25, మే 2020, సోమవారం

213 దేశాల్లో .. 55 లక్షల కరోనా కేసులు

                      చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్... ఇపుడు ఏకంగా 213 దేశాలకు విస్తరించింది. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 55 లక్షలకు చేరింది. దీని బారిన పడి చనిపోయినవారి సంఖ్య 3.45 లక్షలకు చేరుకుంది. ఇక 23.02 లక్షల మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాను ఈ వైరస్ తీవ్రంగా వణికిస్తోంది. ఈ దేశంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అమెరికాలో ఆదివారం మరో 18 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,86,436 కు చేరుకన్నాయి.
         దేశంలో వైరస్‌ సోకిన వారిలో 99,300 మంది మరణించారు. ఇకపోతే, పాజిటివ్ కేసుల్లో రష్యా రెండో స్థానంలో ఉండేది. కానీ, ఇపుడు బ్రెజిల్ రష్యాను వెనక్కి నెట్టేసింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు మొత్తం 3.63 లక్షల కేసులు నమోదుకాగా, 22,716 మంది మరణించారు. ఇక 1,49,911 మంది కోలుకోగా, మరో 1,90,991 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మూడవ స్థానంలో ఉన్న రష్యాలో కరోనా కేసులు 3,44,481 కి పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 3,541 మంది మరణించారు. ఇక 2,82,852 కేసులతో స్పెయిన్‌, 2,59,559 పాజిటివ్‌ కేసులతో బ్రిటన్, 2,29,858 కేసులతో ఇటలీ, 1,82,584 కేసులతో ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
             మరోవైపు, 130 కోట్ల జనాభా వున్న భారత్‌లో ఆదివారం ఒక్క రోజే ఆరు వేలకు పాగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకంటే మొత్తం కేసుల సంఖ్య 1.38 లక్షలకు చేరువైంది. అలాగే, ప్రపంచ దేశాల జాబితాలో భారత్... ఇరాన్‌ను వెనక్కి నెట్టి పదో స్థానంలోకి వచ్చింది.

22, మే 2020, శుక్రవారం

మంటలు పుట్టిస్తున్న వేసవి


పడమర గాలులతో ఉక్కిరిబిక్కిరి 
ద్వారకా తిరుమలలో 48 డిగ్రీలు 
ఈ నెల 25 వరకూ ఇంతే


                   వేసవి ఠారెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. వడగాలులు ఉధృతమయ్యాయి. వెచ్చటి గాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోహిణీకార్తె రాకముందే భానుడు భగభగ మండిపోతున్నాడు. పడమర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా ప్రాంతం ఉడికిపోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

              ‘ఆంఫన్‌’ తుఫాను బలహీనపడటంతో వేసవి తీవ్ర ప్రభావం చూపుతోంది. సూర్యాస్తమయం తరువాత కూడా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. గురువారం కోస్తాలో పలుచోట్ల సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ, తెలంగాణలో కొనసాగిన వడగాడ్పుల ప్రభావం కోస్తా వరకు విస్తరించింది. ఆర్టీజీఎస్‌ డేటా ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ రాఘవపురంలో 48, కురించేడు(ప్రకాశం)లో 47.97, పమిడిముక్కల(కృష్ణా), క్రోసూరు(గుంటూరు), జగ్గిలబొంత(శ్రీకాకుళం)లో 46.32డిగ్రీలు నమోదయ్యాయి. భారత వాతావరణ సంస్థ నమోదు చేసే కేంద్రాలను పరిశీలిస్తే గన్నవరంలో 46, బాపట్ల, నందిగామ, ఒంగోలు,. జంగమహేశ్వరపురంలో 45, కావలి, మచిలీపట్నంలో 44 డిగ్రీలు నమోదయ్యాయి. ఈనెల 23న ఉష్ణోగ్రత మరింత పెరిగి 48 డిగ్రీలకు చేరుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రి సమయంలోనూ గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోయింది. దీంతో వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
             
శుక్రవారం నుంచి వేడిగాలులు, ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి. ఉత్తరాంధ్రలో 45-47 డిగ్రీలు, దక్షిణ కోస్తాలో 43-44డిగ్రీలు, రాయలసీమలో 41-42డిగ్రీల నమోదు కానున్నాయి. 23న ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నా, విశాఖ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 46-48డిగ్రీలు, విజయనగరం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 43-45డిగ్రీలు, నమోదు కానున్నాయి. 24న ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో 44-46 డిగ్రీలు, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో 42-43డిగ్రీలు, రాయలసీమలో 39-42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 25న కూడా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43-44, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 41-42, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు వడగాలుల బారిన పడకుండా, డీహైడ్రేట్‌ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, నీడలో ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మరో రెండురోజులపాటు కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ విజయభాస్కర్‌ తెలిపారు. 24వరకు వడగాడ్పులు కొనసాగి తరువాత క్రమేపీ తగ్గుతాయని ఇస్రో నిపుణుడు పేర్కొన్నారు.


21, మే 2020, గురువారం

ఆంఫన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది మృతి

           
కోల్‌కతా: ఆంఫన్ తుపాను తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది చనిపోయారు. తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు ప్రధానమంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆమె రెండున్నర లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
          అతి తీవ్ర తుఫాన్‌ ‘ఆంఫన్‌’ పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 5.30 గంటలకు ముగిసినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. కాగా, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్‌ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఇరు రాష్ట్రాలోనూ భారీ గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. హౌరా జిల్లా మణికాన్‌లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి.
         పశ్చిమబెంగాల్‌లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. బెంగాల్‌లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై బీజేపీ విచారం వ్యక్తం చేసింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 


20, మే 2020, బుధవారం

21 నుంచి ఆర్ టి సి బస్సులు రోడ్డు పైకి


  • ఆన్‌లైన్‌లో లేదా బస్టాండ్‌లో టికెట్‌ కొనాలి
  • గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోనే అనుమతి
  • తొలుత 15% బస్సులతో ప్రారంభం
  • విజయవాడ, విశాఖలో కొంత ఆగాలి

            ఆర్టీసీ బస్సులు అరవై రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కుతున్నాయి. లాక్‌ డౌన్‌తో రెండు నెలలుగా డిపోలకే పరిమితమై 2020 మే 21
గురువారం నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు పది నుంచి పదిహేను శాతం బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారినీ, బస్టాండుకు వచ్చి గ్రౌండ్‌ బుకింగ్‌ ద్వారా టికెట్‌ తీసుకున్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు. నగదు ద్వారా కొవిడ్‌ వచ్చే అవకాశం ఉందని, అందుకే కండక్టర్‌ బస్సులో ఉండకుండా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని ఆపరేషన్‌ విభాగానికి చెందిన కీలక అధికారి ఒకరు చెప్పారు. నిజానికి, ఈ నెల 18 నుంచే బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇందుకు రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 128 బస్‌ డిపోలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని డిపోల నుంచి సాధ్యమైనన్ని బస్సులు నడపాలని అధికారులు భావించారు. అందుకు అనుగుణంగా అంతా సిద్ధమవ్వడంతో, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారికంగా ప్రకటన చేసేందుకు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే ముఖ్యమంత్రి జగన్‌తో రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, టాస్క్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు సమావేశం అవడంతో.. ఆర్టీసీ ఎండీని పిలిపించారు. విలేకరుల సమావేశం రద్దు చేసుకుని వెళ్లిన ఎండీ, ఇతర అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు.                         బస్సుల్లో సీటింగ్‌ మార్పు, గ్రీన్‌ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్‌ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్‌ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు. అయితే డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్‌ విధానం మార్చడం వల్ల వీలైనంత మేరకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, ఆర్టీసీ బస్సులు తిప్పడంపై బుధవారం ఎంపీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

17, మే 2020, ఆదివారం

మే 31 వరకూ లాక్‌డౌన్‌

                      న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.
           మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.                                                                                                                                        

లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

 కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
                పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకూ మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

9, మే 2020, శనివారం

విశాఖలో ఎల్‌జి విషాదం


               కరోనా కష్టంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుండి స్టైరీన్‌ విషవాయువు లీకైన ఘటన మరో అశనిపాతం. 2020 మే 7న జరిగిన విశాఖ విశాదంలో విషవాయువును పీల్చి 12 మంది మృతిచెందారు. వందలాది మంది  అస్వస్థతకు గురయ్యారు. విషవాయువులో స్టైరీన్‌ ఒక్కటేనా ఇంకేమైనా విషవాయువు కలిశాయ విచారణలో తేలాలి. స్టైరీన్‌ అనేది ప్రాథమికంగా ద్రవరూపంలో ఉండే వాయువు. వాతావరణంలో ఇది చాలా తక్కువగా లభిస్తుంది. మిగతా వాటితో పోలిస్టే భారమైన వాయువు. కొన్ని రకాల చెట్ల బెరడు నుంచి చాలా తక్కువగా లభిస్తుంది.  అందువ్లలన పెట్రో కెమికల్‌ రీఫైనరీస్‌లో దీనిని తయారు చేసి పాలిమర్స్‌, ప్లాస్టిక్‌, రెగ్జిన్‌ తయారిలో వినియోగిస్తున్నారు. ఇది గాలిలో కలిసినప్పుడు ప్రాణాంతకమైన స్టైరీన్‌ డయాక్సైడ్‌గా మారుతుందని నిపుణులు అంచనాకు వచ్చారు. 
       ఘటనపూర్వపరాలు :  ఘటన త్లెలవారుజామున జరగడంతో సమీప గ్రామాల్లో గాఢనిద్రలో ఉన్నవారికి ముప్పు తీవ్రత తెలియలేదు. విషవాయువు ప్రభావంతో ఉక్కిరిబిక్కిరవుతూ రోడ్లమీదకు పరుగెత్తుకొచ్చిన వారంతా కుప్పకూలిన ద్రుశ్యాలు   హ్రుదయవిదారకంగా ఉన్నాయి. పిల్లలను, ముసలి వాళ్ళను మోసుకుపోతున్న వాళ్ళు, ఆ వేదన రోదన మధ్యనే తమకుటుంబీకులను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారితో ఈ విషాద ద్రుశ్యాలు పువురిని  కంటతడిపెట్టించాయి. ఐదుకిలోమీటర్ల మేరకు విస్తరించిన ఆ విష వాయువు మనుషులనే కాదు, అమాయక పశుపక్ష్యాదులనూ కబలించింది.  పచ్చనిచెట్లు సైతం మాడిమసై పోయాయి. విశాఖను కుదిపేసిన ఈ మహా విషాదంలో నిజాన్ని నిగ్గుత్చేడం ముఖ్యం. ఒక భయానకమైన విషవాయువును పొట్టనిండా దాచుకున్న కంపెనీ ఇంతటి బాధ్యతారాహిత్యంతో ఎలా ఉండగలిగిందో, అందుకు కారకులెవరో తేల్చాలి. కొందరిని చంపి, వందమందిని ఆస్పత్రుల పాల్జేసిన ఈ విషవాయువు తక్షణ ప్రభావం మాత్రమే మనం ఇప్పుడు చూశాం. కళ్ళమంటలు, చర్మంపై దురదలు, శ్వాస సమస్య వంటి తాత్కాలిక లక్షణాను అటుంచితే, ఈ వాయువు మనిషిపై చూపే దీర్ఘకాలిక ప్రభావం తీవ్రమైనది. ప్రాణవాయువుతో కలిసినందున స్టైరీన్‌ మరింత ప్రమాదకర రూపాన్ని సంతరించుకొని, వారంపాటు గాలిలోనే ఉండిపోతుందన్న విశ్లేషణలు భయపెడుతున్నాయి. స్టైరీన్‌ను నిల్వ ఉంచిన కంటైనర్లు పాతవికావడం, వాటినీ సరిగా నిర్వహించకపోవడం, ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ‘అతి హానికర విషవాయువు’తో నిత్యమూ వ్యవహరించే కంపెనీలో కీకమైన వీవోసీ వ్యవస్థ పనిచేయని స్థితిలో ఉండటం ఆశ్చర్యం. స్టైరీన్‌ స్థితిని ఎప్పటికప్పుడు తెలియచెప్పే ప్రత్యేక వ్యవస్థ లేనందునే, లీకేజీని తక్షణమే గుర్తించక వాయువు ఇలా వేగంగా విస్తరించగలిగింది.
          ఈ ప్రమాదంలో కంపెనీ నిర్లక్ష్యం అణువణువునా కనిపిస్తున్నది. సడలింపును అందిపుచ్చుకొని తిరిగి తెరిచేందుకు ఉత్సాహపడుతున్నవారు, లాక్‌డౌన్‌ కాలం లో తాము నిర్వహణలో చూపిన నిర్లక్ష్యాన్ని ముందుగా సవరించుకోలేదు. వాయువు లీకైన గంటకు కానీ లీకేజీని గుర్తించలేదు.  అక్కడున్న కొద్దిమందికీ ఏం చేయాలో తోచక చేతులెత్తేశారు. నివారణ చెప్పగ నిపుణులెవ్వరూ లేకపోవడం వలన గంటల తరబడి ఆ విష వాయువు సమీప ప్రాంతాను చుట్టుముట్టింది.  వరుస తప్పిదాలకు నిదర్శనం. లాక్‌డౌన్‌ కారణంగా మూతబడిన కంపెనీలన్నీ రక్షణచర్యుల కొనసాగిస్తున్నదీ లేనిదీ కనిపెట్టాల్సిన వివిధ శాఖ అధికారులు ఇది బడా కంపెనీ కావడంతో దీని జోలికి వచ్చివుండరు. ఈ కాలు ష్య కారక కంపెనీని మూసివేయాలని ఎంతోకాలగా ప్రజులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పాకులుకు పట్టలేదు.  విస్తరణకు సైతం అనుమతులు ఇస్తున్నారు. కరోనా కారణంగా చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలుకు ఘనస్వాగతం పలుకండి అంటూ రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఉద్బోధించిన నేపథ్యంలో, మరిన్ని మినహాయింపుతో ఈ దేశంలోకి అడుగుపెట్టే కంపెనీతో రాబోయే కాలం లో ఎన్ని విషాదాలు చవిచూడాల్సి వస్తుందో ..........

1, మే 2020, శుక్రవారం

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు


►విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
►స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌
►హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌
►స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి
►అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు
►అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
►గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
►రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
►వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన
►కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు
►గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
►గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
►ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
►ఆరెంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
►ఆరెంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి
►ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
►గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి
►వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి
►రెడ్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
►33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
►రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
►బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి
►గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ఆన్‌ లైన్‌ షాపింగ్‌కు అనుమతి
►ప్రైవేట్‌ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
►అన్ని రకాల గూడ్స్‌, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
►బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాల్సిందే
►పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
►అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి