31, జులై 2019, బుధవారం

కాఫీడే బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా రంగనాథ్‌

                  వి.జి.సిద్ధార్థ మరణంతో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌.వి.రంగనాథ్‌ను నియమించారు. ఇప్పటికే ఆయన బోర్డులో  సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1975 కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రంగనాథ్‌ ప్రభుత్వంలో వివిధ  హోదాల్లో పనిచేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్‌ సెక్రటరీగా కూడా విధులు నిర్వహించారు. గతంలో అబుదాబిలోని  ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌సెంటర్‌ బోర్డు డైరెక్టర్లలో ఒకరు. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ తర్వాతి సమావేశం ఆగస్టు8వ తేదీన జరగనుంది.
ఇప్పటి వరకు వి.జి.సిద్ధార్థే ఈ కంపెనీకి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. 29వ తేదీ నుంచి ఆయన కనిపించకపోవడంతో  నిన్న సీడీఈ రెగ్యూలేటరీలకు ఈమేరకు సమాచారం అందజేసింది. కంపెనీని నిపుణుల సాయంతో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళతామని పేర్కొంది. నిన్న 20శాతం.. నేడు 19శాతం మేరకు సీడీఈ షేర్లు కుంగాయి. 

బోర్డులో మిగిలిన సభ్యలు వీరే..
మాళవికా హెగ్డే: దివంగత వి.జి.సిద్ధార్థ సతీమణి ఈమె. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కుమార్తె కూడా. 2008 నుంచి గ్రూపు నిర్వహించే ఆతిథ్య వ్యాపార కార్యకలాపాలకు బాధ్యురాలు. 
డాక్టర్‌ ఆల్బర్ట్‌ హైరోనిమస్‌: స్వతంత్ర డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు 11 ఏళ్ల నుంచి మైండ్‌ట్రీ బోర్డులో కూడా ఉన్నారు. బాష్‌ రెక్సోర్త్‌  ఏజీలో బోర్డులో కూడా ఆయన పనిచేశారు. మాన్నెస్‌మన్న బాష్‌ గ్రూప్‌తో 30ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన 2003లో మోటార్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.  
సంజయ్‌ ఓంప్రకాశ్‌ నాయర్‌: నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌, నామినీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కేకేఆర్‌ ఇండియాకు సీఈవోగా కూడా పనిచేస్తున్నారు. 2009లో కేకేఆర్‌లో చేరడానికి ముందు ఆయన సిటీగ్రూప్‌లో 24ఏళ్ల పనిచేశారు. ఆయన 2002-2009 మధ్యలో సిటీ గ్రూప్‌ భారతీయ విభాగం సీఈవోగా కూడా విధులు నిర్వహించారు. 
సులక్షణ రాఘవన్‌: ప్రస్తుతం ఈమె లాండోర్‌ ముంబయికి ఎండీగా పనిచేస్తున్నారు. ఇదే సంస్థలో 18ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలోని లాండోర్స్‌ కార్యాలయంలో కూడా పనిచేశారు. మేనేజర్‌, బ్రాండ్‌ వ్యూహకర్త,  కార్పోరేట్‌ వ్యూహకర్త, క్లైంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

29, జులై 2019, సోమవారం

చేపమాంసంతో క్యాన్సర్‌ దూరం


  చేపమాంసాన్ని క్రమంతప్పకుండా ఆహారంగా తీసుకుంటే పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని క్యాన్సర్‌ రీసెర్చి సెంటర్‌ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు వారు తెలిపారు. వారానికి సుమారుగా మూడుసార్లు క్రమం తప్పకుండా చేపమాంసాన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు పురీషనాళానికి సంబంధించి వచ్చే క్యాన్సర్‌ రాకుండా  12 శాతం వరకు నియంత్రించవచ్చని వారు వివరించారు. చేపలో ఉండే ఒమెగా-3 అమ్లాలు ఈ చర్యలో కీలకపాత్ర వహిస్తాయన్నారు. అంతేకాక చేపలో అత్యధికంగా పోషక పదార్థాలు ఉంటాయని, విటమిన్‌ ‘డి’ లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే వాటిలో ఉండే ఒమెగా-3 ఫాటీ అమ్లాలు మానసిక ఒత్తిడి, మానసిక వ్యాకులత, గుండెనొప్పి, అధిక రక్తపోటు వంటి వ్యాధులు రాకుండా నియంత్రిస్తాయని తెలిపారు.

28, జులై 2019, ఆదివారం

జైపాల్‌రెడ్డి జీవిత ప్రస్థానం...
                కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రాజకీయవేత్త సూదిని జైపాల్‌రెడ్డి. తాను చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మన్మోహన్‌ హయాంలో పట్ణణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. దక్షిణాది నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జైపాల్‌రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో దిల్లీ కేంద్రంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఇంగ్లిష్‌లో దిట్ట.

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మాడుగుల సమీపంలోని నెర్మెట్ట అనే చిన్న గ్రామంలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు, ఎంఏ ఇంగ్లిష్‌ లిట్‌రేచర్‌లో పట్టా పొందారు. డిగ్రీ స్థాయిలోనే రోజుకి ఆరు ఆంగ్ల పత్రికలు చదివేవారు. ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. పుస్తక పఠనం అంటే అమితాసక్తి. విద్యార్థి దశనుంచి జైపాల్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
రాజకీయ ప్రస్థానం...

            * విద్యార్థి సంఘ నాయకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జైపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రెండుసార్లు విశ్వవిద్యాలయ ఎన్నికల్లో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. 
* 1965-71 మధ్య జాతీయ స్థాయిలో యూత్‌ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు అనేక మంది జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 
* అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు సంవత్సరాల పాటు వ్యవహరించారు. 
* 1969లో తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన వరుసగా నాలుగుసార్లు అదే స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు.
* అనంతరం కాంగ్రెస్‌ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ 1977లో కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం 1979లో జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 
* 1980లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
* 1984, 98లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
* 1977లో కాంగ్రెస్‌ను వీడిన ఆయన తిరిగి 1999లో మళ్లీ అదే గూటికి చేరారు.
* 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు.
* 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు.

* 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 
* జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు
* 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
కీలక పదవులు, విజయాలు

* ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 
* మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా దిల్లీ మాస్టర్ ప్లాన్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆయనకు గుర్తింపు ఉంది. 
* పలుసార్లు పార్లమెంటు స్థాయీ సంఘాలు, సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు. 
* ప్రసార భారతి బిల్లును ప్రవేశపెట్టడం, అమలులో జైపాల్‌ రెడ్డిదే కీలక పాత్ర.
* ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లను విస్తృతీకరణకు ఎనలేని కృషి.
* ఉభయసభల ప్రత్యక్షప్రసారాల విధానాన్ని సూత్రీకరించి, దాన్ని అమలులోకి తెచ్చిన ఘనత జైపాల్‌ రెడ్డిదే.
* దిల్లీ మాస్టర్‌ ప్లాన్‌ని అమలు చేసి అందులో భాగంగా దేశ రాజధాని ట్రాఫిక్‌ కష్టాలకు పరిష్కారంగా నిలిచిన మెట్రో సర్వీస్‌ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 
* 2010 కామన్వెల్త్‌ పోటీల మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలు జైపాల్ రెడ్డికే అప్పగించారు. 
* 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి ఘనత సాధించారు. 

27, జులై 2019, శనివారం

కలెక్టర్‌ ఆశయం విడిచి.. గిరిజనుల కోసం నడిచి..

            ర్నలిజం కోర్సులో భాగంగా ఓ మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి, అక్కడి సర్పంచ్‌తో మాట్లాడుతోంది మిత్తల్‌ పటేల్‌. అంతలో ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడవటం వినిపించింది. ఆ ఏడుపు తమ సంభాషణకు ఇబ్బంది కలిగిస్తుండటంతో పాపకు పాలు తాగించమని తల్లికి సూచించింది. దీంతో ఆ తల్లి ముఖం కోపంగా మారింది. ‘‘నేను భోజనం చేసే కొన్ని రోజులవుతోంది. ఇంకా పాపకు పాలు ఎలా తాగించనూ..’’ అంది. మిత్తల్ ఇంటికొచ్చినప్పటికీ ఆ తల్లి మాటలు తన చెవుల్లో ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ గిరిజన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. ఆ ఆలోచనే గుజరాత్‌లోని కొన్ని గిరిజన తెగల పాలిట వరంగా మారింది. 
               అది 2018 అక్టోబర్‌. గుజరాత్‌లోని అద్‌గామ్‌ గ్రామంలో ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా గ్రామసభ జరుగుతోంది. మూడు గంటలుగా ఓ మహిళ చెబుతున్న అంశాలను గ్రామస్థులు శ్రద్ధగా వింటున్నారు. ఆమె మాటలు వింటుంటే తమ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వారిలో కలుగుతోంది. కొద్దిసేపటి తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించి వారి వైపు చూసింది. అంతా నిశ్శబ్దం. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడే గ్రామ పెద్ద ఒకరు లేచి నిలబడి గొంతు సవరించుకుంటూ ‘‘గ్రామాభివృద్ధి కోసం అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. నీకు మేము చేయగలిగిన సహాయమంతా చేస్తాం.’’ అన్నాడు. 
                 ఇలా వారు ఆమెకు హామీ ఇవ్వడం మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మాట ఇచ్చి తప్పారు. కానీ ఈసారి వాళ్లు మాట తప్పలేదు. తమ ప్రాంతంలో నీటి సమస్యను పరిష్కరించడానికి ఎక్కడో బయట నుంచి ఆమెతో చేతులు కలిపారు. దాని ఫలితమే రెండు వారాలు తిరిగేలోపు గ్రామంలోని మోతిసర్‌ చెరువును పునరుద్దరించగలిగారు. ఆమె నేతృత్వంలో చెరువులోని ముళ్ల చెట్లు, గడ్డిని శుభ్రం చేశారు. ప్రణాళిక బద్ధంగా పూడిక తీసి, గట్లు నిర్మించారు. అలా ఆ ఊరి చెరువు కొత్త రూపును సంతరించుకుంది. ఆ మహిళే ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్న మిత్తల్‌ పటేల్‌. సంచార జాతులు, గుర్తింపునకు నోచుకోని గిరిజన తెగల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి గానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. 
కలెక్టర్‌ అవుదామనుకొని.. 
             గుజరాత్‌లోని శంఖల్‌పుర్‌కు చెందిన మిత్తల్‌ పటేల్‌ కలెక్టర్‌ కావాలనే ఆశయంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. అయితే కాకతాళీయంగా గుజరాత్‌ విద్యాపీఠంలో జర్నలిజం కోర్సులో ప్రవేశం పొందింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె తన కోర్సులో భాగంగా గుజరాత్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలపై అధ్యయనం చేసింది. ఈ ప్రయత్నంలో ఆమె బనస్‌కాంత్‌ జిల్లాలోని సంచార జాతులు, ప్రభుత్వ గుర్తింపు పొందని గిరిజన తెగలను కలిసింది. వారు గడుపుతున్న దుర్భర జీవితం ఆమెను కలచివేసింది. సరైన గుర్తింపు లేని కారణంగా వారంతా ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలకు దూరమయ్యారని గుర్తించింది. ఇక కలెక్టర్‌ కావాలన్న తన ఆశయాన్ని పక్కనపెట్టి గిరిజన తెగల హక్కుల కోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 2006లో ‘విచర్త సముదాయ్‌ సమర్థన్‌ మంచ్‌’ అనే ఎన్జీవోను స్థాపించింది.  

              తన నిర్ణయాన్ని మొదట్లో చాలా మంది తప్పుపట్టారు. గిరిజన తెగల వారిని నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. ముందు గిరిజనులతో పరిచయం ఏర్పరచుకుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరవుతూ వారి నమ్మకాన్ని చూరగొంది. తర్వాత నెమ్మదిగా వారిలో చైతన్యం నింపడానికి ప్రయత్నించింది. సంచార తెగల జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక వారి సమస్యలకు నీటి కొరత ఓ ప్రధాన కారణమని గుర్తించింది. 
గ్రామస్థులను ఏకం చేసి..
               బనస్‌కాంత్‌ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. భూగర్భ జలాలు 900-1000 అడుగుల లోతుకు వెళ్తే గాని అందవు. దీంతో ఆ ప్రాంతంలో తాగు, సాగునీరుకు కటకటలాడాల్సిందే. అక్కడి మారుమూల గ్రామాలకు ప్రభుత్వ పైపులైన్ల ద్వారా వచ్చే తాగునీరు సరిపోవడం లేదు. అయితే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్లందరినీ ఐకమత్యం చేసి ఆ ప్రాంతంలోని చెరువులను పునరుద్ధరించడం ద్వారా వాన నీటిని ఒడిసి పట్టొచ్చు అనుకుంది. 

         2015 ప్రారంభంలో తన ఏడుగురు బృందంతో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రతి ఊరిలో సమావేశాలు నిర్వహించి స్థానికుల్లో చైతన్యం నింపింది. మొదట్లో ఆయా గ్రామ పెద్దల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వెనుదిరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అలా కేవలం రెండు సంవత్సరాల్లోనే 87 చెరువులను పునరుద్ధరించగలిగారు. 
హక్కుల సాధన కోసం..
                     నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు గిరిజన తెగల హక్కుల కోసమూ కృషి చేస్తున్నారామె. బ్రిటిష్‌ కాలం నాటి ‘క్రిమినల్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1871’ ప్రకారం సుమారు 198 గిరిజన తెగలను నేర స్వభావం కలిగిన వారిగా గుర్తించారు. తర్వాత ఆ చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. అయినా వారిని ఇంకా నేరస్థులగానే పరిగణిస్తున్నారు. ఆ తెగలకు చెందిన ప్రజల హక్కుల సాధన కోసం ఆమె కృషి చేస్తోంది. ఇప్పటి దాకా సుమారు 60వేల మందికి వ్యక్తిగత ఓటరు కార్డులు, వెయ్యి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజురయ్యేలా చేశారు. వారి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నారు. 

భర్తకు 1వ ర్యాంక్‌.. భార్యకు 2వ ర్యాంక్‌

ఛత్తీస్‌గఢ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో దంపతుల ఘనత
                   దిల్లీ: కలిసి చదువుకున్నవారు పెళ్లిచేసుకుని జీవితాన్ని పంచుకోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ జంట పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. అలా ఏకంగా ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో అగ్ర స్థానాల్లో నిలిచారు. భర్త తొలి ర్యాంకు సాధించగా.. భార్య రెండో ర్యాంకులో నిలిచారు. వివరాల్లోకి వెళితే..
              ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఎంపికవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం అవడం మొదలుపెట్టారు. పెళ్లయ్యాక భార్య విభా సింగ్‌తో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఇటీవల చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ)కు పరీక్ష నిర్వహించగా.. వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అనుభవ్‌కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి. 
ఈ సందర్భంగా అనుభవ్‌ జంట మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం. ఒకరికొకరం సాయం చేసుకున్నాం. విజయం సాధించాం. కుటుంబసభ్యులు కూడా మాకు ఎంతో అండగా నిలిచారు’ అని సంతోషం వ్యక్తం చేశారు.

26, జులై 2019, శుక్రవారం

యడ్డీ ప్రమాణం.. నిన్న రాత్రి ఏం జరిగింది?

కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి విశ్వాసపరీక్షలో ఓటమి పాలై కుప్పకూలింది. ఇక భాజపా ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అని అందరూ అనుకున్నారు. మూడు రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేదు. మళ్లీ ఒక్కసారిగా శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను యడియూరప్ప కలవడం.. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం.. ప్రమాణస్వీకారం జరగడం.. అంతా కొన్ని గంటల్లోనే చకచకా జరిగిపోయింది. నిన్న రాత్రి వరకు స్తబ్దుగా ఉన్న కర్ణాటక వ్యవహారంలో రాత్రికి రాత్రి ఏం జరిగింది? ప్రభుత్వ ఏర్పాటుకు వేచి చూసిన పార్టీ అధినాయకత్వం ఒక్కసారిగా ఎందుకు ముందడుగు వేసింది?
               ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆదేశాలిచ్చిన వెంటనే విధానసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండడం.. దీనికి తోడు రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుండడంతో భాజపా అధిష్ఠానం ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాస్త వెనుకడుగు వేసింది. మరోవైపు ఆర్థిక బిల్లుకు సభ ఆమోదం కూడా తప్పనిసరి అయింది. ఈ పరిణామాలను ముందే ఊహించిన భాజపా సర్కారు గురువారం వరకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువ జాము వరకు జరిగిన పలు పరిణామాలు యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీశాయి. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు యడ్డీకి అభయమివ్వడమే. కర్ణాటకకు చెందిన భాజపా నేతలు వారితో గురువారం రాత్రి వీడియో కాల్‌లో మాట్లాడటంతోపాటు విశ్వాసపరీక్షకు తాము హాజరవుతామని వారు చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని భాజపా అధిష్ఠానానికి చేరవేయడంతో అక్కడి నుంచి శుక్రవారం వేకువజామున యడియూరప్పకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని తెలుస్తోంది.
75 ఏళ్ల నిబంధన ఏమైంది?
              భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అయితే ఇది అనధికారిక నిబంధనే. అదే సమయంలో యడియూరప్ప వయస్సు 77 ఏళ్లు. కానీ ఆయనకే మళ్లీ అవకాశం ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఓ దశలో యడియూరప్పను గవర్నర్‌గా పంపించి సీఎం పదవికి మరో వ్యక్తిని ఖరారు చేయాలని భాజపా అధిష్ఠానం భావించినా.. చివరికి యడ్డీ పేరును ఫైనల్‌ చేసింది.  మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడూ పూర్తి కాలంపాటు యడియూరప్ప ఆ పీఠంపై ఉండలేదు. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. దీనికి తోడు తనదైన శైలిలో వ్యూహాలను అమలు పరుస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించడంతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఒకవేళ యడ్డీని తప్పించి వేరొకరిని సీఎం పీఠంపై కూర్చోబెడితే అలకపాన్పు ఎక్కే అవకాశముంటుంది. అదే ఎదురైతే పరిస్థితి ఏంటన్నది ముందుగానే ఊహించిన భాజపా అధిష్ఠానం.. యడియూరప్పకు మరో అవకాశం ఇచ్చింది. గతంలో దాదాపు ఇలాంటి పరిణామాలతోనే ఆయన భాజపాను వీడి సొంతంగా ఓ రాజకీయ పార్టీ నెలకొల్పి వేరుకుంపటి పెట్టిన సంగతి ప్రస్తావనార్హం.

ఇంకా ఉంది..
                 యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. బలపరీక్ష అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్లెట్లిచ్చి గెలిపించుకోవడం.. వారికి మంత్రివర్గంలో చోటివ్వడం ఓ సవాలు. అదే సమయంలో గరిష్ఠంగా ఇచ్చే అవకాశమున్న 34 మంత్రి పదవులకు సుమారు 60 మంది భాజపా ఎమ్మెల్యేలు పోటీ పడటం యడియూరూప్పకు కత్తిమీద సామే. అంటే ఈ లెక్కన కర్ణాటకం ఇంకా సశేషమే!!

ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

             అమరావతి: విద్యార్థుల నిరీక్షణకు తెరదించుతూ ఏపీ (ఆంధ్రప్రదేశ్‌ ) ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది. (27-07-2019)  రేపటి నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30తేదీల్లో..  80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్టు 1న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోనేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు  వీలు కల్పించారు. అనంతరం ఆగస్టు 4న విద్యార్థులకు కేటాయించిన సీట్ల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఆగస్ట్‌ 5 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇన్ని రోజులూ కళాశాల రుసుముల విషయంలో ఎటు తేల్చకపోవడం వల్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఈ జాప్యం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల యాజమాన్యాల వినతుల దృష్ట్యా గతేడాది రుసుములనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరే విద్యార్థుల్లో అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

25, జులై 2019, గురువారం

బ్రిటన్‌ కొత్త కేబినెట్‌లో నారాయణమూర్తి అల్లుడు

లండన్‌: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు యూకే ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ నేత బోరిస్‌ జాన్సన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్‌ కూర్పు జరిగింది. రిషి సునక్‌ సహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దీనిలో చోటు కల్పించారు. 
           రిషి సునక్‌ను ట్రెజరీ విభాగ చీఫ్‌ సెక్రటరీగా నియమించినట్లు యూకే ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 39ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. చీఫ్‌ సెక్రటరీ హోదాలో రిషి కేబినెట్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. 
ఇక రిషితో పాటు భారత సంతతికి చెందిన అలోక్‌ శర్మ, ప్రీతి పటేల్‌కు కేబినెట్‌లో స్థానం దక్కింది. యూపీలోని ఆగ్రాలో పుట్టిన శర్మ.. బ్రిటన్‌లో స్థిరపడ్డారు. 2010 నుంచి రీడింగ్‌ వెస్ట్‌ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. థెరిసా మే ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా చేసిన అలోక్‌ శర్మ.. తాజా కేబినెట్‌లో ఇంటర్నల్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ కొత్త కేబినెట్‌లో హోం సెకట్రరీగా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళ ఈమే కావడం విశేషం. 

23, జులై 2019, మంగళవారం

విశ్వాస పరీక్షలో కుమార ఓటమి!

   
            బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలింది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన కర్ణాటక రాజకీయానికి తెరపడింది. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. అధికార కూటమికి చెందిన 15మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న కర్ణాటకీయం ముగిసింది. సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా ఒక్కో సభ్యుడ్ని లెక్కించారు. ఈ విశ్వాస పరీక్షలో అధికార కూటమి వైపు 99 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష కూటమికి 105 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 103ను అందుకోలేకపోవడంతో జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 
ఫలించని కాంగ్రెస్‌- జేడీఎస్‌ ప్రయత్నాలు
               సంకీర్ణ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మొదలైన రాజకీయ సంక్షోభం చివరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితికి దారితీసింది. దీంతో మూడు వారాలుగా అనేక మలుపులు తిరిగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్టయింది. అధికారాన్ని నిలుపుకొనేందుకు అధికారపక్షం వ్యూహాలు ఫలించలేదు. ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోగల్గినప్పటికీ..  అసమ్మతి ఎమ్మెల్యేలను మాత్రం దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్‌ వైఫల్యం చెందింది. విధానసభలో బలపరీక్ష జాప్యం చేసినా అధికార కూటమికి ఫలితం లేకపోయింది. రెండు సార్లు సుప్రీంకోర్టు తలుపులు కాంగ్రెస్‌, జేడీఎస్‌ తట్టాయి. ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌వేదికగా అసమ్మతి రాజకీయం సాగింది. చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో చివరకు విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ నిర్వహించగా.. ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు.. జేడీఎస్‌ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సభకు దూరంగా ఉన్నారు. అలాగే, రాజీనామా చేయకపోయినా కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాల సాకుతో సభకు దూరమయ్యారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సభకు దూరంగా ఉండటంతో అధికార పక్షానికి తగిన సంఖ్యాబలం లేని కారణంగా కుమార సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. 
పట్టు సడలని రెబల్స్‌
                 కాలయాపన చేసి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకొనేందుకు అధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. వారెవరూ వెనక్కి తగ్గలేదు. వారిని దారిలోకి తెచ్చుకొనేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయి. సంప్రదింపులు జరిపినా.. విప్‌ ప్రయోగించినా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగిస్తామని కొందరు నేతలు బెదిరించినా రెబల్స్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. కుమారస్వామి ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలేదని అందుకే తాము రాజీనామాలు చేసినట్టు స్పష్టంచేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటంతో కుమార సర్కార్‌ ఓటమిపాలైంది.

22, జులై 2019, సోమవారం

చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతం


             శ్రీహరికోట: భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌)  16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమికి దగ్గరగా 170కి.మీలు.. భూమికి దూరం 39059కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌ 2ను విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ  ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది.
చంద్రయాన్‌ 2 గురించి ఆసక్తికర విషయాలు!
* చంద్రయాన్‌ 2 ఉపగ్రహం బరువు మొత్తం 3,447 కిలోలు. దీన్ని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం చేశారు.  వీటిలో ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుంది. ల్యాండర్‌పై ఉండే రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లను పరిశోధన చేస్తుంది.

* చంద్రయాన్‌ 2 ఉపగ్రహం జాబిల్లి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరగా నెమ్మదిగా దిగనుంది.
* అందులోంచి అత్యంత మృదువుగా రోవర్‌ బయటకు వచ్చి సెకెన్‌కు సెంటీమీటర్‌ వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది.
* చంద్రయాన్‌2 ఉపగ్రహాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన పని. ఇస్రో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఇస్రో చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండర్‌ కోసం చేస్తున్న తొలి ప్రయత్నమూ ఇదే. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ను వీడిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.
* చంద్రయాన్‌ 2లో అత్యంత సూక్ష్మంగా అత్యంత సమర్థంగా పనిచేసే ఎన్నో పరికరాలను అమర్చారు. చంద్రయాన్‌ 1 జాబిల్లిపై నీటిని గుర్తించగా.. చంద్రయాన్‌ 2 మరింత లోతుగా పరిశోధిస్తుంది. ఇందులో ఖనిజాలు, నీటి అణువుల్ని సవివరంగా గుర్తించే అమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌, సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి ఖనిజాలను మనం తవ్వి తెచ్చుకొనే వీలుందా అనేది తెలుస్తుంది.
*  చందమామకు సంబంధించిన త్రీడీ మ్యాప్‌లను రూపొందించేందుకు జాబిల్లి పుట్టుక గురించి తెలుసుకొనేందుకు అవసరమైన సమాచారాన్ని చంద్రయాన్‌ 2 సేకరిస్తుంది.
* అంతిమంగా భవిష్యత్తులో మనం అక్కడికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకొనే వీలుందా అన్న ప్రశ్నకు కొంతవరకైనా కచ్చితమైన జవాబు అందిస్తుంది.
*  చంద్రుడిపై వ్యర్థాలు లేని అణుశక్తి, మూలకాల కోసం ఇది వెతకనుంది.
* చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ప్రాంతంలోనే నీటి ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
* చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్‌ల్యాండర్‌ చేసిన దేశంగా భారత్‌ ఘనత సాధించనుంది.

20, జులై 2019, శనివారం

షీలాజీ.. అందమైన ప్రేమకథ ఇది

దేశ రాజధానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు షీలాదీక్షిత్‌ శనివారం కన్నుమూశారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆమె.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రెండేళ్ల పాటు ఎదురు చూశారట. సాధారణ కుటుంబంలో పుట్టిన షీలా ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించారు. అయితే కాబోయే అత్త అంగీకారం కోసం ఏకంగా రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తన ప్రేమకథను ఒకానొక సందర్భంలో మీడియాతో పంచుకున్నారామె. అది ఆమె మాటల్లోనే..
‘‘నేను ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో వినోద్‌ను మొదటిసారి చూశా. మా ఇద్దరిదీ ఒకే క్లాస్‌. తొలి చూపులోనే ప్రేమ అని చెప్పలేను గానీ వినోద్‌ చాలా చలాకీగా ఉండేవారు. అందరితో ఇట్టే కలిసిపోయేవారు. అయితే తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా స్నేహితురాలు.. తన స్నేహితుడు ప్రేమించుకున్నారు. వారి మధ్య ఏదో గొడవ రావడంతో దాన్ని పరిష్కరించే సమయంలో మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. వారి సమస్య పరిష్కారం కాలేదు గానీ, మేం మాత్రం మంచి స్నేహితులమయ్యాం. రోజులు గడుస్తున్న కొద్దీ మా ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. నాది నెమ్మది స్వభావం. తనది దూకుడు మనస్తత్వం. ఆ విభిన్న ధ్రువాలే మమ్మల్ని దగ్గర చేశాయి. క్రమంగా తనకు నేను అన్ని చెప్పుకొనేంత దగ్గరయ్యాం. కానీ, ఏ రోజూ మా మధ్య కుటుంబ విషయాలు రాలేదు’’
‘‘నాతో మాట్లాడేందుకు ఆయన నేను ఎక్కిన బస్సులోనే ఎక్కేవారు. ఫైనల్‌ పరీక్షలకు ఒక రోజు ముందు మేం ఇద్దరం బస్సులో వెళ్తుండగా.. తను నాతో ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు దొరికింది అని మా అమ్మతో చెప్పాలనుకుంటున్నా’ అని అన్నారు. అందుకు బదులుగా నేను..‘మరి ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నావా’ అని అడిగా. దానికి ఆయన..‘లేదు.. కానీ తాను నా పక్కనే కూర్చుంది’ అని అన్నారు. నేను ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యా. రెండు రోజుల తర్వాత వినోద్‌ గురించి మా ఇంట్లో చెప్పాను. మా కుటుంబంలో కులమతాల పట్టింపులు లేవు. అయితే మేం ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో వారు ఒప్పుకోలేదు. కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. అప్పటికే వినోద్‌ ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు’’
‘‘ఆ తర్వాత చాలా కాలం పాటు మేం పెద్దగా కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. నేను చిన్న ఉద్యోగంలో చేరాను. వినోద్‌ ఐఏఎస్‌కు ఎంపికవడమేగాక దేశంలోనే 9వ ర్యాంక్‌ తెచ్చుకున్నారు. అప్పట్లో టాప్‌ 10 ర్యాంకర్ల పేర్లను రేడియోలో చెప్పేవారు. అది విన్న మా తల్లిదండ్రులు మా ప్రేమకు గర్వంగా పచ్చజెండా ఊపారు. అయితే ఇక ఒప్పించాల్సింది వినోద్‌ వాళ్లింట్లోనే. వినోద్‌ నాన్నగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు  ఉమాశంకర్‌ దీక్షిత్‌. మాజీ ప్రధాని నెహ్రూకు అత్యంత సన్నిహితులు. పలుకుబడి ఉన్న బ్రాహ్మణ కుటుంబం. ఒకరోజు వినోద్‌ మా విషయాన్ని తన తండ్రితో చెప్పి నన్ను కలవమన్నారు. నేను భయంభయంగానే కలిశాను. కానీ ఆయన చాలా మంచివారు. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఆ తర్వాత మా అమ్మానాన్నలను కలిసి మా ప్రేమను అంగీకరించారు. అయితే కులాంతర వివాహానికి వినోద్‌ తల్లి ఒప్పుకోవడానికి కాస్త సమయం పడుతుందని.. అప్పటిదాకా ఆగాలని చెప్పారు. అది ఒక రోజు.. రెండు రోజులు.. రెండు సంవత్సరాలు కూడా కావొచ్చన్నారు’’
‘‘అన్నట్లుగానే రెండేళ్లు గడిచింది. ఆ రెండేళ్లలో వినోద్‌ అమ్మను ఒప్పించేందుకు వీరిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమెకు నచ్చజెప్పారు. చివరకు ఆమె కూడా  మా పెళ్లికి అంగీకరించారు. రెండు వేర్వేరు సంప్రదాయాలు కలిగిన కుటుంబాలైనా సరే వాటన్నింటినీ పక్కనబెట్టి అంతా కలిసిపోయారు. 1962 జులై 11న మా పెళ్లికి ముహూర్తం పెట్టారు. మామయ్యగారికి ఆడంబరాలు నచ్చవు. అందుకే పెళ్లి చాలా నిరాడంబరంగా జరిపించారు. అలా నేను దీక్షిత్‌ ఇంట కోడలిగా అడుగుపెట్టా’ అని ఆమె తన మధురజ్ఞాపకాలను పంచుకున్నారు.

19, జులై 2019, శుక్రవారం

సారథిగా ప్రియాంక అయితే ఓకే!

లాల్‌ బహదూర్‌ శాస్త్రి తనయుడు అనిల్‌ శాస్త్రి
దిల్లీ: కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కొత్త సారథి వేటలో పడింది. గాంధీ కుటుంబానికి చెందిన వారు కాకుండా కొత్తవారిని నియమించాలని రాహుల్‌ ఇది వరకే చెప్పారు. ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్‌ సీనియర్లు ఏకీభవించడం లేదు. గాంధీ కుటుంబీకులే అధ్యక్ష పదవిలో ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి మాట్లాడారు.
           ‘కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబీకులే ఉండాలన్నది నా వాదన కూడా. ఎంతో వైభవం ఉన్న పార్టీని నడిపించే అవగాహన, సామర్థ్యం వారికి మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి ఈ పదవికి ప్రియాంక గాంధీ అయితే సరిపోతుంది. ఆమె ఇందుకు 100% న్యాయం చేయగలరని మేం నమ్ముతున్నాం. కాంగ్రెస్‌ను నుంచి ఏర్పడిన తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల్లో రెండు పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. సరైన నాయకత్వం లేకపోతే అవికూడా అధికారంలో ఉండేవి కావేమో. ప్రస్తుతానికైతే ప్రియాంక సేవలు పార్టీకి ఎంతో అవసరం. ఆమె పార్టీకి పునర్‌వైభవం తెచ్చేలా పనిచేయగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు అనుచర గణం బాగా ఉంది. గాంధీ కుటుంబీకులు సారథులుగా లేకపోతే ఆ పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అందరూ అంగీకరించే దృఢమైన నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్‌కు అవసరం’ అని అన్నారు.

18, జులై 2019, గురువారం

ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్‌ నం.1


మూడోస్థానానికి పడిపోయిన బిల్‌గేట్స్‌
          ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్‌ ఇండిక్స్‌ విడుదల చేసిన జాబితాలో ఈయన తొలిస్థానంలో నిలిచారు. బెజోస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు ఈ సారి మాత్రం షాక్‌ తగిలింది. గేట్స్‌ను వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆర్నాల్ట్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు కాగా, గేట్స్‌ ఆస్తుల మొత్తం 107 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 
             అమెజాన్‌ చీఫ్‌ బెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం సమర్పించుకున్నప్పటికీ 125బిలియన్‌ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్‌ తన సంపదలోని 35 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ అండ్‌ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంపద 107 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక ఆర్నాల్డ్‌ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్‌ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్‌ తొలిస్థానంలో నిలిచారు.
మహిళల్లో నాలుగో స్థానం మెకంజీదే..

           అమెజాన్ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌తో విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్‌ నిలిచారు.
భారత కుబేరుడు మళ్లీ ఆయనే..

           రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13 వస్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ 20.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ నాడార్‌ 92 స్థానంలో, కొటాక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కొటాక్‌ 96స్థానంలో నిలిచారు.

10, జులై 2019, బుధవారం

చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష


కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
న్యూదిల్లీ: కేంద్ర కేబినెట్‌ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్‌ పలు అంశాలపై చర్చించి వివరాలు ప్రకటించింది. పోక్సో చట్ట (2012) సవరణకు ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా చట్టానికి సవరణ చేయనుంది. అలాగే, చైల్డ్‌ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరణ చేయనుంది. మరోవైపు, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) సంస్థ చట్టబద్దమైనది కాదని ప్రకటన చేసింది. పంజాబ్‌ సహా పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
              దేశంలోని లక్షలాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు మేలు చేసే ‘కార్మిక రక్షణ కోడ్‌’కు ఆమోద ముద్ర వేసింది. 13 కేంద్ర కార్మిక చట్టాలను ఈ ‘ఒకే కోడ్’‌ పరిధిలోకి తీసుకురానుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కార్మికులు ఆరోగ్య రక్షణ, భద్రత వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగుల సంఖ్య 10 మందికి పైగా ఉండే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది.
మరిన్ని కీలక నిర్ణయాలు
* ఆర్‌పీఎఫ్‌ సర్వీసులకు గ్రూప్‌-ఎ హోదా కేటాయిస్తూ నిర్ణయం
* ప్రధాని గ్రామ సడక్‌ యోజక మూడోవిడత పనులకు ఆమోదం
* రూ.80,250 కోట్లతో లక్షా 25 వేల కి.మీ రోడ్ల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం
* అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్టసవరణ బిల్లుకు ఆమోదం

8, జులై 2019, సోమవారం

15, 16 తేదీల్లో ‘మున్సిపల్‌’ నోటిఫికేషన్‌


నెలాఖరున పోలింగ్‌

14వ తేదీ నాటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు

వేగవంతంగా ఎన్నికల ప్రక్రియ
                        తెలంగాణ  రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో అవసరమైన ముందస్తు ప్రక్రియను మరింత ముందుకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 14వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. గతంలో ఈ గడువు 18వ తేదీ వరకు ఉండగా దీన్ని నాలుగు రోజులు ముందుకు తీసుకువచ్చారు. వార్డుల వారీగా ఫొటోలతొ కూడిన ఓటర్ల జాబితాను 14న ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఈ నెల 15న పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ వెంటనే అంటే ఈ నెల 15న లేదా 16న రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయనుందని తెలిసింది. జులై 30 లేదా 31న రాష్ట్రంలోని 131 పురపాలక సంఘాలు, మూడు నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అనుగుణంగా రాష్ట్ర పురపాలకశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ముగిసిన వార్డుల పునర్విభజన

                ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆర్డినెన్స్‌ మేరకు రాష్ట్రంలో వార్డుల సంఖ్య పెరిగింది. కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల విస్తరణ నేపథ్యంలో కొత్త వార్డులు ఏర్పడ్డాయి. వార్డులను ప్రకటించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించి పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో పునర్విభజన మేరకు ఆదివారం వార్డులను ఖరారు చేశారు. కొత్త వార్డుల ప్రకారం ఈ నెల 14వ తేదీ లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి ప్రకటించనున్నారు. ఇది పురపాలక ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదిక కానుంది. పోలింగ్‌ కేంద్రాల ప్రకటనకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. కానీ తాజాగా ఈ నెల 14 లోపు పురపాలక ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేసే నేపథ్యంలో ఈ షెడ్యూలు కూడా మారనుందని తెలిసింది. ఈ నెల 14వ తేదీ లోపే పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రకటించనున్నారు.
పరోక్ష పద్ధతిలోనే ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక

         పురపాలక సంఘాల ఛైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లను ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పురపాలక చట్టం నేపథ్యంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. పురపాలక చట్టంలో సమూల మార్పుల నేపథ్యంలో మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి ద్వారా నిర్వహించడం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఎన్నికలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలనే లక్ష్యం నేపథ్యంలో ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకునే విధానంతో ముందుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రక్రియ దీనికి అనుగుణంగానే సాగుతోంది. పురపాలిక ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు తాజా షెడ్యూలు ఇది

      ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ముసాయిదా ప్రచురణ : జులై 10

అభ్యంతరాల స్వీకరణకు గడువు : జులై 11, 12 తేదీల్లో

అభ్యంతరాల పరిష్కారం : జులై 13

తుది జాబితా ప్రచురణ : జులై 14

7, జులై 2019, ఆదివారం

మలేరియాకు మన మందు


కొత్త ఔషధాన్ని ఆవిష్కరించిన హెచ్‌సీయూ బయోకెమిస్ట్రీ విభాగం
                మలేరియాపై జరుగుతున్న యుద్ధంలో మన దగ్గరి నుంచే ఓ ప్రత్యామ్నాయ ఔషధం ఆవిష్కృతమవుతోంది. వ్యాధి కారక ‘ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌’ అనే పరాన్నజీవి ఇప్పటికే ఉన్న ఔషధాలను తట్టుకొని.. మొండిగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆ పరాన్నజీవిని పూర్తిగా చంపేందుకు ‘బీఓ2’ అనే మందును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) బయోకెమిస్ట్రీ విభాగం కనుగొంది. వర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి మ్రిణాల్‌కాంతి భట్టాచార్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు ప్రతాప్‌ వైద్యం, డిబుయేందు దత్తా, నిరంజన్‌ సూత్రంతోపాటు బయోటెక్నాలజీ విభాగం ఫ్యాకల్టీ సునందా భట్టాచార్య పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఆవిష్కరణ వివరాలు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి.
మలేరియా ఎలా వస్తుంది ?

       ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌ అనే ప్రోటోజోవా పరాన్నజీవితో మలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్‌ దోమ కుడితే ఇది మనషుల రక్తంలోకి ప్రవేశిస్తుంది. తొలుత కాలేయం, ఆ తర్వాత ఎర్ర రక్తకణాల్లోకి చేరుతుంది. దీని కారణంగా ఎర్ర రక్తకణాలు నిర్వీర్యమై వ్యాధి తీవ్ర పెరుగుతుంది. చికిత్స ఆలస్యమైతే పి.పాల్సిపారమ్‌ మెదడుకు చేరి ప్రాణాపాయం ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఔషధాలు..
           ప్రస్తుతం మలేరియాను తగ్గించడానికి క్లోరోక్విన్‌, ఆర్టిమిసినిన్‌ అనే రెండు రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిగ్రస్థులు ఈ మందులు వేసుకుంటే పి.ఫాల్సిపారమ్‌ డీఎన్‌ఏను విచ్ఛిన్నం చేస్తాయి. అలా వ్యాధి కారకం చనిపోతుంది. కానీ, ఇటీవలికాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మందులు అంతగా పని చేయడం లేదు. వ్యాధికారక జీవి ఆ ఔషధాలను తట్టుకొని.. విచ్ఛిన్నమైన తన డీఎన్‌ఏను తిరిగి బాగుచేసుకుని బతుకుతోంది. దీన్నే వైద్య పరిభాషలో ‘హోమోలొగస్‌ రీ కాంబినేషన్‌’గా వ్యవహరిస్తారు. దీంతో వ్యాధి ముదురుతోంది. ఫాల్సిపారమ్‌లో ఉండే ‘ఆర్‌ఏడీ51’ అనే ఎంజైమ్‌ కారణంగా డీఎన్‌ఏ తిరిగి బాగవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విచ్ఛిమైన డీఎన్‌ఏ రిపేర్‌ కాకుండా చేయగలిగితే వ్యాధి తగ్గుతుందని భావించిన హెచ్‌సీయూ పరిశోధక బృందం నాలుగేళ్లపాటు శ్రమించి ఈ ఔషధాన్ని కనిపెట్టింది.
బీఓ2 పనితీరు ఇలా..
        పరాన్నజీవి నమూనాను సేకరించి దానిపై ప్రస్తుతం ఉన్న ఔషధాలు ప్రయోగించారు. వ్యాధికారకం డీఎన్‌ఏ విచ్ఛిన్నమై.. తిరిగి రిపేర్‌ చేసుకునే క్రమంలో బీఓ2 మందును ప్రయోగించారు. దీంతో విచ్ఛిన్నమైన డీఎన్‌ఏను బాగు చేసుకునే శక్తిని అది కోల్పోయింది. క్రమంగా వ్యాధి తగ్గింది. బీఓ2 వల్ల ఇతర అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదని తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

5, జులై 2019, శుక్రవారం

గ్రాఫ్స్‌రూపంలో కేంద్ర బడ్జెట్‌..వీక్షించండిగ్రాఫ్స్‌రూపంలో కేంద్ర బడ్జెట్‌..వీక్షించండి

 మోదీ  ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్‌ నిరీక్షణకు తెరదించింది. మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఐబీ) గ్రాఫ్స్‌ రూపంలో చిత్రాలను విడుదల చేసింది. ఆ చిత్రమాలికే ఇది..