25, డిసెంబర్ 2018, మంగళవారం

గుజరాత్ పేరు ఎక్కడైనా వినిపించిందా?: చంద్రబాబు


  •  బీజేపీ కంటే సంపన్న పార్టీ ఉందా?
  • టన్నులకొద్దీ డబ్బు పెట్టుకున్నారు
  • వాటితో గెలవాలనుకుంటున్నారు
  • కేసీఆర్‌కు ఇక్కడ కీలుబొమ్మ ఉండాలి
  • ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎవరి కోసం?
  • సీఎం చంద్రబాబు ప్రశ్న
  • సుపరిపాలనపై శ్వేతపత్రం విడుదల
అమరావతి, డిసెంబరు 24: కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తోందని.. సంపన్న పార్టీలు, సైద్ధాంతిక సారూప్యం లేని పార్టీలు జట్టుకడుతున్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలను సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. బీజేపీ కంటే సంపన్న పార్టీ ఏముందని నిలదీశారు. ఏపీ ముందుకెళ్లకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. సుపరిపాలన అంశంపై చంద్రబాబు సోమవారం (24-12-2018) శ్వేతపత్రం విడుద ల చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ టన్నుల కొద్దీ డబ్బు పెట్టుకుంది. దాంతోనే ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. ఎందుకు రెండువేల నోట్లు రద్దుచేయరు? మీకు డబ్బు ఎక్కువుంది కాబట్టి ఆ నోటు పంచి గెలవాలని చూస్తున్నారు. నేను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాను.. ఎన్టీఆర్‌ కాంగ్రెస్ కు వ్యతిరేకమని మోదీ అంటున్నారు. మీరు (మోదీ)చేసిన నమ్మకద్రోహానికి, నమ్మించి మోసం చేసినదానికి.. ఎవరు కలిసొస్తే వారితో కలిసి రాష్ట్ర హ క్కులు కాపాడుకోవడంలో తప్పేంటి? మీరు అణగదొ క్కే ప్రయత్నం చేశారు. ఇక్కడున్నవారితో కలిసి కుట్ర, కుతంత్రాలు చేసి దెబ్బతీయాలనుకున్నారు.
 
ప్రధాన ప్రతిపక్షం కూడా మీపంచన చేరింది. పోలవరం నుంచి రాజధాని వరకు అడ్డుపడడం ఎంతవరకు సమంజ సం? దేశం, రాష్ట్రం కోసం అన్ని పార్టీలూ కలవాలి. ఇది ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలోనే మనం బాగా చేస్తున్నామని మోదీకి కోపం. ఇక కేసీఆర్‌కు మంచి వ్యవస్థలున్నాయి. బాగా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర మాత్రం ముందుకుపోకూడదని ఆయన అనుకుంటారు. ఇందుకోసం కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. నియంత్రణ చేసుకోవచ్చన్నది కేసీఆర్‌ ఆలోచన’ అన్నారు.
 
ఐటీలో గుజరాత్‌ పేరు వినిపించిందా?
‘హైదరాబాద్‌ అంత అద్భుతంగా గుజరాత్‌ ఉందా? 12 ఏళ్లు మోదీ గుజరాత్‌ సీఎంగా చేశారు. కానీ ఏం చేశారు? ఐటీలో ఆరాష్ట్రం పేరు వినిపించిందా? మనం ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ఇంజనీరింగ్‌ కళాశాలలు పె ట్టాం. ఈరోజు ఐటీలో నంబర్‌వన్‌ తెలుగోడు. అదీ విజన్‌, నాయకత్వం. కొందరికి పోలవరం కట్టడం ఇ ష్టం లేకపోవచ్చు. నదుల అనుసంధానం అసలే ఇష్టం లేకపోవచ్చు. విద్యుత్‌ మిగులు ఇష్టం లేకపోవచ్చు. కానీ మనం చేస్తున్నాం. సాధిస్తున్నాం. ఇంకో నాలుగేళ్లు పోతే కష్టాలు అసలుండవు.’ ‘దేశంలో ప్రభుత్వం ఏర్పడేందుకు మూడే అవకాశాలున్నాయి. ఒకటి కాంగ్రెస్‌, రెండు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం. మూడోది ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో ఏర్పడే సంకీర్ణం. ఇంతకుమించి విశ్వామిత్ర సృష్టి చేయలేం. ఏ పక్షమో చెప్పకుండా.. ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధ్యం కాదు.’ ‘పోలవరం ప్రాజెక్టు గేటు పెడితే గ్రేట్‌డేనా అని ప్రధాన ప్రతిపక్షం అవహేళన చేస్తోంది. కేంద్రం ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రాజెక్టు తొలి గేటు పెట్టిన రోజు కచ్చితంగా గ్రేట్‌ డే. కడపలో స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసమని విమర్శిస్తున్నారు. అవగాహన, ఇంగితజ్ఞానం లేదు.’

కామెంట్‌లు లేవు: