21, మార్చి 2018, బుధవారం

ఆలోచింప జేసేదే కవిత్వం

                                                                               నేడు ప్రపంచ కవితా దినోత్సవం

                 నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక స్రుజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టులు ఉండకూడదు. కవిత్వం రాసేవారిని కవులు, కవయిత్రులు అంటారు. వారికి కీర్తి కాంక్ష అసలే ఉండొద్దు. ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో  స్రుజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే. ఒకరు రాయమంటే రాసేది కవిత్వం కాజాలదు. ఆకలియే కవిత్వం ఆలోచనయే కవిత్వం కదిలించే ఘటనలు, కవ్వించే ప్రతినలు కవితకు ప్రతిపాదికలు..
                                                కవిత్వంలో రకాలు
అభ్యుదయ, విప్లవ కవిత్వం
భావ కవిత్వం
కాల్పనికత కవిత్వం

                                              కవిత్వం పై ప్రముఖుల వ్యాక్యలు
శ్రీశ్రీ:` కవిత్వ మొక తీరని దాహం
శ్రీశ్రీ:` ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే
గుర్రం జాషువా:` వడగాడ్పుల నా జీవితం. వెన్నెల నా కవిత్వం
దాశరథి క ష్ణమాచార్య:` అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం
                                          కవులలో రకాల
1 జంట కవులు,   2 భారత కవులు, 3 రామాయణ కవులు, 4 శివ కవులు, 5 ప్రబంధ కవులు, 6 పద కవులు,7 శతక కవులు, 8 జాతీయోద్యమ కవులు,  9 భావ కవులు, 10 అభ్యుదయ కవులు,11 దిగంబర కవులు,12 తిరుగబడు కవులు, 13 విప్లవ కవులు, 14 నయాగరా కవులు, 15 చేతనావర్త కవులు,16 అనుభూతి కవులు,  17 స్త్రీవాద కవయిత్రులు,18 దళితవాద కవులు, 19 ముస్లిం మైనార్టీవాద కవులు. ఇప్పటి వరకు ఉన్న రకాలు , మున్ముందు ఇంకా పెరగవచ్చు.....