30, డిసెంబర్ 2018, ఆదివారం

ఆ 3 దీవుల పేర్లు మారాయి

 
                   పోర్ట్ బ్లెయిర్ : అండమాన్, నికోబార్ దీవుల్లో మూడింటికి ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టింది. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ పోర్ట్‌ బ్లెయిర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ రాస్ ఐలాండ్‌కు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ ద్వీప్ అని, నీల్ ఐలండ్‌కు షహీద్ ద్వీప్ అని, హవలోక్ ఐలండ్‌కు స్వరాజ్ ద్వీప్ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు.
               ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్ళను, రూ.75 నాణేన్ని మోదీ విడుదల చేశారు. బోస్‌ పేరుపై డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు మోదీ మెరీనా పార్క్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయనకు నివాళులర్పించారు.

29, డిసెంబర్ 2018, శనివారం

ఊపిరితిత్తులను కాపాడే ఆహారం

           మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవము ఊపిరితిత్తులు. ఇది శరీరం పనితీరును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడేందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ఈ వ్యాసంలో, ఇప్పుడు మనము ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాల గూర్చి చర్చించుకోబోతున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన నివేదిక ప్రకారం, 235 మిలియన్ల ప్రజలు ఆస్త్మాతో బాధపడుతున్నారు. భారతదేశంలో, వాయు కాలుష్యం & ధూమపానం చేసే వారు ఎక్కువగా ఉండటంవల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలమవుతున్నాయి. Healthy Diet For Lungs: 12 Best Foods For Lungs అయితే, మన ఊపిరితిత్తుల నిరంతరంగా కలుషితమైన గాలికి గురవటం వల్ల, ఈ కాలుష్య కారకాలు బ్రోన్కైటిస్ (శ్వాసనాళముల వాపు), ఆస్తమా, న్యుమోనియా & సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలను మనలో పెంచుతున్నాయి. కాబట్టి, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, దోహదపడే ఆహార పదార్ధాలను తినడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తీసుకోవలసిన ఆహారాల గూర్చి చదివి మీరే తెలుసుకోండి. అవి, 
          1. యాపిల్స్ :  ఎవరైతే ప్రతిరోజూ ఒక గ్లాసు మోతాదులో ఆపిల్ రసాన్ని తీసుకుంటారో వారిలో గురక తక్కువగా ఉంటుందని కనుగొనబడింది. మరొక అధ్యయనం ప్రకారం, గర్భవతులుగా ఉన్న మహిళలు ప్రతిరోజూ ఆపిల్ను తినడం వల్ల పుట్టే పిల్లలలో ఆస్తమా లక్షణాలు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆపిల్స్లో ఫాలోలిక్ సమ్మేళనాలు & ఫ్లేవానాయిడ్లను కలిగివుంటాయి ఇవి శ్వాసనాళముల వాపును తగ్గిస్తాయి.
         2. సాల్మన్ : సాల్మన్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తులలో ఏర్పడిన వాపును తగ్గిస్తుంది & ఊపిరితిత్తులలో తిష్టవేసుకొని జీవిస్తున్న బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది. సాల్మొన్తో పాటు మాకేరెల్, ట్రౌట్, సార్డినెస్ & హెర్రింగ్ వంటి ఈ చేపలు ఊపిరితిత్తులకు చాలా మంచివి. 
         3. ఆలివ్ ఆయిల్ :  ఆయిల్, ఆలివ్ ఆయిల్, & కనోల ఆయిల్స్ వంటివి కలిగి ఉంటే అవి మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెరుగుతున్న రక్తపోటుకు & బలహీనమైన రక్తనాళాల వంటి వాయు కాలుష్యంతో ముడిపడివున్న ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులకు & గుండెకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి. 
         4. గ్రీన్-టీ : గ్రీన్-టీ, మీ శరీరాన్ని శాంతపరచి, వాపులను / మంటలను తగ్గించి, మీకు స్వస్థతను చేకూర్చడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటటిన్ అనేది ఒక సహజమైన యాంటిహిస్టామైన్గా పనిచేస్తుంది, ఇది అలెర్జీ లక్షణాలను కలిగించే హిస్టామైన్ను విడుదలను తగ్గిస్తుంది.
            5. కాఫీ :  ఒక కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుందని తెలుసా ? కెఫిన్ ఒక బ్రోన్చోడైలేటర్గా పనిచేస్తుంది, ఇది ఆస్తమాటిక్స్లో గట్టి వాయుమార్గాలను తెరచి & శ్వాసకోశ కండరాల అలసటను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీను తాగటం వల్ల మీరు తీసుకునే శ్వాసను మెరుగుపరచి & మీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
         6. గింజలు  గింజలు కూడా మీ ఊపిరితిత్తులకు మరొక సూపర్ ఫుడ్స్. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు & పొద్దుతిరుగుడు గింజలు వంటివి మీ శరీరానికి మెగ్నీషియమును పుష్కలంగా అందిస్తాయి,అలాగే ఆస్తమాతో బాధపడేవారికి అవసరమైన మినరల్స్ను కూడా అందిస్తాయి. మెగ్నీషియం మీ శ్వాసకోశ కండరాలకు ఉపశమనాన్ని చేకూర్చడంలో సహాయపడి, మీ శ్వాసను మెరుగుపరుస్తుంది. మీ చేతి నిండుగా ఈ గింజలను పట్టుకొని వాటిని ప్రతిరోజు వినియోగించండి (లేదా) స్మూతీలో కలిపి వాడండి.
           7. ఆరెంజ్-రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు : బొప్పాయి, గుమ్మడికాయ & నారింజ పండ్లు అనేవి ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు & కూరగాయలు. ఈ రకమైన ఆహారాలు మీ ఊపిరితిత్తులకు స్నేహపూర్వకంగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి అంటువ్యాధులను, ఇతర వాపు తగ్గించడంలో బాగా ఉపకరిస్తాయి. 
              8. తృణధాన్యాలు : బ్రౌన్ రైస్, క్వినొయా & గోధుమల వంటి ధాన్యపు ఆహారాలను మీ రోజువారి డైట్లో ఉండేలా చూసుకోవాలి. మఫిన్లు, పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ వంటి మరిన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే ఆహారాలుగా ఉంటూ, కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని పెంచి, మీ ఊపిరితిత్తులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.
           9. వెల్లుల్లి : వెల్లుల్లిలో, గ్లూటాతియోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఫ్లేవానాయిడ్స్ కలిగివుంది, ఇది విషాన్ని & క్యాన్సింజెన్లను తొలగించడంలో సహాయపడటమే కాకుండా ఇది మీ ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండటంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు మూడు రెబ్బల పచ్చి వెల్లుల్లిని తీసుకున్నవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ను 44 శాతానికి వరకూ తగ్గించగలదని ఒక అధ్యయనంలో కనుగొనబడింది. 
             11. కైయేన్ పెప్పర్ :  (కారపు పొడి) క్యాప్సైసిన్ అనే సమ్మేళనమును కలిగి ఉంటుంది, ఇది స్రావాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంధి, అలాగే శ్వాసకోశంలో ఎగువున, దిగువున ఉన్న శ్లేష్మ పొరలను కాపాడుతుంది. అందువల్ల, ఆస్తమా లక్షణాలను కలిగి ఉన్నవారు తీసుకునే భోజనంలో కారపుపొడిని కలిపి తీసుకోవాలి (లేదా) మీరు కైయేన్ మిరియాలతో చేసిన టీని కూడా త్రాగవచ్చు. 
          12. బ్రోకలీ :  బ్రోకలీలో విటమిన్-సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్ & ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయలో L- సల్ఫోరాఫాన్ అనే చురుకైన సమ్మేళనం ఉంది, ఇది శ్వాస సంబంధిత కణాల అనారోగ్యాలను నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ జన్యువులుగా రూపాంతరం చెందుతుంది.

26, డిసెంబర్ 2018, బుధవారం

14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజు భారత్‌లో...


                     న్యూఢిల్లీ: 14 ఏళ్ల క్రితం 2004 డిసెంబరు 26న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తు సంభవించి 14 దేశాలకు చెందిన 2, 27,898 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోజు ఇండోనేషియా, భారత్‌తో పాటు పలు దేశాల్లో సంభవించిన సునామీ తాకిడికి కొన్ని లక్షల మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇండోనేషియాలోని ఉత్తర ప్రాంతంలో రిక్టార్ స్కేల్‌పై 8.9 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం సముద్రంలో ఉద్భవించిన సునామీ భారత్‌తో పాటు పలు దేశాలను అతలాకుతలం చేసింది. హిందూ మహా సముద్రంలో హఠాత్తుగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాలను నామరూపాలు లేకుండా మార్చివేశాయి. థాయ్‌ల్యాండ్‌తో పాటు పలు దేశాల్లో సముద్ర తీరంలో నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లలో బసచేసిన విదేశీ పర్యాటకులు సముద్రపు అలలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో భారత్‌కు చెందిన 10 వేల మంది బలయ్యారు. ఈ సునామీ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షల మంది నిరాశ్రయులవగా, 50 వేల మంది గల్లంతయ్యారు.

25, డిసెంబర్ 2018, మంగళవారం

గుజరాత్ పేరు ఎక్కడైనా వినిపించిందా?: చంద్రబాబు


  •  బీజేపీ కంటే సంపన్న పార్టీ ఉందా?
  • టన్నులకొద్దీ డబ్బు పెట్టుకున్నారు
  • వాటితో గెలవాలనుకుంటున్నారు
  • కేసీఆర్‌కు ఇక్కడ కీలుబొమ్మ ఉండాలి
  • ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎవరి కోసం?
  • సీఎం చంద్రబాబు ప్రశ్న
  • సుపరిపాలనపై శ్వేతపత్రం విడుదల
అమరావతి, డిసెంబరు 24: కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తోందని.. సంపన్న పార్టీలు, సైద్ధాంతిక సారూప్యం లేని పార్టీలు జట్టుకడుతున్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలను సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. బీజేపీ కంటే సంపన్న పార్టీ ఏముందని నిలదీశారు. ఏపీ ముందుకెళ్లకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. సుపరిపాలన అంశంపై చంద్రబాబు సోమవారం (24-12-2018) శ్వేతపత్రం విడుద ల చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ టన్నుల కొద్దీ డబ్బు పెట్టుకుంది. దాంతోనే ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. ఎందుకు రెండువేల నోట్లు రద్దుచేయరు? మీకు డబ్బు ఎక్కువుంది కాబట్టి ఆ నోటు పంచి గెలవాలని చూస్తున్నారు. నేను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాను.. ఎన్టీఆర్‌ కాంగ్రెస్ కు వ్యతిరేకమని మోదీ అంటున్నారు. మీరు (మోదీ)చేసిన నమ్మకద్రోహానికి, నమ్మించి మోసం చేసినదానికి.. ఎవరు కలిసొస్తే వారితో కలిసి రాష్ట్ర హ క్కులు కాపాడుకోవడంలో తప్పేంటి? మీరు అణగదొ క్కే ప్రయత్నం చేశారు. ఇక్కడున్నవారితో కలిసి కుట్ర, కుతంత్రాలు చేసి దెబ్బతీయాలనుకున్నారు.
 
ప్రధాన ప్రతిపక్షం కూడా మీపంచన చేరింది. పోలవరం నుంచి రాజధాని వరకు అడ్డుపడడం ఎంతవరకు సమంజ సం? దేశం, రాష్ట్రం కోసం అన్ని పార్టీలూ కలవాలి. ఇది ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలోనే మనం బాగా చేస్తున్నామని మోదీకి కోపం. ఇక కేసీఆర్‌కు మంచి వ్యవస్థలున్నాయి. బాగా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర మాత్రం ముందుకుపోకూడదని ఆయన అనుకుంటారు. ఇందుకోసం కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. నియంత్రణ చేసుకోవచ్చన్నది కేసీఆర్‌ ఆలోచన’ అన్నారు.
 
ఐటీలో గుజరాత్‌ పేరు వినిపించిందా?
‘హైదరాబాద్‌ అంత అద్భుతంగా గుజరాత్‌ ఉందా? 12 ఏళ్లు మోదీ గుజరాత్‌ సీఎంగా చేశారు. కానీ ఏం చేశారు? ఐటీలో ఆరాష్ట్రం పేరు వినిపించిందా? మనం ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ఇంజనీరింగ్‌ కళాశాలలు పె ట్టాం. ఈరోజు ఐటీలో నంబర్‌వన్‌ తెలుగోడు. అదీ విజన్‌, నాయకత్వం. కొందరికి పోలవరం కట్టడం ఇ ష్టం లేకపోవచ్చు. నదుల అనుసంధానం అసలే ఇష్టం లేకపోవచ్చు. విద్యుత్‌ మిగులు ఇష్టం లేకపోవచ్చు. కానీ మనం చేస్తున్నాం. సాధిస్తున్నాం. ఇంకో నాలుగేళ్లు పోతే కష్టాలు అసలుండవు.’ ‘దేశంలో ప్రభుత్వం ఏర్పడేందుకు మూడే అవకాశాలున్నాయి. ఒకటి కాంగ్రెస్‌, రెండు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం. మూడోది ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో ఏర్పడే సంకీర్ణం. ఇంతకుమించి విశ్వామిత్ర సృష్టి చేయలేం. ఏ పక్షమో చెప్పకుండా.. ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధ్యం కాదు.’ ‘పోలవరం ప్రాజెక్టు గేటు పెడితే గ్రేట్‌డేనా అని ప్రధాన ప్రతిపక్షం అవహేళన చేస్తోంది. కేంద్రం ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రాజెక్టు తొలి గేటు పెట్టిన రోజు కచ్చితంగా గ్రేట్‌ డే. కడపలో స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసమని విమర్శిస్తున్నారు. అవగాహన, ఇంగితజ్ఞానం లేదు.’

21, డిసెంబర్ 2018, శుక్రవారం

ఆసియా కుబేకులకు 2018 కలిసి రాలేదట




               దిల్లీ: 2018 ప్రత్యేకించి ఆసియా కుబేరులకు కలిసి రాలేదు.     అత్యంత సంపన్నుల జాబితాలో వారి స్థానాలకు ఎసరు పెట్టింది. స్టాక్‌ మార్కెట్ స్థితిగతులు, వాణిజ్య పరంగా ఉన్న ఒత్తిడులు వారి సంపద మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వివరాలను వెల్లడిస్తూ బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
                 ప్రపంచంలోనే అత్యంత సంపన్నులతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేరిట ప్రతి ఏటా విడుదల చేసే జాబితాలో ఉన్న 128 మంది ఆసియా ధనవంతులు 2018లో 137 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. 2012 నుంచి బ్లూమ్‌బర్గ్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి వారి మీద ఇలాంటి ప్రభావం పడటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, స్టాక్‌ మార్కెట్ ఒడుదొడుకులు ఈ పరిస్థితికి కారణాలు. వాటివల్ల ముఖ్యంగా చైనా సాంకేతిక రంగం ఎక్కువగా నష్టపోయింది. భారత్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఈ ఒడుదొడుకుల నుంచి తప్పించుకోలేకపోయాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి బ్యాంకులు, మనీ మేనేజర్లు చేసిన ప్రయత్నాలు ఆసియా ధనవంతులకు పెద్దగా కలిసిరాలేదు.
             బ్లూమ్‌బర్గ్ జాబితాలో ఉన్న చైనాకు చెందిన 40 మంది ధనవంతుల సంపద ఆవిరైంది. వాండా గ్రూప్‌ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్‌లిన్  అత్యధికంగా 10 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు. అలాగే భారత్ కు చెందిన 23 మంది సంపన్నులు దాదాపు 21 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. ప్రపంచ స్టీల్ మార్కెట్‌ను శాసించే లక్ష్మి మిత్తల్‌ కు చెందిన 5.6 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. ఆయన మొత్తం నెట్‌ వర్త్‌లో అది 29 శాతం. అలాగే ప్రపంచంలోనే జనరిక్ డ్రగ్ మార్కెట్‌లో నాలుగో స్థానంలో ఉన్న సన్‌ ఫార్మా కంపెనీ అధినేత దిలీప్‌ సంఘ్వీ  4.6 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. దక్షిణ కొరియా, హాంకాంగ్ టైకూన్స్‌ ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే ఈ మార్కెట్ ఒడుదొడుకుల్లో కూడా సంపదను పోగేసిన వారు ఉన్నారు. చైనా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ షియోమి అధినేత లీజున్‌కు అదనంగా 8.7 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి చేరింది.  భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌, చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్ లిమిటెడ్  సంస్థలు అదనంగా సంపదను పోగేసుకున్నాయి.

19, డిసెంబర్ 2018, బుధవారం

న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు





  నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. వేడుకల్లో నిబంధనలు, ఆంక్షలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు కొనసాగే ప్రాంతాల్లో నిర్వాహకులు విధిగా సీసీ కెమెరాలు, ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటిగంట కల్లా మూసివేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహిళలకు ఇబ్బంది కలుగకుండా షీ బృందాలను అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. అసభ్యకర నృత్యాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్‌ హెచ్చరించారు.

18, డిసెంబర్ 2018, మంగళవారం

ఐదు రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రులు


                   2018 నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు కొలువు దీరారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలు వుదీరాయి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌, రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్‌లు ముఖ్య మంత్రుగా ప్రమాణ స్వీకారం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆపార్టీ  అధ్యక్షు డు  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు.  మిజోరాం రాష్ట్రంలో మిజోరాం నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జొరంతంగా ఎన్నికయ్యారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రమాణం చేయించారు.

16, డిసెంబర్ 2018, ఆదివారం

ముద్దుల పోటీకి నో చెప్పిన బీజేపీ


                  రాంచీ: ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా గిరిజనులు నిర్వహించుకునే ‘ముద్దుల పండుగ’కు ఈసారి బీజేపీ మోకాలడ్డింది. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయం కాదని, ఈ పండుగ ద్వారా సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని చెబుతూ ఈ ఏడాది పండుగకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది.
                జార్ఖండ్‌లోని గిరిజనులు ప్రతి ఏడాది డిసెంబరులో ముద్దుల పోటీ నిర్వహిస్తారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. పాకూర్ జిల్లాలోని లిట్టిపర బ్లాక్‌లో జరిగే ఈ పండుగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఏళ్లుగా ఈ ముద్దుల పండుగ కొనసాగుతున్నా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని గతేడాది జరిగిన పోటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే సిమోన్ మరాండి ఆధ్వర్యంలో గతేడాది జరిగిన ఈ కార్యక్రమంలో 18 జంటలు పాల్గొన్నాయి.
              ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు హిందూ సంఘాలు ఈ పండుగపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈ ఏడాది ముద్దుల పండుగకు అనుమతి ఇచ్చేది లేదని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో జిల్లా ఎస్‌డీవో జితేంద్ర కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా వస్తున్నతమ ఆచారాన్ని అడ్డుకోవాలని చూడడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15, డిసెంబర్ 2018, శనివారం

ఆశావాదికి అరుదైన గౌరవం


2019 తర్వాత టి డి పి పాత్ర నామమాత్రమే!


                   హైదరాబాద్‌: రాష్ట్రాలు, కేంద్రం బలోపేతం కావాలన్న ఉద్దేశంతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని టి ఆర్ ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు.  టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్న కూటమి కేవలం తెదేపాను బలోపేతం చేసుకోవడానికేనని విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో తెదేపా పాత్ర నామమాత్రమవుతుందన్నారు. 15-12-2018 శనివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఈ దేశంలో రాష్ట్రాల పాత్ర, బలోపేతం మీద అర్థవంతమైన చర్చకు దారితీసేదిగా ఉంటుందన్నారు. చంద్రబాబు చెబుతోన్న ఫ్రంట్‌ దేశం బలోపేతం కోసం కాదని, అది  టిడిపి బలోపేతానికన్నారు.
             బిజెపిని బూచిగా చూపించి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే బిజెపిని ఓడగొట్టేందుకు తానేదో కూటమి తయారు చేస్తున్నానన్న ప్రయత్నాన్ని బలంగా ఏపీ ప్రజల ముందు పెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  టిడిపి కోసం పనిచేస్తే.. తాము దేశం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని చెప్పారు.

13, డిసెంబర్ 2018, గురువారం

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌


భోపాల్‌: ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ మధ్య మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కమల్‌నాథ్‌కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. సీఎం అభ్యర్థి ఎంపికపై ఆశావహులు జ్యోతిరాదిత్య సింథియా, కమల్‌నాథ్‌తో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా చర్చలు జరిపారు. చివరికి సీనియర్‌ నాయకుడివైపే అధినాయకత్వం మొగ్గు చూపడంతో ఉత్కంఠకు తెరపడింది.

పదవుల కోసం టీఆర్ఎస్‌లో పెరిగిన ఆశావహుల సంఖ్య


           హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి మెజారిటీ ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ తరఫున 88 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది. గురువారం ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మహమూద్ ఆలీ మంత్రిగా ప్రమాణం చేశారు. గత కేబినెట్‌లో మహమూద్ ఆలీ డిప్యూటీ సీఎం పదవితోపాటు రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా అవే శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం అసెంబ్లీని సమావేశపరిచి.. ఎన్నికైనా ఎమ్మెల్యేల అందరిచేత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహమూద్ ఆలీకి 4, 5 ముఖ్య శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే వచ్చే నెల 15వ తేదీ లోపల పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాతే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్పెంబర్ 6న అసెంబ్లీ రద్దయిన విషయం తెలిసింది. మళ్లీ ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.

10, డిసెంబర్ 2018, సోమవారం

11న ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి



               2018 డిసెంబర్ 11న ఉదయం 8 గంటలకు  ఐదు రాష్ట్రాల కౌంటింగు ప్రారంభమవుతాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మొత్తం 1,74,724 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య దాదాపు 8,500గా ఉంది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మొత్తం 670 స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 65,367 ఈవీఎంలను వాడారు. ఆ రాష్ట్రంలో 2,907 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 679 సీట్లు ఉండగా, వాటిలో 678 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్‌లో బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందగా, ఆ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది.
          మంగళవారం స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరవనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌లా ఈ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికల్లో గెలవడం తమకు చాలా ముఖ్యమని ఆ పార్టీ భావిస్తోంది. మిజోరంలో కాంగ్రెస్‌, తెలంగాణలో తెరాస అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భాజపా ఇప్ప‌టికి వరుసగా మూడుసార్లు గెలిచింది. ఆయా రాష్ట్రాల్లో నాలుగోసారి కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్‌లో 2013 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన భాజపా.. రెండోసారీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.
               ఈ మూడు రాష్ట్రాలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు భారీ మెజార్టీ తెచ్చిపెట్టడానికి కారణమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉండగా, వాటిల్లో 62 స్థానాల్లో భాజపా గెలుపొందింది. ఈ ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్‌కి కూడా చాలా ముఖ్యమే. దేశంలో బలంగా ఉన్న భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలనుకుంటున్న కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో గెలిచి ఆత్మ విశ్వాసంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగానే పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. రాజస్థాన్‌లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌, రాష్ట్రీయ లోక్‌ దళ్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)తో పొత్తు పెట్టుకుంది, తెలంగాణలో తెదేపా, తెజస‌, సీపీఐలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.

8, డిసెంబర్ 2018, శనివారం

తెలంగాణలో 73.2శాతం పోలింగ్‌



              హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతంపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. పోలింగ్‌ జరిగి 24 గంటలు దాటిన తర్వాత ఆయన ఈ శాతాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 73.2శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగియగా.. 69.1శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తొలుత ప్రకటించారు. అయితే, రాత్రి 10.30గంటల తర్వాతా కొన్ని కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ఈసీ కార్యాలయానికి నివేదికలు చేరలేదు. దీంతో పోలింగ్ శాతం మదింపుపై శనివారం రాత్రి వరకు కసరత్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. 

            అత్యధికంగా యాదాద్రి-90.95 పోలింగ్ శాతం నమోదవ్వగా.. అత్యల్పంగా హైదరాబాద్‌‌లో 48.89 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. భాగ్యనగరంలో పలు సంస్థలు ఓటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది.
జిల్లాల వారిగా చూస్తే..
ఆదిలాబాద్- ‌83.37 %
నిర్మల్‌- 81.22 %
నిజామాబాద్‌-76.22 %
కామారెడ్డి-83-05 %
జగిత్యాల-77.89 %
పెద్దపల్లి-80.58 %
కరీంనగర్‌-78.30 %
సిరిసిల్ల-80.49 %
సంగారెడ్డి-81.94 %
మెదక్‌-88.24 %
సిద్దిపేట-84.26 %
రంగారెడ్డి-61.29 %
వికారాబాద్‌-76.87 %
మేడ్చల్‌-58-85 %
హైదరాబాద్‌-48.89 %
మహబూబ్‌నగర్‌-78.42 %
నాగర్‌కర్నూల్‌-82.40 %
వనపర్తి-86.15 %
నల్గొండ-86 %
యాదాద్రి-90.95 %
జనగాం-87.39 %
వరంగల్‌-89.68 %
భూపాలపల్లి-83.21 %
ఖమ్మం-85.99 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రజత్‌‌కుమార్ స్పష్టం చేశారు.

5, డిసెంబర్ 2018, బుధవారం

మూగబోయిన మైకులు..

                   హైదరాబాద్‌ : రెండు నెలలకు పైగా నేతల ప్రచార హోరుతో వేడెక్కిన తెలంగాణ.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. 119 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2 కోట్ల 80 లక్షల, 64 వేల ఓటర్లు తమ తీర్పుతో తేల్చనున్నారు. సంక్షేమ పథకాలు తమ అభివృద్ధే నినాదంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగగా.. కేసీఆర్‌ను గద్దే దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ప్రచారం సాగించింది. గులాభి అధినేత కేసీఆర్‌ గజ్వేల్‌లోనే ప్రచారం ప్రాంభించి అక్కడే ముగించగా..  మహాకూటమి ఆలంపూర్‌లో ప్రారంభించి.. కోదాడ బహిరంగ సభతో ముగించింది.
               ప్రచార పర్వం ముగియడంతో.. ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ హెచ్చరించారు. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం.. మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్దమని స్పష్టం చేశారు. మావోయిస్ట్‌ ప్రభావిత 13 నియోజక వర్గాలు.. సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ)లలో ఓ గంట ముందు నుంచే నిషేధం విధించమన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాలల్లో వినోదానికి సంబంధించిన కచ్చేరీలు, స్టేజ్ కార్యక్రమాలకు కూడా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. 
  • తెలంగాణలో మొత్తం ఓటర్లు  2,80,64,684
  • మహిళా ఓటర్లు 1,39,05,811, పురుష ఓటర్లు  1,41,56,182
  • 119 నియోజకవర్గాలు, బరిలో 1,821 మంది అభ్యర్థులు
  • అత్యధికంగా మల్కాజ్‌గిరి నుంచి 42 మంది అభ్యర్థులు
  • అత్యల్పంగా నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో ఆరుగురు అభ్యర్థులు
  • ఎన్నికల విధుల్లో సుమారు 30వేల మంది పోలీసులు
  • ఈవీఎంలు-55,329, వీవీప్యాట్స్‌-42, 751, 39,763 కంట్రోల్‌ యూనిట్లు
  • పెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి 5,75,541 మంది ఓటర్లు
  • చిన్న నియోజకవర్గం భద్రాచలం: 1,37,319 మంది ఓటర్లు

21న బ్యాంకుల దేశ వ్యాప్త సమ్మె


           ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. మూడు బ్యాంకుల ప్రతిపాదిత విలీనాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరు 26న దేశవ్యాప్త సమ్మె తలపెట్టినట్లు బ్యాంకు యూనియన్లు గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిసెంబరు 21న కూడా సమ్మె చేయనున్నట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌(ఐఏబీఓసీ) బుధవారం ప్రకటించింది. స్కేల్‌ 4, ఆపై ఉద్యోగుల వేతనాల విషయంలో ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సమ్మె చేయనున్నట్లు ఏఐబీఓసీ నోటీసులు విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. సమ్మె ప్రభావం బ్యాంకులపై ఎక్కువగా పడనుంది. ఈ ప్రకారం డిసెంబరు 21 నుంచి డిసెంబరు 26( డిసెంబరు 24, సోమవారం మినహా) వరకు బ్యాంకులు  నిచేయకపోవచ్చు. 22, 23 శని, ఆదివారాలు కావడం, మంగళవారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఐబీఏ తీరును యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) కూడా వ్యతిరేకించింది. విజయా బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రతిపాదిత విలీనాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరు 26న యూఎఫ్‌బీయూ సమ్మె నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

4, డిసెంబర్ 2018, మంగళవారం

అధికారంలోకి రాబోతోంది ప్రజాకూటమి ; లగడపాటి



             హైదరాబాద్:ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో దిట్ట అయిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిరేపుతూ ఇటీవల ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గెలిచే అభ్యర్థుల పేర్లను.. ఇలా రోజుకో రెండు చొప్పున ప్రకటిస్తానని చెప్పినప్పటికి అనివార్య కారణాల వల్ల ఆయన మీడియా ముందుకు రాలేదు. అయితే ప్రచారం గడువు రేపటితో ముగియనుండడంతో.. నేడు మీడియా ముందుకు వచ్చి సర్వేలోని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా మరో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారని లగడపాటి పేర్కొన్నారు. మరో మూడు నియోజకవర్గాల్లో తన సన్నిహితులు పోటీ చేస్తున్నారని.. వారి అభ్యర్థన మేరకు ఆ మూడు స్థానాల గురించి చెప్పడం లేదన్నారు. తన సర్వే ఎప్పుడూ నిష్పక్షపాతంగా సాగుతుందన్నారు. అదే విధంగా ఏఏ జిల్లాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో..ప్రస్తుత ప్రజానాడి ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో కూడా లగడపాటి మీడియాకి తెలియజేశారు. 
  • ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యం
  • వరంగల్, నిజామాబాద్,మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
  • కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పోటాపోటీ
  • హైదరాబాద్‌లో అత్యధిక సీట్లు ఎంఐఎంకు వెళతాయని..మిగతావి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకుంటాయన్నారు.
టీఆర్ఎస్ కంటే కూడా ప్రజాకూటమి ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందని, ప్రస్తుత ప్రజానాడి ప్రకారం ప్రజాకూటమిదే గెలుపని ఆయన చెప్పారు. అయితే పోలింగ్ శాతం బట్టి విజయావకాశాలు మారే అవకాశం ఉందన్నారు. 68.5 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైతే అంచనాలు తారుమారు అవుతాయన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమి గెలుపొందుతుందని, పోలింగ్ తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని లగడపాటి స్పష్టం చేశారు.
 
లగడపాటి లెక్కల ప్రకారం చూసుకుంటే.. 46 సీట్లలో ప్రజా కూటమి, 31 సీట్లలో టీఆర్ఎస్, 27 చోట్ల పోటాపోటీ, ఎంఐఎం 7, హైదరాబాద్‌లో మరో 8 సీట్లు ప్రజాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ పంచుకునే అవకాశం కనపడుతోంది.

3, డిసెంబర్ 2018, సోమవారం

తెలంగాణ ఎన్నికల చరిత్ర



                      భారతదేశంలో తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఆవిష్కృతమైంది. రెండువేల ఐదువందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అనేక పరిణామాల అనంతరం 2014 జూన్ 2 వ తేదీ (అపాయింటెడ్ డే) రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణగా ఏర్పడింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత నిజాం సంస్థానం విలీనమైంది. అప్పటి భారత ప్రభుత్వం 17 సెప్టెంబర్ 1948 తేదీన నిర్వహించిన ఆపరేషన్ పోలో పేరుతో నిజాం స్టేట్ భారత యూనియన్ లో విలీనమైంది. 26 జనవరి 1950 న ఆనాటి కేంద్రం సివిల్ సర్వెంట్ ఎం.కె.వెల్లోడిని హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రిగా నియమించింది.
                    నిజాం స్టేట్ (మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలతో కూడిన తెలంగాణ) కు తొలిసారిగా 1952 లో ప్రజాస్వామిక ఎన్నికలు జరగ్గా ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. తిరిగి 66 ఏళ్ల తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలతో కూడి ఉంది. 2014 జూన్ 2 అపాయింటెడ్ డే రోజు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. 
                     2014 లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని తెలిసినప్పటికీ ఆనాటి ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగాయి. ఎన్నికల అనంతరం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత ఎన్నికల అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో జిల్లాల సంఖ్యను పది నుంచి 31 కి పెంచారు. 2008 లో నియోజకవర్గాల పునర్విభజన చట్టం ద్వారా ఏర్పడిన ప్రస్తుత 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 19 స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఈస్థానాలకు డిసెంబర్ 7 వ తేదీన పోలింగ్ జరగనుండగా ప్రస్తుతం రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవిష్యత్తును తేల్చనున్నారు.