో..అది కూడా పగటిపూట మాత్రమే ప్రయాణించడం ప్రాణవాయువు సమస్య మరింత రెట్టింపైంది. రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రులకు ఇదొక తలనొప్పిగా మారింది. కాగా, కేంద్రం ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాట్ల ప్రణాళికను గత అక్టోబర్‌లో ప్రకటించింది. 166 నిర్మిస్తామని హమీనిచ్చిన.... ఈ ఆరు నెలల్లో నిర్మించింది కేవలం 33 మాత్రమే. ఇప్పుడు దీని కొరత రావడంతో మరో 551 ప్లాంట్లను నిర్మిస్తామని తాజాగా ప్రధాని మోడీ హామీనిచ్చారు. వాస్తవానికి ఈ ప్రకటన చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఇప్పటికే ఆక్సిజన్‌ కొరతతో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయితే చిన్నపాటి ఆక్సిజన్‌ ప్లాంట్లను నడుపుతున్నవారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటామని...తమకు ఆర్థిక సాయం అందించాలని అడుగుతున్నా....మోడీ ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదు.

center
ఆపన్న హస్తం అందిస్తోన్న ప్రపంచ దేశాలు
భారత్‌ కరోనా కల్లోల్లంలో కొట్టుమిట్టాడుతుంటే..ఇతర దేశాలు ఆపన్న హస్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. సింగపూర్‌, జర్మనీ, యుకె... ఆక్సిజన్‌ సంబంధిత సామాగ్రిని పంపాయి. ఫ్రాన్స్‌, రష్యా, ఆస్ట్రేలియా వంటివి వైద్య సాయాన్ని అందిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్‌ సాయం అందిస్తామని చెప్పాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఆక్సిజన్‌, ఇతర మందులకు అందించేందుకు సహకరిస్తామని తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ మాట్లాడుతూ..భారత్‌కు అదనపు ఆరోగ్య సిబ్బంది, సామాగ్రిని పంపుతామని తెలిపారు. కాగా, భారత్‌కు సాయం చేయాలని ఒత్తిడి పెరగంతో అమెరికా కూడా సాయం చేస్తామని చెప్పింది. కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడిసరుకును అందిస్తామని హామీనిచ్చింది.