1, జూన్ 2012, శుక్రవారం

అవినీతిని అరికట్టేదెవరు?

              అవినీతిపై ఒక పక్క ఉద్యమాలు జరుగుతున్నాయి. జనలోక్‌పాల్‌ బిల్లు కావాలని పోరాటం చేశారు. అది నామమాత్రంగా చర్చించి పార్లమెంటు అలా వదిలేసింది. అవినీతిని అరికట్టి, ప్రజల మానప్రాణాలను, సంపదను కాపాడాల్సిన న్యాయమూర్తులు కూడా అవినీతికి పాల్పడుతుంటే అవినీతిని ఎలా అరికట్ట గలం. ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సంపదను దోచుకుంటున్నారు. వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేసి వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతోపాటు, తప్పుడు వ్యాపారాలు చేసి ప్రజల సంపదను కొల్లగొడుతున్నారు. పోర్త్‌ ఎస్టేట్‌గా చెప్పుకునే ప్రసార మాధ్యమాలను ప్రచార మాధ్యమాలుగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. విద్యావంతులు, మేథావులు ఈ వ్యవహారాలను తగినంతగా ప్రశ్నించి ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారు. ప్రజాపక్షపాతంగా వ్యవహరించి గొంతెత్తి చాటే వామపక్ష పార్టీలను ప్రచారమాధ్యమాల ద్వారా , అధికార బలంతో అణగదొక్కుతున్నారు. వారి గొంతును నొక్కేస్తున్నారు. వ్యవస్థలో సమూలమైన మార్పువచ్చేవరకు ఈ అవినీతిని అరికట్టలేమని నాఅభిప్రాయం. నాకున్న కొన్ని ప్రతిపాదనలు మీ ముందుంచుతాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
1. పెట్టుబడిదారి వ్యవస్థ నాశనం కావాలి. ప్రస్తుతం అది వెంటనే సాధ్యం కాదు.
2. ఎన్నికల నిర్వహణలో మార్పు రావాలి.
3. ప్రజాసేవ చేస్తానని ఎన్నికల్లో పోటీ చేసే వక్తి ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలి. పదవి కాలం పూర్తయ్యాక ఆస్తులను వెనక్కు తీసుకోవాలి. పదవిలో ఉన్నంత కాలం కనీస వేతనం తీసుకోవాలి. పదవి కాలంలో అవినీతికి పాల్పడితే పదవి నుంచి వైదొలడంతోపాటు జీవతకాలం పోటీ చేయకూడదు.
4. ఎన్నికల ప్రచార ఖర్చు ప్రభుత్వమే భరించాలి. అభ్యర్థి ఖర్చు చేస్తే ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉండకూడదు.
5. నేర చరిత్ర ఉన్నవాళ్లను ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం ఇవ్వరాదు.
6. ఒకసారి గెలిచి పదవి ఐదేళ్లు అనుభవించిన వ్యక్తి తిరిగి పోటీచేయరాదు.
7. ఉన్నత ఉద్యోగాల్లో ఉండి అవినీతికి పాల్పడితే జీవితకాలం జైల్లో పెట్టాలి.
8. విద్య, వైద్యం ప్రయివేటు ఆదీనంలో ఉండరాదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.
9. ఆస్తికి పన్ను చెల్లించని వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
10. పై వాటి అమలుకు తక్షణ రాజ్యాంగసవరణ చేయాలి.
11. ప్రస్తుతం ఉన్నచట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.