ప్రపంచంలోనే అత్యంత సంపన్నులతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేరిట ప్రతి ఏటా విడుదల చేసే జాబితాలో ఉన్న 128 మంది ఆసియా ధనవంతులు 2018లో 137 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. 2012 నుంచి బ్లూమ్‌బర్గ్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి వారి మీద ఇలాంటి ప్రభావం పడటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు ఈ పరిస్థితికి కారణాలు. వాటివల్ల ముఖ్యంగా చైనా సాంకేతిక రంగం ఎక్కువగా నష్టపోయింది. భారత్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఈ ఒడుదొడుకుల నుంచి తప్పించుకోలేకపోయాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి బ్యాంకులు, మనీ మేనేజర్లు చేసిన ప్రయత్నాలు ఆసియా ధనవంతులకు పెద్దగా కలిసిరాలేదు.
బ్లూమ్‌బర్గ్ జాబితాలో ఉన్న చైనాకు చెందిన 40 మంది ధనవంతుల సంపద ఆవిరైంది. వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్‌లిన్ అత్యధికంగా 10 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. అలాగే భారత్ కు చెందిన 23 మంది సంపన్నులు దాదాపు 21 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ప్రపంచ స్టీల్ మార్కెట్‌ను శాసించే లక్ష్మి మిత్తల్ కు చెందిన 5.6 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఆయన మొత్తం నెట్ వర్త్‌లో అది 29 శాతం. అలాగే ప్రపంచంలోనే జనరిక్ డ్రగ్ మార్కెట్‌లో నాలుగో స్థానంలో ఉన్న సన్ ఫార్మా కంపెనీ అధినేత దిలీప్ సంఘ్వీ 4.6 బిలియన్ డాలర్లు నష్టపోయారు. దక్షిణ కొరియా, హాంకాంగ్ టైకూన్స్ ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే ఈ మార్కెట్ ఒడుదొడుకుల్లో కూడా సంపదను పోగేసిన వారు ఉన్నారు. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమి అధినేత లీజున్‌కు అదనంగా 8.7 బిలియన్ డాలర్ల సంపద వచ్చి చేరింది. భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు అదనంగా సంపదను పోగేసుకున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి