30, ఏప్రిల్ 2011, శనివారం

అమెరికాలో మరో తెలుగోడి హత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఫార్మసీ యజమాని అమెరికాలోని న్యూజెర్సీలో హత్యకు గుర య్యారు. సరైన ప్రిస్క్రిప్షన్‌ లేకపో వడంతో మందులు ఇవ్వడానికి నిరాకరించాడన్న కారణంగా ఒక యువకుడు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడు. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన అర్జున్‌ రెడ్డి ద్యాపా (52) బ్రాడ్‌ స్ట్రీట్‌లోని బ్రన్‌స్విక్‌ అవెన్యూ ఫార్మసీకి యజమాని. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆఫ్రికా-అమెరికా సంతతికి చెందిన ఒక యువకుడు సరైన మందుల చీటీ లేకుండానే మందులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీనికి అర్జున్‌రెడ్డి మర్యాదపూర్వకంగానే తిరస్కరించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయినా ఆ యువకుడు పదే పదే డిమాండ్‌ చేస్తూ అర్జున్‌ ఛాతీ భాగంలో పిస్టల్‌తో కాల్పులు జరపాడు. అర్జున్‌ను తక్షణమే కేపిటల్‌ హెల్త్‌ రీజినల్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. షాపులో వీడియో రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (తానా) వ్యవస్థాపక సభ్యుల్లో అర్జున్‌ ఒకరు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా)లో సీనియర్‌ నాయకునిగా కూడా ఉన్నారు. న్యూజెర్సీలో నిర్వహించిన పలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అర్జున్‌ రెడ్డి చాలా మర్యాదస్తుడు, తోటివారికి సహాయం చేసే వ్యక్తి అని మరో ఫార్మసీ యజమాని స్టీవ్‌ ఎట్మాన్‌ అన్నారు. అర్జున్‌ మృతిపట్ల తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ఆయన, హంతకుడిని అరెస్టు చేయడానికి తగిన సమాచారం ఇచ్చిన వారికి వెయ్యి డాలర్ల రివార్డు ఇస్తానని ప్రకటించారు. ఇలాంటి దారుణం తమలో ఎవరికైనా జరగొచ్చని స్టీవ్‌ వ్యాఖ్యానించారు. అర్జున్‌ హత్యతో దిగ్భ్రాంతికి గురైన ఇండో-అమెరికన్‌ కమ్యూనిటీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని సంతాపం ప్రకటించారు. మిడ్జిల్‌ మండలంలో మారుమూల గ్రామం మాదారంలో జన్మించిన ఆయన 1984లో అమెరికా వెళ్ళి స్థిర పడ్డారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వారూ అమెరికాలోనే స్థిర పడ్డారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తరువాత పలుమార్లు రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించేవారు. కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఆయన కొనసాగారు. పలుమార్లు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్సుయాత్రకు బాగా సహకరించారు. అర్జున్‌రెడ్డి మృతి వార్త తెలిసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
అమెరికా శాంతిభద్రతలు కాపాడకపోతే ఎలా?
భారతీయుల మృతిపై ప్రధాని దృష్టి తీసుకెళ్తా : విహెచ్‌
చట్టాలను కఠినంగా అమలు చేసే అమెరికాలోనే శాంతిభద్రతలు కాపాడకపోతే ఎలా? అని కాంగ్రెస్‌ ఎంపి వి హనుమంతరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అర్జున్‌రెడ్డిని అమెరికాలోని న్యూజెర్సీలో కొందరు దుండగులు చంపడం బాధాకరమన్నారు. భారతీయుల మృతికి సంబంధించిన అంశాలను ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. శనివారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అమెరికాలో గత కొంత కాలంగా 18 నుంచి 20 మంది చనిపోయారని తెలిపారు. భారతీయులపై జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. అమెరికాలో భారతీయులకు తగిన రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

24, ఏప్రిల్ 2011, ఆదివారం

సత్యసాయిబాబా అస్తమయం

ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సత్యసాయిబాబా (86) ఇకలేరు. ఆదివారం ఉదయం 7-40 గంటలకు బాబా తుదిస్వాస వదిలినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. బాబా ఇకలేరన్న వార్త విని భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మార్చి 28న శ్వాస సంబంధ సమస్యతో బాబా ఆస్పత్రిలో చేరారు. పుట్టపర్తి సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రయుఖ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. శరీరంలోని ప్రధాన అవయవాలు కాలేయం, మూత్రపిండాలు, ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాబా మరణ వార్త విని పుట్టపర్తి అంతటా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది.
ఆదివారం ఉదయం 7-30 గంటల నుంచి ఆస్పత్రి వద్ద హడావుడి మొదలైంది. బాబా బంధువులు, ట్రస్టు సభ్యులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. కొంతమంది కన్నీటిపర్యంతమవుతూ ఆస్పత్రి నుంచి బయటకువెళ్లారు. దీన్ని చూసి భక్తుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి రోజూ ఉదయం 8-00 గంటలకు విడుదల చేసే బులెటిన్‌ కూడా విడుదల చేయలేదు. ఇది మరింత ఆందోళనకు గురిచేసింది. ఉదయం 9-30 గంటలకు సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ డైరెక్టర్‌ డాక్టరు సఫాయా చివరి బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ బులెటిన్‌లో బాబా ఇక భౌతికంగా లేరని పేర్కొన్నారు. బాబా లేరన్న వార్త విన్న భక్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎలాగైనా బాబా కోలుకుంటారని ఇంతకాలం ఎదురుచూసిన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బాబా భౌతికకాయం ప్రశాంతి నిలయానికి తరలింపు...
సత్యసాయిబాబా భౌతికకాయాన్ని ప్రశాంతి నిలయానికి తరలించారు. భక్తుల దర్శనార్థం ప్రశాంతి నిలయంలోని యజుర్వేద మందిరం సాయికుల్వంత్‌ హాలులో ఉంచారు. సాయంత్రం ఆరు గంటల నుంచి భక్తులు బాబా భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. బాబా భౌతిక కాయాన్ని సూపర్‌స్పెలాటి ఆసుపత్రినుంచి సాయి కుల్వంత్‌ హాలుకు ఒక అంబులెన్స్‌లో తరలించడం సామాన్య ప్రజలకు ఆందోళన కలిగించింది. పెద్దఎత్తున సాయి కుల్వంత్‌ హాలు వద్దకు చేరుకున్నారు. ఒక దశలో గేట్లను ధ్వంసం చేసకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరిన ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
పోలీసుల వలయంలో పుట్టపర్తి...
రెండు రోజుల ముందు నుంచే పుట్టపర్తికి భారీగా పోలీసు బలగాలను తరలించారు. ఆదివారం ఉదయం బాబా ఇక లేరన్న విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. 9 వేల మంది పోలీసు బలగాలు పుట్టపర్తి పట్టణంలో తిష్టవేశాయి. అన్ని రహదారుల కూడలిలో పోలీసులను భారీఎత్తున మెహరించారు. పుట్టపర్తికి వస్తున్న ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఆస్పత్రి వైపు వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. పట్టణంలో దాదాపు బంద్‌ వాతావరణం నెలకొంది. దుకాణాలన్నీ మూసివేశారు.
ప్రజల సందర్శనార్థం మూడు రోజులు 27న అంత్యక్రియలు
సత్యసాయిబాబా భౌతికకాయాన్ని యజుర్వేద మందిరానికి తరలించారు. సాయంత్రం సాయికుల్వంత్‌హాలులో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. బాబా భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2-50 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నరు నరసింహన్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు బాబా భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. అనంతరం 2-50 గంటలకు అంబులెన్స్‌లో ఆస్పత్రి నుంచి ప్రశాంతి నిలయంలోని యజర్వేద మందిరానికి తరలించారు. భౌతికకాయాన్ని ఆయన నిత్యమూ భక్తులకు దర్శనమిచ్చే సాయికుల్వంత్‌ హాలులో ఉంచారు. సాయంత్రం ఆరు గంటల వరకు ట్రస్టు సభ్యులు, అలాగే ప్రశాంతి నిలయంలో పని చేసే సేవా కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం సాయంత్రం వరకు భక్తులు భౌతికకాయాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం బుధవారం ఐదు గంటలకు సాయికుల్వంత్‌హాల్‌లోనే అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు ట్రస్టు వర్గాలు ప్రకటించాయి.
భక్తుల్లో విషాదఛాయలు
సత్యసాయిబాబా ఇకలేరన్న వార్తతో పుట్టపర్తితో పాటు జిల్లాలో కూడా విషాదచాయలు అలుముకున్నాయి. భక్తులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి కోలుకుని దర్శనమిస్తారని ఎదురుచూస్తున్న భక్తులకు బాబా లేరన్న వార్త మింగుడుపడటం లేదు. పుట్టపర్తిలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. బాబా పార్ధివదేహాన్ని భక్తులు దర్శించేందుకు వీలుగా ప్రశాంత నిలయం పరిసర ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ప్రముఖులందరూ సాయి భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పుట్టపర్తికి బయలుదేరారు.
బాబా భౌతికకాయాన్ని దర్శించుకున్న ప్రముఖులు
సత్యసాయిబాబా భౌతికకాయాన్ని ప్రముఖులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌, కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి, ఎంపీలు అనంతవెంకట్రామిరెడ్డి, నిమ్మలక్రిష్టప్ప, ఎమ్మెల్యేలు పల్లెరఘునాథ్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌లు బాబా భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. టిటిడి మాజీ ఛైర్మన్‌ ఆదికేశవనాయుడు, లక్ష్మిపార్వతిలు బాబా భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. కర్నాటక ప్రభుత్వం రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

18, ఏప్రిల్ 2011, సోమవారం

శక్తి పీఠాల చరిత్ర

' శక్తి ' సినిమాలో 18 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలిపారు. ఆ 18 ఎలా ఏర్పడ్డాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటి? ఆపేరెలా వచ్చిందని పలురువు మిత్రులు అడిగారు. అందరికీ తెలియజెప్పడం కోసం ఈ పోస్టును పెడుతున్నాను. పరిశీలించి తెలుసుకుంటారని ఆశిస్తూ...
ఈ మధ్య ఐదో శక్తి పీఠం జోగులాంబదేవాలయం (అలంపూరు)కు వెళ్లాను. అక్కడ శక్తిపీఠాల పూర్వాపరాలున్నాయి. వాటి ఆధారంగా ఈ పోస్టు పెడుతున్నాను. పార్వతీదేవిని హిందువులు ఆరాధించే దేవాలయాల్లో పురాణగాథలు, ఆధారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఎన్ని? ఏవి? అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని, 51 అని, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణగాథ ఉంది. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసేటప్పుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ కూతురు, అల్లుడిని పిలువడు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయని) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడుతుంది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలువాలేమిటి?అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రథమ గణాలను వెంట బెట్టుకుని యాగానికి వెళ్తుంది. అక్కడ అవమానానికి గురవుతుంది. అవమాన్ని సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు. కానీ సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మాని వేస్తాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర పాదకులకు ఆరాధనా స్థలాలయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయని మాత భైరవుని (శివుని)కి తోడుగా దర్శనమిస్తుంది.
1. శాంకరీదేవి-శ్రీలంక:- ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పు ట్రిన్‌కోమలిలో ఉండొచ్చని నమ్మకం. 17వ శతాబ్ధంలో పోర్చుగీసు వారు ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో త్రికోణ శహపరస్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం పక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ కాళీ మందిరం ప్రసిద్ధమైనది.
2. కామాక్షిదేవి-కాంచీపురం, తమిళనాడు :- మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖలాదేవి-ప్రద్యుమ్ననగరం, పశ్చిమబెంగాల్‌: ఇది కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులు లేవు. అయితే కోల్‌కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్‌ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతోంది.
4. చాముండేశ్వరీదేవి-కొంచపట్టణం మైసూరు, కర్ణాటకలో ఉంది.
5. జోగులాంబదేవి - అలంపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రానదిగా కలిసే స్థలంలో ఉంది.
6. భ్రమరాంబికాదేవి-శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్‌:- కృష్ణానది తీరాన అమ్మవారు మళ్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.
7. మహాలక్ష్మీదేవి-కొల్హాపూర్‌, మహారాష్ట్ర :- ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేశారు. అమ్మవారి తలమైన ఐదు తలల శేషుని చత్రం ఉంది. ప్రతి సంవ్సతరం మూడుసార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మిపడుతుంది.
8. ఏకవీరిక (ఏకరూపాదేవి), మాహుర్యం లేదా మహార్‌, నాందేడ్‌ జిల్లా మహారాష్ట్ర : - ఇక్కడ అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు. షిరిడీ నుంచి ఈ మాతను దర్శించుకోవచ్చును.
9. మహాకాళి-ఉజ్చయిని , మధ్యప్రదేశ్‌:- ఇది ఒకప్పుడు అవంతినగరం అనబడే క్షిప్రానది తీరానుంది.
10. పురుహూతిక-పీఠిక లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్‌:- కుకుటేశ్వరస్వామి సమేతమై ఉన్న అమ్మవారు
11. గిరిజాదేవి-ఓడ్య, ఒరిస్సా:- జాజ్‌పూర్‌ నుంచి 20 కిలోమీటర్లు ఒరిస్సా వైతరణి నది తీరాన ఉంది.
12. మాణిక్యాంబ దేవి-దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్‌:- కాకినాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
13. కామరూపాదేవి- హరిక్షేత్రం, అస్సోం:- గౌహతి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మపుత్రనది తీరంలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14. మాధవేశ్వరిదేవి- ప్రయాగ, అలహాబాదు, ఉత్తరప్రదేశ్‌:- త్రివేణి సంగమం సమీపంలో ఉంది. అమ్మవారిని అలోపిదేవి అని కూడా అంటారు.
15. వైష్ణవిదేవి-జ్వాలాక్షేత్రం-హిమాచల్‌ ప్రదేశ్‌:- కాంగ్రా వద్ద అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలం నుంచి వెలుగుతున్నాయి.
16. మంగళగౌరిదేవి-గయా, బీహారు:- పాట్నా నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది.
17. విశాలాక్షిదేవి-వారణాసి, ఉత్తర ప్రదేశ్‌లో ఉంది.
18. సరస్వతి దేవి- జమ్మూకాశ్మీర్‌:- అమ్మవారిని కీర్‌భవానీ అని కూడా అంటారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరహాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

13, ఏప్రిల్ 2011, బుధవారం

నేడు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి

డాక్ట్టర్‌ భీమ్‌రావ్‌రాంజీ అంబేద్కర్‌ 1891 ఏప్రిల్‌ 14న జన్మించారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయనను అప్పటి సమాజం అంటరాని వాడిగా చూసింది. అంటరాని వాడిగా ముద్రపడిన ఆయన 'ఎంఏ, పిహెచ్‌డి, డిఎస్‌సి, ఎల్‌ఎల్‌డి, డిలిట్‌, బారిస్టర్‌ అట్‌లా' వంటి ఉన్నత చదువులు చదివి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. ఆరోజుల్లో సంస్కృతం అస్పృశ్యులు చదవరాదనే కట్టుబాట్లు ఉండేవి వాటిని ఎదిరించి సంస్కృతం చదివాడు. మనుధర్మ రక్షకులను మంటలల్లో కలిపాడు. సాటిమానవులను మనుషులుగా గౌరవించని హిందూధర్మాన్ని విడనాడి బౌద్ధధర్మాన్ని పాటించాడు. మతం మార్పుతో సమాజంలో మార్పు రాదని ఆర్థిక అసమానతు పోవాలని పోరాటం చేశారు. దళిత జనోద్దరణ కోసం జీవితాంతం పోరాటం చేశారు. భారత రాజ్యాంగపరిషత్‌లో డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రాజ్యాంగ పితగా ఆయనను జాతి గౌరవిస్తోంది. 1931లో మహాత్మగాంధీ, అంబేద్కర్‌ మధ్య పూనా ఒడంబడిక జరిగింది. జవహర్‌లాల్‌నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో ఆయనకు భారతరత్న అవార్డు లభించింది. 1956లో బౌద్ధమతాన్ని స్వీకరించారు. బహిష్కృత్‌ భారత్‌, మూక్‌నాయక్‌ పత్రికలను నిర్వహించారు. 1956 డిసెంబర్‌ 6న మరణించారు. భారతదేశం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి వేడుకలను గురువారం జరుపుకుంటుంది. అంబేద్కర్‌ గొప్ప పోరాట యోధుడు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పోవాలని కెవిపిఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి.

అన్నా హజారే ఒక్క అవినీతిమీదే ఎందుకింత స్పందించారు?

నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రంపంచీకరణ , సరళీకరణ, ప్రయివేటీకరణ వల్ల జరిగిన దుష్పరిణామాలపై అన్నా హజారే ఎందుకు స్పందించలేదు? ఆయనకు అవి అర్థం కాలేదా? అర్థం అయినా ఎందుకులే అనుకున్నారా?. విద్యా, వైద్యం, ఉపాధి సామాన్యులకు అందనంత దూరం అవుతున్నాయి. ఆయనొక సామాజిక కార్యకర్త సమాజంలోని సామాజిక అసమానతలు కనబడలేదా? ప్రయివేటీకరణ పుణ్యమాని ఎస్సీఎస్టీబీసీల కోసం రాజ్యాంగంలోని నిర్థేశించుకున్నవి అమలు ఎందుకు కావడంలేదో తెలియదా? సరళీ కరణతో పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తూ సహజసిద్దమైన వనరులన్నీ నాశనమై గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోంది. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంకా దెబ్బతింటూనే ఉన్నాయి. వాటిపై అన్నా హజారే ఎందుకు స్పందించ లేదు. అన్నా హజారే భారత సైన్యంలో పని చేశారు. దేశరక్షణ గురించి బాగా తెలుసు దేశ రక్షణకు భంగం వాటిల్లే ఒప్పందాలను అమెరికాతో చేసుకుంటుంటే ఎందుకు స్పందించలేదు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా రాలేగావ్‌సిద్ధి గ్రామ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన సౌరశక్తి, జీవ ఇంధనం, పవన విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నడుంబిగించారు. అంటే ప్రకృతిని కాపాడాలనే ఆలోచన ఆయనకుందనే కదా? మరి ప్రమాదకరమైన అణుఒప్పందం భారత ప్రభుత్వం చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదు. ఆయన చేసిన పనిమీదే ఆయనకు నమ్మకం లేదా? దేశంలో స్వయం ప్రతిపత్తి గల రాలేగావ్‌ సిద్ధి గ్రామాన్ని మొదటిస్థానంలో నిలిపినందుకు ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఇదంతా చేయగలిగిన ఆయన ప్రమాదకరధోరణుల సమయంలో ఎందుకు నోరు మెదపలేదు.
అన్నా హజారే ఒక్క అవినీతిమీదే ఎందుకు దీక్ష చేశారు. అన్నింటికీ మూలం అవినీతే అనుకుంటున్నారా? ఏటేటా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు, ఉత్తర్వుల వల్ల జరుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం లేదా?. మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడీ, సామాజిక వేత్త అగ్నివేష్‌, ఆర్‌టిఐ విప్లవవేత్త అరవింద్‌ కెజ్రావాల్‌ హజారేకు తోడుగా నిలిచారు. వీరికయినా ఎందుకు ఈ పరిస్థితులన్నీ అర్థం కాలేదు. రాజకీయాలకు అతీతులనీ, స్వచ్చందంగా ముందుకొచ్చి జనలోక్‌పాల్‌ బిల్లుకోసమని పోరాడారని ఎక్కువమంది నమ్ముతున్నారు. అందులోని తోతుపాతులను అధ్యయనం చేసేంత తీరిక లేదేమో అనిపించింది. సరే ముందుముందు అన్నీ బయటపడుతాయిగా అప్పటికైనా ఎవరి పోరాటం వెనుక ఏముందో అర్థమవుతుంది. ఒకప్పుడు నూతన ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన వారిని వితండవాదులు అన్నారు. కొన్నాళ్ల తరువాత అందరూ వ్యతిరేకించక పోయినా ఒక్కో సందర్భంలో గొంతుకలిపారు.
సరే అదంతా అటుంచితే జనలోక్‌పాల్‌ బిల్లు అంటే ఏమిటీ? : ఈ బిల్లును 1972లో అప్పటి న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్‌ పార్లమెంటులో ప్రతిపాదించారు. మారుతున్న పాలకులు దీనిని పక్కన పెడుతూ వచ్చారు. కొందరు అవినీతి పరులు ఆబిల్లును మార్చాలని కూడా ప్రయత్నించారు. ఈబిల్లు అమలయితే కేంద్రం ఒక లోక్‌పాల్‌ను ఎన్నుకోవాలి. లోక్‌పాల్‌ బిల్లును డ్రాప్టు చేయడానికి 50 శాతం ప్రభుత్వం నుంచి , 50 శాతం ప్రజల తరుపున కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలి. అవినీతిని అంతమొందించడంలో ప్రభుత్వాన్ని ఊర్తిగా నమ్మడం సాధ్యం కాదని ఈ విధంగా కమిటీని వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఉండే కొందరు అవినీతి పరులు చట్టం కళ్లుగప్పి తప్పించుకునే ప్రమాదం ఉంది. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్నంత స్వయంప్రతిపత్తి లోక్‌పాల్‌బిల్లుకు కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఏడాదిలోపు అందరి అవినీతి పరులను గుర్తించే అవకాశం ఉంది. రెండేళ్లలో అందరికీ శిక్షపడేలా చేయడం సాధ్యమవుతుంది. బిల్లుపాస్‌అయితేనే అవినీతిని అంతమొందించే అవకాశం ఉంది. ఇదంతా పార్లమెంటు మీద ఆధారపడి ఉంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి సాధ్యమవుతుంది. సరే ఏంచేస్తారో వేచి చూద్దాం. అన్నా హజారే ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. పోరాటం ఏదయినా మద్దతు ఇవ్వాల్సిందే. ప్రమాదకరమైన అన్నింటిమీద ఆయనెందుకు స్పందించలేదనేదే నాప్రశ్న.

6, ఏప్రిల్ 2011, బుధవారం

సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరం

''సత్యసాయి బాబా ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. కీలక అవయవాలేవి వాటంతట అవి పనిచేసే పరిస్థితుల్లేవు. కృత్రిమ సహకారంతోనే పనిచేయిస్తున్నాం., అయినా బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది'' అని వైద్యులు చెబుతున్నప్పటికీ ముప్పు తప్పిందని మాత్రం ఘంటాపథంగా చెప్పలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం అతిథి గృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పివి.రమేష్‌, వైద్యవిద్యాశాఖ డైరెక్టరు డాక్టర్‌ రవిరాజు, సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టరు డాక్టరు సఫాయ మాట్లాడారు. బాబా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని, నిలకడగానే ఉందని చెప్పారు. బాబా ఆరోగ్యం గురించి వైద్య బృందం ఆహర్నిశలు శ్రమిస్తున్నా రని చెప్పారు. వారు తెలిపిన సమాచారం మేరకు అవయవాల పనితీరు ఈ విధంగా ఉంది.
గుండె పనితీరు బాగుంది...
సత్యసాయి బాబా గత నెల 28న గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చినందువల్ల సత్య సాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆయనకు పేస్‌మేకర్‌ అమర్చి గుండె పనితీరు మెరుగుపరిచారు. ప్రస్తుతం ఆయన హృదయ స్పందన బాగుంది. గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కొంత తగ్గింది. తద్వారా బిపి తగ్గుతోంది. దీనికి
మందులు వాడుతున్నారు. దీని వల్ల బిపి సాధారణంగానే ఉంటోంది. ప్రస్తుతం 130/60, 140/70గా బిపి ఉంటోంది. ఇది సాధారణ వ్యక్తి తరహాలోనే ఉన్నట్టు వైద్య, విద్య డైరెక్టరు రవిరాజు పేర్కొన్నారు.
వెంటిలేటరు సహకారంతో..
గుండె పనితీరు మెరుగుపడిన తరుణంలో బాబా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ ప్రబలింది. నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారు. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆక్సిజన్‌ కూడా శరీరానికి బాగా అందుతోంది. అయితే వెంటిలేటర్‌ తీసేస్తే ఏ మేరకు శ్వాస తీసుకోగలరో చెప్పలేని పరిస్థితుల్లో వైద్యులున్నారు.
సిఆర్‌టిటి ద్వారా మూత్రపిండాలకు వైద్యం...
శ్వాసకోస సమస్యలకు పరిష్కారం చేసేలోపే మూత్రపిండాల పనితీరు మందగించింది. ఇవి పనిచేయకపోవడంతో మూత్రం వచ్చే పరిమాణం తగ్గింది. ఫలితంగా శరీరంలోకి నీరు చేరింది. సిఆర్‌టిటి ద్వారా డయాలసిస్‌ చేసి శరీరంలోని నీటినంతటినీ తొలగించారు. దీని ద్వారా శరీరంలో చేరిన మలినాలను కూడా తీసివేస్తున్నారు. కాళ్లు, చేతులు, మొహం వాపు తగ్గి సాధారణ పరిస్థితికి వచ్చింది. ఈ విధానాల ద్వారా మూత్రపిండాల పనిని కృత్రిమంగా చేయవచ్చునని చెబుతున్నారు. మూత్రంలో యూరియ, సోడియం, పొటాషియం స్థితి కూడా సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కీలక అవయవాల పని తీరిలా...
సాయిబాబా ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళన మాత్రం తప్పలేదు. ఎందుకంటే కీలక అవయవాలన్నీ కృత్రిమ సహకారంతోనే పనిచేస్తున్నాయి. వీటిని తొలగిస్తే అవి ఏ మేరకు పనిచేస్తాయన్నది చెప్పలేని పరిస్థితుల్లో వైద్యులున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మూత్రం చాలా తక్కువగా వస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా శరీర ఉష్టోగ్రత 99 నుంచి 100 వరకు ఉంటోందని చెప్పారు. న్యుమోనియా వల్ల శరీరంలోని కొన్ని భాగాలకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్టు కూడా రవిరాజు తెలిపారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ శరీరంలో వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాబా ఏ మేరకు స్పృహలో ఉన్నారో కూడా చెప్పలేమని, ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్న అంశాలేనని ఆయన చెప్పారు. మొత్తమ్మీద బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పాలన్నారు. ఎంతకాలంలో కోలుకోవచ్చని విలేకరులు అడిగిన ప్రశ్నకు వారి నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. ఎంత సమయం పట్టవచ్చన్నది ఎవరూ చెప్పలేమన్నారు. అయితే తొందరలోనే కోలుకుంటారని అందరం ఆశిద్దామన్నారు.
ప్రభుత్వ సహకారం బాగుంది... : డైరెక్టరు సఫాయా
సత్యసాయిబాబా ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని చెప్పారు. తమ వైద్యులకు తోడు ప్రభుత్వ వైద్య బృందం కూడా సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బాబాను ఎక్కడికైనా తీసుకెళ్లే ఆలోచనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ అటువంటిదేమీ లేదన్నారు. ఇక్కడి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే అన్ని రకాలైన వైద్య సౌకర్యాలున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఆయన భక్తులుగానున్న ప్రముఖ వైద్యులు చాలా మంది ఉన్నారన్నారు. వారందరూ ఆయన ఆరోగ్యం కోసం కష్టపడుతున్నారని చెప్పారు.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయి బాబాగా

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబరు 23న సత్యనారాయణ రాజు (సత్యసాయిబాబా) జన్మించారు. తనకుతానే బాబా అని ప్రకటించుకుని ప్రపంచ ఆధ్యాత్మికవేత్తగా సత్యసాయిబాబా ఎదిగారు. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు, విమర్శలను, ఆరోపణలను సైతం సత్యసాయిబాబా ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్తగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులున్నారు.
బాల్యం గడించింది ఇలా...
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెద్దవంకమరాజు రత్నం దంపతులకు 1926 నవంబరు 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిన్నప్పటి నుంచి పెద్దసోదరుడు శేషమరాజు వద్దనే ఉంటూ వచ్చారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సత్యనారాయణరాజు విద్యాభ్యాసం కూడా ఒక్కొక్క చోటు జరుగుతూ వచ్చింది. పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉరవకొండలో ప్రాథమికోన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల తరుణంలో ఒక రోజు సత్యనారాయణ రాజుకు తేలు కుట్టింది. అప్పటి నుంచి ఆయన మానసిక పరివర్తనలో మార్పు వచ్చింది. ఏదేదో మాట్లాడుతుండే వాడు. దీంతో ఆయన సోదరుడు శేషమరాజు ఆయన్ను తన స్వగ్రామమైన పుట్టపర్తికి పంపించారు. కొద్దిరోజులు తరువాత తాను దేవుడినని, తన పేరు ఇక నుంచి సత్యసాయిబాబా అని 1940లో ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సత్యనారయణ రాజు కాస్త సత్యసాయిబాబాగా పిలువబడుతూ వచ్చారు. అనంతరం ఆయన దక్షిణ, ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. తిరిగొచ్చాక కొన్ని మహిమలు చూపడంతో భక్తులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. 1944లో ఆయనకు మొట్టమొదటిసారిగా పుట్టపర్తిలో మందిరాన్ని నిర్మించారు. దీన్ని ప్రస్తుతం మందిరంగా పిలుస్తున్నారు. 1948లో ప్రశాంతి నిలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి క్రమక్రమంగా బాబా గురించి దేశవ్యాప్తంగా తెలియడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చేవారు. 1968లో మొట్టమొదటిసారి విదేశీ పర్యటన చేపట్టారు. క్రమక్రమంగా అక్కడి నుంచి కూడా విదేశీ భక్తులు పుట్టపర్తికి రావడం పెరిగింది.
విమర్శలు, ఆరోపణలు...
సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయిబాబాగా ఎదిగే క్రమంలో ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం అనేక వ్యతిరేక కథనాలు వచ్చాయి. అన్నింటికంటే ఎక్కువగా విమర్శలకు గురిచేసింది 1993 జూన్‌ 6న ఆశ్రమంలో జరిగిన ఆరు హత్యలు. బాబా నిద్రించే గదిలోనే ఇద్దరు యువకులు తుపాకీతో కాల్చి హత్య గురికావడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించినందునే వారిని కాల్చి చంపారని అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. ఇకపోతే నోటిలో నుంచి శివలింగం తీయడం, గాలిలో విబూది తీయడం వంటివన్నీ మహిమలు కాదని, మ్యాజిక్‌ మాత్రమేనని ప్రముఖ హేతువాది ప్రేమానంద్‌ పేర్కొన్నారు. చంద్రుడు తన ప్రతిరూపం కనిపిస్తుందని అంతకు ముందు ఏడాది ప్రకటించి కనబడకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఆరోపణలేవీ ఆయన్ను పెద్దగా అడ్డుకోలేకపోయాయి. 2004లో బిబిసి అంతర్జాతీయ మీడియా ఛానల్‌ 'ది సీక్రెట్‌ స్వామి' అనే పేరుతో ఒక కథనాన్ని వెలువరిచింది. వీటన్నింటినీ సత్యసాయిబాబా భక్తులు తిప్పికొట్టగలిగారు.
ప్రపంచ వ్యాప్తంగా సేవా సమితులు...
సత్యసాయి సేవా సమితులు ప్రపంచ వ్యాప్తంగానున్నాయి. 126 దేశాల్లోని 1200 చోట్ల సత్యసాయి సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారానే సత్యసాయి బాబా ట్రస్టు కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలే కాకుండా పుట్టపర్తిలోని ట్రస్టు కార్యకలాపాలన్నీ సేవాసమితి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. భద్రత మొదలుకుని అన్నీ కూడా సమితి సభ్యుల కనుసన్నల్లోనే నడుస్తాయి. ట్రస్టు లోపలి భాగంలో పోలీసులకు సైతం ప్రవేశం ఉండదు.
సేవా కార్యక్రమాలు...
సత్యసాయి బాబా ఏర్పాటు చేసిన 'సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు' ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, వైద్యం అందులో ప్రధానమైనవి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. వీటితోపాటు పలు జిల్లాలకు తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. అనంతపురం, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. చెన్నై నగరానికి తాగునీటి ప్రాజెక్టును చేపట్టారు. ఒరిస్సాలో 2008లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టారు.
ఇటీవలే వైభవంగా 85వ జన్మదిన వేడుకలు...
ప్రతి ఐదేళ్లకు ఒకసారి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించడం అనవాయితీ. 2010 నవంబరు 23న 85వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వారం రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో మహిళా దినోత్సవానికి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నవంబరు 22న సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. 23న జరిగిన జన్మదిన వేడుకలకు కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణ, టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్‌టాటా తదితరులు హాజరయ్యారు.
సత్యసాయి వారసులెవరు?
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి పుట్టపర్తివైపే పడింది. భక్తి , మహిమలు ఎలాగున్నా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బోగు చేశారు. వాటితో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిని కాపాడి ప్రభుత్వ పరం చేయడానికి తగిన శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి నిర్వహణ పరిస్థితి భవిష్యతులో ఏ విధంగా ఉండబోతోందన్న చర్చసాగుతోంది. సత్యసాయిబాబా ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఇటువంటి ఆలోచనే చేయని వారందరూ ఇకపై ఎలాగన్న చర్చమొదలైంది. ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లే వారసుడు ఎవరన్నది ట్రస్టులోని ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కార్యక్రమాలు జరిగాయి. ఈ ట్రస్టుకు సత్యసాయి బాబానే అధ్యక్షులుగావున్నారు. కార్యదర్శిగా చక్రవర్తి ఉన్నారు. తొమ్మిది మంది సభ్యులున్నారు. వారిలో ఎక్కువగా తమిళనాడుకు చెందినవారున్నారు. భక్తులుగా చేరిన వారు క్రమంగా ట్రస్టు సభ్యులుగా మారారు. ఈ సభ్యుల్లో సత్యసాయి బాబా సోదరుడు జానకిరామయ్య కుమారుడు రత్నాకర్‌ ఒకరుగానున్నారు. సత్యసాయిబాబాకు ఆయనంటే అమితమైన అభిమానముండేది. కాని ఆయన్ని వారసుడిగా ఇప్పటి వరకు బాబా ఎక్కడా ప్రకటించిన దాఖలాల్లేవు. బాబా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. ఆయన కోలుకున్నప్పటికీ ఇకపై ట్రస్టు నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలపై ఏ మేరకు దృష్టి సారించగలరో చెప్పలేని పరిస్థితి. దీంతో నాయకత్వ బాధ్యతలను మరొకరు తీసుకునే అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితే గనుక వస్తే ఎవరిని సత్యసాయి వారసునిగా ప్రకటిస్తారో అంతుబట్టడం లేదు. ఈ విషయంలో ట్రస్టు వర్గాల్లోనూ భిన్నాభిప్రాయలున్నట్లు తెలుస్తోంది. ట్రస్టు కార్యదర్శిగానున్న చక్రవర్తి ఇప్పటి వరకు అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆయన పట్ల కొంత మంది వ్యతిరేక భావంతోనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌ రాజును కూడా వారసుడిగా ప్రకటించే పరిస్థితుల్లేవు. ఈ విషయంలో ఇప్పటికే ట్రస్టు సభ్యుల మధ్య భేదాభిప్రాయలున్నట్టు తెలుస్తోంది. రత్నాకర్‌ రాజును ట్రస్టు సభ్యులు దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం సాగుతోంది. బాబా ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు కూడా కొంత మంది నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో శుక్రవారం రాత్రి రత్నాకర్‌ రాజు ఆసుపత్రి వైద్యులతోనూ, ట్రస్టు సభ్యులతోనూ స్వల్ప వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కొంత మంది కలుగజేసుకుని సర్ధిజెప్పడంతో తాత్కాలికంగా ఇది సద్దుమణిగినట్టు సమాచారం. ఇదిలావుండగా సోమవారం ఆరుగురు ఉన్నతస్థాయి న్యాయనిపుణులు పుట్టపర్తికి వస్తున్నట్టు సమాచారం. వీరు బాబాను కలిసేందుకు వస్తున్నారా లేక ట్రస్టులో తలెత్తబోయే సమస్యలను పరిష్కరించేందుకు వస్తున్నారా? అన్నది తెలియాల్సుంది. మొత్తం మీద భవిష్యత్తులో సత్యసాయి సేవా ట్రస్టు కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న ఆందోళన అటు భక్తుల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ నెలకొంది.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

శ్రీఖర నామ ఉగాది శుభాకాంక్షలు

మనం నిత్యం జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలువులు తదితరాలు మన సంస్కృతిలో భాగం. పండుగలు ఉత్సవాలు అన్నీ మత పరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించినవి. అంటే వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతుంటాయి. కొన్ని పండుగలు మత నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల పండుగలు, ఉత్సవాలు, జాతరలు వంటి వాటిని మూఢ నమ్మకాలని కొట్టి పారేయలేం. ఉగాది కూడా వ్యవసాయం అధారమైన పండుగ. ఉగాది తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఉగాదిరోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి తొలిపండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి, తలంటి స్నానం చేసి, కొత్తబట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు. దేవస్థానానికి వెళ్లి పూజలు చేస్తారు. కొత్త సంవత్సరంలో రాశీఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతుల లాంటివి చేసి సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక పరాఠీలు గుడిపడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మళయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖీగానూ, బెంగాలీలు బైశాఖ్‌ గాను జరుపుకుంటారు.
ఉగాది ప్రాముఖ్యం: చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ము తారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈజగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయవేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు వసంత రుతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్తజీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిశషిక్తుడైన దినం కారణంగా ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ ఉంది. ఉగాది , యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగము అనగా ద్వయము లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా , ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్ధానికి ప్రతిరూపమైన ఉగాదిగా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొన్నాడు.
సంప్రదాయాలు: ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయసింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం తదితర పంచకృత్య నిర్వహణ చేయాలని వ్రతగంధ నిర్ధేశితం, మామిడాకుల తోరణాలు కట్టడం. తలస్నానం చేయడం. కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం,. పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ, వ్యయాలు, కందాయఫలాలు, రాశిఫలాలు తెలిపే పంచాంగం వినడం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున దేవాలయం వద్ద అంతాచేరి పురోహితుడిని పిలిపిస్తారు. తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది. గ్రహణాలు ఏమయినా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సవంత్సరాలు ప్రభవతో మొదలుపెట్టి అక్షయ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాల్లో మానవులు తాము జన్మించిన నామసంవత్సరాన్ని వారి సన్మాంతర సుకృతాలను బట్టి జీవితంలో ఒక్కసారో రెండుసార్లో చూస్తుంటారు. అందువల్లనే జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆనామ సంవత్సరం వచ్చినప్పుడు అది ఒక పర్వదినంగా భావించి షష్టిపూర్తి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటారు.
చేసే పూజలు: అన్ని పండుగల లాగానే ఉగాది పండుగనాడు ఉదయాన తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి పూజ చేసుకుంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాన దేవుడి పూజ అని ప్రస్తావించలేదు. గనుక ఈ రోజున ఇష్టదేవతాపూజ చేసుకుంటారు. ఆతరువాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడి తింటారు.
ఉగాది పచ్చడి: ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరురుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవంత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్లు, మామిడి కాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం తదితరాలను వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో '' నింబకుసు భక్షణం'' అశోకకళికా ప్రాశనం అని వ్యవహరించే వారు. రుతుమార్పు కారణంగా వచ్చే వాత, కప, పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందంటూ ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, మామిడి చిగుళ్లు, అశోకచిగుళ్లు వేసి చేసేవాళ్లు. ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.  మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషద గుణాన్ని వృక్ష సంరక్షణ అవసరాన్ని ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెబుతుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్తచింతపండు, లేత మామిడి చిగుళ్లు, ఆశోక వృక్షం చిగుళ్లు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయ ముక్కలు, చెరుకు ముక్కలు చిలకర లాంటివి ఉపయోగించాలి. ఈపచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్టమని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంటుంది. ఈపచ్చడిని కాలిపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమభక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈపచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పే మాట. అయితే ఒక పూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించడం చైత్రశుక్ల పాడ్యమినుంచి పూర్ణిమ వరకు గాని లేదా కనీసం ఉగాది పండుగనుంచి తొమ్మిది రోజులపాటయినా వసంత నవరాత్రుల వరకయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేస్మాల వల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్లు, వేపపూత, బెల్లం ముక్కలను మాత్రం ఉపయోగించడం కనిపిస్తుంది. పూర్వం లేత వేపచిగుళ్లు ఇంగువ పొంగించి బెల్లం సైందవలవణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లం, పటిక బెల్లంగాని వాము, జిలకర్ర మంచి పసుపు కలిపి నూరేవారు. ఈమిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీకడుపుతో ఉగాదినుంచి తొమ్మిది రోజులుగా పదిహేను రోజులు వీలును బట్టి సేవించాలి. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు. పూర్ణకుంభ లేదా ధర్మకుంభదానాన్ని చేస్తుంటారు. ఈధర్మకుంభ దానం వల్ల సంవత్సరమంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
ఉగాది ప్రసాదం: ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు ఉంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది. వేసవి తాపం తట్టుకోడానికి పానకం లాంటి నీరాహారం తీసుకోవాలని గుర్తు చేస్తుంది. వడపప్పులో వాడే పెసర పప్పు చలవ చేస్తుందని, వేసవిలో కలిగే అవస్థలను తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో ఇమిడి ఉంది. ఉగాదికి విసనకర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్తుత కాలంలో ఉన్న పంఖా, ఏసీ, ఏర్‌కూలర్‌ వసతులు లేని కాలంలో వేసవిలో విసనకర్రల ద్వారా గాలి సేద తీర్చుకుంటారు.
పంచాంగ శ్రవణం : పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం. తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం అనే వాటిని పంచాం గాలు అంటారు. పదిహేను తిథులు, ఏడు వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి పంచాంగం అని అంటారు. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థి తులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతుల వంటివి చేస్తారు. పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. పూర్వ కాలంలో ఆ ఏడాది పంటలు ఎలా పండబోతున్నాయి. ఏరువాక ఎలా సాగాలి లాంటి విషయాలను తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మార్గంగా ఎంచుకున్నారు. నిత్య వ్యవహారాల కోసం ప్రస్తుతం గ్రిగేరియన్‌ ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ను ఉపయో గిస్తున్నారు. శుభకార్యాలు, పూజలు వంటి వాటికి మాత్రం పంచాంగాన్ని వాడుకుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమలులోకి వచ్చి మళ్లీ ఉగాది వచ్చే వరకు అమలులో ఉంటుంది. పంచాంగాన్ని ఉగాది నాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబు తున్నాయి. గ్రామాలు మొదలు కొని పెద్ద నగరాల్లో చేస్తారు. పూర్వ కాలం లో పంచాంగాలు అందరికి అందుబాటులో ఉండేవి కావు. తాటాకుల మీద రాయబడేవి కనుక పండితుల వద్ద మాత్రమే ఉండేవి. ఉగాది రోజు ఊరంతటికి పంచాంగ శ్రవణం వినిపించేవారు. పంచాంగ శ్రవణంలో సంవత్సర ఫలితాలను వివరిస్తారు. నవ నాయకులను తెలుసుకుని వారి ద్వారా ఫలాలను అంచానా వేస్తారు. సంవత్సరంలో ఏఏ గ్రహాలకు ఏఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి సంవత్సరం ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తారు.