న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.
మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.
లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకూ మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
1 కామెంట్:
కొలకలూరి ఇనాక్ ఆకలి కథ పాఠ్యబాగం గుర్తుకు వస్తుంది.😩😨😷
కామెంట్‌ను పోస్ట్ చేయండి