27, ఫిబ్రవరి 2012, సోమవారం

నాలుగు స్థానాల్లో పోటీలో ఉంటాం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు
               ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు స్థానాల్లో పోటీలో ఉంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్రంలో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజు సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో రాఘవులు పాల్గొన్నారు. దీంతో మీడియా వింత ప్రచారం చేస్తోందనీ, టిడిపికి సిపిఎం ఝలక్‌ ఇచ్చిందనీ, 2014 ఎన్నికల్లో కలవరని ప్రచారం చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పోటీకి దిగిందని చెప్పారు. మిగతా రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ప్రస్తుతం పోటీచేస్తున్నామన్నారు ప్రకాశ్‌ కరత్‌తో చంద్రబాబు మాట్లాడి పోటీనుండి ఉపసంహరించుకునేలా చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, తమ పార్టీలో నాయకులను మేనేజ్‌ చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, దళితులు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు తల్లికి రూ.50 లక్షలు ఎలా వచ్చాయనీ, కెసిఆర్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే విషయాల చుట్టే రాజకీయాలను నడుపుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు మద్యం ముడుపుల కేసుల్లో ఉన్నారని, టిడిపి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్‌ నుండి రాష్ట్రంలో 4900 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు, ఇంధన సర్‌ఛార్జీల కింద మరో 10 వేల కోట్ల రూపాయలు భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మళ్లీ విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఉద్యమం మహోధృతంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా 14 వేల కోట్ల రూపాయల పన్నులు వస్తున్నాయని, ప్రజా ప్రతినిధులకు లక్షలాది రూపాయలు మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే మహిళల ఆమోదం తీసుకుని ఆయా గ్రామాల్లో మద్యం షాపులు పెట్టాలన్నారు. 104, 108 గ్రామ సేవకులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఐకెపి, మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ మద్దతిస్తోందన్నారు. మరే ఇతర రాజకీయ పార్టీ వారికి మద్దతు తెలపలేదని, అలాంటప్పుడు వారికి ఓట్లేందుకు వేయాలని ప్రశ్నించారు. సిపిఎం విజయం సాధిస్తే అన్ని ప్రజా సమస్యలు చర్చకొస్తాయనీ, పరిష్కారానికీ నోచుకుంటాయనీ అన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కా వెంకయ్య, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.పి.భానురాజు, ఎం.మోహన్‌రావు, పి.శ్రీరాములు, మాదాల వెంకటేశ్వర్లు, పి.చంద్రమౌళి తదితరులున్నారు.
కొల్లాపూర్‌ సిపిఎం అభ్యర్థి ఎండి జబ్బార్‌ నామినేషన్‌
          మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా ఎం డి జబ్బార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారికి మధ్యాహ్నం నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ పట్టణంలోని పెట్రోలు బంకు నుండి బస్టాండ్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, వై.వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్‌వెస్లీ, టి.సాగర్‌, జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌, సీనియర్‌ నాయకులు వనగంటి ఈశ్వర్‌ ప్రదర్శన అగ్రభాగాన నడిచారు. డప్పువాయిద్యకారులు, కళానృత్యాలతో కళాకారులు ముందు రాగా కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మార్చి 18న జరిగే ఉప ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. పూర్తి స్థాయిలో శాసనసభ సమావేశాలు జరిగితే సభ్యుల అవినీతి చిట్టా బయటపడుతుందని, సమావేశాలు పూర్తికాకుండా అడ్డు తగులుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్న అభివృద్ధి నిరోధకులను ఓడించాలన్నారు. 30 ఏళ్లుగా ప్రజాతంత్ర ఉద్యమంలో కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, యువజన పక్షాన పనిచేస్తున్న ఎం.డి జబ్బార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొల్లాపూర్‌లో రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌ ప్రాంత ప్రజలకు రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు.
ఆకట్టుకున్న భారీ ర్యాలీ
        జొన్నలగడ్డ వెంకమరాజు నామినేషన్‌ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎర్రబారింది. కోవూరు పట్టణంలో అభ్యర్థితో పాటు రాఘవులు, జిల్లా కార్యదర్శి రాజగోపాల్‌ ఎడ్లబండిపై ప్రదర్శనగా వచ్చారు. సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజు సోమవారం కోవూరు తహశీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు.