రాంచీ:
ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా గిరిజనులు నిర్వహించుకునే ‘ముద్దుల పండుగ’కు
ఈసారి బీజేపీ మోకాలడ్డింది. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ
సంప్రదాయం కాదని, ఈ పండుగ ద్వారా సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని చెబుతూ
ఈ ఏడాది పండుగకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది.
జార్ఖండ్‌లోని
గిరిజనులు ప్రతి ఏడాది డిసెంబరులో ముద్దుల పోటీ నిర్వహిస్తారు. బహిరంగంగా
ముద్దులు పెట్టుకోవడంతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. పాకూర్ జిల్లాలోని
లిట్టిపర బ్లాక్‌లో జరిగే ఈ పండుగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఏళ్లుగా ఈ ముద్దుల పండుగ కొనసాగుతున్నా
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని గతేడాది జరిగిన పోటీకి సంబంధించిన ఫొటోలు,
వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన స్థానిక
ఎమ్మెల్యే సిమోన్ మరాండి ఆధ్వర్యంలో గతేడాది జరిగిన ఈ కార్యక్రమంలో 18
జంటలు పాల్గొన్నాయి.
ఈ వీడియోలు
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు హిందూ సంఘాలు ఈ పండుగపై అభ్యంతరాలు
వ్యక్తం చేశాయి. దీంతో ఈ ఏడాది ముద్దుల పండుగకు అనుమతి ఇచ్చేది లేదని
బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో జిల్లా ఎస్‌డీవో జితేంద్ర కుమార్
ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలపై గిరిజనులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. ఏళ్లుగా వస్తున్నతమ ఆచారాన్ని అడ్డుకోవాలని చూడడం భావ్యం
కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి