13, డిసెంబర్ 2018, గురువారం

పదవుల కోసం టీఆర్ఎస్‌లో పెరిగిన ఆశావహుల సంఖ్య


           హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి మెజారిటీ ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ తరఫున 88 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది. గురువారం ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మహమూద్ ఆలీ మంత్రిగా ప్రమాణం చేశారు. గత కేబినెట్‌లో మహమూద్ ఆలీ డిప్యూటీ సీఎం పదవితోపాటు రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా అవే శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం అసెంబ్లీని సమావేశపరిచి.. ఎన్నికైనా ఎమ్మెల్యేల అందరిచేత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహమూద్ ఆలీకి 4, 5 ముఖ్య శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే వచ్చే నెల 15వ తేదీ లోపల పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాతే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్పెంబర్ 6న అసెంబ్లీ రద్దయిన విషయం తెలిసింది. మళ్లీ ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.

కామెంట్‌లు లేవు: