28, ఏప్రిల్ 2021, బుధవారం

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!

 

న్యూఢిల్లీ : గత ఏడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది. దీంతో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దశల వారీగా లాక్‌డౌన్‌కు విముక్తి కలిగించగా..కేసులు పెరుగుతూ వచ్చినప్పటికీ..అనంతరం తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వాలు, ప్రజలు 'హమ్మయ్య' అనుకున్నారు. జనవరిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేయడంతో... ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్లతో భయాందోళనలను మొదలయ్యాయి. అయితే టీకాలు అందుబాటులోకి వచ్చేయడంతో.. వాటి వల్ల భారత్‌కు వచ్చే ప్రమాదమేమీ లేదని, అప్పటికే వచ్చిన వ్యాక్సిన్లు వాటిపై కూడా పనిచేస్తాయని వైద్య సిబ్బంది, అంటు వ్యాధి నిపుణులు అనుకున్నారు. వెంటిలేటర్ల డిమాండ్‌ ఉండకపోవచ్చునని, సెకండ్‌ వేవ్‌ను తప్పించుకున్నట్లేనని కొందరు నిపుణులు ఫిబ్రవరిలో ఓ అంచనాకు వచ్చేశారు.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
వద్దన్నా...వదిలేస్తానా....
మార్చి చివరి నుండి కరోనా కేసులు కొది కొద్ద్దిగా పెరగడం మొదలయింది. మహమ్మారి బలం పుంజుకుని విజృంభించింది. దీంతో దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో వెళ్లిందని కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్‌లో ఊహించనిరీతిలో మహమ్మారి జడలు విప్పింది. కేసులు విపరీతంగా పెరిగాయి. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. పలువురు మృత్యువాత పడ్డారు. శ్మశాన వాటికల వద్ద మృతదేహాలు బారులు తీరిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతటి విపత్తుకు మోడీ సర్కార్‌ వైఫల్యమే కారణమని పలువురు విమర్శించారు.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
ఇంత ఘోరమైన పరిస్థితులు ఇందుకేనా..?
తగ్గినట్లే తగ్గి కరోనా ఉప్పెనలా ఎగిసి పడటాన్ని బహుశా నిపుణులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గింది. రోజువారీ కేసుల నమోదులో అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంతో సమానంగా భారత్‌లో నమోదయ్యాయి. జనాభా రీత్యా న్యూయార్క్‌కు భారత్‌ 50 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే భారత్‌లో కేసులు తక్కువగా ఉండడానికి ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి కారణమని అంటువ్యాధి నిపుణులు భావించారు. ఏప్రిల్‌లో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రపంచంలో మరే ఇతర దేశంలో నమోదవ్వనన్ని కేసులు భారత్‌లో వెలుగుచూడటంతో...ఈ దేశం కేంద్ర బిందువుగా మారిపోయింది. కేసుల నమోదులో భారత్‌ తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటోంది. లక్ష నుండి మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు వెలుగుచూడటంతో...రోగ నిరోధక శక్తిపై తాము వేసుకున్న అంచనా తప్పని నిపుణులు భావించారు. కాగా, గతంలో వచ్చిన వైరస్‌ పేదలపై అధిక ప్రభావం చూపించగా ఈ ఉప్పెన కొంత స్తోమతుపరులను దెబ్బ తీసిందని కొందరి భావన.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
మోడీ ర్యాలీలు, కుంభమేళా కొంప ముంచాయ్
ఈ స్థాయిలో కరోనా వ్యాప్తికి పెద్ద పెద్ద ప్రజా సమూహాలు ప్రధాన పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. దానికి ఉదాహరణ...ప్రధాని మోడీ ప్రసంగ ర్యాలీలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలపై ఫోకస్‌ చేశారు. దీంతో ప్రజలు వేలల్లో హాజరుకావడం మొదలు పెట్టారు. అంతేకాకుండా మహా కుంభ మేళా వంటి వాటికి భక్తులను ఆహ్వానించారు. ఇవి కరోనా కేసులు విజృంభించడానికి కారణమయ్యాయి. దీనిపై ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ అంటువ్యాధి నిపుణులు రమణ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..కోవిడ్‌-19పై భారత్‌ విజయం సాధించిందని బహిరంగంగా గొప్పలు చెప్పుకున్నారని, అయితే పరిస్థితి మరోలా ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు రిలాక్స్‌ అయ్యారని, ఈ ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక అన్ని కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. పెద్దగా గుమిగూడటం, ప్రయాణాలు, ఘనంగా వివాహాలు నిర్వహించడం మొదలు పెట్టారని తెలిపారు. ఇది కూడా మహమ్మారి కట్టలు తెంచుకోవడానికి కారణమైందన్నారు.

భారత్‌లో కరోనా ఉప్పెనకు కారణాలివేనా....!
కొత్త వేరియంట్లు పరిస్థితులను దిగజార్చాయా..?
బ్రెజిల్‌, యుకె, దక్షిణాఫిక్రా వంటి దేశాలకు చెందిన వైరస్‌ల వల్ల దేశంలో ఈ పరిస్థితులకు దారితీశాయా అనే అంశంపై ఇంక స్పష్టత రాలేదు. అయితే శాస్త్రవేత్తలు ఇవి కూడా కారణం కావచ్చునని అంగీకరిస్తున్నారు. యుకెలో మొదట గుర్తించిన బి.1.1.7 వైరస్‌ ఇప్పుడు..పంజాబ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలెక్కువని అధ్యయనంలో తేలింది. మరో వేరియంట్‌ బి.1.617 మహారాష్ట్రలో విజృంభిస్తోంది. దీన్నే డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌గా పిలుస్తారు. అయితే ఇతర వేరియంట్ల కన్నా..ఇది వేగంగా వ్యాప్తి చెందగలదన్న నివేదికలు ఏమీ లేవు. అదేవిధంగా బ్రెజిల్‌, దక్షిణాఫిక్రాలో బయటపడ్డ వేరియంట్లు కూడా భారత్‌లో చక్కర్లు కొట్టాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

కేసులు పెరుగుతుంటే...కేంద్రం ఏం చేసిందంటే..?
కేసులు పెరుగుతుండటంతో వివిధ రాష్ట్రాలు మినీ లాక్‌డౌన్‌ బాట పట్టాయి. ఆసుపత్రుల్లో బెడ్స్‌ కొరత మొదలైంది. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడిన చందంగా ఆక్సిజన్‌ కొరత తోడయ్యింది. దీంతో దేశంలో మృత్యుఘోష మొదలైంది. ఇవన్నీ కేంద్రం దృష్టికి వెళ్లగా...ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని భావించి..మే 1 నుండి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ చివరి ఆప్షన్‌గా మాత్రమే ఉండాలని హితవు పలికారు. పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో పలు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం నడిపేందుకు సిద్ధమైంది. వీటన్నింటితో పాటు కరోనా కట్టడి చేయడంతో మోడీ సర్కార్‌ వైఫల్యం చెందిందంటూ సోషల్‌ మీడియా వేదికగా గొంతెత్తిన వారి పోస్టులను తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది. ఇది మరో పెద్ద వివాదానికి దారి తీసింది.

center

ప్రాణవాయువు కొరత ఏర్పడటానికి కారణాలు?
దేశంలో గతంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగం చాలా తక్కువ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌లో 90 శాతం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రులకు తరలివెళ్లాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సీనియర్‌ ఆరోగ్యాధికారి రాజేష్‌ భూషణ్‌ ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్య్యూలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే సొంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లు లేనందున..ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడ్డాయి. అయితే ఇందులో కూడా ఓ సమస్య ఏర్పడింది. ఓ ఆక్సిజన్‌ ట్యాంక్‌ నింపేందుకు రెండు గంటల సమయం పట్టడం, ట్యాంకర్లు గంటకు 25 మైళ్ల వేగంతో..అది కూడా పగటిపూట మాత్రమే ప్రయాణించడం ప్రాణవాయువు సమస్య మరింత రెట్టింపైంది. రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రులకు ఇదొక తలనొప్పిగా మారింది. కాగా, కేంద్రం ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాట్ల ప్రణాళికను గత అక్టోబర్‌లో ప్రకటించింది. 166 నిర్మిస్తామని హమీనిచ్చిన.... ఈ ఆరు నెలల్లో నిర్మించింది కేవలం 33 మాత్రమే. ఇప్పుడు దీని కొరత రావడంతో మరో 551 ప్లాంట్లను నిర్మిస్తామని తాజాగా ప్రధాని మోడీ హామీనిచ్చారు. వాస్తవానికి ఈ ప్రకటన చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఇప్పటికే ఆక్సిజన్‌ కొరతతో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయితే చిన్నపాటి ఆక్సిజన్‌ ప్లాంట్లను నడుపుతున్నవారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటామని...తమకు ఆర్థిక సాయం అందించాలని అడుగుతున్నా....మోడీ ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదు.

center
ఆపన్న హస్తం అందిస్తోన్న ప్రపంచ దేశాలు
భారత్‌ కరోనా కల్లోల్లంలో కొట్టుమిట్టాడుతుంటే..ఇతర దేశాలు ఆపన్న హస్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. సింగపూర్‌, జర్మనీ, యుకె... ఆక్సిజన్‌ సంబంధిత సామాగ్రిని పంపాయి. ఫ్రాన్స్‌, రష్యా, ఆస్ట్రేలియా వంటివి వైద్య సాయాన్ని అందిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్‌ సాయం అందిస్తామని చెప్పాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఆక్సిజన్‌, ఇతర మందులకు అందించేందుకు సహకరిస్తామని తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ మాట్లాడుతూ..భారత్‌కు అదనపు ఆరోగ్య సిబ్బంది, సామాగ్రిని పంపుతామని తెలిపారు. కాగా, భారత్‌కు సాయం చేయాలని ఒత్తిడి పెరగంతో అమెరికా కూడా సాయం చేస్తామని చెప్పింది. కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడిసరుకును అందిస్తామని హామీనిచ్చింది.

కామెంట్‌లు లేవు: