28, ఆగస్టు 2014, గురువారం

అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం

            
నవ్యాంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి సంచిక ఆవిష్కరణ సభలో కలెక్టర్‌

       నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని  ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా  కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. బుధవారం (2014 ఆగస్టు 27) కర్నూలు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో   ప్రజాశక్తి నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రత్యేక సంచికను కలెక్టర్‌, ప్రజాశక్తి 34వ వార్షికోత్సవ ప్రత్యేక అనుబంధాన్ని సంపాదకులు తెలకపల్లి రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలుగు ప్రజల ఆశాసౌదంగా భావించిన హైదరాబాద్‌ నగరం నుంచి దూరమైన ఆరున్నర కోట్ల ఆంధ్రులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. రాజధానికంటె కీలకమైన ఆర్థిక వ్యవస్థను కోల్పోయామని చెప్పారు.  భవిష్యత్తులో ఇలాంటినష్టం జరగకుండా ఐదారు చోట్ల అలాంటి నగరాలను నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. పదిచోట్ల మెగాసిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. అందులో కర్నూలు కూడా ఒకటని అన్నారు. పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 29 వేల ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామని చెప్పారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గనులు, వ్యవసాయం, నీటి వనరులు ఉన్నాయని వివరించారు. విత్తన ఉత్పత్తికి నంద్యాల డివిజన్‌లో రెండు లక్షల ఎకరాలు అనుకూలంగా ఉందని చెప్పారు. వ్యవసాయంలో ఉద్యానవనపంటలు, విత్తనోత్పత్తికి, కర్భూజ, అరటి పండ్ల ఉత్పత్తికి అవకాశాలున్నాయని చెప్పారు. వీటిపై ప్రభుత్వానికి  నివేదికలు పంపామని చెప్పారు. ఇక్కడ మానవ వనరులు కూడా పుష్కలంగా ూన్నాయని చెప్పారు. శారీరక శ్రమ చేసేవారు, మేధోశ్రమ చేసేవారు ఉన్నారని చెబుతూ శారీరక శ్రమ చేసే వారు వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఇవన్నీ జరిగితే స్థూల ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికోసం  ప్రజాశక్తి చేస్తున్న కృషిని కలెక్టర్‌ అభినందించారు. అనంరతం ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ కర్నూలుకు పత్రికా రంగంలో విశిష్ట స్థానం ఉందని చెప్పారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టు  గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు.  ఆనాడు స్వాభిమానం కోసం మాది మాకు కావాలని పోరాడారని గుర్తు చేశారు.  1936లో తొలిపత్రిక కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రారంభించారని అన్నారు. మీడియాకు సత్యనిష్ట అవసరమని, ప్రజాశక్తి స్థిరంగా, నికరంగా, నిజాయితీగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ప్రజాశక్తి కూడా ఒకటని అన్నారు.  మీడియా అంటే పాలకులు భయపడుతున్నారని అందుకే ఇటీవల రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపేశారని అన్నారు. మీడియా దృష్టి సినిమా, కార్పోరేట్‌, సెలబ్రిటీ, సెన్సేషనల్‌, క్రైం వైపే కాకుండా కామన్‌మ్యాన్‌, కమ్యూనిష్టులపై కూడా ఉండాలని సూచించారు. రాష్ట్రం విడిపోయాక ప్రజల సమస్యలపై కేంద్రీకరించడాకి మీడియాకు ఎక్కువ అవకాశం ఉందని చెప్పారు.  రాష్ట్రం విడిపోయాక పరిష్కారం కాని ప్రధాన సమస్యల్లో నదీజలాలు ఒకటని చెప్పారు. కృష్ణానది నీటి విభజన జరగక పోతే రాయలసీమకు నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పాలకులు అంతరరాష్ట్ర సమస్యలపై కాకుండా అంతర్గత సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఉపాధి, ఉత్పత్తిపై చర్చజరగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ 2020 కాస్త 2029గా మారిందని చెప్పారు. సెజ్‌లు, రాజధాని అభివృద్ధికి సూచికలు కావని అన్నారు. నవ్యాంధ్రను సవ్యాంధ్రగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం 14 వేల కోట్లు ఇస్తుందని ఆశించారని, అలాంటి సూచనలు కానరాక 37వేల కోట్లకు  ద్రవ్యలోటు పెరిగిందని చెప్పారు. అనంతరం డిసిసి అధ్యక్షులు బివై రామయ్య, టిడిపి అధికార ప్రతినిధి నాగేశ్వరయాదవ్‌, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు కె ప్రభాకర్‌రెడ్డి, రామాంజనేయులు, రవీంద్ర విద్యా సంస్థల అధినే జి పుల్లయ్య, కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి మాట్లాడారు. సభకు కర్నూలు స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.గోరంట్లప్ప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సిఇఓ జయరామిరెడ్డి, ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

1, ఆగస్టు 2014, శుక్రవారం

కార్మిక భద్రతపై కేంద్రం దాడి

                            పోలవరం వ్యవసాయం కోసం కాదు
            వరంగల్‌ జాతీయ సెమినార్‌లో పాలగుమ్మి సాయినాధ్‌

        కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికుల చట్టాల్లో సవరణలు తేవడం మొదటి ఎజెండాగా పెట్టుకున్నట్లుగా ఉందని సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఎనిమిదో మహాసభల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో 2014 ఆగస్టు ఒకటిన శుక్రవారం సెమినార్లు ఏర్పాటు చేశారు. ‘సరళీకరణ విధానాలు ` గ్రామీణ పేదల స్థితిగతులు’ అంశంపై సాయినాధ్‌, ప్రొఫెసర్‌ షీలా భల్లా మాట్లాడారు. సెమినార్‌లో సాయినాధ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యవసాయ అవసరాల కోసం కాదన్నారు. బహుళ జాతి సంస్థల కోసమేనని స్పష్టం చేశారు. అక్కడ సెజ్‌లు వెలుస్తాయన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పనిదినాలు పెరగవని చెప్పారు. ఉపాధి హామీకి కేవలం రూ.34 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కార్పొరేట్‌ శక్తులకు రూ.71 వేల కోట్ల పన్ను మాఫీ చేశారని వివరించారు. రూ.2 లక్షల కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. దీనిలో రూ.48 వేల కోట్లు బంగారం, డైమండ్స్‌ దిగుమతులపై సబ్సిడీ ఉందన్నారు. ఇటువంటి చర్యల వల్ల లోటు బడ్జెట్‌ కనిపిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయింపు పెంచాలంటే డబ్బులేవంటున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో బహుళ జాతి సంస్థల యజమానులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో దేశంలో వందేళ్లపాటు ఉపాధి హామీ చట్టం అమలు చేయవచ్చని చెప్పారు. అందరికీ పని కల్పించవచ్చన్నారు. ఆహారభద్రత చట్టం అమలుకు డబ్బుల్లేవని కేంద్రం చెబుతోంద న్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో నీటి లభ్యత లేదని, అక్కడ కరువు ప్రకటించారని చెప్పారు. సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదన్నారు. గ్రామాల నుండి ముంబాయికి వలస వచ్చిన వారిని కలిశామన్నారు. వారు ముంబాయిలో 37 అంతస్తుల భవన నిర్మాణంలో పని చేస్తున్నారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ఒక్కో స్విమ్మింగ్‌ పూల్‌ ఉందన్నారు. నీరు ఎక్కడ నుండి వచ్చిందన్నారు. ఈ నీటిని వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామీణ ప్రాంతానికి ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
                                              శాశ్వత ఉపాధి కరువు : ప్రొఫెసర్‌ శీలా భల్లా
            గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కరువైందని ప్రొఫెసర్‌ శీలా భల్లా తెలిపారు. ‘సరళీకృత విధానాలు ` గ్రామీణ స్థితిగతులు’ అంశంపై సెమినార్‌లో ఆమె ప్రసంగించారు. 15 ఏళ్లలో వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ రంగంలోనూ ఆశించినంతగా ఉపాధి పెరగలేదని తెలిపారు. నూతన ఆర్థిక విధానాల ప్రారంభం అనంతరం ఇటువంటి పరిస్థితి తీవ్రమైందన్నారు. ముఖ్యంగా యువత ఉపాధికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. భారీగా అసమానతలు పెరిగాయని చెప్పారు. వలసలు ఎక్కువయ్యాయని వివరించారు. ఇటువంటి పరిస్థితి మారాలంటే పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య ఉన్న అంతరాలు పోవాలని ఆకాంక్షించారు.