4, డిసెంబర్ 2018, మంగళవారం

అధికారంలోకి రాబోతోంది ప్రజాకూటమి ; లగడపాటి



             హైదరాబాద్:ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో దిట్ట అయిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిరేపుతూ ఇటీవల ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గెలిచే అభ్యర్థుల పేర్లను.. ఇలా రోజుకో రెండు చొప్పున ప్రకటిస్తానని చెప్పినప్పటికి అనివార్య కారణాల వల్ల ఆయన మీడియా ముందుకు రాలేదు. అయితే ప్రచారం గడువు రేపటితో ముగియనుండడంతో.. నేడు మీడియా ముందుకు వచ్చి సర్వేలోని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా మరో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారని లగడపాటి పేర్కొన్నారు. మరో మూడు నియోజకవర్గాల్లో తన సన్నిహితులు పోటీ చేస్తున్నారని.. వారి అభ్యర్థన మేరకు ఆ మూడు స్థానాల గురించి చెప్పడం లేదన్నారు. తన సర్వే ఎప్పుడూ నిష్పక్షపాతంగా సాగుతుందన్నారు. అదే విధంగా ఏఏ జిల్లాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో..ప్రస్తుత ప్రజానాడి ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో కూడా లగడపాటి మీడియాకి తెలియజేశారు. 
  • ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యం
  • వరంగల్, నిజామాబాద్,మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
  • కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పోటాపోటీ
  • హైదరాబాద్‌లో అత్యధిక సీట్లు ఎంఐఎంకు వెళతాయని..మిగతావి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకుంటాయన్నారు.
టీఆర్ఎస్ కంటే కూడా ప్రజాకూటమి ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందని, ప్రస్తుత ప్రజానాడి ప్రకారం ప్రజాకూటమిదే గెలుపని ఆయన చెప్పారు. అయితే పోలింగ్ శాతం బట్టి విజయావకాశాలు మారే అవకాశం ఉందన్నారు. 68.5 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైతే అంచనాలు తారుమారు అవుతాయన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమి గెలుపొందుతుందని, పోలింగ్ తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని లగడపాటి స్పష్టం చేశారు.
 
లగడపాటి లెక్కల ప్రకారం చూసుకుంటే.. 46 సీట్లలో ప్రజా కూటమి, 31 సీట్లలో టీఆర్ఎస్, 27 చోట్ల పోటాపోటీ, ఎంఐఎం 7, హైదరాబాద్‌లో మరో 8 సీట్లు ప్రజాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ పంచుకునే అవకాశం కనపడుతోంది.

కామెంట్‌లు లేవు: